తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా నటిస్తున్న అక్కినేని నాగార్జున మరో చారిత్రక పురుషుని పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. అది షిర్డీసాయి పాత్ర. సినిమాకి మాత్రం 'శిరిడి సాయి' అనే పేరు పెట్టారు. నిరాడంబరత్వాన్నీ, ప్రేమ తత్త్వాన్నీ, శాంతి తత్త్వాన్నీ ప్రపంచానికి బోధించిన షిర్డీసాయిగా నాగార్జున నటించబోతున్నారనే సంగతి ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచ లేదు. కారణం, అలాంటి పాత్రల వైపు మొగ్గు చూపుతున్న అగ్ర కథానాయకుడు ఆయనే కాబట్టి. ఇప్పటికే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రల పోషణతో నటునిగా ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. తోటి హీరోలతో పోలిస్తే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపే పాత్రలవి. భవిష్యత్తులోనూ నిలిచిపోయే పాత్రలవి. ఇప్పుడు 'రాజన్న', 'శిర్దిడి సాయి' పాత్రలతో ఆయన తనని తానే అధిగమించుకునే యత్నంలో ఉన్నారు. కొన్నేళ్లుగా భక్తిరస చిత్రాలకే ప్రాధాన్యమిస్తున్న సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికీ దర్శకుడు. కాకపోతే రచయిత మారాడు. ఇదివరకు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'కు జె.కె. భారవి రచన చేస్తే, 'శిరిడి సాయి'కి పరుచూరి బ్రదర్స్ రచన చేస్తున్నారు. ఎప్పటిలా ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. షిర్డీలోనే వారం రోజుల పాటు జరిపిన సిట్టింగ్స్‌లో మూడు పాటల్ని కంపోజ్ చేశారు. నవంబర్ నాటికి పాటల రికార్డింగ్‌ని పూర్తి చేయాలనేది సంకల్పమని నిర్మాత ఎ. మహేశ్‌రెడ్డి తెలిపారు.
ఇప్పటికే తెలుగులో షిర్డీసాయిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ 1986లో వచ్చిన 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' ఎక్కువ జనాదరణ పొందింది. షిర్డీసాయి పాత్రలో విజయచందర్ బాగా రాణించారు. ఇప్పటివరకు మరొకరినెవర్నీ ప్రేక్షకులు ఆ పాత్రలో ఆమోదించలేదు. ఇప్పుడు 'శిరిడి సాయి'కి జనామోదం లభించాలంటే విజయచందర్‌ని నాగార్జున మరిపించ గలగాలి. దాన్ని ఆయన సాధించగలరా?
No comments:
Post a Comment