Wednesday, August 17, 2011

మన చరిత్ర: ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి తాత్కాలిక అడ్డుకట్ట

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే బిల్లు 2.8.1935న ఇంగ్లీష్ పార్లమెంట్‌లో చట్టంగా రూపొందింది. దాన్ననుసరించి రాష్ట్రాలకు చెందిన విషయాల్లో ఆ రాష్ట్ర సభలకు స్వాతంత్ర్యం ఇచ్చారు. దాన్నే రాష్ట్రీయ స్వపరిపాలన అన్నారు. దాన్ననుసరించి 1937 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జస్టిస్ పార్టీ ఓడిపోయింది. 1927-30, 1934-37 వరకూ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండేది. ఈ 1937 ఎన్నికల్లో జస్టిస్ పార్టీకి చల్లపల్లి జమీందారు సీటూ, నరసాపురంలోని జస్టిస్ నాయుడు సీటూ మాత్రమే దక్కాయి. ముస్లింలకు వారికి కేటాయించిన స్థానాలన్నీ దక్కాయి. శాసనసభలోని 215 స్థానాల్లో కాంగ్రెసుకు 160 లభించాయి. ఆంధ్ర ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులందరూ ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం జరగాలని ఒత్తిడి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారికి ఇది ఇష్టంలేదు. ఎప్పటికప్పుడు ఏవేవో సాకులు చెబుతూ ఉద్యమ భావాలపై నీళ్లుచల్లడం ఆరంభించాడు.
1937లో శాసనసభ స్పీకరుగా ఉన్న బులుసు సాంబమూర్తి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆంగ్లేయ పాలకులకు వివరించేందుకు లండన్ వెళ్లాలనుకున్నారు. అంతా సిద్ధమైంది. అయితే రాజాజీ మంత్రాంగంతో కాంగ్రెస్ అధిష్టానం అసమ్మతి తెలిపింది. ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇది ఆంధ్ర ప్రాంత శాసనసభ్యుల్లో ఆగ్రహావేశాల్ని కలిగించింది. సమయం కోసం కాచుక్కూర్చున్నారు.
ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. 3.9.1939న బ్రిటీష్ రాజప్రతినిథి, భారతదేశం ఈ యుద్ధంలో ఇంగ్లండు పక్షాన చేరినట్టు ప్రకటించాడు. అంతకుముందు మన దేశానికేమాత్రం సంబంధంలేని ఈ ఐరోపా సంగ్రామంలో భారతదేశాన్ని దించకూడదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. అందులో భాగంగానే ఆంగ్లేయులకు భారతదేశ పాలనలో సాయం చేయకూడదనీ, కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేయాలనీ 22.10.1939న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తీర్మానించింది. దాని ప్రకారం 26.10.1939న చెన్న రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ మంత్రివర్గ రాజీనామాను ఆమోదించింది. 29వ తేదీన రాజాజీ మంత్రివర్గం తన రాజీనామాను గవర్నరుకు అందజేసింది. అంతటితో అప్పటికి ఆంధ్రరాష్ట్ర వాంఛకు తాత్కాలిక సమాధి కట్టినట్టయింది. ఆ తర్వాత 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తెలుగు ప్రజలు నిర్వహించారు.

No comments: