Showing posts with label prabhakara reddy. Show all posts
Showing posts with label prabhakara reddy. Show all posts

Saturday, January 2, 2016

Synopsis of the movie CHIRANJEEVI (1969)

'చిరంజీవి' (1969) చిత్ర కథాంశం

బాలకృష్ణ నర్సింగ్ హోంలో 7వ నెంబర్ వార్డులోని ముగ్గురు రోగులు - సత్యం (చలం), మధు (రామకృష్ణ), వెంకటప్పయ్య (అల్లు రామలింగయ్య). సత్యం అనాథ. ఊపిరితిత్తుల వ్యాధితో బతికేది కొద్ది రోజులే అయినా అది తెలియక అందర్నీ నవ్విస్తూ, కవ్విస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. మధు పేరుపొందిన ఫుట్‌బాల్ ఛాంపియన్. ప్రపంచ ఖ్యాతి వచ్చిందని సంబరపడేంతలోనే కాలు విరిగి తన భవిష్యత్ అంధకారబంధురమైందని బాధపడుతుంటాడు. ఇక వెంకటప్పయ్యకు కడుపులో పుండు. డాక్టర్‌కు తెలీకుండా దొరికిన ప్రతిదీ తింటుండే మూర్ఖుడు.
మృత్యువు సమీపంలో ఉన్న సత్యం డాక్టర్ ఇందిరాదేవి (సావిత్రి), మధు మధ్య ప్రేమను కలిగిస్తాడు. తనకు మందు ఇచ్చే నర్సు స్టెల్లా (మీనాకుమారి)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. రోగుల్ని కన్నతండ్రిగా చూసే డాక్టర్ బాలకృష్ణ (ప్రభాకరరెడ్డి)నీ, ఇందిరాదేవినీ అవసరమున్నా లేకపోయినా మాటిమాటికీ కంగారుపెడుతుంటాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకననే నిజం డాక్టర్ నోట రహస్యంగా విన్న సత్యం జీవితంలో నిజమైన బాధను తొలిసారి అనుభవిస్తాడు. జీవితం అంటే ఏమితో తొలిసారిగా అప్పుడే అర్థమవుతుంది. చనిపోయేలోగా తానూ ఒక మంచిపని చేసి చనిపోవాలనుకుంటాడు. ఆ మంచిపని మధు, ఇందిర పెళ్లనేది అతని అభిప్రాయం.
సత్యం జీవితం ముగిసిపోయే క్షణం రానే వచ్చింది. డాక్టర్ కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఇదీ వేళాకోళానికేనని భావించిన ఇందిర నిర్లక్ష్యం చేస్తుంది. చివరకు పెద్ద డాక్టర్ వచ్చినా ఫలితం ఉండదు. మధు చేతిలో సత్యం కన్ను మూస్తాడు. చనిపోయే ముందు డాక్టర్ బాలకృష్ణ మనసు మార్చి ఆయన కూతురు ఇందిరను కుంటివాడైన మధుకు ఇవ్వడానికి ఒప్పిస్తాడు. ఇదివరకు తండ్రి వ్యతిరేకించా మధు ప్రేమ కోసమే విదేశాల్లో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పిన ఇందిర, ఇప్పుడు సత్యం మరణంతో మనసు మార్చుకుంటుంది. విదేశాలకు వెళ్లి కేన్సర్ స్పెషలిస్టయి సత్యంలాంటి అభాగ్యుల్ని చిరంజీవులను చేయాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మనసారా అభినందిస్తాడు మధు. తన యావదాస్తినీ ఆమె ఆస్పత్రికి దానం చేస్తానని మాటిస్తాడు.

తారాగణం: సావిత్రి, ప్రభాకరరెడ్డి, చలం, రామకృష్ణ, అల్లు రామలింగయ్య, మీనాకుమారి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాత: ఎ.కె. వేలన్
దర్శకురాలు: సావిత్రి

Tuesday, December 8, 2015

Synopsis of the movie BOMMALU CHEPPINA KATHA (1969)

'బొమ్మలు చెప్పిన కథ' (1969) చిత్ర కథాంశం


అమరావతీ నగర మహారాజు (ధూళిపాళ) బావమరిది వీరసేనుడి (ప్రభాకరరెడ్డి) ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరొకరి మరణానికి కారకులవుతారని బొమ్మలు చెపుతాయి. ఇది విన్న వీరసేనుడు చిన్న కూతుర్ని కాళీ ఆలయంలో వదిలేసి వెళ్తాడు. ఆ అమ్మాయి చంప (విజయనిర్మల) పేరుతో ఓ గొర్రెల కాపరి వద్ద పెరుగుతుంది. పెద్దమ్మాయి సుజాత (విజయలలిత) రాజ ప్రసాదంలో పెరిగి యువరాజు ప్రతాప్ (కాంతారావు)పై మనసు పడుతుంది.
రాజ్యంలో బందిపోట్ల అరాచకాల్ని అణచాలని అడవికి వెళ్లిన ప్రతాప్ బందిపోట్ల చేతుల్లో దెబ్బలుతిని అక్కడ చంప ఆశ్రయంలో తేరుకొంటాడు. ఆమెను ప్రేమించి పెళ్లాడి అంతఃపురానికి తెస్తాడు. తను ప్రేమించినవాణ్ణి వలలో వేసుకొని పెళ్లి చేసుకుందనే కక్షతో చంపను ఏడిపిస్తూ ఉంటుంది సుజాత. విషమిచ్చి చంపటానికి సైతం ప్రయత్నిస్తుంది. అది విఫలం కావడంతో పగతో రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా బందిపోటు మంగు (కృష్ణ) అనుచరుణ్ణి యువరాజు పట్టుకొని ఉరితీయించాడనే వార్త బందిపోటు దొంగల్లో కలవరం కలిగిస్తుంది. ప్రతాప్‌ను చంపడానికి అర్ధరాత్రి అంతఃపురానికి వెళ్లిన మంగూను తన అన్నగా గుర్తిస్తుంది చంప.
ఇంతలో యువరాజు మేల్కొని వెన్నంటి తరమగా గాయపడిన మంగు కాళికాలయం చేరి, అక్కడ బొమ్మలు చెప్పిన మరో కథ వింటాడు. చంప శ్రీమంతం నాటి రాత్రి ఒక కాలనాగు యువరాజును కాటువేస్తుంది. ఈలోగా చంప తన భర్త గుండెల్లో గాయంచేసి ఆ రక్తంతో నుదుట తిలకం దిద్దుకుంటే యువరాజు బతుకుతాడు. ఈ రహస్యం ఆమె బయటపెడితే భర్త శిలగా మారిపోతాడు. ఈ కథ వినడంతో యువరాజు రక్షణకు సిద్ధమవుతాడు  మంగు. అదును కోసం వేచిచూస్తున్న సుజాత, ఇదే సమయమని మంగూ చంపలకు రంకు అంటగట్టి యువరాజును హత్యచేయడానికి ప్రయత్నించిందని చంపపై అభియోగం మోపుతుంది. విచారణలో చంపకు నిజం చెప్పక తప్పలేదు. ఫలితంగా యువరాజు శిలైపోతాడు. చంపను మాయలమారిగా నిర్ణయించి శిక్ష విధిస్తారు. అప్పుడే రాజును బంధించి సింహాసం ఆక్రమిస్తాడు మంత్రి.
ఈ చిక్కును విడదీసే ఉపాయాన్ని సైతం బొమ్మలే చెబుతాయి. మంగు సాహసంతో, సుజాత ఆత్మ పరిత్యాగంతో కథ నిర్ణీత ప్రకారం సుఖాంతమవుతుంది. మంగు  ఎవరో కాదు, వీరసేనుడి కుమారుడేనని తేలుతుంది.

తారాగణం: కాంతారావు, కృష్ణ, విజయనిర్మల, విజయలలిత, సంధ్యారాణి, గీతాంజలి, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజబాబు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: డి. రామానాయుడు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: సురేశ్ మూవీస్
విడుదల తేదీ: 4 ఏప్రిల్