Showing posts with label puri jagannath. Show all posts
Showing posts with label puri jagannath. Show all posts

Monday, June 25, 2012

'దేవుడు చేసిన మనుషులు' పాటల విడుదల


రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించిన పాటలన్నీ అలరిస్తాయని నమ్ముతున్నానీ, సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోవాలనీ ఆకాంక్షించారు.
గేయ రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ "ఇది చాలా మంచి ఆడియో. సింగిల్ కార్డ్ రాశా. 'ఏమి సేతుర సామీ' అనేది నా మనసుకు బాగా నచ్చిన పాట. 'బంపర్ ఆఫర్' తర్వాత రఘు కుంచెతో పనిచేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది వేరే సెటప్‌తో తీసిన సినిమా. కథలేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసిన సినిమా. మొదట ఈ కథని ఇలియానాకి చెప్పా. తను టాక్సీ డ్రైవర్‌గా బాగా చేసింది. రవితేజతో ఇది నాకు ఐదో సినిమా. రవి అంటే నాకు మోజు. హైదరాబాద్‌లో నాకు తగిలిన మొదటి ఫ్రెండు రఘు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బర్తాంతే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ చేసింది'' అని చెప్పారు. ఈ పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాయనీ, జగన్‌తో, రవితో పనిచేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందనీ హీరోయిన్ ఇలియానా చెప్పింది.
రఘు కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్‌గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి'' అని తెలిపారు.
రవితేజ మాట్లాడుతూ "ఈ సినిమాతో రఘు కుమ్మేయబోతున్నాడు. జగన్ నమ్మకమే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది'' అని చెప్పారు. జూలై 27న 'దేవుడు చేసిన మనుషులు'ను విడుదల చేస్తామని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు గుణ్ణం గంగరాజు, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, వీరభద్రం, రిలయెన్స్ ప్రతినిధి మహేశ్ రామనాథన్, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బండ్ల గణేష్, లవ్‌లీ రాజు, సహ నిర్మాత భోగవల్లి బాపినీడు, నటులు ఆలీ, సుబ్బరాజు, తారలు జ్యోతిరాణా, గాబ్రియేలా, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, కల్యాణ్, కళా దర్శకుడు చిన్నా, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, సోనీ మ్యూజిక్ ప్రతినిధులు అశోక్, అశ్విన్, బ్యాంకాక్ బాబీ తదితరులు పాల్గొన్నారు.

Monday, June 4, 2012

పవన్‌కల్యాణ్ షో గబ్బర్‌సింగ్

"ఒన్‌మ్యాన్ షో 'గబ్బర్‌సింగ్'. పవన్‌కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్‌సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్‌చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్‌సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్‌కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్‌ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్‌వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్‌సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

Saturday, January 28, 2012

ప్రివ్యూ: యమహో యమః

యమధర్మరాజుగా శ్రీహరి తొలిసారిగా నటిస్తున్న చిత్రం 'యమహో యమః'. సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి.వి.కె. ఆర్ట్స్ బేనర్‌పై జి. విజయ్‌కుమార్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జితేందర్ వై. దర్శకుడు. 
"తొలిసారి యముడిగా బరువైన పాత్ర చేస్తున్నా. ఇది అసాధారణ స్క్రిప్ట్. బాగా నవ్వించే సినిమా. ఇదివరకు మహామహులు పోషించిన ఈ పాత్రని బాగా చేసి, నన్ను నేను నిరూపించుకోవడానికి కృషిచేస్తున్నా" అని శ్రీహరి చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ విశేషం దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ గెస్ట్ కేరక్టర్ చేయడం.
హీరో సాయిరాం మాట్లాడుతూ "యమునిగా శ్రీహరి చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చింది. అమెరికా వెళ్లిన ఓ కుర్రాడికీ, అక్కడకు వచ్చిన యమునికీ మధ్య జరిగే కథ ఇది" అని చెప్పాడు. ఈ సినిమాతో తనకు కచ్చితంగా బ్రేక్ వస్తుందని అతను ఆశిస్తున్నాడు. పార్వతీ మెల్టన్ అమెరికాలో ఉండే తెలుగమ్మాయి పాత్రని చేస్తోంది. "ఇంతవరకు మన ప్రాంతంలోనే అలరిస్తూ వచ్చిన యముడు అమెరికాలో అడుగుపెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అల్లిన కథ ఇది" అని దర్శకుడు జితేందర్ తెలిపాడు.
ఈ సినిమాతో మహతిగా పేరు మార్చుకున్న బొంబాయ్ భోలే సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో అలీ, భరత్, కోవై సరళ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, చిర్రావూరి, సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జితేందర్ వై.

Monday, December 26, 2011

బిగ్ స్టోరీ: సంక్రాంతికి సై

సంక్రాంతికి ఏయే సినిమాలు రానున్నాయో దాదాపు తేలిపోయింది. తెలుగు సినిమాకు సంబంధించి ఓ కేలండర్ సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద సీజన్ సంక్రాంతి అనేది తెలిసిందే. సంక్రాంతికి వారం నుంచి పది రోజుల దాకా బడులకు ఇచ్చే సెలవుల్ని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు భావిస్తుంటారు. పెద్ద సినిమాలు రంగంలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఆ సినిమాల నిర్మాతలు నిరాశ పడటం మామూలే. ఇప్పుడూ అదే స్థితి. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీ అంటుండటంతో చిన్న సినిమాకు చోటెక్కెడ దొరుకుతుంది? పైగా ఈ పెద్ద సినిమాలే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుండటం వల్ల వాటికీ మిగతా సమయాల్లో లభ్యమయ్యే రీతిలో థియేటర్లు దొరకవనేది నిజం. ఫలితంగా వాటి కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపడం తథ్యం. సంక్రాంతి విజేతలుగా నిలవాలనే తపనతో వస్తున్న ఆ నాలుగు సినిమాలు - 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్', 'నిప్పు', 'పూలరంగడు'.
మళ్ళీ కలిశారు 
'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేశ్ హీరోగా వస్తున్న 'బిజినెస్‌మేన్' సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకుడవడం వల్ల కూడా ఈ సినిమా పట్ల ఇటు సినీ వర్గాలవారూ, అటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'బిజినెస్‌మేన్' ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బారులు తీరారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. 'దూకుడు' మీదున్న తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో అన్నిటికంటే ముందుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడు తెలుగులో... 
వెంకటేశ్ హీరోగా నటించిన 'బాడీగార్డ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం - ఇప్పటికే ఈ సినిమా మూడు భాషల్లో జయకేతనం ఎగురవేయడం. మొదట మలయాళంలో (దిలీప్ హీరో), తర్వాత తమిళంలో (విజయ్ హీరో), ఆ పిమ్మట హిందీలో (సల్మాన్‌ఖాన్ హీరో) కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. వాటికంటే తెలుగు వెర్షన్ మరింత బాగా వచ్చిందని శ్రీ సాయిగణేశ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బెల్లకొండ సురేశ్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన వెంక టేశ్ చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇప్పుడే. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేయడం ఇది మూడోసారి. 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ కూర్చిన ఫైట్లు, తమన్ సంగీతం అందించిన పాటలు హైలైట్ అవుతాయంటున్నారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ముగ్గురు మిత్రులు 
ముగ్గురు మిత్రుల సినిమా 'నిప్పు'. కెరీర్ తొలినాళ్లలో చెన్నైలో ఒకే ఇంట్లో ఉండి అవకాశాలు వెతుక్కున్న ఆ ముగ్గురు - గుణశేఖర్, రవితేజ, వైవీఎస్ చౌదరి. రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ నిర్మిస్తున్నారు. ఇలా ఓ అరుదైన కాంబినేషన్‌తో, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ మార్కు వినోదానికి, గుణశేఖర్ శైలి టేకింగ్ తోడైన ఈ సినిమాకి సైతం తమన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఇలా ఒకే సంగీత దర్శకుడు పనిచేసిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడనుండటం అనేది కూడా అరుదైన సందర్భం. జనవరి 13న 'నిప్పు' విడుదలవుతోంది.
నవ్వులు పువ్వులు 
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని, కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ ఇప్పుడు 'పూలరంగడు'గా అవతారమెత్తాడు. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' చిత్రాలతో ఘన విజయాలు సాధించిన ఈ భీమవరం నటుడు తనకంటూ సొంత మార్కెట్‌ని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. అందుకు తగ్గట్లే 'పూలరంగడు' పట్ల బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 'అహ నా పెళ్లంట' ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో దాని సోదర సంస్థ మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జనవరి 5న ఆడియో ఆవిష్కరణ జరగనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా నాయిక. ఒకే సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండటాన్నీ ఈసారి మనం చూడబోతున్నాం.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 26, 2011

Sunday, December 4, 2011

ఆ ఆలోచన వస్తే నాశనమే!

సాధారణంగా ఎవరైనా మంచి సినిమా తీయాలనీ, చేయాలనీ అనుకుంటారు. కానీ ఆ ఆలోచన వస్తే వాళ్ల కెరీర్ నాశనమే అని చెబుతున్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరి జగన్నాథ్. "దర్శకుడు అన్నవాడు వరుసగా కమర్షియల్ సినిమాలు తీసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే అతడి నాశనం అక్కడ మొదలైనట్లే. పదిమందికి మంచి జరిగే సినిమా అని 'నేనింతే' తీశా. ఫ్లాపయింది. నేనే కాదు, ఏ దర్శకుడైనా ఎప్పుడూ ఏదో కొత్త పాయింట్ చెప్పి ఎదుటివాళ్లని ఎక్జయిట్ చేస్తూనే ఉండాలి. లేకుంటే అక్కడ పడిపోతాం. అన్ని సందర్భాల్లోనూ అవతలివాళ్లని ఆశ్చర్యానికి గురిచేయడం కుదరదు. అప్పుడు మనల్ని పట్టించుకునేవాళ్లు ఉండరు. మన ఫోన్లను రిసీవ్ చేసుకునే వాళ్లుండరు. అందుకే వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి" అని ఆయన వివరించాడు. ప్రస్తుతం మహేశ్ హీరోగా ఆయన డైరెక్ట్ చేస్తున్న 'బిజినెస్‌మేన్' జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది.

Saturday, October 15, 2011

బిగ్ స్టోరీ: హవా తగ్గిన పరభాషా దర్శకులు!

ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్‌రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్‌తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్‌కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్‌తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్‌కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్‌లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.

Wednesday, October 12, 2011

ఇంటర్వ్యూ: మహేశ్

'దూకుడు'తో పోకిరి' ఇమేజ్ నుంచి బయటకొచ్చేశా 


'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను - అని చెప్పారు మహేశ్. ఆయన హీరోగా నటించిన 'దూకుడు' చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేశ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...

శ్రీను వైట్ల చెప్పినట్లు ఇది యూనివర్సల్ స్క్రిప్టు. ఇంతవరకు నా కెరీర్‌లో ఇంత కంప్లీట్ స్క్రిప్టు వినలేదు. విన్నప్పుడే చాలా ఆనందం వేసింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, సినిమా ఇంత పెద్ద హిట్టయినందుకు. నేను చేసిన కేరక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే ఐ లైక్ ద స్క్రిప్ట్. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ఉంది, అదే సమయంలో ఓ పోలీస్ యాంగిల్ ఉంది, పొలిటికల్ యాంగిల్ ఉంది.. ఇలా మూడు యాంగిల్స్ ఉన్న మంచి కేరక్టర్. ఎప్పుడూ ఇలాంటి పూర్తి స్థాయి భావోద్వేగాలున్న సినిమాలు చేయడం కష్టం. ఇలాంటి స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తుంటాయి. 'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను. 'దూకుడు'కంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఇమేజ్ రాలేదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ స్క్రిప్టు కావడం. అన్ని యాంగిల్స్ కవరయ్యాయి. 'పోకిరి' అనేది ఒక కేరక్టర్ బేస్ట్ సినిమా. ఇది అలా కాదు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మాకందరికీ మొదట్నించీ చాలా నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకంతోనే పనిచేశాం. ఫలితం సాధించాం.
నాన్న ఫోనే బెస్ట్ కాంప్లిమెంట్
నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాన్నగారు ఫోన్ చేయడమే. ఆ టైమ్‌లో నేనూ, శ్రీనూ ఒక్కచోటే ఉన్నాం. మార్నింగ్ షో చూసి ఫోన్ చేశారు. రూ. 80 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. నాకైతే ఆయన మాటలు వెంటనే జీర్ణం కాలేదు.  ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, 'దూకుడు' ఎంత ఇంపాక్ట్ కలిగిస్తున్నదో. అమెరికాలో తొలి రెండు, మూడు రోజుల కలెక్షన్ల ఫిగర్లు చూసి నేను నిజంగా నమ్మలేకపోయా. లాజ్ ఏంజిల్స్ టైమ్స్ ప్రత్యేక వ్యాసం రాయడం సెన్సేషనల్ న్యూస్. నా వరకు అమెరికా అనేది ఇంకో నైజాంలా అయిపోయింది.
ఒక్కటే సందేహం
శ్రీను స్క్రిప్టు చెప్పినప్పుడు ఒక్కటే సందేహం ఉండేది. 'పోకిరి'లో నేను పోలీస్ అనేది చివర్లోనే తెలుస్తుంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్‌లోనే పోలీస్ అని చెప్పేస్తాం. అలా చెప్పి పోలీస్ కేరక్టర్ నడపడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఈ సందేహం నేను చెబితే అలాంటి డౌటేమీ పెట్టుకోవద్దనీ, మన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సయిపొమ్మని చెప్పారు శ్రీను. అదే జరిగింది. డైరెక్టర్‌తో కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాత్రలో ప్రవేశించాలంటే అది చాలా అవసరం. ఈ విషయంలో శ్రీనుగారు ఈజ్ పర్‌ఫెక్ట్ ఫర్ మీ.
ఎమ్మెల్యే రోల్ హైలైట్
ఎమ్మెల్యే కేరక్టర్ రిస్క్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హైలైట్ అవుతుందనే అనుకున్నాం. 'ఆ గెటప్‌లో మిమ్మల్ని చూడాల'ని శ్రీనుగారు అన్నారు. దాన్నాయన హైలైట్‌గా ఫీలయ్యారు. అంతేకానీ రిస్కనేది మైండ్‌లో రాలేదు. అఫ్‌కోర్స్. మెళ్లో పులిగోరనేది చివరలో జత కలిసింది. తెలంగాణ యాసని ఓవర్‌బోర్డ్‌గా వెళ్లకుండా నీట్‌గా చేసుకు వెళ్లాం. అది పే చేసింది. అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీకారం కథని వినోదాత్మకంగా చెప్పడం నాకు తెలిసి ఇదే తొలిసారి.
ప్రకాశ్‌రాజ్ పాత్ర ఇష్టం
నా పాత్ర కాకుండా ప్రకాశ్‌రాజ్ చేసిన పాత్ర బాగా ఇష్టం. శ్రీనుగారు చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు. అది వెరీ స్పెషల్ కేరక్టర్. నిజ జీవితంలోనూ నేను మా నాన్నగారికి బాగా సన్నిహితం.
కామెడీని ఎంజాయ్ చేశా
బాంబేలో జగన్ చూసి ఇచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేను. కామెడీ టైమింగ్ బాగుందనీ, కొన్ని సీన్లలో బ్రహ్మానందంగార్ని మించిపోయారనీ అన్నారు. అంతకంటే మంచి కాంప్లిమెంట్ వేరేముంటుంది. నిజంగానే సెకండాఫ్‌లో వచ్చిన కామెడీ సీన్స్‌ని బాగా ఎంజాయ్ చేశా. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ టెర్రిఫిక్ కామెడీ యాక్టర్లు. వాళ్లతో కలిసి చెయ్యడం చాలా సంతోషం.
స్క్రిప్టుకి ఇంప్రెస్సయ్యా
వచ్చే ఏడాది నావి మూడు సినిమాలు వచ్చే అవకాశముంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేస్తున్న 'బిజినెస్‌మ్యాన్' వచ్చే జనవరిలో వస్తుంది. ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. 'దూకుడు'తో పోలిస్తే మరో భిన్నమైన పాత్ర. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేశ్‌గారు, నేను బ్రదర్స్‌గా చేస్తున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్క్రిప్టుకి బాగా ఇంప్రెస్ అయ్యా. వెంకటేశ్‌గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో సన్నిహితంగా ఉంటా. హిందీలో చేసేంత టైమ్ లేదు. నేను ప్రయోగాలు చెయ్యను. మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా.

Monday, October 3, 2011

బిగ్ స్టోరీ: అప్పుడు 'పోకిరి' పోలీస్! ఇప్పుడు 'దూకుడు' పొలీస్!!

ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఎప్పటిలా కొన్నే హిట్టయ్యాయి. ఆ సినిమాల నిర్మాతలను గట్టెక్కించాయి. అయితే ఏడాది మూడోవంతు పూర్తవుతున్నా టాలీవుడ్‌కు అతి పెద్ద హిట్టు రాలేదనే బాధ సినీ వర్గాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ సినిమాలు 'దబాంగ్', 'బాడీగార్డ్', అజయ్ దేవగన్ సినిమా 'సింగమ్' సినిమాలు రూ. వంద కోట్ల పైగా వసూళ్లతో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల్నీ, డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ - అందర్నీ అమితానందపరుస్తూ వచ్చింది 'దూకుడు' చిత్రం. మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రం తొలి వారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సైతం ముక్కుమీద వేలేసుకునేట్లు చేసింది.
80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 1600 పైగా థియేటర్లలో విడుదలైన 'దూకుడు' ప్రభంజనం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాక, దేశంకాని దేశమైన అమెరికాలోనూ సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం. తొలివారం అక్కడ రూ. 5 కోట్లకు పైగా షేర్ సాధించడం అమెరికన్ ట్రేడ్ విశ్లేషకుల్నీ విస్మయ పరిచింది. అక్కడ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాని సైతం ప్రదర్శించని థియేటర్లలోనూ 'దూకుడు'ని ప్రదర్శించడం విశేషం. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమంటే మహేశ్ పోలీస్ పాత్రలు చేసిన రెండు సినిమాలూ వాటి కాలాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సినిమాలు కావడం.
2006లో తొలిసారి ఆయన పోలీస్ కేరక్టర్ చేసిన 'పోకిరి' సినిమా కలెక్షన్లలో అంతకు ముందున్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి రూ. 40 కోట్లకు పైగానే వసూలు చేసిన (అంచనా) తొలి తెలుగు సినిమాగా పేరు తెచ్చుకుంటే, ఐదేళ్ల తర్వాత మహేశ్ రెండోసారి 'పొలీస్' పాత్ర చేసిన 'దూకుడు' సైతం అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి'లో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణమనోహర్‌గా మహేశ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆయన చెప్పిన కట్ డైలాగ్స్ అలరించాయి. ఓ చోట 'ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. తండ్రి (నాజర్)ని విలన్ ప్రకాశ్‌రాజ్ చంపినప్పుడు తొలిసారి పోలీసాఫీసర్ వేషంలో మహేశ్ వేగంగా పరుగెత్తుకుంటూ తండ్రి శవం వద్దకు వచ్చే సన్నివేశం సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది.
ఇప్పుడు 'దూకుడు'లో ఐపీఎస్ ఆఫీసర్ అజయ్‌కుమార్‌గా మహేశ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తున్నదో కలెక్షన్లే తెలియజేస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన తండ్రి (ప్రకాశ్‌రాజ్) ప్రాణానికి హాని ఉండటంతో ఆయన వద్ద ఎమ్మెల్యేగా నటిస్తూ, మరోవైపు ఆయనకు అలాంటి స్థితి కలగడానికి కారణమైన దుష్టుల్ని పోలీసాఫీసర్‌గా ఏరిపారేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. 'ఎవర్నువ్వు?' అని ఎవరైనా అడిగితే 'పో'లీస్ అని కాకుండా 'పొ'లీస్ అంటూ ఆయన సమాధానం చెప్పే తీరు జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇలా రెండు మార్లు పోలీస్ పాత్రలు చేసి, రెండు సార్లూ రికార్డు కలెక్షన్లు సాధించడంతో మహేశ్ అభిమానులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీన్నో సెంటిమెంటుగా భావించి, రచయితలూ, దర్శకులూ ఈ తరహా పాత్రలతో ఆయన వద్దకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ పాత్రల్లో మొనాటనీ లేకుండా చూసుకోవడం మహేశ్ వంతు.

Monday, September 26, 2011

న్యూస్: ఆసక్తి రేపుతున్న మహేశ్, సుకుమార్ కాంబినేషన్



మహేశ్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' సినిమా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకుపోతుండగా, మరో డైరెక్టర్‌తో మహేశ్ తొలి కాంబినేషన్ సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఆ కాంబినేషన్ సుకుమార్‌తో. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న 'బిజినెస్‌మేన్' తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చేయడానికి మహేశ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో ఉన్న నిజాన్ని సుకుమార్ ధృవీకరించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని అతను సిద్ధం చేశాడు. 'బిజినెస్‌మేన్' 2012 జనవరిలో విడుదల కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 'దూకుడు' నిర్మాతలే తీయనున్నారనేది సమాచారం. సుకుమార్‌కి అత్యంత ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి. సుకుమార్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పనిచేయడం అతడికి ఇదే తొలిసారవుతుంది. ఇదివరకు అతను అల్లు అర్జున్, రాం, నాగచైతన్యలను డైరెక్ట్ చేశాడు. ఆ ముగ్గురిలో స్టార్ ఇమేజ్ ఉన్నది అర్జున్‌కే. 'ఆర్య'తో అతడికి ఆ ఇమేజ్ తెచ్చింది సుకుమార్ అనేది గమనార్హం. ఇప్పుడు మహేశ్‌ని అతడు డైరెక్ట్ చేసే సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతడి స్క్రిప్టుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేధావితనం కూడా ఉంటుందనేది నిజం. అంటే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే తీరులో అతడు హీరో పాత్రని మలుస్తుంటాడు. మరి మహేశ్‌ని అతడు ఎలా చూపిస్తాడు? మహేశ్‌లోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకుంటాడు? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.

Wednesday, August 24, 2011

న్యూస్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్!

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 2012 ఏప్రిల్ నుంచి ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ అంతకంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ కలవడం ఇదే తొలిసారి. ఎన్టీఅర్, పూరి కాంబినేషన్ సినిమాని నిర్మించే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ సినిమానీ నిర్మించబోతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్‌నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.

న్యూస్: ఈ సారైనా ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ హిట్ కొట్టేనా?

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందబోతోంది. ఈ కాంబినేషన్‌లో తయారయ్యే రెండో సినిమాని బండ్ల గణేశ్ నిర్మించనున్నాడు. ఈ బండ్ల గణేశ్ మరెవరో కాదు. ఇదివరకు రవితేజతో 'ఆంజనేయులు', పవన్ కల్యాణ్‌తో 'తీన్‌మార్' నిర్మించిన హాస్యనటుడు గణేశ్‌బాబు. మనవాళ్లకి న్యూమరాలజీ అంటే పిచ్చి కాబట్టి, ఆ రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిపేరుని తెరపేరుగా వాడుతున్నాడు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మాణమయ్యే ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్లో మొదలు కానున్నది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని సహజంగానే జగన్నాథ్ అందించనున్నాడు. "జగన్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చెయ్యాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులు, అభిమానులు, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది. జగన్, నేను కలిసి పనిచేస్తున్నామంటే అంచనాలు భారీగానే ఉంటాయి" అని చెప్పాడు ఎన్టీఆర్.
నిజమే. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరై ఆ సినిమా నిర్మాత గిరికి పీడకలగా పరిణమించిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా దెబ్బతో గిరి తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. 20 యేళ్ల వయసులో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఆ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. అంతేనా.. తండ్రి పాత్రకి జోడీగా అప్పటికే ముదురు తార అయిన సంఘవి చేయడం ఇంకా ఎబ్బెట్టు అనిపించింది ప్రేక్షకులకి. అందుకే ఆ సినిమాని మరో ఆలోచనకు తావులేకుండా తిరస్కరించారు. మిస్ కేస్టింగ్ అనేది ఓ మోస్తరు సినిమాని ఎలా ఘోరమైన సినిమాగా మారుస్తుందో 'ఆంధ్రావాలా' చక్కని ఉదాహరణ. చాలా సన్నిహితులైన ఎన్టీఆర్, జగన్నాథ్ కాంబినేషన్ రెండో సినిమాకి ఎనిమిదేళ్లు పట్టిందంటే ఆ సినిమా అనుభవమే కారణం. వచ్చే యేడాది రూపొందే ఈ రెండో సినిమా అయినా ఆ పీడకలని మర్చిపోయేలా చేస్తుందా?

Saturday, August 20, 2011

ప్రివ్యూ: బిజినెస్ మేన్

హీరో మహేశ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'బిజినెస్ మేన్'. వాళ్ల తొలి సినిమా 'పోకిరి' అంతకు మునుపటి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసి, తెలుగులో తొలిసారిగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. 'బిజినెస్ మేన్'ని ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ తీస్తోంది. ఆ బేనర్‌లో చేయడం ఇటు మహేశ్‌కీ, అటు జగన్నాథ్‌కీ ఇదే తొలిసారి. డా. వెంకట్ నిర్మాతగా, వి. సురేశ్‌రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. "ఇంతవరకు నేను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులో హీరో కేరక్టర్ ద బెస్ట్ అనిపించేలా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా సబ్జెక్ట్ నడుస్తుంది" అని జగన్నాథ్ చెప్పగా "ఈ కథ విన్నప్పట్నించీ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నా. హీరో రోల్ అసాధారణంగా ఉంది. జగన్నాథ్ కాంబినేషన్‌లో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజిలోనే ఈ సినిమా ఉంటుంది" అని మహేశ్ తెలిపాడు.
2012 సంక్రాంతికి (జనవరి 12న) రిలీజయ్యే ఈ సినిమాకి సంగీతం: ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

Wednesday, August 17, 2011

న్యూస్: 'కందిరీగ' హిట్ కొట్టాడు!

మూడేళ్ల విరామంతో, మూడు సినిమాల ఫ్లాప్ షో తర్వాత హిట్ కొట్టాడు రాం. చిత్రమేమంటే అతని కేరీర్‌లో ఇది మూడో హిట్ కావడం. 'కందిరీగ'తో అతనికి విజయాన్ని కూర్చిన దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్. పెద్దగా మేధావితనం కనిపించని సినిమాటోగ్రాఫర్ శ్రీన్‌వాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను తరహాలో జడ్జిమెంట్ చేయగల సామర్థ్యం అతనిలో ఉండటమే 'కందిరీగ' విజయానికి కారణమని చెప్పాలి. ఒకరోజు ముందుగా మరో కొత్త దర్శకుడు, బాగా చదువుకున్న విద్యాధికుడు అజయ్ భుయాన్ 'దడ'తో నిరాశపరిస్తే, ప్రేక్షకుల నాడినే నమ్ముకుని అన్ని కమర్షియల్ అంశాలూ సమపాళ్లలో మేళవించి సినిమా తీసి ఆకట్టుకున్నాడు శ్రీన్‌వాస్. శీను పాత్రలో రాం మరోసారి మంచి ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టిన అతను, మాసీ డైలాగ్స్‌ని బాగా చెప్పి మెప్పించాడు. హన్సిక కాస్త ఒళ్లు చేసినా అందంతో ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో అక్ష రోల్ అందర్నీ ఆశ్చర్యపరచింది. ఆమె కూడా ఆ పాత్రకి న్యాయం చేకూర్చింది. ఈ సినిమా విజయంతో నిర్మాత బెల్లంకొండ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా టాప్ పొజిషన్‌లో నిల్చున్నాడు. ఆయనకి ఇది వరుసగా రెండో విజయం. నిన్నటికి నిన్న లారెన్స్ 'కాంచన' బంపర్ హిట్ కొట్టి ఆయనకి బాగా డబ్బులు సంపాదించిపెట్టింది. అదివరకు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తీసిన 'గోలీమార్' సైతం ఆయనకి డబ్బులు మిగిల్చింది. ఇలా వరుస విజయాలతో అతను దూసుకెళ్తుంటే రాంకి వ్యక్తిగతంగా 'కందిరీగ' విజయం ఎంతో మేలు చేసింది. యువ హీరోల్లో అతనిప్పుడు తనదైన మార్కెట్‌ని పొందినట్లే. దీంతో అతని తదుపరి సినిమా 'ఎందుకంటే ప్రేమంట'కి క్రేజ్ వచ్చినట్లయింది. ఇందులో అతని సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండటం దానికి మరింత ఆకర్షణని తెస్తోంది.

Friday, August 12, 2011

చిట్ చాట్: అనుష్క

బాలీవుడ్ అవకాశాలు
బాలీవుడ్‌లో నటించేందుకు నేను సిద్ధం. 'సింఘం' సినిమాలో చేయక పోవడానికి డేట్స్ కుదరక పోవడమే కారణం. బిజీ వల్లనే దాన్ని చేయలేకపోయా. అన్నీ కుదిరితే హిందీలోనే కాదు ఏ భాషలోనైనా నటిస్తా. స్క్రిప్టు నచ్చితే చాలు.
అవార్డులపై అభిప్రాయం
సినిమా ఫీల్డులోకి వచ్చి ఐదున్నరేళ్లే అయ్యింది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓ పదేళ్లు అయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలో నా నటన బాగుందని గుర్తుంచుకునేలా ఉండాలి. మనం చేసిన కష్టానికి ఇచ్చే ప్రతిఫలం అవార్డు. అది రావడం వల్ల మన బాధ్యత మరింత పెరుగుతుంది.
నచ్చిన నటులు
నటనాపరంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. హి ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. పర్సనల్‌గా అయితే నాగార్జున ఇష్టం. నన్ను సినీ రంగానికి పరిచయం చేసింది నాగ్, పూరి జగన్నాథ్. అందుకే నా ఆల్‌టైం ఫేవరేట్స్ నాగ్ అండ్ జగన్.
నచ్చిన హీరోయిన్లు
తమన్నా, కాజల్ అంటే ఇష్టం. అయితే తమన్నా బాగా హార్డ్ వర్కర్. అందుకే తనంటే బాగా ఇష్టం. బాగా కష్టపడే వాళ్లని నేనెప్పుడూ అభిమానిస్తా. తను నాకంటే బాగా నటిస్తోంది అంటే నాకంటే సంతోషించేవాళ్లు మరొకరు ఉండరు.
డబ్బింగ్ సంగతి
తెరముందు నా పాత్రకి నేనే వాయిస్ ఇవ్వాలని నాకూ ఉంది. కానీ నాలుగైదు సినిమాలు చేతిలో ఉండటం వల్ల డబ్బింగ్‌కి సమయం కేటాయించలేకున్నా. 'వేదం'కు చెపాలనుకున్నా కానీ అది వెస్ట్ గోదావరి యాసలో మాట్లాడాలి. ఆ యాసను చెడగొట్టరాదనే ఉద్దేశంతోనే అందులో నేను డబ్బింగ్ చెప్పలేదు. ఈసారి తప్పకుండా ట్రై చేస్తా.
బెంగళూరులో ఎక్కువ సమయం
అమ్మా నాన్నలు బెంగళూరులో ఉంటారు. అందుకే వీలున్నప్పుడల్లా వారి దగ్గర ఉంటున్నా. ఐటీ అధికారులు దాడులు చేశారని నేనేదో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాననీ రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదు. నేను ఇంటున్నా. 'డమరుకం', 'రెబెల్' షూటింగుల్లో పాల్గొంటున్నా.
గ్లామర్ రహస్యం
యోగా చెయ్యడం వల్ల మనలో ఉన్న అన్ని చెడు అలవాట్లు పోతాయి. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే చాలు.. మీకు తెలియకుండానే మీలో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోతాయి. ఉదాహరణకి ఓ హాబీలా మాంసాహారం తింటున్నారనుకోండి. యోగా చేస్తే అది మీకు తెలియకుండానే మరచిపోతారు. 

Wednesday, August 10, 2011

న్యూస్: యముడైనా గట్టెక్కిస్తాడా?

కెరీర్‌లో ఒక్క హిట్టూలేని హీరో సాయిరాం శంకర్. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడైన సాయిరాం '143' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. జగన్నాథ్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ఆ తర్వాత సాయిరాం 'హలో ప్రేమిస్తారా', 'వాడే కావాలి', 'డేంజర్', 'బంపర్ ఆఫర్' సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిలో 'బంపర్ ఆఫర్' హిట్టవుతున్నట్లే కనిపించి, ఫ్లాప్‌గా తేలింది. 'డేంజర్'కి కృష్ణవంశీ డైరెక్టర్ అయినా ప్రయోజనం లేకపోయింది. వీటితో పాటు రవితేజ సినిమా 'నేనింతే'లో హీరో అభిమానిగా సాయి నటించాడు. ఇవేవీ అతని కెరీర్‌కు దోహదం చేయలేదు. కాగా అతను హీరోగా మరో సినిమా తెరకెక్కుతోంది. దాని పేరు 'యమహో యమహ'. 'ఇన్ అమెరికా' అనేది ట్యాగ్‌లైన్. ఇది సోషియో ఫాంటసీ కావడం గమనార్హం. ఇందులో యమధర్మరాజు పాత్రని శ్రీహరి చేస్తుండటం విశేషం. ఆయన ఆ పాత్రని పోషించడం ఇదే ప్రథమం. ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం సాయి సరసన పార్వతీ మెల్టన్ నటిస్తుండటం. పవన్ కల్యాణ్ సినిమా 'జల్సా' తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో నటించడం ఇదే. 'వేడుక' ఫేం జితేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో జరగనున్నది. యమధర్మరాజు ఉంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్‌ని సినీ జనం గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ సినిమా అయినా విజయం సాధించి సాయి కెరీర్‌కి ప్రయోజనం చేకూరుస్తుందేమో చూడాలి.

Tuesday, August 9, 2011

బిగ్ స్టోరీ: కేవలం టైటిల్‌తో విజయం సాధ్యమా?

ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి టైటిల్ బాగా దోహదం చేస్తుందని సినిమా రంగంలోని చాలామంది నమ్ముతారు. టైటిల్ అనేది సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది కానీ, విజయానికి మొత్తంగా అదే దోహదం చేయదనీ, సినిమా కథలో పస లేకపోతే టైటిల్ ఎంత బాగున్నా, వింతగా వున్నా ఆ సినిమా నడవదనీ విశ్లేషకులు అనే దాంట్లో తప్పు కొంచెం కూడా లేదు. అయినప్పటికీ మన దర్శకులు తమ సినిమా టైటిళ్లను విభిన్నంగా పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు.
ఎవరన్నా కాస్త డబ్బులు ఖర్చు పెడుతూ సరదా చేసుకునే వాణ్ణి చూసి మనం 'వాడికేంటిరా జల్సా పురుషుడు' అంటుంటాం. అందులోని 'జల్సా'ని టైటిల్‌గా పెట్టి సక్సెస్ సాధించారు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు. రెండక్షరాలతో చాలా సినిమాలే వచ్చాయి కానీ అన్నీ విజయం సాధించలేక పోయాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే యోగి, టాస్, ఆట, లక్ష్యం, మున్నా, మంత్ర, డాన్, కృష్ణ, వాన, గమ్యం, జల్సా, కంత్రి, రెడీ, శౌర్యం, కింగ్, మస్కా, ద్రోణ, మేస్త్రి, బిల్లా, కిక్, డైరీ, రైడ్, బోణి, ఓయ్!, జోష్, శంఖం, బాణం, కథ, కేడి, సింహా, వేదం, శక్తి వచ్చాయి. లక్ష్యం, మంత్ర, కృష్ణ, గమ్యం, జల్సా, రెడీ, శౌర్యం, కింగ్, కిక్, రైడ్, సింహా, వేదం విజయం సాధించగా; ఆట, డాన్, మస్కా, మేస్త్రి, బిల్లా, వేదం బాక్సాఫీసు వద్ద యావరేజ్ ముద్రను వేసుకున్నాయి. యోగి, టాస్, మున్నా, వాన, కంత్రి, ద్రోణ, డైరీ, బోణి, ఓయ్!, జోష్, శంఖం, బాణం, కథ, కేడి, శక్తి సినిమాలు విఫలమయ్యాయి. ఆగస్ట్ 11న 'దడ' రిలీజ్ కాబోతోంది. తేజ తొలి చిత్రం 'చిత్రం' హిట్టవడంతో రెండక్షరాల టైటిల్‌కి గిరాకీ ఏర్పడింది. 'ఖుషి', 'ఆది' చిత్రాలు ఆ బాటలో మంచి హిట్టవగా తేజ స్వయంగా రూపొందించిన మరో రెండక్షరాల సినిమా 'జయం', చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'ఇంద్ర' బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి.
టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్ టైటిల్‌ని విభిన్నంగా పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇట్లు.. శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి 9848022338 అంటూ అతడు వెరైటీగా పెట్టిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తిట్టుపదాలు ఇడియట్, పోకిరి, దేశముదురు టైటిళ్లతో బంపర్‌హిట్ సినిమాలు తీయడం అతడికే చెల్లింది. ఆ కోవలోనే ఎన్టీఆర్ హీరోగా పూరీ శిష్యుడు మెహర్ రమేష్ రూపొందించిన 'కంత్రి', నాగార్జున నటించిన 'కేడి' బాక్సాఫీసుని గెలవలేకపోయాయి. ప్రభాస్ హీరోగా తను రూపొందించిన సినిమాకు 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' అనే వెరైటీ టైటిల్ పెట్టాడు పూరీ. కానీ అది వర్కవుట్ కాలేదు.
తెలుగు సినిమాలకీ, యముడికీ మంచి అవినాభావ సంబంధం వుంది. 'యమజాతకుడు' వంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే 'యమ' శబ్దంతో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా విజయం సాధించినవే. 'యమగోల', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'యమలీల' వంటివి అందుకు ఉదాహరణలు. ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ సినిమా 'యమదొంగ', శ్రీకాంత్, వేణుల సినిమా 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు రెండూ విజయాన్ని చవిచూశాయి. ఆఖరికి రాజేంద్రప్రసాద్, శివాజీ, జయప్రకాశ్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సైతం బాగానే ఆడింది. అంటే యముడు బాక్సాఫీసు మంత్రమన్నమాట.
ఆహ్లాదకరమైన పేర్లు పెడితే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పొలోమని వస్తారనేది చాలామంది భావన. కానీ ఆ తరహా టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్లో అత్యధికం ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విచారకరం. టైటిల్‌లో వున్న ఆహ్లాదం సినిమాలో లేకపోవడమే దానికి కారణం. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అందమైన మనసులో', పదిహేనేళ్ల తర్వాత గిరిబాబు రూపొందించిన 'నే సుఖమే నే కోరుతున్నా', అపురూప చిత్రాల దర్శకుడు బాపు గీచిన 'సుందరకాండ', తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 'నవ వసంతం', స్వాతి హీరోయిన్‌గా నటించిన 'కలవరమాయె మదిలో', నితిన్, హన్సిక జంటగా నటించిన 'సీతారాముల కల్యాణం.. లంకలో', శివాజీ సినిమా 'తాజ్‌మహల్', మనోజ్ హీరోగా కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం', వంశీ సినిమా 'సరదాగా కాసేపు', రవిబాబు డైరెక్ట్ చేసిన 'మనసారా', వరుణ్ సందేశ్ సినిమా 'కుదిరితే కప్పు కాఫీ' వంటివి తుస్సుమన్నాయి.
కొన్ని సినిమాలు టైటిళ్లకు విరుద్ధమైన ఫలితాల్ని పొంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనించదగ్గ అంశం. 'వాన' ఎమ్మెస్ రాజుకు బాక్సాఫీసు వానను కురిపించలేక పోయింది. రాజా నటించిన 'వేడుక' నిర్మాత పాలిట పీడకల అయ్యింది. శ్రీహరి 'శ్రీ మహాలక్ష్మి' సిరులు కురిపించలేక పోయింది. 'లక్షీపుత్రుడు', 'లక్ష్మీ కల్యాణం'లదీ అదే దారి. ఎస్వీ కృష్ణారెడ్డి 'బహుమతి' నిర్మాత జేబుల్ని ఖాళీ చేయించింది. నాగబాబు హీరోగా నటించిన 'ఆపద మొక్కులవాడు' నిర్మాతల్ని పుట్టిముంచాడు. నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్', నారా రోహిత్ హీరోగా పరిచయమైన 'బాణం' బాక్సాఫీసు వద్ద వ్యతిరేక ఫలితాన్నిచ్చాయి. కల్యాణ్‌రాం 'జయీభవ'కి ప్రేక్షకులు అపజయాన్ని కలిగించారు. పవన్ కల్యాణ్ సినిమా 'పులి' బాక్సాఫీసు వద్ద పిల్లి అయ్యింది. మహేశ్ 'ఖలేజా' చూపించలేక పోయాడు.ఎన్టీఆర్ 'శక్తి' నిర్మాత అశ్వనీదత్‌కి శక్తికోల్పోయేలా చేసింది. పవన్ కల్యాణ్ 'తీన్ మార్' అనలేకపోయాడు. 'హ్యాపీ డేస్' మాత్రం శేఖర్ కమ్ములకూ, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకూ నిజంగానే హ్యాపీ డేస్‌ను తెచ్చింది.
హిట్టయిన పాత సినిమాల టైటిల్స్‌తో వచ్చిన సినిమాలేవీ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. ఉదయ్‌కిరణ్, శ్రీహరిల 'వియ్యాలవారి కయ్యాలు', వేణుమాధవ్ నటించగా దాసరి కథను అందించిన 'ప్రేమాభిషేకం', తరుణ్, ఇలియానాల 'భలే దొంగలు', తరుణ్ మరో సినిమా 'నవ వసంతం', శ్రీకాంత్, ప్రభుదేవా, సునీల్ ప్రధాన పాత్రలు పోషించిన 'మైఖేల్ మదన కామరాజు', ముమైత్‌ఖాన్ 'పున్నమి నాగు', కమల్‌హాసన్, వెంకటేశ్ సినిమా 'ఈనాడు', శివాజీ 'తాజ్‌మహల్', ఎన్టీఆర్ 'శక్తి' వంటివి అందుకు ఉదాహరణలు.
అంటే చిత్ర విజయానికి టైటిల్ అనేది ఒక ప్లస్ పాయింట్‌గా మాత్రమే వుంటుందనీ, కేవలం టైటిల్ వల్లే సినిమా హిట్టు కాదనీ స్పష్టమవుతుంది. మంచి కథతో సినిమాని రూపొందించి, దానికి జస్టిఫై అయ్యే టైటిల్‌ని పెడితే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతందనడంలో సందేహ లేదు. అందుచేత కథకులూ, దర్శకులూ టైటిల్ కంటే ముందు కథకీ, స్క్రీన్‌ప్లేకీ ప్రాధాన్యతనిచ్చి వాటిమీద శ్రద్ధ చూపి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించడం బెటరు.

Saturday, July 23, 2011

న్యూస్: 'ది బిజినెస్ మ్యాన్'కి రంగం సిద్ధం

రెండో బాలీవుడ్ సినిమా 'బుడ్డా.. హో గయా తేరా బాప్' (తొలి సినిమా 'బద్రి'కి రీమేక్ అయిన 'షర్త్') తర్వాత మహేశ్‌తో రెండో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్‌లో తొలిగా వచ్చిన 'పోకిరి' బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు సినిమా 40 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ మూవీ 'మగధీర' ఏకంగా దానికి రెట్టింపు వసూళ్లను సాధించి యావద్భారతీయ చిత్రసీమనే అబ్బురపరిచిన సంగతి మనకు తెలుసు. ప్రస్తుతానికి వస్తే మహేశ్‌తో జగన్ తీయబోతున్న 'ది బిజినెస్‌మ్యాన్' బిజినెస్ వర్గాల్లో హాట్ ప్రాజెక్ట్‌గా మారింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ద గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్' అనే ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తున్నారు. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా మహేశ్‌తో జతకట్టబోతోంది. నిజానికి మొదట ఆ పాత్రకి ఇలియానా, శ్రుతిహాసన్ పేర్లు వినిపించినా, చివరకి కాజల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. తమన్ మ్యూజిక్ అందించే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలు కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దీనితో పాటు రవితేజతో 'ఇడియట్ 2'ని కూడా తీయబోతున్నాడు జగన్.

Friday, July 22, 2011

న్యూస్: ఛార్మి 'మంత్రం' పారడం లేదు!

లేడీ ఓరియంటెడ్ మూవీ 'మంత్ర' తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాని ప్రేక్షకులు ఆదరించారు? ప్చ్.. ఏమీ లాభం లేదు. 'మంత్ర' (2007) తర్వాత ఛార్మి వైభవం మసకబారుతూ వచ్చింది. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో 'సుందరకాండ', వి. ఈశ్వరరెడ్ది దర్శకత్వంలో 'మనోరమ', కొత్తవాడైన రమణ దర్శకత్వంలో 'సై ఆట', 'మంత్ర' ఫేం తులసీరాం దర్శకత్వంలో 'మంగళ', ప్రేంరాజ్ డైరెక్ట్ చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేదు. కొద్ది రోజుల తేడాతో ఇటీవల వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', 'మాయగాడు' సినిమాలు రెండూ ప్రేక్షకుల నుంచి కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అమితాబ్‌తో కలిసి నటించిన హిందీ సినిమా 'బుడ్డా.. హోగా తేరా బాప్' ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యిందంటూ మీడియా మొదట్లో తెగ హడావుడి చేసినా, వారాంతం తర్వాత చూసుకుంటే కలెక్షన్లు బాగా డౌనయ్యాయి. ఏదేమైనా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఛార్మి శ్రీకాంత్ సరసన 'సేవకుడు' చిత్రంలో నటిస్తోంది. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునేవాళ్లు కరువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.