Monday, October 3, 2011

బిగ్ స్టోరీ: అప్పుడు 'పోకిరి' పోలీస్! ఇప్పుడు 'దూకుడు' పొలీస్!!

ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఎప్పటిలా కొన్నే హిట్టయ్యాయి. ఆ సినిమాల నిర్మాతలను గట్టెక్కించాయి. అయితే ఏడాది మూడోవంతు పూర్తవుతున్నా టాలీవుడ్‌కు అతి పెద్ద హిట్టు రాలేదనే బాధ సినీ వర్గాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ సినిమాలు 'దబాంగ్', 'బాడీగార్డ్', అజయ్ దేవగన్ సినిమా 'సింగమ్' సినిమాలు రూ. వంద కోట్ల పైగా వసూళ్లతో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల్నీ, డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ - అందర్నీ అమితానందపరుస్తూ వచ్చింది 'దూకుడు' చిత్రం. మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రం తొలి వారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సైతం ముక్కుమీద వేలేసుకునేట్లు చేసింది.
80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 1600 పైగా థియేటర్లలో విడుదలైన 'దూకుడు' ప్రభంజనం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాక, దేశంకాని దేశమైన అమెరికాలోనూ సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం. తొలివారం అక్కడ రూ. 5 కోట్లకు పైగా షేర్ సాధించడం అమెరికన్ ట్రేడ్ విశ్లేషకుల్నీ విస్మయ పరిచింది. అక్కడ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాని సైతం ప్రదర్శించని థియేటర్లలోనూ 'దూకుడు'ని ప్రదర్శించడం విశేషం. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమంటే మహేశ్ పోలీస్ పాత్రలు చేసిన రెండు సినిమాలూ వాటి కాలాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సినిమాలు కావడం.
2006లో తొలిసారి ఆయన పోలీస్ కేరక్టర్ చేసిన 'పోకిరి' సినిమా కలెక్షన్లలో అంతకు ముందున్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి రూ. 40 కోట్లకు పైగానే వసూలు చేసిన (అంచనా) తొలి తెలుగు సినిమాగా పేరు తెచ్చుకుంటే, ఐదేళ్ల తర్వాత మహేశ్ రెండోసారి 'పొలీస్' పాత్ర చేసిన 'దూకుడు' సైతం అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి'లో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణమనోహర్‌గా మహేశ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆయన చెప్పిన కట్ డైలాగ్స్ అలరించాయి. ఓ చోట 'ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. తండ్రి (నాజర్)ని విలన్ ప్రకాశ్‌రాజ్ చంపినప్పుడు తొలిసారి పోలీసాఫీసర్ వేషంలో మహేశ్ వేగంగా పరుగెత్తుకుంటూ తండ్రి శవం వద్దకు వచ్చే సన్నివేశం సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది.
ఇప్పుడు 'దూకుడు'లో ఐపీఎస్ ఆఫీసర్ అజయ్‌కుమార్‌గా మహేశ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తున్నదో కలెక్షన్లే తెలియజేస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన తండ్రి (ప్రకాశ్‌రాజ్) ప్రాణానికి హాని ఉండటంతో ఆయన వద్ద ఎమ్మెల్యేగా నటిస్తూ, మరోవైపు ఆయనకు అలాంటి స్థితి కలగడానికి కారణమైన దుష్టుల్ని పోలీసాఫీసర్‌గా ఏరిపారేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. 'ఎవర్నువ్వు?' అని ఎవరైనా అడిగితే 'పో'లీస్ అని కాకుండా 'పొ'లీస్ అంటూ ఆయన సమాధానం చెప్పే తీరు జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇలా రెండు మార్లు పోలీస్ పాత్రలు చేసి, రెండు సార్లూ రికార్డు కలెక్షన్లు సాధించడంతో మహేశ్ అభిమానులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీన్నో సెంటిమెంటుగా భావించి, రచయితలూ, దర్శకులూ ఈ తరహా పాత్రలతో ఆయన వద్దకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ పాత్రల్లో మొనాటనీ లేకుండా చూసుకోవడం మహేశ్ వంతు.

No comments: