Showing posts with label vikram. Show all posts
Showing posts with label vikram. Show all posts

Monday, August 22, 2016

Monday, August 15, 2011

న్యూస్: తమిళ హీరోల బాటలో...

రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందాక తర్వాతి తరం నటులైన విక్రం, సూర్య, విశాల్, కార్తీ, ఇప్పుడు జీవా వంటివాళ్లు సైతం తెలుగునాట అనూహ్యమైన మార్కెట్‌ని సంపాదించారు. ఇప్పుడు వాళ్ల సినిమాలు తెలుగు మార్కెట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని తయారవుతున్నాయి. ఇది చూసి తాము కూడా టాలీవుడ్‌లో పాగా వెయ్యాలనే ఆలోచన కన్నడ హీరోలకు కలిగింది. అయితే ఇప్పటివరకు ఏ కన్నడ హీరో కూడా తెలుగులో మార్కెట్ సంపాదించలేక పోయాడు. నిన్నటికి నిన్న కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ చిన్న కొడుకు పునీత్ రాజ్‌కుమార్ 'జాకీ'గా తెలుగు ప్రేక్షకుల మధ్యకు వచ్చాడు. అయితే మనవాళ్లు అతన్నేమాత్రమూ పట్టించుకోలేదు. విశేషమేమంటే 'జాకీ' సినిమాని పునీత్ కుటుంబమే స్వయంగా తెలుగులో విడుదల చేసింది. దాన్నిబట్టే పునీత్‌ని తెలుగువాళ్ల చేత ఆమోదింపజేయడానికి వాళ్లు గట్టిగా ప్రయత్నించారని అర్థమవుతుంది. అలాగే ఇటీవలే రాజ్ అనే నటుడు 'తిరుగుబోతు' పేరుతో తన జాతకాన్ని పరీక్షించుకున్నాడు. విలన్ పాత్రలతో కన్నడ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా మెప్పించిన అతను హీరోగా 'సంచారి' అనే సినిమా చేసి హిట్‌కొట్టాడు. అదే సినిమాని తెలుగులో తనే స్వయంగా 'తిరుగుబోతు'గా తెచ్చాడు. ఇందుకోసం అతను మరో కన్నడ సినిమా ఏదీ చేయకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం వెచ్చించాడు. గమనించాల్సిందేమంటే 'తిరుగుబోతు' హిట్టు కాకపోయినా 'జాకీ' కంటే బెటర్‌గా ఆడింది. అంతేకాదు.. ఈ సినిమా పాటలు ఓ మోస్తరుగానైనా ఆదరణ పొందాయి. రాజ్ ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించేందుకు యత్నిస్తున్నాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ శిష్యుడు నాగిరెడ్డి డైరెక్షన్‌లో నటించేందుకు అంగీకారం తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలన్నా, తెలుగు హీరోలన్నా విపరీతమైన అభిమానం కనపరిచే రాజ్ తెలుగులో రాణిస్తాడా?

Wednesday, August 3, 2011

న్యూస్: 'నాన్న' ఓడాడు.. 'కాంచన' గెలిచింది!


తెలుగు బాక్సాఫీసు వద్ద తలపడ్డ రెండు డబ్బింగ్ సినిమాల్లో 'కాంచన' గెలవగా, 'నాన్న' ఓటమి పాలయ్యాడు. మానసిక వికలాంగుడిగా విక్రం గొప్పగా నటించిన 'నాన్న'కి విమర్శకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇంకా చెప్పాలంటే 'నాన్న' కూతురిగా నటించిన బేబీ సారాకి మరింత పేరు వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద ఈ ప్రశంసలేవీ పనిచేయలేదు. మళ్ల విజయప్రసాద్, సురేశ్ కొండేటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా హక్కుల్ని వారు రూ. 4 కోట్లకు కొనుగోలు చేశారు. అందులో ఒప్పందం ప్రకారం విజయప్రసాద్‌కు రూ. 1.4 కోట్లు శాటిలైట్ హక్కుల రూపంలో అందాయి. మరోవైపు వెస్ట్ గోదావరిలో 'నాన్న'ని సొంతంగా రిలీజ్ చేసిన సురేశ్ మిగతా అన్ని ఏరియాలకు సినిమాని అమ్మేశాడు. అందువల్ల అతను సేఫ్. నష్టమంతా విజయప్రసాద్ మీదే పడిందనేది సమాచారం. మరోవైపు లారెన్స్, శరత్‌కుమార్ ఇద్దరూ కలిసి నటించిన 'కాంచన' టాలీవుడ్ బాక్సాఫీస్‌పై విజయ బావుటా ఎగురవేసింది. హిజ్రాలూ అందరులాగే మనుషులేననే విషయాన్ని హారర్, కామెడీ మేలవింపుతో డైరెక్టర్ లారెన్స్ చెప్పిన తీరు అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులనిద్దర్నీ మెప్పించింది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన బెల్లంకొండ సురేశ్ మంచి లాభాలు ఆర్జించాడు. ఆయన ప్రకారం ఇప్పటికే తెలుగు 'కాంచన' రజనీకాంత్ సూపర్‌హిట్ సినిమా 'చంద్రముఖి' కలెక్షన్లని అధిగమించింది. అలాగే రజనీ బిగ్గెస్ట్ తెలుగు ఫిల్మ్ 'శివాజీ'ని సైతం కొన్ని సెంటర్లలో అధిగమించింది. అందులో నిజమెంతున్నా గానీ 'కాంచన' పెద్ద హిట్టయ్యిందనే విషయంలో సందేహం లేదు. నిన్న 'రంగం', నేడు 'కాంచన' హిట్లతో డబ్బింగ్ సినిమాలే తెలుగు నేలమీద రాజ్యం చేస్తున్నట్లయ్యింది. దీన్ని ఓ గుణపాఠంగా తీసుకుని మనవాళ్లు ఇకనైనా క్వాలిటీ సినిమాలు తీయాల్సిన అవసరముంది.

Monday, July 18, 2011

న్యూస్: తెలుగు సినిమాలకు థియేటర్లు కావలెను!

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ డబ్బింగ్ సినిమాల హవా నడుస్తున్నదనే దానికి ఇంకో మంచి ఉదాహరణ ఈ శుక్రవారం (జూలై 15) విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు. వాటిలో రెండు తమిళం నుంచి తెలుగుకు వచ్చిన 'నాన్న', 'కాంచన' కాగా, మరోటి హాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చిన 'హారీపోట్టర్ 7' (పార్ట్ 2). వీటి మధ్య 16న రెండు తెలుగు సినిమాలు 'మాయగాడు', 'కీ' విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలు మూడు కలిసి హైదరాబాద్ ఏరియాలో 65 థియేటర్లకు పైగా విడుదలైతే, రెండు తెలుగు సినిమాలు కలిసి కేవలం 14 థియేటర్లలో రిలీజయ్యాయి. విక్రం, అనుష్క జంటగా నటించిన డబ్బింగ్ సినిమా 'నాన్న' సిటీ ఏరియాలో 25 థియేటర్లలో, రాఘవ లారెన్స్ సినిమా 'కాంచన' 33 థియేటర్లలో, 'హారీపోట్టర్ 7' 7 థియేటర్లలో విడుదలయ్యాయి. మన తెలుగు సినిమాల్లో వేణు, ఛార్మి సినిమా 'మాయగాడు' 10 థియేటర్లలో విడుదలైతే, జగపతిబాబు హీరోగా నటించిన 'కీ' కేవలం అత్యల్పంగా 4 థియేటర్లలోనే రిలీజవడం గమనార్హం. అంటే తెలుగు సినిమాల కంటే పర భాషల నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ బిజినెస్ జరుగుతున్నదన్న మాట. ఈ నేపథ్యంలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల కారణంగా థియేటర్లే దొరకని స్థితి నెలకొంది. ఇప్పటికే తమిళం నుంచి మరో రెండు డబ్బింగ్ సినిమాలు 'రంగం', 'వాడు వీడు' హైదరాబాద్ థియేటర్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆరోవారంలో ఉన్న అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా కేవలం 5 థియేటర్లలోనే సిటీలో నడుస్తుండగా, ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా నటించిన 'రంగం' డబ్బింగ్ సినిమా పదో వారంలో 11 థియేటర్లలో ఆడుతుండటం విశేషం. దీన్ని బట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దబ్బింగ్ సినిమాలకు 50% టాక్స్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

Saturday, July 31, 2010

'Dubbing' Stroke To Tollywood


తెలుగు సినిమాకి ప్రధాన శత్రువులేమిటి? వీడియో పైరసీ, డబ్బింగ్ సినిమాలు. అవును. తామరతంపరగా వస్తున్న అనువాద చిత్రాలు నేడు స్ట్రయిట్ తెలుగు సినిమాల పాలిట విలన్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దాదాపు పారలల్ గా అనువాద చిత్ర పరిశ్రమ 'వర్థిల్లుతోంది'. 2009లో విడుదలైన స్ట్రయిట్ సినిమాలకు కాస్త అటుఇటుగా అంతే సంఖ్యలో డబ్బింగ్ ఫిలిమ్స్ రిలీజయ్యాయి. దానికి రిజల్ట్.. స్ట్రయిట్ సినిమాల కలెక్షన్లకు భారీ గండి. ఈ ఏడాది పరిస్థితిలోనూ పెద్ద మార్పు లేదు. కాకపోతే పోయిన సంవత్సరం స్థాయిలో డబ్బింగ్ సినిమాలు విడుదల కాకపోవచ్చు. ఆ రకంగా చూస్తే ఈ ఏడు నేరుగా తెలుగులో నిర్మాణమై, విడుదలైన సినిమాలు కూడా తక్కువయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్ అందించిన సమాచారం ప్రకారం జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రిలీజైన స్ట్రయిట్ సినిమాలు 58 అయితే, డబ్బింగ్ సినిమాలు సరిగ్గా 50. వాటిలో బాగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు స్ట్రయిట్ సినిమాల మాదిరే బాగా తక్కువ. 'యుగానికి ఒక్కడు', 'ది ఉల్ఫ్ మ్యాన్', 'మదనుడు.. మృగమైతే', 'ఐరన్ మ్యాన్-2', 'ఆవారా', 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా', 'యముడు', 'ద కరాటే కిడ్' వంటివి కొద్దో గొప్పో కలెక్షన్లు రాబట్టాయి. మిగతావేవీ ఆడలేదు. వాటిలో 'విలన్', 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్', 'ఆవహం', 'సూపర్ కౌబాయ్', 'కైట్స్', 'ప్రిన్స్' వంటి డిజాస్టర్స్ వున్నాయి.
తక్కువ కష్టం, నష్టం
అసలు నిర్మాతలు స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల మీదే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు? సమాధానం సులువైనదే. స్ట్రయిట్ సినిమాల ప్రొడక్షన్లో సవాలక్ష కష్టాలు వుంటాయి. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులతో పని వుంటుంది. రోజువారీ షూటింగంటే ఒక యుద్ధం చేసినంత పని. ఎన్ని రోజులు షూటింగుంటే అన్ని రోజులూ నిర్మాతలకి ఊపిరి సలపనంత పని. ఏదైనా అవాంతరంతో ఒక్క రోజు షూటింగ్ కాన్సిలయినా, ఆ రోజు కాల్షీట్లు ఇచ్చిన యాక్టర్ల కాంబినేషన్లో తిరిగి షూటింగ్ చేయడానికి నానా పాట్లూ పడాలి. టైమ్ వేస్ట్, మనీ లాస్. 24 క్రాఫ్టులవారినీ సమన్వయంతో పనిచేయించుకోడం అంత ఈజీ కాదు. ఇన్ని బాధలు పడి సినిమా తీసినా ఆ సినిమా హిట్టవుతుందనే గ్యారంటీ ఏ కోశానా వుండదు. పెట్టిన డబ్బు వస్తుందనే నమ్మకం కనిపించదు. ఆ బాధలన్నీ ఎందుకనే ఉద్దేశంతోటే చాలామంది డబ్బింగ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమాలకైతే కొత్తగా షూటింగ్ చేయాల్సిన పనిలేదు. 24 క్రాఫ్టుల్లో రెండు, మూడు క్రాఫ్టులు మినహా మిగతా వారితో పనివుండదు. డబ్బింగ్ స్పెషలిస్టులైన రచయితలతో మాటలు, పాటలు రాయించి, డబ్బింగ్ కళాకారులతో వాయిస్ ఇప్పిస్తే సరిపోతుంది. అవసరమైతే ఎడిటింగ్ మార్పులు వుంటాయి. అంతకుమించి మిగతా డిపార్టుమెంట్ల వారితో అవసరం వుండదు. ల్యాబులో డైలాగ్స్, సాంగ్స్ మిక్సింగ్ చేయిస్తే చాలు.. సినిమా రెడీ! అందుకే అతి తక్కువ కష్టం, నష్టం వుండే డబ్బింగ్ సినిమాలకి నిర్మాతలు ఓటు వేయడం.
పెద్ద సంస్థలదీ అదే బాట
మనదేశంలో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ పరిశ్రమ టాలీవుడ్డే. అందువల్లే ఇక్కడి డబ్బు కొల్లగొట్టుకు పోవడానికి తమిళ, హిందీ, ఇంగ్లీషు సినిమాల డబ్బింగ్ రూపాలు వెల్లువలా వస్తున్నాయి. తెలుగులో అవి భారీ విజయాలు సాధించకపోవచ్చు. కానీ ఏడాది మొత్తం మీద డబ్బింగ్ సినిమాల మీద తెలుగు ప్రేక్షకులు వెచ్చిస్తున్న డబ్బు యాభై కోట్ల రూపాయల పైమాటే. అంటే ఆమేరకు మన తెలుగు సినిమాలు నష్టపోతున్నాయన్నమాట. ఇంగ్లీషు భాషలో వుండే హాలీవుడ్ సినిమాలు నగరాలకే పరిమితమవుతున్నందున, విలేజ్ మార్కెట్టుని కూడా అందుకోవాలంటే తెలుగులో వాటిని డబ్ చేయడమొక్కటే మార్గం. కాబట్టే.. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, పారామౌంట్ ఫిలిమ్స్, ఇండో ఓవర్సీస్ ఫిలిమ్స్, వాల్ట్ డిస్నీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ వంటి గొప్ప గొప్ప హాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ సినిమాల్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి.
ఈ ఏడాది వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సినిమాలు 'ఫైనల్ డెస్టినేషన్', 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్', పారామౌంట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన 'ది ఉల్ఫ్ మ్యాన్', 'ఐరన్ మ్యాన్-2', ఇండో ఓవర్సీస్ ఫిలిమ్స్ 'లేడీ టెర్మినేటర్', వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించిన 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' సినిమాలు తెలుగులో రిలీజయ్యాయి. అలాగే బాలీవుడ్డులో భారీ వ్యయంతో తయారైన వివేక్ ఓబరాయ్ సినిమా 'ప్రిన్స్', సాజిద్ నదియడ్ వాలా సినిమా 'హౌస్ ఫుల్', హృతిక్ రోషన్ మూవీ 'కైట్స్' సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. రాంగోపాల్ వర్మ బాలీవుడ్డులో నిర్మించిన 'ఫూంక్-2' చిత్రం 'ఆవహం' పేరుతో వచ్చింది. వీటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫెయిలవడం గమనార్హం.
థియేటర్ల కొరత
స్ట్రయిట్ సినిమాలతో సమాన సంఖ్యలో డబ్బింగ్ సినిమాలు విడుదలవడం వల్ల తెలుగు నిర్మాతలకు తమ సినిమాల్ని విడుదల చేసుకోడానికి థియేటర్ల కొరత ఏర్పడుతోంది. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ వంటివాళ్ల సినిమాలకు మన రాష్ట్రంలో మంచి మార్కెట్ వుంది. వాళ్ల సినిమాలు తెలుగులోని పెద్ద హీరోల సినిమాల స్థాయిలో ఎక్కువ ప్రింట్లతో విడుదలవుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా సూర్య తమ్ముడు కార్తీ తెలుగులోనూ చెప్పుకోదగ్గ మార్కెట్ సంపాదించాడు. 'యుగానికి ఒక్కడు'తో అతను తెలుగువాళ్లకి పరిచయమయ్యాడు. పబ్లిసిటీ వల్లనైతేనేమి, సినిమాలోని విషయం వల్లనైతేనేమి అది పెద్ద హిట్టయ్యింది. తమిళ వెర్షన్ కంటే తెలుగు డబ్బింగ్ వెర్షనుకే ఆ సినిమా నిర్మాతకి ఎక్కువ లాభాలు రావడం ఇక్కడ గమనించదగ్గ అంశం. ఈ ఒక్క సినిమాతో కార్తీ తెలుగువాళ్లకి సన్నిహితమైపోయాడు. అది హిట్టవడంతో అతని మరో సినిమా 'ఆవారా'కు ఎక్కడలేని డిమాండూ వొచ్చింది. అందుకు తగ్గట్లే సుమారు 125 ప్రింట్లతో విడుదలైన ఆ సినిమాకి తెలుగులోని పెద్ద హీరో సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వొచ్చాయి. ఇలా అతని రెండు సినిమాలూ తెలుగులో విజయాన్ని సాధించడం వల్ల కార్తీ మినిమం గ్యారంటీ డబ్బింగ్ సినిమాల హీరోగా మారాడు. భవిష్యత్తులో రిలీజవబోయే అతని సినిమా కోనేందుకు బయ్యర్లు పోటీపడడం ఖాయం. ఇక 'గజిని' సినిమాతో సూర్యకి తెలుగులో వొచ్చిన మార్కెట్ ఏ స్థాయిదో మనకు తెలిసిందే. అతని మునుపటి సినిమా 'ఘటికుడు' చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోయినా ఇటీవల వొచ్చిన 'యముడు' సినిమాకి మంచి ఓపెనింగ్స్ వొచ్చాయి. ఆ సినిమాలో హీరోయిన్ అనుష్క కావడం ప్లస్సయింది. అది వంద ప్రింట్లతో రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఇక విక్రమ్, ఐశ్వర్యారాయ్ కాంబినేషనుతో మణిరత్నం తమిళంలో రూపొందించిన 'రావణన్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'విలన్' భారీ స్థాయిలో 125 ప్రింట్లతో 215 థియేటర్లలో విడుదలైంది. అంటే అవి ఆడుతున్న సమయాల్లో థియేటర్లు లభించక స్ట్రయిట్ తెలుగు సినిమాల నిర్మాతలు కొంతమంది ఇబ్బందులు పడ్డారు.
నిఘా నిల్
ఒకవైపు తెలుగులోని క్రేజీ సినిమాల వల్ల థియేటర్ల కొరతని ఎదుర్కొంటున్న తెలుగులోని చిన్న (తక్కువ బడ్జెట్) సినిమాల నిర్మాతలు ఇప్పుడు ఈ బడా డబ్బింగ్ సినిమాల వల్ల మరింత అగచాట్లకు గురవుతున్నారు. థియేటర్లు సకాలంలో లభ్యంకాక విడుదల వాయిదా వేసుకుంటున్న సినిమాలెన్నో. ఆ తర్వాత విడుదల చేద్దామంటే వాటిని కొనేందుకు ఏ బయ్యరూ, ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకురాడు. అప్పటికే ఫైనాన్సుతో సినిమాని పూర్తి చేసిన నిర్మాతకు సొంతంగా రిలీజ్ చేసుకునే స్థోమత వుండదు. పబ్లిసిటీకీ, విడుదలకీ మళ్లా అప్పుచేసే ధైర్యం లేక చాలామంది నిర్మాతలు తమ సినిమాల్ని ల్యాబుల్లోనే మగ్గనిస్తున్నారు. అవెప్పుడు థియేటర్ల మొహం చూస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. ఈమధ్య కొంతమంది నిర్మాతలు తెలివిమీరి డబ్బింగ్ సినిమాలకి నాలుగైదు తెలుగు సీన్లు జోడించి, స్ట్రయిట్ సినిమాలంటూ విడుదల చేస్తున్నారు. తద్వారా డబ్బింగ్ సినిమాల మీద ప్రభుత్వం వేస్తున్న పన్నుని తప్పించుకుంటున్నారు. వీటిమీద సరైన నిఘా లేకపోవడంతో ఇలాంటి సినిమాలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈరకంగా డబ్బింగ్ సినిమాలు తెలుగు మార్కెట్ మీద దురాక్రమణ చేస్తున్నాయి. అష్టకష్టాలు పడి తెలుగులో సినిమాలు తీస్తున్న నిర్మాతల నడ్డి విరుస్తున్నాయి. కర్నాటక తరహాలో ఇక్కడ కూడా డబ్బింగ్ సినిమాల మీద ఆంక్షలు పెట్టుకుంటే తప్ప 'మన' నిర్మాతల కష్టాలు కొంతమేరకైనా తీరవు.

Thursday, July 1, 2010

Aditi Agarwal Re-entry!


ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితి జ్ఞాపకముంది కదా.. తొలి సినిమాలోనే 'గంగోత్రి'గా ఘన విజయాన్ని అందుకున్న ఆమె కెరీర్ ఏమాత్రం ఎదగకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. చాలా కాలం తర్వాత ఆమె మొహానికి రంగేసుకుని 'లోకమే కొత్తగా' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో శివాజీ హీరో. నేహ మీడియా ప్రై. లిమిటెడ్ అనే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. ఇటీవలే అతను అదితి అక్క ఆర్తీతో 'నీలవేణి' అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఆమె చెల్లెలు అదితిని పెట్టి ఈ సినిమా తీస్తున్నాడు.
కన్నడంలో సక్సెస్ అయిన్ 'మొగ్గిన మనసు' అనే సినిమాకి ఇది రీమేక్. ఐదు ఫిలింఫేర్ అవార్డులు పొందిన ఆ సినిమాలో ప్రధానాంశం.. కాలేజీలోకి ప్రవేశించిన యువత మనసులు దారి తప్పుతుంటాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు వాళ్లని సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నించాలి. ఈ సినిమాలో అదితి కాలేజీ విద్యార్థినిగా కనిపించబోతోంది. నిజానికి 'గంగోత్రి' తర్వాత సరైన సినిమాల్ని ఎంచుకోనుంటే ఆమె సినీ కెరీర్ మెరుగ్గా ఉండేదే. ఆ సినిమా తర్వాత 'విద్యార్థి', 'కొడుకు' సినిమాలను ఆమె చేసింది. 'విద్యార్థి'లో హీరో ఆర్.బి. చౌదరి కొడుకు రమేష్ అయితే, 'కొడుకు'లో హీరో ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రం. అవి ఫెయిలవడంతో ఆమె కెరీర్ దాదాపు ఆగిపోయింది. అందుకే అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటోంది. ఇప్పడు మళ్లీ 'లోకమే కొత్తగా' అంటూ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఎంట్రీ అయినా ఆమెకి కొత్త లోకాన్ని అందిస్తుందా?