Wednesday, August 24, 2011
న్యూస్: మలయాళంలో తెలుగు కుర్రాడి హవా!
కేరళలోని యువతలో ఇవాళ బాగా పాపులరైన నటుడెవరో తెలుసా? మన అల్లు అర్జున్. అవును. తన తెలుగు సినిమాల మళయాళ డబ్బింగులతోటే అతను అంతటి పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు మరో కుర్ర తెలుగు నటుడు మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. అతను నిన్నటిదాక బాల నటుడిగా కనిపించిన కౌశిక్‌బాబు. ప్రస్తుతం ఆంధ్రప్రభ డైలీకి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న పి. విజయబాబు కుమారుడే కౌశిక్. తెలుగులో ప్రస్తుతం షూటింగులో ఉన్న జె.కె. భారవి సినిమా 'జగద్గురు ఆది శంకరాచార్య'గా టైటిల్ రోల్ చేస్తున్న కౌశిక్ మలయాళంలో నేరుగా ఓ సినిమాలో హీరోగా నటిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు 'నాద బ్రహ్మం'. ఒక తెలుగు నటుడు హీరోగా నటిస్తున్న తొలి మలయాళ సినిమా ఇది. ఇందులో ఇంకో విశేషమేమంటే కౌశిక్ డ్యూయల్ రోల్ చేస్తుండటం. "బాల అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఓ పాత్రనీ, కృష్ణ అనే మృదంగ విద్వాంసునిగా మరో పాత్రనీ చేస్తున్నా. ఈ రెండు పాత్రల మధ్య ఎంతో వైవిధ్యం ఉంది. బాల పాత్రలో స్టైల్, డైనమిజం ఉంటే, కృష్ణ పాత్రలో సంప్రదాయబద్ధంగా, కూల్‌గా కనిపిస్తా" అని చెప్పాడు కౌశిక్. అయ్యప్పస్వామి పాత్రలో మలయాళ మెగా టీవీ సీరియల్లో మెప్పించడమే అతడికి అక్కడ ఇంతటి పాపులారిటీని సంపాదించి పెట్టింది. అందుకే అతణ్ణి అక్కడ 'కుట్టి ఎన్టీఆర్' అని పిలుస్తున్నారు. పౌరాణిక సినిమాల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా మహానటుడు ఎన్టీఆర్ మలయాళీలకి సుపరిచితం. అన్నట్లు 'టక్కరి దొంగ'లో చేసిన మహేశ్ చిన్నప్పటి పాత్రతో అతను ఉత్తమ బాలనటునిగా నంది అవార్డును గెలుచుకున్నాడు. గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా సహజసిద్ధంగా అబ్బిన నటనా సామర్థ్యం, స్ఫురద్రూపంతోటే అతడు మలయాళీల మనసుల్ని గెలుచుకున్నాడు. తెలుగులోనూ ఆరోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాడు కౌశిక్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment