తెలుగు చిత్రసీమ కనుగొన్న గొప్ప దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ఒకరు. ఆయన డైరెక్ట్ చేసిన వాటిలో నాలుగు సినిమాలు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డులు సాధించాయంటేనే ఆయన ప్రతిభ, సృజన శక్తి ఎలాంటివో అర్థమవుతుంది. 1912లో రాజమండ్రిలో జన్మించిన ఆయన 1954లో అమర్‌నాథ్, శ్రీరంజని, పద్మిని కాంబినేషన్‌తో తీసిన 'అమర సందేశం' చిత్రంతో దర్శకునిగా అరంగేట్రం చేశారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'బైజు బావ్రా' ప్రేరణతో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించారు. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు.
ఎప్పుడైతే అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు ఆయన ప్రతిభను గుర్తించి 'తోడికోడళ్లు' (1957) చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారో, అప్పట్నించీ ఆయన దశ తిరిగింది. శరత్‌చంద్ర చటోపాధ్యాయ నవల 'నిష్కృతి' ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి ఆదుర్తికి మంచి పేరుతో పాటు మంచి అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'మాంగల్య బలం' (1959), 'నమ్మిన బంటు' (1960), 'వెలుగు నీడలు', 'ఇద్దరు మిత్రులు' (1961), 'చదువుకున్న అమ్మాయిలు' (1963), 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'దాగుడు మూతలు' (1964)' 'సుమంగళి' (1965) వంటి విజయవంతమైన చిత్రాల్ని ఆయన రూపొందించారు. 1965లోనే అంతా కొత్తవాళ్లతో ఆయన డైరెక్ట్ చేసిన తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు' సూపర్‌హిట్టయి ఆయన కీర్తి ప్రతిష్ఠల్ని మరింత ఇనుమడింపజేసింది. ఈ సినిమాతోనే ఘట్టమనేని కృష్ణ హీరోగా పరిచయమై, అనంతర కాలంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. ఆ తర్వాత 'సుడిగుండాలు', 'పూలరంగడు' (1967), 'విచిత్ర బంధం' (1972), 'మాయదారి మల్లిగాడు' (1973), 'గాజుల కిష్టయ్య' (1975) వంటి హిట్లని తీశారు ఆదుర్తి. అక్కినేనితో 'మహాకవి క్షేత్రయ్య' చిత్రాన్ని తీస్తూ 1975 అక్టోబర్ 1న అర్థంతరంగా తనువు చాలించారు. ఆ సినిమాని ఆ తర్వాత సి.ఎస్. రావు పూర్తి చేశారు.
ఆయన చిత్రాల్లో 'నమ్మినబంటు', 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'సుడిగుండాలు' చిత్రాలు జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి.
No comments:
Post a Comment