నవరస నటనా సార్వభౌమగా ఖ్యాతి పొందిన కైకాల సత్యనారాయణ విలన్ పాత్రలతో సుప్రసిద్ధులైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన తొలిగా నటించింది హీరోగా. హీరో నుంచి విలన్ ఎందుకయ్యారో ఆయన మాటల్లోనే...
"ఇంటర్మీడియేట్‌లో ఉండగా విజయవాడలో ఓ నాటకాల పోటీలో పాల్గొన్నా. ఆ పోటీకి న్యాయమూర్తుల్లో ఒకరైన గరికపాటి రాజారావు గారు వచ్చి నన్ను సినిమాలో హీరోగా పరిచయం చేస్తానన్నారు. ముందు డిగ్రీ సంపాదించాకే ఏదైనా అని చెప్పా. బీఏ అయిపోయాక కె.ఎల్. ధర్ అని ఎల్వీ ప్రసాద్ దగ్గరి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ నన్ను మద్రాసు రమ్మని ఉత్తరం రాశారు. బి.ఎ. సుబ్బారావుగారి దగ్గరకు వెళ్లి అసిస్టెంట్‌గా ఇవ్వమని అడిగితే ఆయన చక్రపాణిగారి వద్దకి పంపారు. ఆయన మళ్లీ కేవీ రెడ్డిగారి దగ్గరకి పంపారు. 15 రోజుల తర్వాత రమ్మని, చిన్న పాత్ర చేయమన్నారు. మర్నాడు వాయిస్ టెస్ట్ చేసి, 'యు ఆర్ సెలెక్టెడ్' అన్నారు. కానీ సంక్రాంతికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఆ పాత్ర ఆర్. నాగేశ్వరరావుకి వెళ్లిపోయింది. కేవీ రెడ్డిగారు తర్వాతి చిత్రంలో ఇస్తానన్నారు. తర్వాత డి.ఎల్. నారాయణ గారి దగ్గరకు వెళ్తే ఆయన 'సిపాయి కూతురు' సినిమా తీస్తూ అందులో హీరో ఛాన్స్ ఇచ్చారు. అది ఫెయిలైంది. మళ్లీ గ్యాప్. ఇక వెళ్లిపోదాం అనుకుని.. మద్రాసు చూద్దామని తిరుగుతున్నా. ఇంతలో విఠలాచార్య గారు 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రానికి నా కోసం వెతుకుతున్నారు. నేను వెళ్లిన వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది. రషెస్ అందరికీ నచ్చింది. పాతికవేల చెక్కిచ్చారు. విలన్‌గా చేస్తే బాగుంటుందని చెప్పి, నాకు తొలి విలన్ వేషం ఇచ్చారు విఠలాచార్య. 'అగ్గి పిడుగు' నుంచి రామారావు గారు, నేను మంచి కాంబినేషన్ అయ్యాం. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశా."
No comments:
Post a Comment