Wednesday, August 3, 2011
న్యూస్: 'నాన్న' ఓడాడు.. 'కాంచన' గెలిచింది!
తెలుగు బాక్సాఫీసు వద్ద తలపడ్డ రెండు డబ్బింగ్ సినిమాల్లో 'కాంచన' గెలవగా, 'నాన్న' ఓటమి పాలయ్యాడు. మానసిక వికలాంగుడిగా విక్రం గొప్పగా నటించిన 'నాన్న'కి విమర్శకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇంకా చెప్పాలంటే 'నాన్న' కూతురిగా నటించిన బేబీ సారాకి మరింత పేరు వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద ఈ ప్రశంసలేవీ పనిచేయలేదు. మళ్ల విజయప్రసాద్, సురేశ్ కొండేటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా హక్కుల్ని వారు రూ. 4 కోట్లకు కొనుగోలు చేశారు. అందులో ఒప్పందం ప్రకారం విజయప్రసాద్‌కు రూ. 1.4 కోట్లు శాటిలైట్ హక్కుల రూపంలో అందాయి. మరోవైపు వెస్ట్ గోదావరిలో 'నాన్న'ని సొంతంగా రిలీజ్ చేసిన సురేశ్ మిగతా అన్ని ఏరియాలకు సినిమాని అమ్మేశాడు. అందువల్ల అతను సేఫ్. నష్టమంతా విజయప్రసాద్ మీదే పడిందనేది సమాచారం. మరోవైపు లారెన్స్, శరత్‌కుమార్ ఇద్దరూ కలిసి నటించిన 'కాంచన' టాలీవుడ్ బాక్సాఫీస్‌పై విజయ బావుటా ఎగురవేసింది. హిజ్రాలూ అందరులాగే మనుషులేననే విషయాన్ని హారర్, కామెడీ మేలవింపుతో డైరెక్టర్ లారెన్స్ చెప్పిన తీరు అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులనిద్దర్నీ మెప్పించింది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన బెల్లంకొండ సురేశ్ మంచి లాభాలు ఆర్జించాడు. ఆయన ప్రకారం ఇప్పటికే తెలుగు 'కాంచన' రజనీకాంత్ సూపర్‌హిట్ సినిమా 'చంద్రముఖి' కలెక్షన్లని అధిగమించింది. అలాగే రజనీ బిగ్గెస్ట్ తెలుగు ఫిల్మ్ 'శివాజీ'ని సైతం కొన్ని సెంటర్లలో అధిగమించింది. అందులో నిజమెంతున్నా గానీ 'కాంచన' పెద్ద హిట్టయ్యిందనే విషయంలో సందేహం లేదు. నిన్న 'రంగం', నేడు 'కాంచన' హిట్లతో డబ్బింగ్ సినిమాలే తెలుగు నేలమీద రాజ్యం చేస్తున్నట్లయ్యింది. దీన్ని ఓ గుణపాఠంగా తీసుకుని మనవాళ్లు ఇకనైనా క్వాలిటీ సినిమాలు తీయాల్సిన అవసరముంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment