Showing posts with label pavan kalyan. Show all posts
Showing posts with label pavan kalyan. Show all posts

Saturday, October 15, 2011

బిగ్ స్టోరీ: హవా తగ్గిన పరభాషా దర్శకులు!

ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్‌రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్‌తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్‌కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్‌తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్‌కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్‌లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.

Wednesday, July 20, 2011

విశ్లేషణ: మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సూపర్‌హిట్టే!

ఏ కథకైనా నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) ముఖ్యం. మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సినిమా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా హైలైట్ చేస్తూ తెలుగులో తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సందర్భాలు అనేకం. గతంలో కాశ్మీర్, అమెరికా, సింగపూర్ తదితర ప్రాంతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోవాలంటే చిన్న సినిమా అయినా గోదావరి నేపథ్యంలో వంశీ రూపొందించిన 'గోపి గోపిక గోదావరి' పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. గోపిక అనే లేడీ డాక్టర్ పేదలకు సేవ చేసే ఉద్దేశంతో గోదావరి గ్రామాల్లో పనిచేసే ఓ బోటు హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైన గోపి అనే ఆర్కెస్ట్రా సింగర్‌ని ప్రేమిస్తుంది. అయితే ఓ యాక్సిడెంట్లో గోపి చనిపోయాడని విని హతాశురాలవుతుంది. చిత్రమేమంటే తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయిన గోపి ఆమె వల్లే కోలుకుని ప్రభుగా చలామణి అవుతాడు. చివరకు ఆ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారన్నది కథ. చక్రి సంగీతం సమకూర్చగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే' పాట ఏ నోట విన్నా వినిపించింది. చక్రి సంగీత మాయాజాలంతో పాటు గోదావరి తీరంలో వంశీ తీసిన సన్నివేశాలన్నీ జనాన్ని ఆకట్టుకోవడంతో 'గో గో గో' చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది.
దాని తర్వాత వచ్చిన పెద్ద సినిమా 'మగధీర' ఏ స్థాయి విజయాన్ని పొందిందో మనకు తెలుసు. అంతకు ముందు బాక్సాఫీస్ పరంగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్న 'పోకిరి'ని వెనక్కినెట్టి ఏకంగా దానికి దాదాపు రెట్టింపు వసూళ్లతో అదరగొట్టింది. అలాంటి 'మగధీర'లోనూ ఓ ప్రాంతపు నేపథ్యం ఉంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఉదయగఢ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజం నేపథ్యంలో వచ్చే అన్ని సన్నివేశాలూ (ముఖ్యంగా రాంచరణ్-కాజల్, రాంచరణ్-దేవ్‌గిల్, రాంచరణ్-శ్రీహరి సన్నివేశాలు) ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉదయఘడ్‌ని రక్షించే కాలభైరవ పాత్రలో రాంచరణ్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. ఉదయఘడ్‌ని కళా దర్శకుడు ఆనంద్‌సాయి తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. రానున్న అరిష్టాన్ని పోగొట్టడానికి రాజకుమారి చేసే కాలభైరవ పూజా సన్నివేశాల చిత్రీకరణ, అక్కడ విలన్లతో హీరో కాలభైరవ పోరాడే తీరు అద్భుతమనిపించాయి.
అంతకుముందు గంగోత్రి, హరిద్వార్ నేపథ్యంలో వచ్చిన అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి', చార్మినార్ నేపథ్యంలో వచ్చిన మహేశ్ 'ఒక్కడు', వరంగల్ నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ 'వర్షం', కలకత్తా నేపథ్యంలో వచ్చిన చిరంజీవి 'చూడాలని ఉంది', రాయలసీమ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వీటిలాగే ఘన విజయం పొందిన మరో సినిమా 'సింహాద్రి'. జూనియర్ ఎన్‌టీఆర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు రాయలసీమతో పాటు కేరళను నేపథ్యంగా ఎంచుకున్నారు. 'ఇంద్ర'లో కాశీ, 'సింహాద్రి'లో కేరళ నేపథ్యాలు వాటి భారీ విజయాల్లో తమవైన పాత్ర పోషించాయి. 'వర్షం' సినిమా ప్రభాస్‌కు స్టార్‌డంను తీసుకొచ్చిందనేది వాస్తవం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథకు నేపథ్యం వరంగల్. హీరో హీరోయిన్ల రొమాన్స్‌కు సాక్షీభూతంగా వరంగల్ నిలుస్తుంది. అంతదాకా వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణాన్ని ఎవరూ చూపించని రీతిలో ఈ సినిమాలో అందంగా చూపించారు.
అయితే కేవలం ఓ ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ సినిమా తీసేస్తే కచ్చితంగా హిట్టు దక్కుతుందా? అనే ప్రశ్నకు 'కాదు' అనే జవాబే వస్తుంది. కథకు అనుగుణమైన నేపథ్యం, వాస్తవికంగా ఉండే చిత్రీకరణ మాత్రమే సినిమాను అందంగా తీర్చిదిద్దగలుగుతాయి. లేదంటే కోరి అపజయం తెచ్చుకున్నట్టే. ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'బద్రినాథ్'ను తీసుకోండి. ఈ సినిమా కథకు నేపథ్యంగా హిమాలయాల్లోని తక్షశిలనీ, అక్కడి బద్రీనాథ్ దేవాలయాన్నీ ఎంచుకున్నారు. అయితే కథలో లోపాలు, గురు (ప్రకాష్‌రాజ్), శిష్య (అల్లు అర్జున్) అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి సినిమాలకి అత్యవసరమైన ఎమోషన్‌ని క్యారీ చేయకపోవడం, దర్శకత్వ లోపాలు ఈ సినిమాకి ఆశించిన రీతిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే బద్రీనాథ్ దేవాలయం సెట్లో తీసిన సన్నివేశాలు బాగుండటం గమనార్హం.
అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన 'తీన్‌మార్' సినిమా కొంతవరకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ హీరో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా వచ్చినప్పటికీ తెలుగు నేటివిటీని మిస్సవడం, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్సులయ్యాయి. ఇక మహా శక్తిపీఠాల నేపథ్యంతో పాటు రాజస్థాన్, కాశ్మీర్ నేపథ్యంలో వచ్చిన ఎన్‌టీఆర్ సినిమా 'శక్తి' అసహజమైన సన్నివేశాల కారణంగా ఘోర పరాజయం పాలైంది. ఇష్టమొచ్చినట్లు భారీగా ఖర్చుపెట్టేసి, 'మగధీర'ని మించిన సినిమా తీయాలనుకునే యత్నంలో నేల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం మరోసారి స్పష్టం చేసింది. దీన్నిబట్టి మంచి కథకు మంచి నేపథ్యం అనేది మరింత శోభను చేకూర్చిపెడుతుందనే సంగతితో పాటు కథలో దమ్ము లేకపోతే మంచి నేపథ్యం కూడా వృథా అవుతుందనే విషయం అర్థమవుతుంది.
తాజాగా కొన్ని సినిమాలు అమెరికా, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశీ నేపథ్యాలతో తయారవుతున్నాయి. ఓవర్సీస్‌లోని తెలుగువాళ్లని కూడా మెప్పించే ఉద్దేశంతో ఇప్పుడు ఈ తరహా నేపథ్యాలు తెలుగు సినిమాల్లో ఎక్కువవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సత్తా వీటికి ఉంటుందా?

Thursday, July 14, 2011

న్యూస్: అది హిట్టయితే ఓకే, లేకపోతే..?

సీనియర్ హీరోయిన్ త్రిష క్రేజ్ తెలుగులో క్రమేపీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఏడేళ్ల క్రితం 'వర్షం'తో యువత కలల రాణిగా ఆవిర్భవించిన ఈ తమిళ తార ఆ మరుసటి యేడాదే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో అగ్ర తారల్లో చేరిపోయింది. ఈ రెండూ ఎమ్మెస్ రాజు నిర్మించినవే కావడం గమనార్హం. అనంతరం 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'కృష్ణ', 'కింగ్' వంటి హిట్ సినిమాల్లో నటించి నెంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత కాలంలో కొత్త తారల సందడి వల్ల ఆమె కెరీర్ వెనుకపట్టు పట్టింది. 'కింగ్' తర్వాత ఆమె చేసిన 'శంఖం', 'నమో వెంకటేశ' సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. ఆమె పాత్రలు కూడా అంతే. వాటి తర్వాత పవన్ కల్యాణ్‌తో తొలిసారిగా నటించిన 'తీన్‌మార్' కూడా ఆమెకి ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. అది వెంకటేశ్‌తో చేస్తున్న మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. వెంకటేశ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం తెలుగులో త్రిష కెరీర్‌ని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితే సరే, లేకపోతే.. సమస్యే.

Wednesday, June 15, 2011

ఇంటర్వ్యూ: సంగీత దర్శకుడు చక్రి

"పాట అంటే నా దృష్టిలో 60 శాతం సాహిత్యం, 40 శాతం బాణీలు. పాటలో గాత్రమే ప్రధానం. సాహిత్యం వినిపించని పాట పాటే కాదు'' అని చెప్పారు సంగీత దర్శకుడు చక్రి. ఎన్నో సూపర్ హిట్ పాటలకి బాణీలు కూర్చిన ఆయన చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తూ వస్తున్న ఆయన బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన అనుభవాల్ని పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే...
చిత్రసీమకి వచ్చాక ఇది పదో పుట్టినరోజు. నిర్మాతలు, దర్శకులు, హీరోల ప్రోత్సాహంతో ఇన్నేళ్లుగా కెరీర్‌ని కొనసాగించ గలుగుతున్నా. ఇన్నేళ్లలో మంచి దర్శకులతో పనిచేశా. మంచి హిట్స్ ఇవ్వగలిగా. అయితే మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, వెంకటేశ్, రాంచరణ్ వంటి హీరోలతో పనిచేసే అవకాశం ఇంతవరకు రాలేదు. రాబోయే రోజుల్లో వారితో పనిచేస్తాననే ఆశిస్తున్నా. బాలకృష్ణతో తొలి సినిమా 'సింహా' పెద్ద హిట్టవ్వడం హ్యాపీ. ఆయన్ని ఎన్నిసార్లు కలిసినా 'చాలా మంచి పాటలిచ్చావు' అని మెచ్చుకున్నారు. 'త్వరలో మనం మళ్లీ కలిసి పనిచేస్తాం' అని కూడా చెప్పారు.
అలా అయితే ఫీలవుతా
'చుక్కల్లో చంద్రుడు', 'చక్రం' వంటి సినిమాల్లో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అవి సరిగా ఆడకపోవడం వల్ల కాస్త బాధుంటుంది కానీ తప్పదు కదా. నా సినిమా హిట్టయ్యాక వెంటనే అవకాశాలు రాకపోయినా, ఆ సినిమా డైరెక్టర్ నుంచి మరో ఆఫర్ రాకపోయినా ఫీలవుతా. పూరి జగన్నాథ్‌తో ఎప్పుడూ కలిసి పనిచేయాలనే ఉంటుంది. ఇప్పుడెందుకు చెయ్యట్లేదనే ప్రశ్న నన్ను కాక ఆయన్నడిగితేనే కరెక్టు. మళ్లీ ఆయనతో కలిసి పనిచేసే రోజు దగ్గర్లోనే ఉందనుకుంటున్నా.
నా పాటల్లో సాహిత్యం వినిపిస్తుంది
ఆడియో మార్కెట్ పడిపోయింది. అయితే వినేవాళ్లు బాగా పెరిగారు. రేడియోలో, ఇంటర్నెట్‌లో బాగా వింటున్నారు. గాయనీ గాయకులు కూడా పెరిగారు. బాలు తర్వాత కార్తీక్ మంచి గాయకుడని చెప్పుకోవచ్చు. గాయనీమణుల్లో గీతామాధురి అద్భుతంగా పాడుతోంది. పాట అంటే నా దృష్టిలో 60 శాతం సాహిత్యం, 40 శాతం బాణీలు. నా పాటలో సాహిత్యం వినిపించాలని కోరుకుంటా. గాత్రమే ప్రధానం. సాహిత్యం వినిపించని పాట పాటే కాదు. అందుకే నా పాటల్లో సౌండ్ రికార్డింగ్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తా. మిక్సింగ్‌లో తేడా వల్ల నేను చేసిన కొన్ని పాటల్లోనూ బీట్ ఎక్కువగా వినిపించి ఉండొచ్చు కానీ, ఎక్కువ వాటిలో సాహిత్యం వినిపిస్తుంది.
అతను విలక్షణ రచయిత
నా అభిమాన సంగీత దర్శకుడు ఇళయరాజా, రెహమాన్. నేను పనిచేసిన గేయ రచయితల్లో భాస్కరభట్ల రవికుమార్ మంచి రచయిత. అన్ని రకాల పాటలూ రాయగల విలక్షణ రచయిత.
తొలి బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం వైవిఎస్ చౌదరి సినిమా 'రేయ్', తరుణ్, శ్రీకాంత్ సినిమా 'అనుచరుడు', రానా హీరోగా నటిస్తున్న 'నా ఇష్టం', నిఖిల్ సినిమా 'వీడు తేడా', తరుణ్ చిత్రం 'యుద్ధం', జగపతిబాబు హీరోగా నటిస్తున్న మరో సినిమా చేస్తున్నా. ప్రకాశ్ ఝా నిర్మించే ఓ హిందీ సినిమాకి పనిచేస్తున్నా. ఇది నా తొలి బాలీవుడ్ సినిమా. ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశా. ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేసేదీ, నటీనటుల వివరాలు ఇంకా తెలీదు.
సేవా కార్యక్రమాలు
నా పుట్టిన రోజు సందర్భంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అనాథ శరణాలయాలకు బియ్యం బస్తాలు అందిస్తున్నాం. వృద్ధాశ్రమాలకు నెల వరకు ఉదయం ఫలహారాల్ని సమకూరుస్తున్నాం. కాలేజీలో చదువుకుంటున్న పేద విద్యార్థుల ఫీజులు కట్టడం, చిత్రసీమలోని వృద్ధ కళాకారుల పిల్లలకు చదువు చెప్పించడం వంటివి చేస్తున్నాం. అలాగే అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నాం.

Friday, January 7, 2011

కొత్తదనం హోరులో క్వాలిటీ మాయం

ఒక నిర్మాత కొత్తవాళ్లతో సినిమా మొదలుపెట్టి 'కొత్తదనం కోసమే నా చిత్రంలో కొత్తవాళ్లని పరిచయం చేస్తున్నా' అంటాడు. ఇంకో దర్శకుడు 'పాత్రలు కనిపించాలే తప్ప నటులు కనిపించకూడదని కొత్తవాళ్లని ఎంచుకున్నా' అని చెబుతాడు. వాళ్ల దృష్టిలో సినిమాకి నూతనత్వం కొత్త నటులవల్లనే వస్తుందని. ఇదెంతవరకు వాస్తవం? తరచి చూస్తే ఇందులో నిజం పాక్షికంగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది. సినిమాకి కొత్తదనం కేవలం కొత్త నటులవల్లనే రాదు. ట్రీట్‌మెంట్‌లో నూతనత్వం వుండాలి. అప్పుడే ఏ సినిమా అయినా కొత్త తరహాగా తోస్తుంది ప్రేక్షకులకి. ఇప్పుడే కాదు అనాది కాలం నుంచే ఈ సత్యం ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది.
ఉదాహరణలకి మరీ పూర్వపు చిత్రాల జోలికి వెళ్లకుండా చిరంజీవి తరం నుంచే తీసుకుందాం. 'ఖైదీ'కి ముందుగా చిరంజీవి అనేక చిత్రాలు చేసి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. 'ఖైదీ' చూస్తే వయొలెన్సు, పగ, ప్రతీకారాల నడుమ ఆ సినిమా కథ నడుస్తుంది. అయితే తీసే విధానం, అందులోని పాటల చిత్రీకరణ నవ్యతతో కూడుకుని వున్నందున ప్రేక్షకులు ఆదరించారు. 'రగులుతోంది మొగలి పొద..' పాట చిత్రీకరణ అద్భుతంగా వుందని మెచ్చుకోనివాళ్లు అరుదు. ట్రీట్‌మెంట్ పరంగా చూసినా అందులో క్షణం క్షణం ఉత్కంఠతని నదిపించడంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మంచి పరిణతిని కనబర్చాడు. ఇదే ఆ చిత్రానికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టి 'ట్రెండ్‌సెట్టర్' ముద్రని వేసుకోగలిగింది.
కామెడీ చిత్రాలంటే మనకి మొదట్నించీ ఓ చిన్న చూపుంది. వాటిని మనం రెండవ శ్రేణి చిత్రాలకిందే జమకట్టడం అలవాటు చేసుకున్నాం. అయితే అలాంటి హాస్య చిత్రాల్లో అరుదైన చిత్రంగా 'లేడీస్ టైలర్'ని పేర్కొనవచ్చు. 'తొడమీద పుట్టుమచ్చ' అన్న పాయింట్ నేపథ్యంలో తీసిన ఆ చిత్రంలో ఆద్యంతమూ హాస్యం, సున్నిత శృంగారం పోటీపడి నడుస్తాయి. దర్శకుడు వంశీ ఒక సరికొత్త తరహా హాస్యాన్ని ప్రేక్షకులకి అందించినందునే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అందులో హీరో రాజేంద్రప్రసాద్. ఆయన కొత్తవాడేమీ కాదు. వంశీయే తీసిన 'అన్వేషణ' సస్పెన్స్ చిత్రాల్లోనే కొత్త ఒరవడిని సృష్టించింది. అందులో హీరో హీరోయిన్లు కార్తీక్, భానుప్రియ అప్పటికే ఎన్నో సినిమాలు చేశారు.
మొదట్నించీ తెలుగులో ప్రేమ కథాచిత్రాలకు కొదవలేదు. అయినా 'గీతాంజలి' కొత్తగా ఎందుకు అనిపించింది? అందులో చెప్పిన పాయింట్ కొత్తగా వుంది. చిత్రీకరణలో నవ్యత వుంది. ఒక దృశ్యకావ్యం అనిపించుకోగల లక్షణాలన్నీ అందులో ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం కానీ, హీరో నాగార్జున కానీ కొత్తవాళ్లు కాదు. అయినా ఆ చిత్రం కొత్త తరహా చిత్రాల కోవకే చెందుతుందని అప్పట్లో అందరం ఒప్పుకున్నాం. అట్లాగే 'శివ'. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక ట్రెండుని సృష్టించిన ఆ చిత్రంలో ప్రతి ఫ్రేములోనూ కొత్తదనాన్ని ఆస్వాదించాం. దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్తవాడే కావచ్చు కానీ హీరో హీరోయిన్లిద్దరూ పాతవాళ్లేగా.
'ఖుషి' సంగతి చూసినా అంతే. పవన్‌కల్యాణ్ కొత్తవాడు కాదు. అయినా చిత్రం అంతా కొత్తదనమే. అదంతా దర్శకుడు యస్.జె. సూర్య పనితనం. ప్రతి సన్నివేశాన్నీ పాత మూసధోరణితో తీయకుండా కొత్తగా, 'సహజంగా జరుగుతుంది' అనిపించేలా తీశాడు. డైలాగులూ అంతే. కొత్త తరహాగా తోస్తాయి. అందుకనే 'ఖుషి' ఒక కొత్త సెన్సేషన్ అయ్యింది.
'నువ్వే కావాలి', 'నువ్వు నేను' కొత్తవాళ్లతో తీసి ఘన విజయాల్ని సొంతం చేసుకున్న చిత్రాలే. దాన్నెవరూ కాదనలేరు. సినిమాలు ఫ్రెష్‌గా ఉండటానికి వాటిలోని హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయి వుండటం కూడా దోహదం చేస్తుందనడంలో ఎవరికీ అభ్యంతరం వుండదు. వాటిలోని సబ్జెక్టుకి కొత్తవాళ్లయితే సరిగ్గా వుంటుంది కాబట్టి వాటికి వాళ్లని ఎంచుకున్నారు. కాలేజీ స్టూడెంటుగా పవన్‌కల్యాణ్‌నీ, మహేశ్‌నీ మినహాయించి వెంకటేశ్, నాగార్జున వంటివాళ్లని మనం చూడలేముగా. అయితే మన అభ్యంతరం దానికి కాదు. ఇప్పుడు అనేకమంది నిర్మాతలు (వాళ్లలో కొత్తవాళ్లు చాలామందే వున్నారు) కొత్తవాళ్లతో సినిమాలు తీస్తూ కొత్తదనం కోసమే అలా చేస్తున్నామని చెబుతుండటం అభ్యంతరకరం. కొత్త నటుల ప్రవేశాన్ని విమర్శించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆ వచ్చే కొత్తవాళ్లలో క్వాలిటీ తక్కువగా కనిపిస్తున్నదనేదే ఇక్కడ పాయింటు.
హీరో హీరోయిన్లు అందంగా కనిపించినంత మాత్రాన చాలదు. హావభావ ప్రకటనలో పరిపక్వత వుందా లేదా అన్నది అతి ముఖ్యం. ఇవాళ పరిచయమవుతున్న హీరోలు చాలామందిలో ఈ పరిపక్వత ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం దిష్టిబొమ్మలుగా మాత్రమే కనిపిస్తున్నారు. లోపం ఆ నటులది కాదంటే వేలు దర్శకులవైపు చూపించాల్సి వస్తుంది. నటుల నుంచి నటనను రాబట్టాల్సింది వాళ్లే కాబట్టి. 'నటించడం'లో నటుడు ఫెయిలయ్యాడంటే ఆ భాధ్యతలో సగం వంతు దర్శకుడిదే. ఆకాశ్, సంతోష్, సతీశ్, శ్రావణ్, సచిన్, దిలీప్, పవన్‌కుమార్, రోహిత్.. ఇలా హీరోల జాబితా.. జయలక్ష్మి, వనియా, అంజలి, మితిక, సునీత, రాజీ, అర్చన, కాంచీకౌల్.. ఇలా హీరోయిన్ల జాబితాకి అంతుండదు. వీళ్లలో నటులుగా ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్లలో ఒక్కరు కూడా అవుపించరు. ఆకాశ్, రోహిత్, జయలక్ష్మి, కాంచీకౌల్ వంటి అతికొద్ది మందికి మాత్రమే ఒకటికంటే ఎక్కువ సినిమాల్లో చాన్సులు వస్తున్నా వాళ్లెంతవరకూ నిలదొక్కుకోగలరన్నది ప్రశ్నార్థకమే. నటనపరంగా వాళ్లు నేర్చుకోవలసింది చాలా వుంది.
ఇదిలా వుంటే కొత్తనటులతో సినిమాలు తీయడంవల్ల సినిమా బడ్జెట్‌ని అనుకున్న తీరులో పరిమితం చేసుకోవచ్చనే వాదనే ఎక్కువ బలంగా వినిపిస్తోంది. కొంతమంది కొత్తతారలు తెరమీద కనిపించిందే చాలనే ధోరణితో పారితోషికం కూడా అడగకపోవడంతో అది నిర్మాతలకు వరంగా మారుతోంది. పైగా కొత్తతారలయితే తమ పాత్ర 'అలా వుండాలి ఇలా వుండాలి' అనే డిమాండ్ చేయరు. ముందనుకున్న ప్రకారంగానే కథని లాగించేయవచ్చు. అదే పెద్ద హీరోలైతే అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారు. అన్నింటికీ మించి బడ్జెట్ - ముందనుకునేదొకటి, తర్వాత అయ్యేదొకటి. ఈ బాధలెందుకని ఇప్పుడు నిర్మాతలు పది, ఇరవై లక్షల్లో సినిమాలు ఎడాపెడా తీసేసి ఆనక బయ్యర్లు లేక నానాతంటాలు పడుతున్నారు. బయ్యర్లు మాత్రం ఏంచేస్తారు? బేనర్ మంచిదా కాదా - దర్శకుడు గట్టివాడా, కాదా - చూసుకున్నాకే కదా కొనడానికి ముందుకొచ్చేది! పెద్ద హీరో చిత్రమైతే ఇవికూడా చూడరు. అందుకే - నిర్మాత కావాలనుకునేవాళ్లు కొత్తవాళ్లని పరిచయం చేసేప్పుడు 'క్వాలిటీ'ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.
-ఆంధ్రభూమి డైలీ, 21 సెప్టెంబర్ 2001 

Friday, September 10, 2010

సినిమా: ఇక ఆశలన్నీ 'మహేశ్ ఖలేజా' మీదే!


ఉదయం ఆటతోటే 'కొమరం పులి' భవిష్యత్ తేలిపోయింది. పవన్ కల్యాణ్ డైరెక్టరుగా పరిచయమవుతూ తీసిన 'జానీ'ని మించిపోయిందని అంతటా వినిపిస్తోంది. 'ఈ సినిమాకా ఇన్ని గొడవలు జరుగుతోంది' అన్ని విస్తుపోయేలా పరమ బోరింగుగా ఉన్న ఈ సినిమాని నిర్మించిన శింగనమల రమేశ్ వైపు అందరూ జాలి చూపులు చూస్తున్నారు. 15 నుంచి 17 కోట్ల రూపాయల డెఫిసిట్ తో రిలీజైన ఈ సినిమాకి నష్టాలు పూడ్చుకోవడం కల్ల అని తేలిపోయింది. దాంతో తన మరో ప్రాజెక్ట్ 'మహేశ్ ఖలేజా' వైపు వెంటనే దృష్టి సారించారు రమేశ్. నిన్నటిదాకా ఆ సినిమాని అక్టోబర్ 7న రిలీజ్ చేయాలని ఆయనా, ఆయన భాగస్వామి సి. కల్యాణ్ అనుకున్నారు.
కానీ రాత్రి నుంచే ఈ సినిమా మీద అన్ని ప్రాంతాల నుంచీ బాడ్ టాక్ రావడంతో శుక్రవారం ఉదయమే 'ఖలేజా'ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు. 'కొమరం పులి' రిలీజ్ అయిన రోజు సాధారణ పరిస్థితుల్లో అయితే ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండాలి. కానీ అలా కాకుండా ఆ సినిమా రిలీజ్ రోజు 'ఖలేజా' గురించి మాట్లాడారంటే వాళ్లే 'కొమరం పులి' బాక్సాఫీసు ఫలితాన్ని గురించి చెప్పినట్లయ్యిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. బయ్యర్లను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఈ ప్రకటన చేశారనేది ఆ వర్గాల వాదన. మొత్తానికి 'పులి' అందర్నీ భయపెడుతోంది. ఆ సినిమాని కొన్న పలు ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. ఇప్పటికే వివాదాల్లో ఉన్న ఆ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలను సృష్టించేలా కనిపిస్తోంది.

రివ్యూ: గాండ్రించని 'కొమరం పులి'


సినిమా: కొమరం పులి
రేటింగ్: 2.5/5
తారాగణం: పవన్ కల్యాణ్, నికిషా పటేల్, శరణ్య, మనోజ్ బాజ్ పేయి, నాజర్, చరణ్ రాజ్, అలీ, గిరీష్ కర్నాడ్, శ్రీధర్, కోవై సరళ, శ్రియ
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: బినోద్ ప్రధాన్
ఎడిటింగ్: ప్రభాకరన్
స్క్రీన్-ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
విడుదల తేది: సెప్టెంబర్ 10, 2010

ఎన్ని అంచనాలు! ఎంత హైప్! పవన్ కల్యాణ్ సినిమా అంటే మామూలుగానే భారీ అంచనాలు ఉంటాయి. అయితే 'జల్సా' వచ్చిన రెండేళ్ల తర్వాత తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెటుతో రావడం, 'ఖుషి' కాంబినేషన్ అయిన పవన్ కల్యాణ్, ఎస్.జె. సూర్య మళ్లీ కలియడం వల్ల 'కొమరం పులి' కోసం చాలా రోజులనుంచే జనం ఎదురు చూస్తున్నారు. దీనికితోడు గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ ఇంటిపేరును ఈ సినిమాకి వాడుకోవడాన్ని మేం అనుమతించమని భీమ్ వారసులు గొడవలు చేయడం వివాదాన్ని రేకెత్తించింది. డెఫిసిట్ లో ఈ సినిమా రిలీజవుతున్నదనే వార్తల వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతున్నదనే క్యూరియాసిటీ కూడా అమితంగా పెరిగింది.
ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కొమరం పులి' ఎలా ఉన్నాడు? అభిమానుల్ని ఆనందపరిచాడా? సగటు సినిమా ప్రియుణ్ణి సంతృప్తి పరిచాడా? దీనికి సమాధానం కాదనే చెప్పాలి. అంచనాలకు తగ్గట్లు లేకపోవడాన్ని అటుంచుదాం. అసలు ఎంచుకున్న కథాంశం, పవన్ కల్యాణ్ పోషించిన కొమరం పులి పాత్ర చిత్రణ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి.

కథేమిటో తెలుసుకుంటే అందులో నిజమేమిటో అర్థమవుతుంది. ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసరుని అల్ సలీమ్ (మనోజ్ బాజ్ పేయి) అనే సంఘ వ్యతిరేక శక్తి అంటే భవిష్యత్ చీకటి సామ్రాజ్యాధినేత చంపుతాడు. తన భర్త ఆచూకీ తెలపమని వేడుకున్న అతని భార్య (శరణ్య)ను కడుపు మీద కాలితో కొట్టి ఆమెనీ చంపబోతాడు. గర్భవతి అయిన ఆమె ఎలాగో తప్పించుకుని నీళ్లలోనే ఒక కొడుకును కంటుంది. అతనే మన కొమరం పులి (పవన్ కల్యాణ్). ఈ సంగతి అల్ సలీమ్ కీ, అతని తొత్తు అయిన ఓ పోలీస్ ఆఫీసరు (చరణ్ రాజ్)కీ తెలీదు.
పెరిగి పెద్దయిన పులి సహజంగానే పోలీస్ అఫీసర్ అవుతాడు. మొదట్లోనే థాయిలాండులో పర్యటిస్తున్న మన ప్రధానిపై హత్యాయత్నాన్ని అడ్డుకుని ఆయన్ని రక్షిస్తాడు. పోలీసులపై ప్రజలకున్న వ్యతిరేక భావనని పోగొట్టాలంటే వీధికో టెలిఫోన్ని ఏర్పాటు చేయాలనీ, ఒక రూపాయతో ఫోన్ చేసే బాధితుల్ని అప్పటికప్పుడు ఆదుకోవాలనీ చెప్పి, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంటాడు. దాంతో 'పులి టీమ్' ఏర్పాటవుతుంది. ఇక అన్యాయానికి గురైన వాళ్లకి సత్వర న్యాయం చేకూరుస్తూ వస్తున్న పులికి అల్ సలీమ్ తారసపడతాడు. హుస్సేన్ అనే పోలీస్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంలో సలీమ్ పాత్ర వుందని తెలుసుకున్న పులి ఆ రహస్యాన్ని ఛేదించాలనుకుంటాడు.
అక్కడినుండి ఇద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుంది. ఆ ఇద్దరిలో గెలుపెవరిది, తన తండ్రిని చంపిన హంతకుడు సలీమేననే సంగతి పులికి తెలుస్తుందా? అనే ప్రశ్నలకి సమాధానాలు ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు.
కథ ఎత్తుగడలో వచ్చే సన్నివేశాలే ప్రేక్షకుల మతి పోగొడతాయి. మనం చూస్తున్నది సోషల్ సినిమానా లేక ఫాంటసీ సినిమానా అనే సందేహం కలుగుతుంది. పులి తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లి మాటలకు అనుగుణంగా చేతులు కాళ్లు ఆడించడం, తల్లి 'లెఫ్ట్' అంటే ఎడమ కాలిని, 'రైట్' అంటే కుడి కాలిని ఆడించి కడుపులోనే పోలీస్ ఆఫీసర్ మాదిరిగా మార్చింగ్ చేయడం మామాలు ఇమాజినేషనా!
అల్ సలీమ్ పాతికేళ్ల తర్వాత దేశాన్నే ఆడించే కింగ్ పిన్ తరహాలో దర్శనమిస్తాడు. అంటే పాతికేళ్ల వయసుకే పులి పోలీస్ అఫీసరుగా పెద్ద రేంజికి ఎదిగినట్టేగా. ఇది తర్కానికి అందని సంగతి. సలీమ్ ని చంపాలంటే ఒక్క క్షణం పని అనీ, తనకు కావలసింది సలీమ్ ని చంపడం కంటే సమాజంలో అలాంటి చెడు మనుషులు తయారుకాకుండా చూడడమనీ చెప్పిన పులి చివరికి ఆ మాటలు మరిచిపోయి సలీమ్ ఒక్కడినే టార్గెట్ చేసుకుంటాడు. అంటే మళ్లీ ఓ సాధారణ ఫార్ములా స్థాయికి సినిమా కథనం పడిపోయింది.
సినిమాలో వినోదం లోపించడం వల్ల ప్రేక్షకుల్ని రంజింపజేసే సన్నివేశాలు లేకుండాపోయాయి. అలీ ఉన్నా అతన్ని సక్రమంగా ఉపయోగించుకోలేదు. హీరోయిన్ నికిషా పటేల్ పాత్రతో పండించాలనుకున్న వినోదం తేలిపోయిందే కానీ ఆకట్టుకోలేదు.

ఆమె పాత్రకి ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశాడు దర్శకుడు. విచారకరమైన సంగతేమంటే పులి పాత్రలో పవన్ కల్యాణ్ కూడా ఆకట్టుకోలేక పోయాడు. చాలా సందర్భాల్లో అతని చేత ప్రసంగాలు ఇస్తున్న తరహాలో సంభాషణలు చెప్పించడం చికాకు తెప్పించింది. పవన్ కూడా ఆ ప్రసంగాల్ని ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయాడు. అతని డిక్షన్ లో లోపాలు కనిపించాయి. ఒక నీతి బోధకుడు చెప్పే రీతిలో అతను నీతులు చెప్పాలని చూశాడు కానీ అవి వర్కవుట్ కాలేదు.
సినిమాలో నటనపరంగా బాగా ఆకట్టుకున్నది పులి తల్లిగా నటించిన శరణ్య, మంచి పోలీసాఫీసరుగా నటించిన నాజర్. విలన్ సలీమ్ పాత్రలో మనోజ్ బాజ్ పేయి బాగా రాణించాడు. హీరోయిన్ నికిషా పటేల్ కి భవిష్యత్తు ఉన్నట్లు అనిపించదు. ఏఆర్ రెహమాన్ సంగీతంలోని రెండు పాటలు మాత్రం బాగున్నాయి. బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ ఎఫెక్టివుగా లేకపోవడమే 'కొమరం పులి'ని అనాసక్తంగా తయారుచేశాయి.

Friday, July 11, 2008

Just title gets success?

ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి టైటిల్ బాగా దోహదం చేస్తుందని సినిమా రంగంలోని చాలామంది నమ్ముతారు. టైటిల్ అనేది సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది కానీ, విజయానికి మొత్తంగా అదే దోహదం చేయదనీ, సినిమా కథలో పస లేకపోతే టైటిల్ ఎంత బాగున్నా, వింతగా వున్నా ఆ సినిమా నడవదనీ విశ్లేషకులు అనే దాంట్లో తప్పు కొంచెం కూడా లేదు. అయినప్పటికీ మన దర్శకులు తమ సినిమా టైటిళ్లను విభిన్నంగా పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు.
ఎవరన్నా కాస్త డబ్బులు ఖర్చు పెడుతూ సరదా చేసుకునే వాణ్ణి చూసి మనం 'వాడికేంటిరా జల్సా పురుషుడు' అంటుంటాం. అందులోని 'జల్సా'ని టైటిల్‌గా పెట్టి సక్సెస్ సాధించారు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు. రెండక్షరాలతో చాలా సినిమాలే వచ్చాయి కానీ అన్నీ విజయం సాధించలేక పోయాయి. గత యేడాది నుంచి చూసుకుంటే యోగి, టాస్, ఆట, లక్ష్యం, మున్నా, మంత్ర, డాన్, కృష్ణ, వాన, గమ్యం, జల్సా, కంత్రి, రెడీ వచ్చాయి. లక్ష్యం, మంత్ర, కృష్ణ, గమ్యం, జల్సా విజయం సాధించగా; ఆట, డాన్ బాక్సాఫీసు వద్ద యావరేజ్ ముద్రను వేసుకున్నాయి. యోగి, టాస్, మున్నా, వాన, కంత్రి సినిమాలు విఫలమయ్యాయి. 'రెడీ' బాక్సాఫీసు ఫలితం తేలాల్సి వుంది. తేజ తొలి చిత్రం 'చిత్రం' హిట్టవడంతో రెండక్షరాల టైటిల్‌కి గిరాకీ ఏర్పడింది. 'ఖుషి', 'ఆది' చిత్రాలు ఆ బాటలో మంచి హిట్టవగా తేజ స్వయంగా రూపొందించిన మరో రెండక్షరాల సినిమా 'జయం', చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'ఇంద్ర' బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి.
టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్ టైటిల్‌ని విభిన్నంగా పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇట్లు.. శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి 9848022338 అంటూ అతడు వెరైటీగా పెట్టిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తిట్టుపదాలు ఇడియట్, పోకిరి, దేశముదురు టైటిళ్లతో బంపర్‌హిట్ సినిమాలు తీయడం అతడికే చెల్లింది. ఆ కోవలోనే ఎన్టీఆర్ హీరోగా పూరీ శిష్యుడు మెహర్ రమేష్ రూపొందించిన 'కంత్రి' బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ప్రభాస్ హీరోగా తను రూపొందించిన ఇటీవలి సినిమాకు 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' అనే వెరైటీ టైటిల్ పెట్టాడు పూరీ. కానీ అది వర్కవుట్ కాలేదు.
తెలుగు సినిమాలకీ, యముడికీ మంచి అవినాభావ సంబంధం వుంది. 'యమజాతకుడు' వంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే 'యమ' శబ్దంతో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా విజయం సాధించినవే. 'యమగోల', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'యమలీల' వంటివి అందుకు ఉదాహరణలు. నిరుడు వచ్చిన ఎన్టీఆర్ సినిమా 'యమదొంగ', శ్రీకాంత్, వేణుల సినిమా 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు రెండూ విజయాన్ని చవిచూశాయి. అంటే యముడు బాక్సాఫీసు మంత్రమన్నమాట.
ఆహ్లాదకరమైన పేర్లు పెడితే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పొలోమని వస్తారనేది చాలామంది భావన. కానీ ఆ తరహా టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్లో అత్యధికం ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విచారకరం. టైటిల్‌లో వున్న ఆహ్లాదం సినిమాలో లేకపోవడమే దానికి కారణం. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అందమైన మనసులో', పదిహేనేళ్ల తర్వాత గిరిబాబు రూపొందించిన 'నే సుఖమే నే కోరుతున్నా', అపురూప చిత్రాల దర్శకుడు బాపు గీచిన 'సుందరకాండ', తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 'నవ వసంతం' వంటివి తుస్సుమన్నాయి.
కొన్ని సినిమాలు టైటిళ్లకు విరుద్ధమైన ఫలితాల్ని పొంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనించదగ్గ అంశం. 'వాన' ఎమ్మెస్ రాజుకు బాక్సాఫీసు వానను కురిపించలేక పోయింది. రాజా నటించిన 'వేడుక' నిర్మాత పాలిట పీడకల అయ్యింది. శ్రీహరి 'శ్రీ మహాలక్ష్మి' సిరులు కురిపించలేక పోయింది. 'లక్షీపుత్రుడు', 'లక్ష్మీ కల్యాణం'లదీ అదే దారి. ఎస్వీ కృష్ణారెడ్డి 'బహుమతి' నిర్మాత జేబుల్ని ఖాళీ చేయించింది. నాగబాబు హీరోగా నటించిన 'ఆపద మొక్కులవాడు' నిర్మాతల్ని పుట్టిముంచాడు. 'హ్యాపీ డేస్' మాత్రం శేఖర్ కమ్ములకూ, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకూ నిజంగానే హ్యాపీ డేస్‌ను తెచ్చింది.
హిట్టయిన పాత సినిమాల టైటిల్స్‌తో వచ్చిన సినిమాలేవీ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. ఉదయ్‌కిరణ్, శ్రీహరిల 'వియ్యాలవారి కయ్యాలు', వేణుమాధవ్ నటించగా దాసరి కథను అందించిన 'ప్రేమాభిషేకం', తరుణ్, ఇలియానాల 'భలే దొంగలు', తరుణ్ మరో సినిమా 'నవ వసంతం', శ్రీకాంత్, ప్రభుదేవా, సునీల్ ప్రధాన పాత్రలు పోషించిన 'మైఖేల్ మదన కామరాజు' వంటివి అందుకు ఉదాహరణలు.
అంటే చిత్ర విజయానికి టైటిల్ అనేది ఒక ప్లస్ పాయింట్‌గా మాత్రమే వుంటుందనీ, కేవలం టైటిల్ వల్లే సినిమా హిట్టు కాదనీ స్పష్టమవుతుంది. మంచి కథతో సినిమాని రూపొందించి, దానికి జస్టిఫై అయ్యే టైటిల్‌ని పెడితే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతందనడంలో సందేహ లేదు. అందుచేత కథకులూ, దర్శకులూ టైటిల్ కంటే ముందు కథకీ, స్క్రీన్‌ప్లేకీ ప్రాధాన్యతనిచ్చి వాటిమీద శ్రద్ధ చూపి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించడం బెటరు.