మీరెక్కువగా రీమేక్స్‌ని ప్రోత్సహిస్తారెందుకు?
-మంచిది ఏ భాషలో దొరికినా ఆహ్వానించడంలో తప్పులేదనుకుంటా. సినిమా అనేది పెద్ద వ్యాపారం. కోట్లు ఖర్చు చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అలా ఓ భాషలో హిట్టయిన సినిమాని రీమేక్ చేయడంలో తప్పులేదనకుంటా. అయినా నేను తెలుగు కథలతోటే ఎన్నో హిట్లు సాధించాగా. బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నెం.1, క్షణ క్షణం, ధర్మచక్రం, పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, తులసి... ఇవన్నీ తెలుగు కథలేగా.
పాతికేళ్ల క్రితానికీ, ఇప్పటికీ పరిశ్రంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తే ఏమనిపిస్తుంది?
-అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. టెక్నికల్‌గా జరిగిన అభివృద్ధి సినిమా స్థాయిని మరింత పెంచింది. అలాగే కొత్త హీరోలు చాలామంది వచ్చారు. దర్శకులూ వచ్చారు. ఇదంతా మంచి పరిణామమే. కాకపోతే హీరోలకి తగ్గ సంఖ్యలో హీరోయిన్లు లేరు.
మీ ఇమేజ్‌కి తగ్గ కథలు ఇష్టపడతారా? కథని కథగా ఇష్టపడతారా?
-మొదట్నించీ నేను ఒకటే చెబుతున్నా. ఓ కథ నాకు నచ్చితే అందులో హీరో పాత్రలో నన్ను నేను మలచుకోడానికే ఇష్టపడతా.
సినిమా సక్సెస్‌లో కీక పాత్రధారి ఎవరు?
-ఇది సమష్టి కృషి. అందరూ కీలక పాత్రధారులే. ఇంతకుముందు సినీ పరిశ్రమ స్టార్స్ మీద ఆధరపడి ఉందన్నారు. ఇప్పుడు దర్శకులంటున్నారు. రేపు రచయితలు కావచ్చు. అయితే ఇదంతా సృజనాత్మక సృష్టి. అందరి సహకారమూ అవసరమే.
సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు?
-ఇన్ని అని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథలు దొరక్కపోవడం వల్ల ఓ సంవత్సరం తక్కువ చేయొచ్చు. కథలు నచ్చితే ఎక్కువ చేయొచ్చు. కథలను బట్టే ఈ సంఖ్య ఉంటుంది.
మీరు నటించిన సినిమాల్లో ఎక్కువ సక్సెస్‌లు కావడం వెనుకున ఉన్న రహస్యం?
-ఎక్కువ భాగం స్క్రిప్టుల ఘనత. పైగా లాభనష్టాలు తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులున్నందువల్ల హీరోల మీద కూడా బాధ్యత ఎక్కువైంది. ఏక కాలంలో ఐదు, ఆరు సినిమాలకు అడ్వాన్సులు తీసుకోవడం గాక, ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా సినిమాల్ని చేస్తున్నాం.
మీరు సినిమాల్ని ఎంచుకునే తీరులో ఈమధ్య బాగా మార్పు వచ్చినట్లుందే?
-ఎప్పటికప్పుడు వైవిధ్యంతో కూడిన పాత్రలు చేయాలన్న దృష్టితోనే తీసుకుంటున్న మార్పు ఇది. భావోద్వేగాలతో నిండిన మాస్ పాత్రలకే పరిమితం కాక, వీలైనంత ఎక్కువగా గుడ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఫిలింస్ చేయాలనీ, ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనీ భావిస్తున్నా. 'చింతకాయల రవి', 'నమో వెంకటేశ' అలా చేసినవే. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రల్ని వెతుక్కుంటా. ఇటు మాస్, అటు క్లాస్... అన్ని పాత్రలూ చేయాలన్నదే నా ఉద్దేశం.
సినిమాల మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడటం మంచిదేనా?
-ఒక సినిమా మీద భారీ అంచనాలు రావడం సహజం. అలా కావాలని ఎవరూ చేయడంలేదు. అదంతా మన చేతిలో కూడా ఉండదు. ఏ సినిమాకైనా సిన్సియర్‌గా పనిచేస్తా. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు ఎంత కష్టపడ్డానో ఇప్పుడూ అంత కష్టపడుతున్నా.
No comments:
Post a Comment