ఒక నిర్మాత కొత్తవాళ్లతో సినిమా మొదలుపెట్టి 'కొత్తదనం కోసమే నా చిత్రంలో కొత్తవాళ్లని పరిచయం చేస్తున్నా' అంటాడు. ఇంకో దర్శకుడు 'పాత్రలు కనిపించాలే తప్ప నటులు కనిపించకూడదని కొత్తవాళ్లని ఎంచుకున్నా' అని చెబుతాడు. వాళ్ల దృష్టిలో సినిమాకి నూతనత్వం కొత్త నటులవల్లనే వస్తుందని. ఇదెంతవరకు వాస్తవం? తరచి చూస్తే ఇందులో నిజం పాక్షికంగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది. సినిమాకి కొత్తదనం కేవలం కొత్త నటులవల్లనే రాదు. ట్రీట్‌మెంట్‌లో నూతనత్వం వుండాలి. అప్పుడే ఏ సినిమా అయినా కొత్త తరహాగా తోస్తుంది ప్రేక్షకులకి. ఇప్పుడే కాదు అనాది కాలం నుంచే ఈ సత్యం ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది.
ఉదాహరణలకి మరీ పూర్వపు చిత్రాల జోలికి వెళ్లకుండా చిరంజీవి తరం నుంచే తీసుకుందాం. 'ఖైదీ'కి ముందుగా చిరంజీవి అనేక చిత్రాలు చేసి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. 'ఖైదీ' చూస్తే వయొలెన్సు, పగ, ప్రతీకారాల నడుమ ఆ సినిమా కథ నడుస్తుంది. అయితే తీసే విధానం, అందులోని పాటల చిత్రీకరణ నవ్యతతో కూడుకుని వున్నందున ప్రేక్షకులు ఆదరించారు. 'రగులుతోంది మొగలి పొద..' పాట చిత్రీకరణ అద్భుతంగా వుందని మెచ్చుకోనివాళ్లు అరుదు. ట్రీట్‌మెంట్ పరంగా చూసినా అందులో క్షణం క్షణం ఉత్కంఠతని నదిపించడంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మంచి పరిణతిని కనబర్చాడు. ఇదే ఆ చిత్రానికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టి 'ట్రెండ్‌సెట్టర్' ముద్రని వేసుకోగలిగింది.
కామెడీ చిత్రాలంటే మనకి మొదట్నించీ ఓ చిన్న చూపుంది. వాటిని మనం రెండవ శ్రేణి చిత్రాలకిందే జమకట్టడం అలవాటు చేసుకున్నాం. అయితే అలాంటి హాస్య చిత్రాల్లో అరుదైన చిత్రంగా 'లేడీస్ టైలర్'ని పేర్కొనవచ్చు. 'తొడమీద పుట్టుమచ్చ' అన్న పాయింట్ నేపథ్యంలో తీసిన ఆ చిత్రంలో ఆద్యంతమూ హాస్యం, సున్నిత శృంగారం పోటీపడి నడుస్తాయి. దర్శకుడు వంశీ ఒక సరికొత్త తరహా హాస్యాన్ని ప్రేక్షకులకి అందించినందునే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అందులో హీరో రాజేంద్రప్రసాద్. ఆయన కొత్తవాడేమీ కాదు. వంశీయే తీసిన 'అన్వేషణ' సస్పెన్స్ చిత్రాల్లోనే కొత్త ఒరవడిని సృష్టించింది. అందులో హీరో హీరోయిన్లు కార్తీక్, భానుప్రియ అప్పటికే ఎన్నో సినిమాలు చేశారు.
మొదట్నించీ తెలుగులో ప్రేమ కథాచిత్రాలకు కొదవలేదు. అయినా 'గీతాంజలి' కొత్తగా ఎందుకు అనిపించింది? అందులో చెప్పిన పాయింట్ కొత్తగా వుంది. చిత్రీకరణలో నవ్యత వుంది. ఒక దృశ్యకావ్యం అనిపించుకోగల లక్షణాలన్నీ అందులో ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం కానీ, హీరో నాగార్జున కానీ కొత్తవాళ్లు కాదు. అయినా ఆ చిత్రం కొత్త తరహా చిత్రాల కోవకే చెందుతుందని అప్పట్లో అందరం ఒప్పుకున్నాం. అట్లాగే 'శివ'. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక ట్రెండుని సృష్టించిన ఆ చిత్రంలో ప్రతి ఫ్రేములోనూ కొత్తదనాన్ని ఆస్వాదించాం. దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్తవాడే కావచ్చు కానీ హీరో హీరోయిన్లిద్దరూ పాతవాళ్లేగా.
'ఖుషి' సంగతి చూసినా అంతే. పవన్‌కల్యాణ్ కొత్తవాడు కాదు. అయినా చిత్రం అంతా కొత్తదనమే. అదంతా దర్శకుడు యస్.జె. సూర్య పనితనం. ప్రతి సన్నివేశాన్నీ పాత మూసధోరణితో తీయకుండా కొత్తగా, 'సహజంగా జరుగుతుంది' అనిపించేలా తీశాడు. డైలాగులూ అంతే. కొత్త తరహాగా తోస్తాయి. అందుకనే 'ఖుషి' ఒక కొత్త సెన్సేషన్ అయ్యింది.
'నువ్వే కావాలి', 'నువ్వు నేను' కొత్తవాళ్లతో తీసి ఘన విజయాల్ని సొంతం చేసుకున్న చిత్రాలే. దాన్నెవరూ కాదనలేరు. సినిమాలు ఫ్రెష్‌గా ఉండటానికి వాటిలోని హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయి వుండటం కూడా దోహదం చేస్తుందనడంలో ఎవరికీ అభ్యంతరం వుండదు. వాటిలోని సబ్జెక్టుకి కొత్తవాళ్లయితే సరిగ్గా వుంటుంది కాబట్టి వాటికి వాళ్లని ఎంచుకున్నారు. కాలేజీ స్టూడెంటుగా పవన్‌కల్యాణ్‌నీ, మహేశ్‌నీ మినహాయించి వెంకటేశ్, నాగార్జున వంటివాళ్లని మనం చూడలేముగా. అయితే మన అభ్యంతరం దానికి కాదు. ఇప్పుడు అనేకమంది నిర్మాతలు (వాళ్లలో కొత్తవాళ్లు చాలామందే వున్నారు) కొత్తవాళ్లతో సినిమాలు తీస్తూ కొత్తదనం కోసమే అలా చేస్తున్నామని చెబుతుండటం అభ్యంతరకరం. కొత్త నటుల ప్రవేశాన్ని విమర్శించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆ వచ్చే కొత్తవాళ్లలో క్వాలిటీ తక్కువగా కనిపిస్తున్నదనేదే ఇక్కడ పాయింటు.
హీరో హీరోయిన్లు అందంగా కనిపించినంత మాత్రాన చాలదు. హావభావ ప్రకటనలో పరిపక్వత వుందా లేదా అన్నది అతి ముఖ్యం. ఇవాళ పరిచయమవుతున్న హీరోలు చాలామందిలో ఈ పరిపక్వత ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం దిష్టిబొమ్మలుగా మాత్రమే కనిపిస్తున్నారు. లోపం ఆ నటులది కాదంటే వేలు దర్శకులవైపు చూపించాల్సి వస్తుంది. నటుల నుంచి నటనను రాబట్టాల్సింది వాళ్లే కాబట్టి. 'నటించడం'లో నటుడు ఫెయిలయ్యాడంటే ఆ భాధ్యతలో సగం వంతు దర్శకుడిదే. ఆకాశ్, సంతోష్, సతీశ్, శ్రావణ్, సచిన్, దిలీప్, పవన్‌కుమార్, రోహిత్.. ఇలా హీరోల జాబితా.. జయలక్ష్మి, వనియా, అంజలి, మితిక, సునీత, రాజీ, అర్చన, కాంచీకౌల్.. ఇలా హీరోయిన్ల జాబితాకి అంతుండదు. వీళ్లలో నటులుగా ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్లలో ఒక్కరు కూడా అవుపించరు. ఆకాశ్, రోహిత్, జయలక్ష్మి, కాంచీకౌల్ వంటి అతికొద్ది మందికి మాత్రమే ఒకటికంటే ఎక్కువ సినిమాల్లో చాన్సులు వస్తున్నా వాళ్లెంతవరకూ నిలదొక్కుకోగలరన్నది ప్రశ్నార్థకమే. నటనపరంగా వాళ్లు నేర్చుకోవలసింది చాలా వుంది.
ఇదిలా వుంటే కొత్తనటులతో సినిమాలు తీయడంవల్ల సినిమా బడ్జెట్‌ని అనుకున్న తీరులో పరిమితం చేసుకోవచ్చనే వాదనే ఎక్కువ బలంగా వినిపిస్తోంది. కొంతమంది కొత్తతారలు తెరమీద కనిపించిందే చాలనే ధోరణితో పారితోషికం కూడా అడగకపోవడంతో అది నిర్మాతలకు వరంగా మారుతోంది. పైగా కొత్తతారలయితే తమ పాత్ర 'అలా వుండాలి ఇలా వుండాలి' అనే డిమాండ్ చేయరు. ముందనుకున్న ప్రకారంగానే కథని లాగించేయవచ్చు. అదే పెద్ద హీరోలైతే అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారు. అన్నింటికీ మించి బడ్జెట్ - ముందనుకునేదొకటి, తర్వాత అయ్యేదొకటి. ఈ బాధలెందుకని ఇప్పుడు నిర్మాతలు పది, ఇరవై లక్షల్లో సినిమాలు ఎడాపెడా తీసేసి ఆనక బయ్యర్లు లేక నానాతంటాలు పడుతున్నారు. బయ్యర్లు మాత్రం ఏంచేస్తారు? బేనర్ మంచిదా కాదా - దర్శకుడు గట్టివాడా, కాదా - చూసుకున్నాకే కదా కొనడానికి ముందుకొచ్చేది! పెద్ద హీరో చిత్రమైతే ఇవికూడా చూడరు. అందుకే - నిర్మాత కావాలనుకునేవాళ్లు కొత్తవాళ్లని పరిచయం చేసేప్పుడు 'క్వాలిటీ'ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.
-ఆంధ్రభూమి డైలీ, 21 సెప్టెంబర్ 2001
No comments:
Post a Comment