Showing posts with label akkineni. Show all posts
Showing posts with label akkineni. Show all posts

Friday, November 20, 2015

Synopsis of the movie ANARKALI (1955)

'అనార్కలి' చిత్ర కథాంశం:

పారశీకంలో పుట్టిన అందాల సుందరి 'నాదిరా' దురదృష్టవశాతూ తనవాళ్లతో కలిసి ఆగ్రా నగరం చేరాల్సి వస్తుంది. ఒకసారి అక్బర్ పాదుషా వారి దానిమ్మతోటలో నాదిరా పూలు కోసుకుంటూ, పాట పాడుతూ ఉంటే, ఆ మధుర గానానికి యువరాజు సలీం ముగ్ధుడవుతాడు. ఆమెను చూసి ఆ దివ్య సౌందర్యానికి దాసుడవుతాడు. నాదిరా కూడా అమాయకంగా సలీం ప్రేమలో పడుతుంది. అప్పట్నించీ రోజూ వాళ్లిద్దరూ ఆ తోటలో కలుసుకుంటూ ఉంటారు. నాదిరా పాడుతున్న సమయంలో ఒకసారి తోటకు వచ్చిన అక్బర్ ఆమె గానానికి పరవశుడై ఆమెకు 'అనార్కలి' అనే బిరుదునిస్తాడు.
కాబూల్‌లో కల్లోలం చెలరేగడంతో, దాన్ని అణచడానికి అక్కడకు వెళ్తాడు సలీం. తన ప్రియుణ్ణి వెదుకుతూ బందిపోటు దొంగలకు పట్టుబడుతుంది అనార్కలి. బానిసల్ని విక్రయించే బజారులో అనార్కలిని బహిరంగంగా వేలం వేస్తాడు బందిపోటు నాయకుడు. ముసుగులో ఉన్న సలీం అధిక ధరకు పాడి ఆమెను కొనుక్కుంటాడు. తన స్వాధీనంలోకి వచ్చిన అనార్‌ను మారువేషంలోని సలీం బలాత్కరించబోతాడు. తన శీలాన్ని భంగపరచవద్దనీ, అదివరకే తన హృదయం మరొకరికి అర్పించాననీ అతన్ని ప్రాధేయపడుతుంది అనార్.
ఆమె నిష్కల్మష ప్రేమను గుర్తించి ఆనందంతో తన ముసుగు తొలగించి, ఆమెనూ ఆనందింపజేస్తాడు సలీం.
యుద్ధంలో సలీంకు బలమైన గాయం తగులుతుంది. అతన్ని ఆగ్రా తీసుకుపోతారు. అనార్ కూడా ఆగ్రా చేరుకుంటుంది. ఎన్ని మందులు వాడినా సలీంకు స్పృహ రాదు. చివరకు అనార్ మధురగానం చెవికి సోకి ఈ లోకంలోకి వస్తాడు సలీం. అనార్ చేసిన మేలుకు సంతోషించిన అక్బర్ ఆమెకు తన కోటలో ఆతిథ్యం ఇస్తాడు. ఆమె అక్కడే నివాసం ఉంటుంది. సలీం ఆరోగ్యవంతుడైన సంతోషంలో ఆగ్రాలో మహోత్సవాలు చేయిస్తాడు అక్బర్. అనార్ అద్భుత నాట్యానికి నజరానాగా ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు.
సలీంపై ఆశలు పెట్టుకున్న గుల్‌నార్‌కు అనార్‌పై అసూయ కలుగుతుంది. సలీం, అనార్ ప్రణయాన్ని భగ్నం చేయాలని కక్ష కడుతుంది. సలీం యువరాజ పట్టాభిషేక మహోత్సవంలో అనార్కలి నాట్యం ఏర్పాటు చేస్తారు. పానీయంలో మత్తుమందు కలిపి అనార్ చేత తాగిస్తుంది గుల్‌నార్. మైకంతో నాట్యంలోనే శృంగార చేష్టలు చేస్తూ యువరాజుపై పడుతుంది అనార్.
దాంతో అక్బర్ ఆమెను ఖైదుచేయిస్తాడు. ఇది తట్టుకోలేని సలీం తండ్రిపై తిరుగుబాటు చేస్తాడు. తల్లిముఖం చూసి తన యుద్ధాన్ని విరమించి బందీ అవుతాడు. దర్బార్‌లో అనార్, సలీంలను దోషులుగా నిర్ణయించి ఇద్దరికీ మరణదండన విధిస్తాడు అక్బర్. సలీంను వధించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్బర్ స్వయంగా కుమారుని చంపడానికి పూనుకుంటాడు. కానీ అతనిలోని పుత్రవాత్సల్యం వెనుకంజ వేయిస్తుంది. సలీంను విడిచిపెడతారు. మరోవైపు అనార్కలిని సజీవ సమాధి చేస్తుంటారు. ఆమెను కాపాడాలని గుర్రంపై బయలుదేరుతాడు సలీం. దారిలో అతనిపై బాణం వేస్తుంది గుల్‌నార్. అది అతని వెన్నులో దిగుతుంది. అయినా తన ప్రయత్నం వీడక ముందడుగు వేస్తాడు. సలీం వచ్చేసరికి అనార్ సమాధి పూర్తయిపోతుంది. విలపిస్తూ తన తలను సమాధికేసి కొట్టుకుంటాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, చిత్తూరు నాగయ్య, పేకేటి శివరాం, సురభి బాలసరస్వతి, హేమలత
సంగీతం: ఆదినారాయణరావు
నిర్మాత: ఆదినారాయణరావు
దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
బేనర్: అంజలీ పిక్చర్స్
విడుదల తేదీ: 28 ఏప్రిల్

Tuesday, October 6, 2015

Synopsis Of MAA BABU (1960) Movie

మా బాబు కథాంశం:

డాక్టర్ ఆనంద్ భార్య ఓ పిల్లవాణ్ణి ప్రసవించి వెంటనే మరణిస్తుంది. అదే సమయంలో ఆనంద్ ఆస్పత్రిలోనే రత్నాదేవి అనే వితంతువు ఓ మగశిశువును కని స్పృహతప్పిపోతుంది. ఆమె శిశువు చనిపోతాడు. అంతకు ముందే ఆ శిశువును కాపాడతానని ఆమెకు వాగ్ధానం చేస్తాడు ఆనంద్. ఆ వాగ్ధానం వమ్మయ్యిందనే ఆవేదన, తన కొడుకును సాకేవాళ్లెవరనే నిస్పృహతో, క్షణికోద్వేగానికి గురై తన బిడ్డనే ఆమె బిడ్డగా రత్నాదేవికి అప్పగిస్తాడు. రత్నాదేవి కానీ, ఆమె బంధువులకు కానీ పిల్లవాడు మారిపోయాడనే విషయం తెలీదు. ఒక్క నర్సుకు మాత్రమే ఈ రహస్యం తెలుసు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమె వద్ద మాట తీసుకుంటాడు ఆనంద్. తన కొడుకుపై ఉన్న ప్రేమకొద్దీ తరచూ రత్నాదేవి ఇంటికి వెళ్తుంటాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల మాయ అనే నర్సును అతను పెళ్లాడాల్సి వస్తుంది. ఆమె ఎవరో కాదు, మొదటి నర్సు కూతురే. ఆనంద్ తండ్రి మరణిస్తూ, నెలకు రూ. 10 వేల వరకూ ఆదాయం వచ్చే తన ఆస్తి తన మనవడికి చెందుతుందని వీలునామా రాస్తాడు. వైద్య శాస్త్ర రీత్యా మాయకు సంతాన యోగ్యం ఉండదు. దాంతో రత్నాదేవి వద్ద పెరుగుతున్న అబ్బాయి ఆనంద్ కొడుకేననీ, అతణ్ణి తెచ్చుకుంటే ఆస్తి దక్కుతుందనీ మాయకు ఉపాయం చెబుతుంది తల్లి. దాంతో మాయ కోర్టుకెక్కుతుంది. ఆ బాబు డాక్టర్ ఆనంద్ కొడుకేనని కోర్టు నిర్ధారిస్తుంది. బాబు దూరమవడంతో రత్నాదేవి కుప్పలా కూలిపోతుంది. బలవంతాన తన దగ్గరకు తెచ్చుకున్న బాబును మాయ మాలిమి చేసుకోలేకపోతుంది. బాబు ఇంటి నుంచి పారిపోతాడు. వాడిని వెంటాడుతూ మాయ వెళ్తుంది. ఆనంద్, రత్నాదేవి కూడా వెళ్తారు. మాయ ఓ ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తుంది. అలా రెండో భార్యను కూడా పోగొట్టుకున్న ఆనంద్ చివరకు బాబును రత్నాదేవికిచ్చేసి తన జీవితాన్ని వైద్యవృత్తికే అంకితం చేస్తాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, రేలంగి, ఎం. సరోజ, ఎం.ఎన్. రాజం, కన్నాంబ, హనీ ఇరానీ
సంగీతం: టి. చలపతిరావు
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
విడుదల తేదీ: 22 డిసెంబర్ 1960

Thursday, September 10, 2015

Synopsis Of PALNATI YUDDHAM (1947) Movie

బ్రహ్మనాయుడు (గోవిందరాజుల వెంకట సుబ్బారావు) వైష్ణవ భక్తుడు, భజనపరుడు. ప్రజలు ఆయనను గౌరవిస్తుంటారు. రాజ బంధువుల్లో అత్యధికులు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటారు. 'జై చెన్నకేశవా' అంటూ హరిభక్తుల వేషాలలో ఆయన్ను అనుసరిస్తుంటారు. సర్వమానవ సమత్వాన్నీ, హరిజనోద్ధరణనూ బోధించే బ్రహ్మనాయుడు దేవాలయంలో హరిజన ప్రవేశాన్నీ, హరిజనులతో పంక్తి భోజనాన్నీ తలపెడతాడు. ఇది గిట్టని ప్రతిపక్షులు, రాజభటులు ఈ విషయాన్ని దండనాథులతోనూ, నరసింహరాజు (ముదిగొండ లింగమూర్తి)తోనూ పితూరీ చేస్తారు. బ్రహ్మనాయుడిపై నరసింహరాజుకు కోపం వస్తుంది. అతని అనుయాయులు కొంతమంది నాగమ్మ (కన్నాంబ) వద్దకు వెళ్తారు. ఆమె శైవ యోగినిగా తన ఊళ్లో శివార్చన చేసుకుంటూ ఉంటుంది. హరిజనులను బ్రహ్మన్న వర్ణస్థుల్లో కలిపివేస్తున్నాడనీ, ఆమె వచ్చి, రాజుకు దన్నుగా నిలిచి, ఆయనను బ్రహ్మన్న మాయ నుంచి తప్పించి, రాజ్యాన్నీ, పురాతన ఆచార ధర్మాలనీ కాపాడాలని బతిమాలుకుంటారు. సర్వసంగ పరిత్యాగిని అయిన తనకు ఈ బెడదలు ఎందుకంటూనే అర్ధంగీకారంతో నాగమ్మ వాళ్ల మాటలు మన్నించి రాజసభలో అడుగుపెడుతుంది. నరసింహరాజు సంతోషిస్తాడు.
మాల కన్నమదాసు (వి. కోటేశ్వరరావు)ను బ్రహ్మన్న దండనాయకుడిగా చేశాడంటూ సభలో ఒక పక్షం ఉద్రిక్తంగా ప్రవర్తిస్తుంది. బ్రహ్మన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది నాగమ్మ. తన మాటలు అక్కడ ఎవరూ వినడంలేదనీ, తనకక్కడ స్థానం లేదనీ ప్రధాని పదవి వదులుకొని రాజాస్థానం నుంచి వెళ్లిపోతాడు. వెళ్లవద్దని నలగామరాజు (తీగల వెంకటేశ్వర్లు) ఆపబోతుంటే, రాజమంత్రులకే కాకుండా రాజాస్థానానికీ ప్రతిష్ఠ ఉందంటూ అతణ్ణి వారిస్తుంది నాగమ్మ. అన్నతో గొడవపడ్డ మలిదేవరాజు (డి.ఎస్. సదాశివరావు) రాజ్యంలో తన భాగం తనకు పంచి ఇమ్మంటాడు. దేశాలూ, రాజ్యాలూ ప్రజలతో కూడుకున్నవనీ, పంపకాలు చేయడానికి రాజులకు హక్కులు లేవనీ చెబుతుంది నాగమ్మ. నలగామరాజు పల్నాడును పంపకం చేస్తాడు. బ్రహ్మన్న వద్దకు వెళ్తాడు మలిదేవుడు. అతడు చేసిన పనికి విచారిస్తాడు బ్రహ్మన్న. అఖండ పల్నాడు, సర్వవర్ణ సమత్వాలు తన ఆశయాలని చెప్పి జరిగిన పనికి చింతిస్తూనే మలిదేవాదుల రక్షణ భారం వహిస్తాడు. కన్నమదాసును సైన్యాధ్యక్షుడిగా చేసుకొని మాచర్ల బయల్దేరతాడు. బ్రహ్మన్నతో కొమ్మరాజు కూడా వెళ్తాడు.
నరసింహరాజు ప్రొత్సాహంతో నాగమ్మను బతిమలాడి ఆమెను మహామంత్రిణిగా చేస్తాడు నలగామరాజు. ఆమె మలిదేవ, బ్రహ్మన్న, అలరాజు (కోనేరు కుటుంబరావు) మీద పగ సాధించే ప్రయత్నంలో భాగంగా నరసింహరాజును ఉపయోగించుకుంటూ, మాచర్లకు గూఢచారులను పంపిస్తూ, అక్కడి విషయాలు తెలుసుకుంటూ, మెలకువగా వ్యవహరిస్తూ, మాచర్లను తిరిగి గురజాల రాజ్యంలో కలపాలని తపిస్తుంటుంది.
మాచర్లలో బ్రహ్మన్న కొడుకు బాలచంద్రుడు (అక్కినేని నాగేశ్వరరావు) గూఢచారులని పట్టుకొని దండించబోతుంటే వారిస్తాడు కన్నమదాసు. అతను సేనానాయకుడు కాబట్టి అతని ఆజ్ఞను పాలించాల్సిందిగా కొడుక్కు చెబుతాడు బ్రహ్మన్న. యవ్వన ఉద్రేకంలో ఉండే బాలచంద్రునికి ఇది చికాకు తెప్పించినా, తండ్రిని ఏమనలేకపోతాడు. బ్రహ్మన్నకు కోడిపందేలంటే ఇష్టమనే సంగతి గూఢచారుల ద్వారా నాగమ్మకూ, నరసింహరాజుకూ తెలుస్తుంది. కోడిపందేల మిషతో మాచర్లను మళ్లీ గురజాలలో కలపవచ్చనీ, బ్రహ్మనాయుడు, మలిదేవాదులను దేశంనుంచే వెళ్లగొట్టించవచ్చనీ పన్నాగం పన్నుతుంది నాగమ్మ. మాయ కవచం తొడిగిన కోడిపుంజునొకదాన్ని తన సేవకుని దగ్గర తయారుగా ఉంచుతుంది.
ఆహ్వానం స్వీకరించకపోవడం పౌరుషానికి లోటంటూ బ్రహ్మన్న, మలిదేవాదులు గురజాల ఆస్థాన మంటపంలో కోడిపందేలలో పాల్గొంటారు. మొదట బ్రహ్మనాయుడి కోడిపుంజులే నెగ్గుతాయి. చివరకు నాగమ్మ కవచం తొడిగిన పుంజును రప్పిస్తుంది. మలిదేవరాజుకు రోషం కలిగిస్తుంది. బ్రహ్మనాయుడిని అడక్కుండానే మలిదేవుడు తన రాజ్యాన్ని పణంగా పెట్టి, ఓడిపోయినవాళ్లు ఏడేళ్లు వలసపోవాలనే పందేనికి ఒప్పుకుంటాడు. నలగామరాజుని అలరాజు నివారించాలని చూసినా నాగమ్మ, నరసింహరాజు ప్రోద్బలంతో పందెం సాగుతుంది. బ్రహ్మన్న కోడి పడిపోగానే నాగమ్మ సేవకుడు తమ కోడి కవచాన్ని రహస్యంగా తీసేస్తాడు. పందెంలో మోసం జరిగిందని బ్రహ్మన్న పక్షంవాళ్లు గొడవ చేయడంతో, కోడిని పరీక్షించుకొమ్మని బ్రహ్మన్న ముందు పెడుతుంది నాగమ్మ. పందెం ప్రకారం మాచర్లను వదిలి కర్నూలు సీమకు వలసపోతుంది బ్రహ్మన్న బృందం.
నలగామరాజు అల్లుడైన అలరాజు తాను కూడా వలసపోతున్నానని భార్య రత్నాల పేరిందేవి (సురభి బాలసరస్వతి)తో చెప్పి వెళ్లిపోతాడు. అతణ్ణి ఆపాల్సిందిగా నలగామరాజును ఏడుస్తూ అర్థిస్తుంది పేరిందేవి. తన తర్వాత రాజ్యం అలరాజుదేననే అభిప్రాయం ఉండి కూడా అతడు ఏమీ చేయకుండా చేష్టలుడిగిపోతాడు. బ్రహ్మనాయుని పరివారం వలస జీవితం పూర్తి చేసుకొని సైన్యంతో సమాయత్తమవుతారు. తమ రాజ్య భాగం తమకివ్వాల్సిందిగా అలరాజును రాయబారానికి పంపుతారు. అలరాజు వస్తే నలగామరాజు మళ్లీ తమ ప్రభావం నుంచి బయటకొచ్చి, బ్రహ్మనాయుడి ప్రభావంలో పడతాడని నరసింహరాజుకు నూరిపోసిన నాగమ్మ, అతడిలో రాజ్యాపేక్షను రగిలిస్తుంది. అలరాజును దారిలోనే చంపేయమని ప్రేరేపిస్తుంది. అలరాజును ఊరిబయటనే కలుసుకున్న నరసింహరాజు అతడికి ఆతిథ్యాలిస్తాడు. నర్తకి చేతికి విషపాత్రనిచ్చి అతని వద్దకు పంపుతాడు. అక్కణ్ణించి తాను వెళ్లిపోతున్నట్లు తప్పుకుంటాడు. నర్తకి వ్యామోహంలో పడిన అలరాజు ఆమె ఇచ్చిన విషం తాగి మరణిస్తాడు. అలరాజు మృతికి విచారించిన బ్రహ్మన్న యుద్ధానికి సన్నద్ధమవుతాడు. అంతఃపుర స్త్రీరక్షణ కోసం బాలచంద్రుణ్ణి ఇంటివద్దే ఉండమంటాడు. బజారులో ఒక బొంగరం ఆట సంఘటనతో పౌరుషం పెల్లుబికిన బాలచంద్రుడు తల్లివద్దకు పోయి, యుద్ధానికి వెళ్తాననీ, దీవించమనీ అంటాడు. కన్నకొడుకును వదలలేక వదులుతూ దీవించి, మొహాన తిలకం దిద్దుతుంది తల్లి. పుట్టింటిలో ఉన్న కోడలు మాంచాల (ఎస్. వరలక్ష్మి)కు కూడా ఓ మాటచెప్పి వెళ్లమంటుంది. అత్తవారింటికి వస్తాడు బాలచంద్రుడు. మాంచాల భర్తను సంతోషపరిచి, వీరపత్నిలాగా అతణ్ణి యుద్ధానికి పంపుతుంది. యుద్ధ శిబిరంలో బ్రహ్మనాయుడు శాంతివచనాలు పలుకుతుంటే వారించి, సైన్యాన్ని యుద్ధోన్ముఖం చేస్తాడు బాలచంద్రుడు. బ్రహ్మన్న పరిస్థితులకు లొంగుతాడు. తను కత్తిపట్టకుండా యుద్ధాన్ని నడుపుతాడు. ఇరుపక్షాలూ యుద్ధంలో తలపడతాయి. బాలచంద్రుడు వీరోచితంగా యుద్ధంచేసి, నరసింహరాజుతో తలపడి, అతని తలనరికి, తనూ గాయపడి, కొనప్రాణంతో తలను బ్రహ్మనాయుడి వద్దకు తెస్తాడు. తను పుత్రప్రాయంగా పెంచిన నరసింహరాజు తలచూసి బ్రహ్మన్న దుఃఖిస్తాడు. తండ్రి తనను మెచ్చుకోకపోగా నరసింహరాజు చనిపోయినందుకు దుఃఖించడంతో "నాన్నా, నువ్వెప్పుడూ ఇంతే"నంటూ నిస్పృహతో ప్రాణాలు వదుల్తాడు బాలచంద్రుడు. మనసు నీరవమైపోగా, యుద్ధం ఆపెయ్యాలనే తలంపుతో, ఆయుధమనేది లేకుండా యుద్ధరంగం మధ్యలోకి వెళ్తాడు బ్రహ్మన్న. అతనిలోని తేజస్సును చూసి ప్రత్యర్థి సైనికులు పారిపోతుంటారు. నరసింహరాజు మృతికి కోపావేశంతో స్వయంగా సైన్యాన్ని ఉద్రిక్తం చేస్తూ బ్రహ్మన్నను ఎదుర్కొంటుంది నాగమ్మ. అహింసనే నమ్మిన్న బ్రహ్మన్న, తన తలనరికి యుద్ధాన్ని ఆపమంటాడు. అతని మహోన్నత హృదయాన్ని ప్రత్యక్షంగా చూసిన నాగమ్మ పశ్చాత్తాపంతో కత్తి దించి క్షమించమంటూ అతని కాళ్లమీద పడుతుంది. యుద్ధం ముగుస్తుంది. బ్రహ్మన్నను మంత్రిగా ఉండమని కోరతాడు నలగామరాజు. నాగమ్మనే మంత్రిణిగా ఉండవలసిందిగా ఆదేశించి, చెన్నకేశవ స్వామిని కీర్తిస్తూ ఆయనలో లీనమైపోతాడు బ్రహ్మనాయుడు.

Saturday, June 28, 2014

Cinema: Extraordinary Writer Mullapudi Venkata Ramana

ఆయన మాట రమణీయం

నాటకంలో విజువల్ కన్నా శబ్దానికి ప్రాధాన్యం ఎక్కువ. కారణం సినిమాలోలా దూరంగా ఉన్నవాళ్లకు రంగస్థలం మీద నటులు సరిగా కనిపించరు. అందుకని సంభాషణలు ఎక్కువ ఉండాలి. అదే సినిమా విషయానికి వస్తే ఒక విజువల్‌తో వంద మాటలు పలికించవచ్చు. అంటే ఒక బొమ్మ వంద మాటల పెట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంభాషణలు రాసినవాళ్లు చరిత్రలో గొప్ప రచయితలుగా నిలిచారు. అలాంటి అరుదైన సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ. 'అందరికీ నచ్చే స్థాయిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటేనే అది మంచి స్క్రిప్టు' అని ఆయనే ఒకచోట చెప్పారు. అలాంటి మంచి స్క్రిప్టులు ఆయన కలం నుంచె అనేకం జాలువారాయి.

"నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను'' అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు 'ముత్యాల ముగ్గు' తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర 'ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ' అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. 'ముత్యాల ముగ్గు' నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా 'బుద్ధిమంతుడు' కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.

గుడికీ, బడికీ మధ్య పోటీ

బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 'బుద్ధిమంతుడు'ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు - మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా' అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి 'బుద్ధిమంతుని'గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య "వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?'' అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. "అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా'' అంటాడు గోపి ఆవేదనగా.

నిజం రాణిస్తుంది

తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాడన్నట్లు మాట్లాడితే "నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది'' అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య "సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను" అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. "అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేడో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు'' అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.

మానవసేవే మాధవసేవ

ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. 'మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?' అని ప్రశ్నించిన కృష్ణుడు (శోభన్‌బాబు) "నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట పెరిగాననీ నువ్వెరుగవా?'' అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. "సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను'' అంటాడు. తమ్ముడితో "మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం'' అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.

'ఆమ్యామ్యా' ఇందులోనిదే

ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే 'ఆమ్యామ్యా' అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. "ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది'' అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి 'బుద్ధిమంతుడు'ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.

- ఆంధ్రజ్యోతి డైలీ, జూన్ 28, 2014

Saturday, April 26, 2014

Telugu Cinema After Independence

1947 తర్వాత తెలుగు సినిమా
ఈ శతాబ్దంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మాధ్యమంగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ యాభైయ్యేళ్ల తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలిస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికొచ్చేది నిర్మాణమవుతున్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతి యేటా తెలుగులో సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అసలు ఉండటం లేదు. అయితే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బి.ఎన్. రెడ్డి, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు వంటి మహానటులూ, రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లూ, కాంచనమాల, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి మహా నటీమణులూ, గూడవల్లి రామబ్రహ్మం, సి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్ వంటి దిగ్దర్శకులూ మనకి లభించారు.
మొదట్లో - అంటే ఆరవ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు బహు తక్కువ. గూడవల్లి రామబ్రహ్మం తీసిన 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటివి అందుకు మినహాయింపు. అయితే 'దేవదాసు', 'పాతాళభైరవి', 'మాయాబజార్', 'మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ చిత్రాలు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర కథానాయకులుగా నిలిచారు. నటీమణుల్లో భానుమతి, సావిత్రి అగ్ర స్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించిన భానుమతి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు. 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళ భైరవి' బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన సామాజిక ప్రయోజనాత్మక చిత్రం 'రోజులు మారాయి' అఖండ విజయం సాధించి ఆ తరహా సినిమాలకు తలమానికంగా నిలిచింది.
స్వాతంత్ర్యానికి పూర్వం వ్యాపారాత్మక దృష్టితో తీసిన సినిమాలు మనకు కనిపించవు. 1950లో వచ్చిన విజయా వారి సినిమా 'షావుకారు'తో ఈ వ్యాపార పోకడలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో నటిగా పరిచయమైన జానకి, దానితోటే 'షావుకారు జానకి'గా మారిపోయారు. 1963లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అప్పట్లో టిక్కెట్ ధరలు 25 పైసలు నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో ఈ సినిమా ఒక కోటి రూపాయలు వసూలు చేసి, ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం పొందింది. ఇదే ఏడాది రూపొందిన 'నర్తనశాల' అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మొదటి తెలుగు చిత్రంగా పేరు తెచ్చుకుంది. జకార్తాలో జరిగి ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాలో కీచకునిగా ఎస్వీ రంగారావు చూపించిన అభినయం ఆ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుల్ని అమితంగా ఆకట్టుకుంది. అలా ఒక అంతర్జాతీయ సినిమా వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఎస్వీఆర్.
తొలి సాంఘిక వర్ణ చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. అదివరకు 'పదండి ముందుకు'లో చిన్న పాత్రలో కనిపించిన కృష్ణ హీరోగా పరిచయమయ్యింది దానితోటే. అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలు రాజ్యం చేస్తూ ఉంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారత చలన చిత్రసీమలోనే తొలి జేమ్స్‌బాండ్ తరహా సినిమాగా రికార్డులకెక్కింది. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి వెలువడటం మరో విశేషం. ఆ తర్వాత కాలంలో ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు సమాన ఆదరణ పొందుతూ వచ్చాయి. ఏడవ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమా ప్రభావం తెలుగు సీమకీ సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు తీయడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువుల కింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' (1972), 'చలిచీమలు' (1978) వంటి అభ్యుదయ చిత్రాలూ, 'తూర్పు వెళ్లే రైలు' (1979), 'నీడ' (1979) వంటి ప్రయోగాత్మక చిత్రాలూ కొన్ని వచ్చాయి. మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' (1971) వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్రే. ఇందులో హీరోగా నటించిన కృష్ణ 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ పతాకంపై 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని నిర్మించి ఆ పాత్రలో తానే నటించించాడు. ఇది తెలుగులో పూర్తిస్థాయి తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక చిత్రాలు వచ్చాయి. ఎన్టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి మూడు పాత్రల్లో (కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దాన వీర శూర కర్ణ' (1977) కలెక్షన్ల వర్షంలో తడిసింది. కేవలం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. కోటి వసూలు చేసిందంటే ఈ చిత్రానిది ఏ స్థాయి విజయమో గ్రహించవచ్చు. మహా భారతంలో దుష్ట పాత్రలుగా చిత్రీకరణకు గురైన కర్ణ, దుర్యోధన పాత్రలను కొత్త కోణంలో చూపించి, ఆ పాత్రలకి హీరో ఇమేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా ఎన్టీఆర్‌దే.
ఇక ఎనిమిదో దశకంలో తెలుగు సినిమా పూర్తిగా వాణిజ్యమయమై పోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ. బూతు మాటలు, శృంగార సన్నివేశాలు ఉన్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సు అనేది సినిమాకి తప్పనిసరి అంశమైంది.
ఏడవ దశకం ద్వితీయార్ధంలో నటుడిగా రంగ ప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకుంటున్న సమయంలో 'ఖైదీ' (1983) అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ సినిమాల్లో 'ఖైదీ' సరికొత్త ధోరణికి తెరతీసింది. హీరోల పరంగా నృత్యాలకు అక్కినేని ఆద్యుడైనా, వాటికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది చిరంజీవి వల్లనే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తుంటే, మరోవైపు కొద్ది సంఖ్యలోనైనా కళాత్మక విలువలున్న సినిమాలు వచ్చాయి. కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' (1980) తెలుగు చిత్రసీమకి ఏనాటికైనా గర్వంగా చెప్పుకోదగ్గ కళాఖండంగా చరిత్రలో నిలిచింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ సినిమాలో ఒక సదాచార బ్రాహ్మణ సంగీత విద్వాంసునికీ, ఒక కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీకీ మధ్య అమలిన అనుబంధాన్ని విశ్వనాథ్ చూపించిన తీరు దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కినేనితో దాసరి నారాయణరావు తీసిన 'మేఘసందేశం' (1982) కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే 'యువతరం కదిలింది' (1980), 'ఎర్రమల్లెలు' (1981), 'విప్లవ శంఖం' (1982) వంటి విప్లవ కథాంశ చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' అనే ఆరు చిత్రాలే తీసినా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
ఎన్టీఆర్ వారసునిగా అంతకుముందే హీరోగా బాలకృష్ణ ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్, అగ్ర నిర్మాతల్లో రామానాయుడి కుమారుడు వెంకటేశ్, వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు హీరోలుగా అడుగుపెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో తనపేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో మొదటి 70 ఎం.ఎం. సినిమా 'సింహాసనం' (1986) కూడా ఈ దశకంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్త రక్తం మొదలైంది. ఎంతోమంది నవ యువ దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించడంతో పాత తరం దర్శకులు చాలమంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఆ సినిమా యువతపై చేదు ప్రభావాన్ని కలిగించిందనే విమర్శలు ఉన్నాయి. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక కథలతో సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యం హెచ్చింది. టెక్నికల్ అంశాలపై శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడా వాతావరణం మచ్చుకి కూడా కనిపించదు. ఎనిమిదో దశకం నుంచే హీరోనిబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ అదే స్థితి. గతంలో సినిమా ఫెయిల్యూర్ అయితే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటుల మీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామన్నది నిజం. మన పొరుగునే ఉన్న మలయాళ సినిమాలు దేశంలో అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమిళంలోనూ ఇటీవలి కాలంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమానే దుస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల 'పెళ్లి' నేపథ్యంలో వచ్చిన ఓ సినిమా మంచి హిట్టవడంతో అదే మూసలో చిత్రాలు వస్తున్నాయి. ఒక విప్లవ కథాచిత్రం బాగా ఆడితే అదే తరహా చిత్రాల్ని తీస్తున్నారు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవడం తప్ప వాటితో చిత్రాలు తీసేవారికి చిత్తశుద్ధి ఉందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న చిత్రాల్లో మానవతా విలువలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా చలామణీ అవడం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలతో పోలిస్తే పురుషాధిక్యం ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ తీసికట్టుగా తయారైంది. వ్యాంప్ కేరక్టర్ల అవసరం లేకుండా హీరోయిన్లతోనే వ్యాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు దర్శకులు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము  కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థం కాదు. అట్లాంటి సన్నివేశాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! మన అభిరుచి స్థాయి అలా ఉంది మరి. వీటినే ఆశీర్వచనాలుగా నమ్ముతున్న నిర్మాతలు అట్లాంటి చిత్రాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్ని ఇస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చిత్రించడం, ఎంత ఏడ్పించినా ఏమీ అనని హీరోయిన్లనీ, భర్త ఎంత హింసించినా సహించే భార్యల్నీ మంచివాళ్లుగా చిత్రిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోలేదు. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవిక అంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెలుగు చిత్ర రంగాన్ని మార్పుకు గురిచేస్తోంది. ఈ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సమయంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాకుండా ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి ఉంది. అప్పుడే విమర్శకి నిల్చే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది.
- స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా 
ఆంధ్రభూమి 'వెన్నెల' 15 ఆగస్ట్ 1997

Thursday, August 29, 2013

ఆనాటి సంగతి: 'నేరము-శిక్ష'తో కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన కత్తి వీరుడు

ఎం. బాలయ్య నిర్మించిన 'నేరము-శిక్ష' సినిమా నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా మారారు కత్తి వీరుడు కాంతారావు. అంతకు ముందు ఆయనతో తయారైన జానపద చిత్రాలన్నీ తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైనవే. నిర్మాతలకు బాగా లాభాలు వచ్చేవి. పుష్కలంగా డబ్బు రావడంతో నిర్మాతల దృష్టి సహజంగానే భారీ బడ్జెట్ సినిమాల మీద పడేది. ఆయనకూ భారీ తారాగణంతో సినిమాలు తీయాలనిపించేది. తీశారు. చెయ్యి కాల్చుకున్నారు. సంపాదించిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. మరోవైపు జానపద చిత్రాలు ఉధృతంగా తయారై ఒకదాని మీదొకటి పోటీగా విడుదలవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. దాంతో ఆ నిర్మాతల దృష్టి సాంఘిక చిత్రాల వైపు మళ్లింది. జానపద చిత్రాల నాయకుడన్న ముద్ర పడటంతో కాంతారావుకు సాంఘిక చిత్రాల్లో నాయకుడిగా సరైన అవకాశాలు రాలేదు. ఆయనతో బాలయ్య "మీరేమీ అనుకోకపోతే మా సినిమాలో ఒక ఫాదర్ రోల్ ఉంది. మీరే వెయ్యాలి" అన్నారు. ఒకప్పుడు బాలయ్య కూడా హీరోనే. నిర్మాత అయ్యాక కేరక్టర్స్ అడపాదడపా వేస్తూ వస్తున్నారు. ఆయన వచ్చి అడిగితే కాదనలేకపోయారు కాంతారావు. కానీ ఆయన మిత్రులు కొందరు "హీరో వేషాలు వేసిన మీరు ఒకసారి వయసు మళ్లిన పాత్రలు వేస్తే మీ మీద అదే ముద్ర పడిపోతుంది. ఒప్పుకోకండి" అని చెప్పారు. మరి జరుగుబాటయ్యేది ఎలా? ఒక రాత్రంతా తీవ్రంగా ఆలోచించి అక్కినేని నాగేశ్వరరావును సలహా అడిగారు. "తప్పకుండా ఒప్పుకోండి. మీకిది టర్నింగ్ పాయింట్ కావచ్చు" అని నాగేశ్వరరావు చెప్పారు. ఆయన చెప్పింది నిజమేననీ, ఇండస్ట్రీకి దూరం కాకుండా ఉండాలంటే, కాలానికి తగ్గట్లు సర్దుకు పోవాలనీ తనకు తనే నచ్చచెప్పుకున్నారు కాంతారావు. అలా 'నేరము-శిక్ష'లో తొలిసారి తండ్రి వేషం వేశారు. అదిచూసి దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు 'బంగారు కలలు'లో కేరక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత 'గుణవంతుడు', 'ఓ సీత కథ', 'ముత్యాల ముగ్గు' వంటి సినిమాలు ఆయనను కేరక్టర్ ఆర్టిస్టుగా నిలబెట్టాయి.

Thursday, December 29, 2011

'అన్నపూర్ణ' ద్వారా పరిచయమైన తారలు, దర్శకులు

సతీమణి అన్నపూర్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావుకు అమితమైన ప్రేమ. అందుకే హైదరాబాద్‌లో నిర్మించిన స్టూడియోకు ఆమె పేరే పెట్టారు. ఇక తమ నిర్మాణ సంస్థను కూడా 'అన్నపూర్ణ స్టూడియోస్' గానే వ్యవహరించారు. ఆ బేనర్ కింద అనేకమంది నటులు, దర్శకులు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది అనంతర కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
* 1986లో నిర్మించిన 'విక్రమ్' చిత్రం ద్వారా నాగేశ్వరరావు, అన్నపూర్ణల చిన్న కుమారుడు నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. హీరోయిన్‌గా శోభన తెలుగు తెరకు పరిచయమయ్యిందీ ఈ చిత్రంతోటే.
* 1989లో నిర్మించిన 'శివ' సినిమాతో తెలుగు సినిమా గతినే మార్చేసిన రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యారు. అదే సినిమా హిందీ వెర్షన్‌తో ఇటు నాగార్జుననూ, అటు వర్మనూ బాలీవుడ్‌కూ పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.
* 1995లో నాగార్జున చిన్న కుమారుడు మాస్టర్ అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ 'సిసింద్రీ'ని నిర్మించారు.
* 1998లో సమర్పించిన 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' చిత్రం ద్వారా దర్శకుడిగా వై.వి.ఎస్. చౌదరినీ, హీరోగా వెంకట్‌నూ పరిచయం చేశారు.
* 1998లోనే తీసిన 'చంద్రలేఖ' చిత్రంతో బాలీవుడ్ సుందరి ఇషా కొప్పికర్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
* 1999లో తీసిన 'ప్రేమకథ' ద్వారా మనవడు (కూతురి కుమారుడు) సుమంత్‌ను హీరోగా, ఆంత్రమాలిని హీరోయిన్‌గా పరిచయం చేశారు.
* 2000 సంవత్సరంలో నిర్మించిన 'యువకుడు' ద్వారా నాయికగా భూమిక పరిచయమయ్యారు.
* 2003లో సమర్పించిన 'సత్యం' చిత్రంతో నాయికగా జెనీలియా తెలుగు తెరకు పరిచయం చేశారు. దర్శకుడిగా సూర్యకిరణ్‌కూ ఇదే తొలి చిత్రం.
* 2004లో తీసిన 'మాస్' చిత్రంతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారారు.
* 2005లో సమర్పించిన 'సూపర్' సినిమాతో అనుష్క తెరంగేట్రం చేశారు. ఇదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా తకియా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
* 2008లో తీసిన 'పౌరుడు' ద్వారా రాజ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 29, 2011

Friday, November 18, 2011

అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'


అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే. 
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే. 
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు. 
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.

Friday, September 30, 2011

అలనాటి దర్శకులు: ఆదుర్తి సుబ్బారావు

తెలుగు చిత్రసీమ కనుగొన్న గొప్ప దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ఒకరు. ఆయన డైరెక్ట్ చేసిన వాటిలో నాలుగు సినిమాలు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డులు సాధించాయంటేనే ఆయన ప్రతిభ, సృజన శక్తి ఎలాంటివో అర్థమవుతుంది. 1912లో రాజమండ్రిలో జన్మించిన ఆయన 1954లో అమర్‌నాథ్, శ్రీరంజని, పద్మిని కాంబినేషన్‌తో తీసిన 'అమర సందేశం' చిత్రంతో దర్శకునిగా అరంగేట్రం చేశారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'బైజు బావ్రా' ప్రేరణతో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించారు. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు.
ఎప్పుడైతే అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు ఆయన ప్రతిభను గుర్తించి 'తోడికోడళ్లు' (1957) చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారో, అప్పట్నించీ ఆయన దశ తిరిగింది. శరత్‌చంద్ర చటోపాధ్యాయ నవల 'నిష్కృతి' ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి ఆదుర్తికి మంచి పేరుతో పాటు మంచి అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'మాంగల్య బలం' (1959), 'నమ్మిన బంటు' (1960), 'వెలుగు నీడలు', 'ఇద్దరు మిత్రులు' (1961), 'చదువుకున్న అమ్మాయిలు' (1963), 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'దాగుడు మూతలు' (1964)' 'సుమంగళి' (1965) వంటి విజయవంతమైన చిత్రాల్ని ఆయన రూపొందించారు. 1965లోనే అంతా కొత్తవాళ్లతో ఆయన డైరెక్ట్ చేసిన తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు' సూపర్‌హిట్టయి ఆయన కీర్తి ప్రతిష్ఠల్ని మరింత ఇనుమడింపజేసింది. ఈ సినిమాతోనే ఘట్టమనేని కృష్ణ హీరోగా పరిచయమై, అనంతర కాలంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. ఆ తర్వాత 'సుడిగుండాలు', 'పూలరంగడు' (1967), 'విచిత్ర బంధం' (1972), 'మాయదారి మల్లిగాడు' (1973), 'గాజుల కిష్టయ్య' (1975) వంటి హిట్లని తీశారు ఆదుర్తి. అక్కినేనితో 'మహాకవి క్షేత్రయ్య' చిత్రాన్ని తీస్తూ 1975 అక్టోబర్ 1న అర్థంతరంగా తనువు చాలించారు. ఆ సినిమాని ఆ తర్వాత సి.ఎస్. రావు పూర్తి చేశారు.
ఆయన చిత్రాల్లో 'నమ్మినబంటు', 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'సుడిగుండాలు' చిత్రాలు జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి.

Wednesday, September 28, 2011

ఇంటర్వ్యూ: పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్

పబ్లిసిటీ ఆర్టిస్టుగా మరచిపోలేని సంఘటనలెన్నో 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సినిమా పోస్టర్'కి ఉండే ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ రంగంలో ఆయనే అత్యంత సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టు. ఇవాళ చేతితో పనిలేకుండా కంప్యూటర్‌తో సునాయాసంగా సినిమాల డిజైన్లు చేస్తున్నారు. కానీ తన కాలంలో కుంచెతో అద్భుతమైన పోస్టర్లకి ప్రాణం పోసి, ఆ సినిమాలపట్ల ప్రేక్షకుల్లో అనురక్తిని కలిగించిన అపురూప పబ్లిసిటీ చిత్రకారుడు ఈశ్వర్. ఇటు రాసిపరంగా కానీ, అటు వాసిపరంగా కానీ సినీ ఆర్ట్ రంగంలో ఎవరెస్టు శిఖరం, ఎన్నటికీ చెరిగిపోని సంతకం ఈశ్వర్. 45 సంవత్సరాల కాలంలో ఏకంగా 2,500 చిత్రాలకు పనిచేసిన ఆ కళాశిల్పి ఇటీవలే తన జీవితానుభవాలతో పాటు, తాను గీసిన సినీ బొమ్మలతో 'సినిమా పోస్టర్' అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా  ప్రత్యేకంగా సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

నా కెరీర్‌లో నేను పనిచేసిన సుమారు రెండు వేల పైచిలుకు సినిమాల ప్రతిఫలంలో నాకు దక్కింది మూడవ వంతు కూడా లేదు. నాకే కాదు. ప్రతి సినీ జీవికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అందరి విజయం వెనుక ఈ రహస్యం దాగి ఉంటుంది. డబ్బు కంటే అందరి మన్ననలూ పొందడం ముఖ్యం. ఆయా కంపెనీలకు పర్మినెంట్ టెక్నీషియన్‌గా సాగిపోవడం ఇంకా ముఖ్యం. ఆ రకంగా ఇవాళ నేను సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నా.
'సినిమా పోస్టర్'కి అదే ప్రేరణ
ఒక రోజున సేతు అనే తమిళ నటుడు ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్)కి చెందిన ఎడో బౌమన్ అనే వ్యక్తిని తీసుకుని నా వద్దకు వచ్చాడు. తాను బాలీవుడ్ సినీ పోస్టర్స్ మీద పరిశోధన చేస్తున్నానని బౌమన్ చెప్పాడు. హిందీ చిత్రసీమలోని అనేకమంది నిర్మాతల్నీ, పోస్టర్ డిజైనర్లనూ కలిశాడు. అనేక హిందీ సినిమాల పోస్టర్లని సేకరించాడు. వాటిలో నేను చేసిన పోస్టర్లు చాలానే ఉన్నాయి. మూడు గంటల పాటు నన్ను ఇంటర్వ్యూ చేశాడు బౌమన్. అతను సేకరించిన వివరాలతో ఆ తర్వాత లండన్‌లోనూ, లాజ్ ఏంజిల్స్‌లోనూ ఉన్న టాస్‌చెన్ పబ్లికేషన్స్ సంస్థ 'ఆర్ట్ ఆఫ్ బాలీవుడ్' అనే పుస్తకం తెచ్చింది. బౌమన్ నన్ను కలవడం నాకు స్ఫూర్తినిచ్చింది. మన పోస్టర్ల మీద విదేశీయులు సైతం పుస్తకాలు తెస్తుంటే మన పోస్టర్ల మీద మనమెందుకు ఓ పుస్తకం రాయకూడదనిపించింది. అలా మూడేళ్ల కష్టంతో 'సినిమా పోస్టర్' తెచ్చా. 

మామూలు శ్రమకాదు
దీని కోసం నిజంగా ఎంతో శ్రమించా. పుస్తకాన్ని ఎలా తీసుకు రావాలి? వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఆర్ట్ వర్క్ ఏదీ నా వద్ద లేదు. అప్పుడు వాటిని వెతకడం ప్రారంభించా. నా వద్ద పనిచేసిన 52 మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్ని సంప్రదించా. వారిలో నలుగురైదుగురు నేను వేసిన పోస్టర్లనీ, ఆర్ట్ వర్క్‌నీ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా 45 ఏళ్ల కాలంలో నా పనిలో నాకు లభ్యమైంది కేవలం 5 శాతం మాత్రమే. నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల సినిమాలకే కాక ఒరియా, బెంగాలీ, అస్సామీ చిత్రాలకూ పనిచేశా. అన్నీ కలిపి సుమారు 2500 సినిమాలకు పనిచేశా. కానీ నాకు వాటిలో 1900 సినిమాలే దొరికాయి. నా జీవిత కథతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆర్టిస్టులతో పాటు దక్షిణ, ఉత్తర భారతదేశంలో పేరుపొందిన ఆర్టిస్టుల జీవిత కథలు సేకరించి వారి గురించి రాశా. పద్నాలుగు మంది ప్రఖ్యాత తెలుగు చిత్రకారుల గురించి అధ్యయనం చేసి రాశా. సినీ ఇండస్ట్రీలో నేను అతి సన్నిహితంగా మెలిగిన మహోన్నత వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకున్నా.

మరచిపోలేని సంఘటనలు
1970లలో ఓ దీపావళికి ఆరుగురు పేరుపొందిన తమిళ హీరోలు.. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్ సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నింటికీ నేనే పబ్లిసిటీ ఆర్టిస్టుని. ఇలా అందరు హీరోల చిత్రాలకు ఒకే పబ్లిసిటీ ఆర్టిస్ట్ డిజైన్ చేయడం అదివరకే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ జరగలేదు. అది నా అదృష్టం. తెలుగు చిత్రసీమ వజ్రోత్సవ వేడుకల్లో సినీ ప్రముఖుల నడుమ అశేష జన సందోహంలో నిష్ణాతులతో పాటు నాకూ గౌరవ పురస్కారాన్ని అందించడం నేనెన్నడూ మరువలేని సంఘటన. ఒకనాడు ఏకాకిగా బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో పాండీ బజార్‌లో తిరిగిన నన్ను ఇవాళ సినీ జగత్తులో ఏకైక సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టుగా గుర్తించి వజ్రోత్సవ వేడుకల్లో సెలబ్రిటీగా నన్ను గౌరవించడంతో నా శ్రమ చరితార్థమైందనిపించింది. అంతకుముందు 1974లో డిస్టిబ్యూటర్లందరూ కలిసి బెజవాడలో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా చేసిన ఘన సన్మానాన్ని కూడా నేను మర్చిపోలేను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదొరై 9 అడుగుల నిలువెత్తు ఆయిల్ పెయింటింగ్ వేసే అవకాశం రావడం నాకు లభించిన భాగ్యంగా భావిస్తా. దాన్ని వేసే అవకాశం కల్పించింది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. అది వేయడానికి నెల రోజుల సమయమిచ్చారు. ఈ మధ్యలో నేనెంతవరకు ఆ బొమ్మ వేశానో చూడ్డానికి కరుణానిధి స్వయంగా రెండుసార్లు మా ఇంటికి రావడం మరచిపోలేని అనుభూతి. ఆ పెయింటింగుని రాజాజీ హాలులో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆవిష్కరించడం నా జీవితంలో మరో గొప్ప ఘటన.

తొలి దర్శకుణ్ణి
'అయినవాళ్లు' సినిమాకి అనుకోకుండా దర్శకత్వం వహించా. భీమలింగం అనే అతన్ని దర్శకత్వం నుంచి తప్పించడంతో దానికి కథ ఇచ్చిన నేనే బలవంతంగా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల నాకు మరో దారి లేకపోయింది. అంతా కొత్తవాళ్లతో తీసిన ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు దాని ప్రింటు కూడా దొరకడం లేదు. ఏదేమైనా తెలుగులో డైరెక్టర్ అయిన తొలి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. ఇతర భాషల్లో చూసుకుంటే నాకంటే ముందు మలయాళంలో పబ్లిసిటీ ఆర్టిస్టు పి.ఎన్. మీనన్ డైరెక్టర్ అయ్యాడు.

అక్కినేని గ్రూప్ అనే ముద్ర
నటుల్లో శోభన్‌బాబు నాతో సన్నిహితంగా మెలిగేవారు. అలాగే కృష్ణ కూడా. వాళ్ల అత్యధిక సినిమాలకి నేనే ఆర్టిస్టుని. రామారావు గారి సొంత సినిమాలకు పనిచేయకపోయినా ఆయన నటించిన 50 సినిమాలకి పనిచేశా. అయితే అక్కినేనిగారితో సినిమాలు తీసిన కంపెనీలన్నీ నాతో పనిచేయించుకోవడంతో నా మీద ఏఎన్నార్ గ్రూప్ అనే ముద్రపడింది. సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు, నేను ఒకే ఊరినుంచి ఈ రంగానికి వచ్చాం. ఆయనకంటే నేను ఏడేళ్ల ముందు వచ్చా. ఆయన తీసిన 150 సినిమాల్లో 82 సినిమాలకి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. నాతో పాటు గంగాధర్ కూడా ఈ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే మేమెప్పుడూ ఒకరికొకరం పోటీ అనుకోలేదు.

అదే పెద్ద అవార్డు
నేనేనాడు అవార్డుల కోసం ప్రాకులాడలేదు. ఈ 50 సంత్సరాల కాలంలో చిత్రసీమ నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు మించిన అవార్డు మరొకటి లేదు. సినీ అవార్డు అనేది ఓ కథను సెల్యులాయిడ్ మీదకు తీసుకురావడానికి శ్రమించిన నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించినది. పబ్లిసిటీ అనేది దానికి ఎంతవరకు వర్తిస్తుంది? సినిమా పూర్తయి తొలి కాపీ వచ్చాక మా అవసరం ఏర్పడుతుంది. ఇది నిర్మాణానికి అంటీ అంటనట్లుండే శాఖ. అందుకేనేమో దీనికి అవార్డులు ప్రకటించలేదు. అయినా చిత్ర పరిశ్రమలోని 24 శాఖల్లో పబ్లిసిటీని చేర్చడం సంతోషమే.

'సాక్షి' నుంచి 'దేవుళ్లు' దాకా
1967లో బాపు దర్శకత్వం వహించిన తొలి సినిమా 'సాక్షి'తో ప్రారంభమైన నా సినీ ప్రస్థానం 2000వ సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన 'దేవుళ్లు' సినిమాతో ముగిసింది. ఆ తర్వాత నేనే సినిమాకీ పనిచేయలేదు. నన్ను పరిశ్రమ వద్దనుకోలేదు. నేనే కావాలని దూరంగా ఉన్నా. ఒక ఉప్పెనలా కంప్యూటర్ సిస్టమ్ ఈ రంగంలోకి ప్రవేశించింది. మాన్యువల్స్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన మా తరం ఇప్పుడు ఈ కొత్తతరంలో పోటీకి దిగడం సరికాదనిపించింది. అలా అని నేను పూర్తిగా ఈ రంగానికి దూరం కాలేదు. పాత సినిమాలకి కొత్త పోస్టర్లు వేస్తూ వస్తున్నా. మా తరంలో మమ్మల్ని పబ్లిసిటీ ఆర్టిస్టులన్నారు. ఇప్పుడు పబ్లిసిటీ డిజైనర్స్ అంటున్నారు. నేడు ఈ శాఖకు 'ఆర్ట్'తో సంబంధంలేకుండా పోయింది. చెయ్యి తిరిగిన ఆర్టిస్టయితేనే కాని మా కాలంలో నెట్టుకు రాలేకపోయేవాళ్లం. ఇప్పుడు అన్ని వసతులు కంప్యూటర్‌లో ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిజ్ఞానం సంపాదిస్తే చాలనే పరిస్థితి ఉన్నప్పుడు నాలాంటి వాడు దూరంగా ఉండటమే మంచిదని నా గౌరవాన్ని నేను దక్కించుకున్నా. సాంకేతిక నైపుణ్యం పెరగడం, కొత్త కొత్త టెక్నాలజీ రావడం మంచిదే. కంప్యూటర్‌తో అద్భుతాలే చేయొచ్చు. హాలీవుడ్ సినిమాలకి చేస్తున్న పబ్లిసిటీ డిజైన్ల ప్రమాణాల్ని మనవాళ్లు అందుకోవాలి.


Tuesday, September 20, 2011

వార్తల్లో వ్యక్తి: అక్కినేని నాగేశ్వరరావు

అభినయ వాల్మీకి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)

Sunday, September 18, 2011

ఇంటర్వ్యూ: 'శ్రీరామరాజ్యం' నిర్మాత సాయిబాబు

'శ్రీరామరాజ్యం'కు శ్రీకారం ఎలా జరిగింది?
- ఓ ఆదివారం మధ్యాహ్నం రామసాయిమందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రాముడు గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న భావన అప్పుడే వచ్చింది. వెంటనే నా స్నేహితుడిని రమ్మని కబురుపెట్టాను. ఐదు నిమిషాల్లో వచ్చాడు. విషయం చెప్పగానే వెంటనే ముళ్ళపూడి రమణగారితో మాట్లాడించారు. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాం. మరుసటి రోజు బాపు-రమణగార్లను కలిశాం. అక్కడి నుంచి ఇళయరాజాగారిని కలిశాం. 'శ్రీరామరాజ్యం' శ్రీకారం చుట్టుకున్న వైనమిది.
ఇప్పటి రోజుల్లో పౌరాణికమంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అనుకున్న బడ్జెట్‌లో తీయగలిగారా?
- మెరుపులాంటి ఆలోచన రావడమే తరువాయిగా అన్నీ హుటాహుటిన కుదిరాయి. ఈ చిత్రం పరిధి విస్తృతమైంది కాబట్టి ద్విభాషా చిత్రంగా తెరకెక్కించమని చాలా మంది సలహా ఇచ్చారు. సీత పాత్రకు ముందు మేం మాధురీదీక్షిత్‌ను సంప్రదించాం. తెలుగు, హిందీల్లో చిత్రీకరిస్తేనే నటిస్తానని చెప్పింది. కానీ ద్విభాషా చిత్రమంటే తెలుగుతనం మరుగునపడే ప్రమాదముంది. పలు చోట్ల రాజీపడాలి. సంగీతం నుంచి సన్నివేశాల వరకు ఎక్కడో ఏదో అడ్డు తగులుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని తెరకెక్కించాలన్నదే నా సంకల్పం అని బాపుగారితో చెప్పాను.
'లవకుశ' అని గాక 'శ్రీరామరాజ్యం' అనే టైటిల్ పెట్టడంలో ఉద్దేశం?
- ముళ్ళపూడివారు కొన్ని హిందీ పౌరాణిక చిత్రాల పేర్లు చెబుతూ మధ్యలో 'శ్రీరామరాజ్య్' అని అన్నారు. 'శ్రీరామరాజ్యం'... పేరు చాలా బాగుంటుంది కదా. మన చిత్రానికి ఆ పేరే ఖరారుచేసుకుందాం అనుకున్నాం. నెల్లోపే పాటల రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి.
జొన్నవిత్తులతోనే అన్ని పాటలూ రాయించారెందుకు?
- 'అందరి బంధువయ భద్రాచల రామయ్యా...' అని జొన్నవిత్తుల అంతకుముందే ఓ పాట రాశారు. అంతకన్నా సరళంగా ఇంకెవరు రాయగలరు? అనిపించింది. అందుకే ఆయనతో అన్ని పాటలూ రాయించాం. ఇళయరాజాగారి బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా పాటల్ని ఇవాళ యువతే ఎక్కువగా ఇష్టపడుతోంది. అంత తాజాదనం గుబాళిస్తోంది గీతాల్లో.
చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
- మొదటి రోజు బాలకృష్ణగారు షూటింగ్‌లో ఉన్నారు. నేను కారు దిగి వెళ్తున్నాను. సీతాదేవిని భూదేవి తనతో తీసుకెళ్లే సన్నివేశమది. ముఖంలో పలు భావాలను పలికిస్తూ నటించాలి. దూరం నుంచి బాలకృష్ణ నటన చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత ఆయన ఎన్ని సన్నివేశాలు చేసినా, నేను చూసినా... నాకు నచ్చింది తొలి సన్నివేశమే.
సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటన గురించి ఏం చెబుతారు?
- పూర్తిగా పాత్రలో లీనమై నటించే నటుడు బాలయ్య. ఈ చిత్రంలో నటించినన్నాళ్ళూ ఆయనలో ఏదో తేజస్సు కనిపించేది. అది దినదినప్రవర్ధమానమైనట్టు అనిపించింది. రాముడి పాత్రలో ఆయన్ని చూసిన కొంతమంది యువకులు 'అచ్చం రామారావుగారిలా ఉన్నారు కదా' అనడం స్వయానా నేనే విన్నాను. చాలా ఆనందమనిపించింది. అంతే భక్తి శ్రద్ధలతో నయనతార నటించింది. సీత పాత్ర చేసినన్నాళ్ళూ తను శాకాహారమే తీసుకుంది. ఏరోజూ గుడికెళ్ళకుండా సెట్‌కు రాలేదు. నేను చూసిన వారందరిలోకీ నయనతార గొప్ప వ్యక్తిత్వమున్న అమ్మాయి. తన వృత్తికి పూర్తి న్యాయం చేసే తరహా మనిషి.
వాల్మీకి పాత్రని చేయడానికి అక్కినేని గారు అంత సులువుగా ఒప్పుకున్నారా?
- అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీయాలనిపించింది అని ఆయన అడిగారు. 'ప్రతి మనిషికీ ఓ తృప్తి ఉంటుంది. ఈ సినిమా తీస్తే నేను తృప్తిగా ఉంటాను. రామాయణాన్ని ఎవరూ మర్చిపోకూడదు. రామచరిత్రలో లేనిది లేదు. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ముల సఖ్యత, సుపరిపాలన, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా మసలడం.. అంటూ అన్ని విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. విశ్వం ఉన్నంతకాలం రాముడుంటాడని నా నమ్మకం ' అని చెప్పాను. పెద్దాయన పాత్రను చేయడానికి అంగీకరించారు. వాల్మీకి పాత్రకు వందశాతం సరిపోయారు.
మిగతా పాత్రధారుల గురించి చెబుతారా?
- తక్కువ సన్నివేశాల్లో కనిపించినా జనకుడి పాత్రలో మురళీమోహన్ అచ్చుగుద్దినట్టు సరిపోయారు. లక్ష్మణుడి పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నాం. చానాళ్ళు ఆయన కాల్షీటు కుదరలేదు. కానీ ఆఖరినిమిషంలో శ్రీకాంత్ కూడా మా యూనిట్‌లో కలవడం ముదావహం. లవకుశుల నుంచి... ప్రతి పాత్రధారీ ఈ చిత్రంలో చాలా గొప్పగా చేశారు.
సాంకేతికంగా ఈ సినిమా ఎలా ఉంటుంది?
- నేననుకున్నట్టు బాపుగారు కావ్యంలాగా తీర్చిదిద్దారు. ముళ్ళపూడివారి కథాకథనాల్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. సాంకేతికంగా ఎక్కడా వెనకడుగేయలేదు. షూటింగ్ జరిగిన 85 రోజులూ జిమ్మీజిప్ మా దగ్గరే ఉంది. నాలుగు ప్రత్యేకమైన సెట్‌లు వేశాం. ఏ ఫ్రేమ్ చూసినా చాలా గొప్పగా, కనులపండువగా ఉంటుంది. పాటలను అత్యంత సౌందర్యవంతంగా తెరకెక్కించారు బాపుగారు. ఆద్యంతం భారీతనంతో తీర్చిదిద్దాం.
సినిమాని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధాని బుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం.

Thursday, August 25, 2011

ప్రివ్యూ: పూలరంగడు

సునీల్ మరోసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా 'పూలరంగడు'. ఇదివరకు అతను హీరోగా నటించిన 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' సినిమాలు సూపర్‌హిట్టవగా, 'అప్పల్రాజు' ఫ్లాపయింది. ఇప్పుడు 'పూలరంగడు' సినిమాని 'అహ నా పెళ్లంట' ఫేం వీరభద్రం డైరెక్ట్ చేస్తున్నాడు. 'ప్రేమ కావాలి' ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఇషా చావ్లా ఇందులో సునీల్ సరసన స్టెప్పులు వేస్తోంది. అదే సినిమాని నిర్మించిన మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సంస్థ సమర్పిస్తోంది. అదివరకు కొన్ని సినిమాలకు పనిచేసినా 'ప్రేమ కావాలి'తోటే లైంలైట్‌లోకి వచ్చిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇషా చావ్లాని చూస్తుంటే 'మైనే ప్యార్ కియా' హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుకొస్తున్నదని సినిమా ప్రారంభం రోజున చెప్పాడు సునీల్. అలా అతణ్ణి ఇంప్రెస్ చేసింది ఇషా. ఇదివరకు 'పూలరంగడు'గా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోగా, రాజేంద్రప్రసాద్ చెప్పుకోదగ్గ రీతిలో అలరించలేదు. ఇప్పుడు ఈ మూడో 'పూలరంగడు' ఏం చేస్తాడో చూడాలి.
2012 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వీ, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేశ్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: నాగేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.

Thursday, August 11, 2011

ఇంటర్వ్యూ: దగ్గుబాటి రామానాయుడు

"నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి'' అని ఒకింత ఉద్వేగంగా చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ హీరోలుగా; రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'ముగ్గురు'. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రం ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా సంభాషించారు రామానాయుడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

వైవిధ్యమైన కథతో రూపొందించిన వినోదాత్మక చిత్రం 'ముగ్గురు'. 2 గంటల 7 నిమిషాల సేపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా నడుస్తుంది. ఈమధ్య విడుదలైన ఆడియోకు వెరీగుడ్ రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుందంటున్నారు. మొత్తం ఆరు పాటలు. ఇప్పటికే మా బేనర్‌లో చాలా సినిమాలు చేసిన కోటి ఈ సినిమాకీ మంచి మ్యూజిక్‌నిచ్చాడు. రచయితలు సాహిత్యం బాగా రాశారు. థియేటర్ ట్రైలర్స్‌కూ స్పందన బాగుంది. తమ పాత్రలకి ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు. ముగ్గురు హీరోలు, హీరోయిన్లు హుషారుగా నటించారు. ఈ సినిమాని 37 రోజుల్లోనే పూర్తి చేశాం. అందులో 23 రోజులు మలేషియాలో షూటింగ్ చేశాం. నాలుగు రోజులు కారంచేడులో చిత్రీకరించాం.
ఆదిత్య బాగా తీశాడు
డైరెక్టర్ ఆదిత్య సినిమాని బాగా తెరకెక్కించాడు. అతను 'ప్రేమించుకుందాం రా'తో మరో రెండు మూడు సినిమాలకి మా బేనర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను సబ్జెక్ట్ చెప్పగానే బాగా నచ్చింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. సాధారణంగా నా సినిమాని సెట్స్‌లో ఉండి గమనించడం అలవాటు కాబట్టి, ఆదిత్య ప్రతిభ ని సెట్స్ మీద చూశాను. వెరీగుడ్ డైరెక్టర్. నేను కథ బాగుంటేనే సినిమా తీస్తాను. ఇదివరకు కొన్ని సినిమాలు ఆడకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. మునుపటి సినిమా 'ఆలస్యం అమృతం' కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని తొలి కాపీ చూసినవాళ్లంతా అభిప్రాయపడ్డారు. చంద్రమహేశ్‌కి కచ్చితంగా హిట్ వస్తుందని ఆశించా. అయితే రాంగ్ టైమ్‌లో రిలీజ్ చెయ్యడం వల్లే అది ఆడలేదు.
అది విత్తనం, ఇది చెట్టు
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలనీ, సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగి ఉండాలనీ నేర్చుకున్నా కాబట్టి నేనెప్పుడూ ఫెయిల్యూర్స్‌కి భయపడలేదు. గతంలో 'ద్రోహి' ఫ్లాపయినప్పుడు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నా. కె. బాపయ్యకి డైరెక్టర్‌గా అది తొలి చిత్రం. దానికి పెట్టిన పది లక్షలూ పోయాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీతో 'ప్రేమనగర్' ప్లాన్ చేశా. దానికి పదిహేను లక్షలు ఖర్చుపెట్టాం. ఆ సినిమా జీవన్మరణ సమస్య. అది ఆడితే మద్రాసులోనే ఉంటాననీ, లేదంటే కేళంబాక్కం వెళ్లిపోతాననీ చెప్పా. ఎందుకంటే కేళంబాక్కంలో అప్పట్లో పొలాలు కొన్నా. అక్కడే వ్యవసాయం చేసుకోవాలనేది ఆలోచన. కారంచేడుకు మాత్రం పోకూడదనుకున్నా. ఎందుకంటే 'రామానాయుడు సినిమాల్లో అంతా పోగొట్టుకుని వచ్చేశాడురా' అనే మాటలు సొంతూరు వాళ్లనుంచి వినకూడదని. అయితే 'ప్రేమనగర్' పెద్ద హిట్టవడంతో కేళంబాక్కంకి వెళ్లాల్సిన పనిలేకపోయింది. అందుకే అంటుంటాను - మా సురేశ్ ప్రొడక్షన్స్‌కి 'రాముడు-భీముడు' విత్తనమైతే, 'ప్రేమగనర్' చెట్టు అని. ఈ రెండో సినిమాతో సినీ ఫీల్డ్‌లో నిలబడిపోయా. దాని హిందీ రీమేక్ 'ప్రేమనగర్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడా సక్సెసయ్యా. అదే సినిమాని తమిళంలో 'వసంత మాళిగై'గా తీసి అక్కడా హిట్టుకొట్టా. ఆ తర్వాత కెరీర్‌లో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను చలించలేదు. ముందుకు సాగుతూ వచ్చా.
ఈ ఏడాదే పంజాబీ సినిమా
ఇప్పటికి పన్నెండు భారతీయ భాషల్లో సినిమాలు తీశా. పంజాబీలో కూడా సినిమా తీస్తే, అన్ని భారతీయ భాషా సినిమాల్ని తీసిన నిర్మాతగా పేరు సంపాదించుకుంటా. ఈ ఏడాదే పంజాబీలో సినిమా తీయబోతున్నా. నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. సినిమా మీద తపనతోటే ఆ భాషల్లోనూ మంచి సినిమాలు తీయాలనుకుని తీశా. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. పైగా వైజాగ్ స్టూడియోని చూసుకోవడానికి అక్కడకి వెళ్తానన్నా వాళ్లు ఒప్పుకోవడం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు.
అన్ని రకాలుగా హ్యాపీ
తదుపరి సినిమాని భూపతిరాజా కథతో చెయ్యాలని అనుకుంటున్నా. అన్నీ కుదిరితే వెంకటేశ్ హీరోగా, ఆదిత్య దర్శకత్వంలో దాన్ని తీస్తా. ఆ తర్వాత నా మనవడు నాగచైతన్య హీరోగా వచ్చే ఏడాది జనవరి నుంచి మరో సినిమా ఉంటుంది. రానా హిందీలో బిజీ అయ్యేటట్లున్నాడు. ఇప్పుడక్కడ రాంగోపాల్‌వర్మ తీస్తున్న 'డిపార్ట్‌మెంట్'లో నటిస్తున్నాడు. సురేశ్‌బాబు మరో కొడుకు అభిరామ్ కూడా నటించేందుకు రెడీ అంటున్నాడు. రెండేళ్ల తర్వాత అతనూ హీరో అవుతాడు. 'మొదట మన బేనర్‌లోనే చేస్తా తాతా' అంటున్నాడు. నేను, నా తర్వాత నా కొడుకులు, ఇప్పుడు నా మనవళ్లు ఈ రంగంలోనే సక్సెస్ సాధించి, ముందుకెళుతుండటం ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నా. ఇక ప్రత్యేకంగా నేను సాధించాల్సిందంటూ ఏమీ లేదు.

Saturday, August 6, 2011

న్యూస్: నాగార్జున, శివప్రసాదరెడ్డి కాంబినేషన్‌లో 11వ సినిమా!

కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని నాగార్జున. 'రగడ' వంటి హిట్ తర్వాత ఈ సినిమా తయారు కాబోతోంది. ఇప్పటివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో పది సినిమాలొచ్చాయి. వాటిలో విక్కీ దాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ హిట్టయ్యాయి. ఆటో డ్రైవర్, ఎదురులేని మనిషి, బాస్, కేడి ఫ్లాపయ్యాయి. అయితే హిట్లు, ఫ్లాపులతో నిమిత్తం లేకుండా వారి అనుబంధం కొనసాగుతుండటం విశేషమనే చెప్పాలి. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు - దుక్కిపాటి మధుసూదనరావు, కృష్ణ-డూండీ కాంబినేషన్ తరహాలో వీరి కాంబినేషన్ తయారయ్యింది. స్టార్లు యేడాదికి ఒకటి, రెండు సినిమాలు కంటే ఎక్కువ చేయని ఈ రోజుల్లో ఒక హీరో ఒకే నిర్మాతతో పది సినిమాలు చేయడం వారి అనుబంధానికి నిదర్శనం. 1988లో 'విక్కీ దాదా'తో ప్రారంభమైన వీరి అనుబంధం 23 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. 'ఆటో డ్రైవర్' ఫ్లాపయ్యాక శివప్రసాద్‌రెడ్డి బాగా డిప్రెస్ అయ్యారు. "ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా నేను పూర్తి నిరాశలో ఉన్న టైంలో నన్ను పిలిచి సినిమా ప్లాన్ చేసుకోండని చెప్పారు నాగార్జున. అలా 'సీతారామరాజు' వచ్చి మళ్లీ నన్ను నిలబెట్టింది. ఫ్లాప్ ఇచ్చినప్పుడు కూడా నన్ను తన నిర్మాతగా భావించిన నాగార్జున సంస్కారం వల్లే మా కాంబినేషన్‌కు ఇంత గుర్తింపు వచ్చింది" అని చెప్పారు శివప్రసాద్‌రెడ్డి. అలాంటి ఈ హీరో, నిర్మాతల 11వ సినిమా 2012 జనవరిలో ప్రారంభం కాబోతోంది. దీని డైరెక్టర్ ఎవరనే సంగతి కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నది.

Friday, August 5, 2011

న్యూస్: అక్కినేనిగారూ ఇది సభ్యతేనా?

అక్కినేని నాగేశ్వరరావు దేశం గర్వించే మహానటుడు. 'దేవదాసు' పాత్రని ఆయన పోషించినట్లుగా ఇంకెవ్వరూ పోషించలేదనే కీర్తి పొందినవారు. ఆరున్నర దశాబ్దాలుగా అలుపన్నది లేకుండా ఇంకా నటిస్తూనే ఉన్నారు. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటానని తన అంకిత భావాన్ని ప్రదర్శించే అసలు సిసలు కళాకారుడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బాపు 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తున్నారు. అలాంటి ఆయన అదుపుతప్పి, అసభ్యకర రీతిలో మాట్లాడటమేమిటా అని అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. మీడియా అంతా పాల్గొన్న ఓ ఆడియో వేడుకలో, టెలివిజన్‌లో ప్రత్యక్షప్రసారమవుతున్న ఆ కార్యక్రమంలో ఆయన ఆడవారి వక్షస్థలం గురించి కొద్దిసేపు అలాగే మాట్లాడటం అందర్నీ బిత్తరపోయేలా చేసింది. కొంతమంది ఆయన మాటల్ని ఎంజాయ్ చేసినా ఎక్కువమంది అంత పెద్దవారు, అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నవారు అలా మాట్లాడవచ్చునా? అని పెదవి విరిచారు. గురువారం (ఆగస్ట్ 4) రాత్రి ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'దగ్గరగా.. దూరంగా...' ఆడియో వేడుకలో ఈ సందర్భం చోటు చేసుకుంది. ఇందులో అందరికంటే చివరగా సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన మధ్యలో అకస్మాత్తుగా 'అమాయకురాలు' సినిమా సంగతి ప్రస్తావిస్తూ అందులో నాయిక కాంచనని తను హత్తుకునే సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. "ఆ సమయంలో నిర్మాత మధుసూదనరావు గారు లేరు. నేను, కాంచన ఒకరినొకరం తన్మయత్వంతో గట్టిగా హత్తుకోవాలి. ఆ సీనులో ఆమె 'బ్రెస్ట్స్' కదిలాయి. ఈ సంగతి నాకెలా తెలుస్తుంది? రషెస్ చూసిన మధుసూదనరావు గారు నన్ను పిలిచారు. 'నీకు బుద్ధుందా? అంత గట్టిగా వత్తుకోవాలా? ఆ బ్రెస్ట్స్ చూడు ఎలా కదిలాయో. చూసుకోవద్దా?' అనరిచారు. అప్పట్లో అసభ్యతకు తావు లేకుండా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. అయినా ఇప్పుటి హీరోయిన్లవి కదులుతున్నా అవి నిజమైనవో, కాదో.. ఇప్పుడు కృత్రిమమైనవేవో తొడుక్కుంటున్నారుగా" అని చెప్పుకొచ్చారు. ఆయన ఈ మాటలు చెప్పేప్పుడు ఆయన పక్కనే ఆ సినిమా హీరోయిన్ వేదిక ఉంది. వేడుకకి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు ఉన్నారు. ఆయన ఇలా సినిమాల్లో అసభ్యత గురించి మాట్లాడుతూ, తనే అసభ్యంగా మాట్లాడటం వాళ్లని తలలు దించుకునేలా చేసింది. "ఆడవాళ్ల వక్షస్థలం గురించి అది మాట్లాడే సందర్భమేనా? ముసలాయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీకుండా పోతోంది" అనే కామెంట్లు వినిపించాయి.