Showing posts with label saloni. Show all posts
Showing posts with label saloni. Show all posts

Saturday, November 26, 2011

బాలకృష్ణ నాయనమ్మగా జయసుధ!

ఇప్పటివరకు హీరోలకు అమ్మగా కనిపిస్తూ వచ్చిన సహజనటి జయసుధ తొలిసారిగా ఓ హీరోకి నాయనమ్మగా కనిపించబోతున్నారు. అదీ తన సమవయస్కుడైన సీనియర్ హీరో బాలకృష్ణకు. 'అధినాయకుడు' సినిమాలో ఆమె నాయనమ్మ పాత్రని చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన తాత, తండ్రి, మనవడిగా నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఇందులో తాత పాత్ర సరసన జయసుధ నటిస్తున్నారు. "అంటే మేం జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఒకే సినిమాలో ఆయనకు భార్యగా, తల్లిగా, నాయనమ్మగా నటిస్తుండటం గమ్మత్తైన అనుభవం. 'శివరంజని'లోనే మేం జంటగా నటించాల్సింది తప్పిపోయింది" అని జయసుధ తెలిపారు. మిగతా ఇద్దరి పాత్రల సరసన లక్ష్మీరాయ్, సలోని నటిస్తున్నారు. ఇలాంటి విశేషాలున్న 'అధినాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Monday, August 15, 2011

న్యూస్: పరుచూరి మురళికి 'మహదేవనాయుడు'తో కలిసి వస్తుందా?

ఇదివరకు నితిన్, ఇలియానా జంటగా రూపొందించిన 'రెచ్చిపో' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ పరుచూరి మురళి ఆశలన్నీ 'మహదేవనాయుడు' సినిమాపైనే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ హీరో కావడంతో చాలా జాగ్రత్తగా సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'సింహా' వంటి ఇటు అవార్డులూ, రివార్డులూ పొందిన సినిమా తర్వాత బాలయ్య చేసిన 'పరమవీరచక్ర' అట్టర్‌ఫ్లాపైన సంగతి తెలిసిందే. అందుకే 'మహదేవనాయుడు' సినిమా హిట్టవ్వాల్సిన అవసరం హీరో, దర్శకుల ఇద్దరికీ ఉంది. కీర్తి క్రియేషన్స్ బేనర్‌పై ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకు ఇదే బేనర్‌లో జగపతిబాబుతో 'పెదబాబు', గోపీచంద్‌తో 'ఆంధ్రుడు' సినిమాలు చేశాడు మురళి. ఆ రెండూ బాగానే ఆడాయి. కలిసి వచ్చిన బేనర్‌లో మురళి ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలనే తపనతో ఆచితూచి పనిచేస్తున్నాడు. అందుకే మొదట దసరాకి రిలీజవుతుందనుకున్న ఈ సినిమా తాజాగా సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయినట్లు సమాచారం. ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఆయనతో ముగ్గురు తారలు జతకడుతున్నారు. వారిలో లక్ష్మీరాయ్, సలోని ఆయనతో తొలిసారి నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఛార్మికి బాలయ్యతో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆమె 'అల్లరి పిడుగు' సినిమాలో నటించింది. ఈ సినిమాతో బాలకృష్ణ-మురళి కాంబినేషన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.

Saturday, July 30, 2011

న్యూస్: ఇండస్ట్రీలో సౌందర్యలు ఎంతమంది?

టాలీవుడ్‌లో సావిత్రులు, సౌందర్యలు ఎంతమందున్నారో లెక్క తేలడం లేదు. అవును మరి. ప్రతి హీరోయిన్నీ ఎవరో ఒకరు సౌందర్యతోటో, సావిత్రితోటో, లేదంటే జయసుధతోటో పోల్చడం పరిపాటైపోయింది. ఇటీవల 'తెలుగమ్మాయి' ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరోయిన్ సలోనిని సొందర్య అంతటి నటంటూ ఆకాశానికెత్తేశాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన పోలికని అదే ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన గురువు దాసరి నారాయణరావు సున్నితంగా తోసిపుచ్చడం గమనార్హం. "రామకృష్ణా అప్పుడే ఎందుకు తొందర. సౌందర్యకి ఎవరూ పోలిక కారు" అని ఆయన సున్నితంగా శిష్యుణ్ణి మందలించారు. కోడి రామకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నా ఆ సినిమాకి సంబంధించిన వాళ్లని ఊహాతీతంగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం అలవాటే. ఆయన సంగతి అలా పక్కన పెడదాం.
సొందర్య ప్రమాదవశాత్తూ మృతి చెందాక మొదట స్నేహని ఆమెతో పోల్చడంతో ఈ పోలికల గొడవ ఎక్కువవుతూ వచ్చింది. 'అన్నమయ్య', 'రాధా గోపాలం' సినిమాలు చేసిన ఆమెని సౌందర్య అంతటి నటిగా కొంతమంది ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఆమె ఆ సినిమాల తర్వాత సరిగా రాణించలేక పోయింది. తెలుగులో ఆమె కెరీర్ ఎదగలేదు. ఆమధ్య 'కలవరమాయే మదిలో' సినిమా చేసిన స్వాతిని ఆ చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల "సావిత్రి తర్వాత అంతటి నటి స్వాతే" అని తీర్మానించేశారు. అంటే వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, విజయశంతి, సౌందర్య కూడా స్వాతి ముందు దిగదుడుపే అని ఆయన పరోక్షంగా చెప్పాడన్న మాట. ఆ సినిమానే కాదు, ఆ తర్వాత కూడా స్వాతి చెప్పుకోదగ్గ రీతిలో తెలుగులో రాణించలేదు. భూమిక, ఛార్మి, అనుష్క వంటి వాళ్లని కూడా సౌందర్యతో మనవాళ్లు పోల్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం 'అలా మొదలైంది' నాయిక నిత్యమీనన్‌ని కూడా కొంతమంది సౌందర్యతోటీ, జయసుధతోటీ పోల్చారు. నో డౌట్. ఆ సినిమాలో నిత్య నటించలేదు, బిహేవ్ చేసింది. అయినా ఆమెని సౌందర్యతో పోల్చలేం. ఇలా చాలామంది సౌందర్యలను మనవాళ్లు తమ మాటల ద్వారా సృష్టించారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మరో సౌందర్య రాలేదన్నది నిఖార్సయిన నిజం. సినిమావాళ్లు ఊరికే సౌందర్యతో ఇతర తారల్ని పోల్చడం మానితే బెటర్.

Tuesday, July 26, 2011

న్యూస్: 'తెలుగమ్మాయి' వచ్చేదెప్పుడు?

ఆరేళ్ల క్రితమే టాలీవుడ్‌కు 'ధన 51' ద్వారా పరిచయమైనా ఈ మధ్యే వచ్చిన రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న' తోటే పాపులర్ అయిన తార సలోని. ఆ సినిమా తర్వాత అవకాశాలు పోటెత్తుతాయనీ, టాప్ హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తాయనీ ఊహించిన ఆమెకి నిరాశే ఎదురైంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు 'తెలుగమ్మాయి' అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో టైటిల్ పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది తెలుగు మాట్లాడ్డం రాని ఈ ఉత్తరాది అమ్మాయి. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు' చిత్రాల దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రాజకీయ నాయకుడు, ఒకప్పటి నిర్మాత చేగొండి హరిరామజోగయ్య నిర్మాణ సారథిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఓ అమ్మాయి, నలుగురు అబ్బాయిల మధ్య నడిచే కథతో తయారైంది. ఆ నలుగురు అబ్బాయిల్లో యశ్వంత్, విక్రం (ఎమ్మెస్ నారాయణ కొడుకు) ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి నెల రోజుల పైనే అయిన ఈ సినిమాని జూన్‌లోనే విడుదల చేయాలని మొదట నిర్మాతలు భావించారు. అయితే బిజినెస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా, ప్రోత్సాహమూ రాలేదు. చివరికి శాటిలైట్ హక్కుల కోసమూ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఈ నెల 24న ఆడియో ఫంక్షన్ని ఆర్భాటంగా జరిపి బయ్యర్లని ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. తద్వారా ఆగస్టు తొలి వారంలో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ల ఆశలు నెరవేరతాయా? బయ్యర్లు రాకపోతే సొంతంగా విడుదల చేయని పరిస్థితి ఏర్పడినట్లే. అందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారో, లేదో? ఈ సినిమాతోనన్నా మరికొన్ని ఛాన్సులు దక్కించుకోవాలని చూస్తున్న సలోని ఆశలు నెరవేరుతాయా?