Saturday, September 24, 2011
న్యూస్: నిందని చెరిపేసుకున్న శ్రీను వైట్ల
పెద్ద హీరోతో హిట్లివ్వలేక పోతున్నాడనే అపవాదుని ఎత్తకేలకు 'దూకుడు'తో అధిగమించాడు శ్రీను వైట్ల. 'దూకుడు'కి ముందు అతను చిరంజీవితో 'అందరివాడు', నాగార్జునతో 'కింగ్', వెంకటేశ్‌తో 'నమో వెంకటేశ' సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. వీటిలో 'అందరివాడు' కేవలం కొందరివాడిగానే మిగలగా, 'కింగ్' పాక్షికంగానే టైటిల్‌ని జస్టిఫై చేయగలిగాడు. ఇక 'నమో వెంకటేశ' అయితే బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. పైగా ఈ సినిమాలో వెంకటేశ్‌ని మరీ జోకర్‌గా చూపించడం విమర్శలకి తావిచ్చింది కూడా. ఈ నేపథ్యంలో మహేశ్ వంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు శ్రీను. మహేశ్‌కి మాస్, క్లాస్ - రెండు వర్గాల్లో ఉన్న ఇమేజ్‌కి, తన స్టైల్ కామెడీ టచ్ ఇవ్వడంలో అతను తెలివిగా వ్యవహరించాడు. మహేశ్ అంటే ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల్ని కోరుకుంటారు కాబట్టి అలాంటి సీన్లని పెడుతూనే, అతని కేరక్టర్లో వినోదాన్ని జోడించాడు. ఆఖరికి హీరోయిన్‌తో అతడి సన్నివేశాలు సైతం వినోదాన్ని అందించడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా తెలంగాణా యాసని విలన్లకే పెడుతుంటారనే తెలంగాణావాదుల విమర్శల్ని దృష్టిలో పెట్టుకున్నట్లుగా మహేశ్ చేత అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి విలన్లతో ఢీకొనేప్పుడు అతడి చేత తెలంగాణా యాసలో మాట్లాడించాడు. ఆ డైలాగుల్ని చెప్పడంతో మహేశ్ 100% సక్సెసయ్యాడు. ఇలా తెలంగాణావాదుల్ని సైతం తన పాత్రతో ఇంప్రెస్ చేయగలిగాడు మహేశ్. సమకాలీన పాపులర్ అంశాల్ని కూడా తన స్క్రిప్టులో జోడించడంలో ముందుండే శ్రీను ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పాత్రచేత చెప్పించే 'ఎస్ఎంఎస్' రిక్వెస్ట్ థియేటర్లలో ఎంతగా నవ్వులు పూయించిందీ చూడొచ్చు. అలాగే అతడికి 'పద్మశ్రీ' అనే పేరు పెట్టడంలోనూ ఆ అవార్డులు ఎలా వస్తున్నాయో చెప్పాడు. అయితే ఎం.ఆర్. వర్మ చేత ఎడిటింగ్‌ని మరింత సమర్థంగా అతడు చేయించి ఉండాల్సింది. అలా జరిగితే లెంగ్త్ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని ఇవ్వడంతో పాటు, పెద్ద హీరోతో హిట్ ఇవ్వలేడనే అపవాదుని చెరిపేసుకోవడంలో సఫలమయ్యాడు శ్రీను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment