Friday, September 9, 2011
న్యూస్: సముద్ర మీద రాజశేఖర్ ఆశలు!
భార్య జీవిత డైరెక్షన్లో చేస్తున్న 'మహంకాళి' సినిమా సెట్స్‌పై గాయపడ్డ డాక్టర్ రాజశేఖర్ కోలుకుని మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2011 మే నెలాఖరులో చెన్నైలో ఫైట్‌మాస్టర్ కనల్ కణ్ణన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్లు తీసేటప్పుడు ప్రమాదవశాత్తూ గులకరాళ్ల మీద పడ్డ రాజశేఖర్ ముఖానికీ, కాళ్లూ చేతులకూ గాయాలయ్యాయి. దాంతో ఆయన రెండు నెల్లపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈలోగా ఆయనలేని సన్నివేశాల్ని జీవిత చిత్రీకరించారు. ఇటీవల నిర్మాతల మండలి ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన రాజశేఖర్ ఉల్లాసంగా కనిపించారు. గాయాలు పూర్తిగా నయమై షూటింగులో పాల్గొంటున్నట్లు చెప్పారు. తాజాగా సముద్ర డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కాబోతొంది. సముద్ర తొలి చిత్రం 'సింహరాశి' హీరో రాజశేఖరే. అది మంచి హిట్టయ్యింది. ఆ తర్వాత వాళ్ల కలయికలో వచ్చిన 'ఎవడైతే నాకేంటి' కమర్షియల్‌గా డబ్బులు తీసుకు రాకపోయినా రాజశేఖర్‌కి వ్యక్తిగతంగా మంచి పేరుతెచ్చింది. ఇప్పుడు వాళ్ల తాజా సినిమాని ఎల్.వి.ఆర్. ప్రొడక్షన్స్ అనే బేనర్ నిర్మించబోతోంది. పేరుపొందిన పారిశ్రామికవేత్త ముత్తినేని సత్యనారాయణతో కలిసి లగడపాటి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబరులో మొదలవుతుంది. 'గోరింటాకు' తర్వాత మరో హిట్ లేకపోవడంతో మరోసారి సముద్ర డైరెక్షన్ మీద ఆశలు పెట్టుకున్నాడు రాజశేఖర్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment