Showing posts with label suicide. Show all posts
Showing posts with label suicide. Show all posts

Saturday, March 19, 2016

Poetry: Nippu Kanam (Fire Cell)

నిప్పుకణం

నీది ఆత్మహత్య అయినా
రాజ్యం చేసిన హత్య అయినా
నీది సాదాసీదా మరణం కాదు
దేశం దేశాన్నే జ్వలింపజేసిన 
నిప్పుకణిక నీ మరణం

మొదట్లో నేనూ అనుకున్నాను
యుద్ధం మధ్యలో వెన్నుచూపిన భీరువువని
చావు తప్ప పరిష్కారం లేదనుకున్న పిరికివాడివని
ఇప్పుడు కళ్లకు కడుతోంది వీరుడా
యుద్ధం మధ్యలో ఆత్మాహుతి అంటే ఏమిటో
ప్రత్యర్థి వెన్నులో చలి పుట్టించడమంటే ఏమిటో

పుట్టుక నుంచే పెరిగిన ఇంటినుంచే
వివక్షను ఎదుర్కొన్నవాడివి
విశ్వవిద్యాలయంలో వివక్ష
నీకు పెద్దలెక్కలోనిది కాదు
అయినా నీ ఊపిరి నువ్వే తీసుకున్నావంటే
అన్యాయపు వేర్లు ఎక్కడిదాకా విస్తరించాయో
తెలిసొచ్చి నిర్లిప్తుడవై నిస్పృహుడవయ్యావేమో
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడుతున్న
అవరోధాల్ని ఈడ్చిపారేయలేనని అనుకున్నావేమో

నువ్వు లేకపోయినా 
నీ మరణం ఎట్లాంటి జ్వాలను రేపిందో చూడు
ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తిందో చూడు
విద్యాలయాల్లో విద్యకు బదులు మితిమీరుతున్న 
రాజకీయాల జాడలు దిగ్భ్రాంతిపరుస్తున్నాయి
దుర్మార్గ దోపిడీ శక్తులు దట్టంగా అల్లుతున్న 
కులసూత్రాలు సాలెపురుగులా చంపుకుతింటున్నాయి 
చదువు కోసం వెళ్లిన కొడుకులు
క్షేమంగా ఇంటికొస్తాడో లేదోనని
అమ్మలు ఆందోళనపడుతున్నారు

నువ్వు అర్ధంతరంగా లోకాన్ని వదిలేశావు
పడమటి సూర్యుడిలా మాయమయ్యావు
నీకు తెలీదు.. నువ్విప్పుడు ఎంతమంది గుండెల్లో చిరంజీవివో
ఎంతమందిని ధీరులుగా మార్చేస్తున్నావో
నీకు తెలీదు.. నువ్వు గోడలో పాతుకొన్న రావిమొక్కవు
ఎన్నిసార్లు తుంచినా తిరిగి చిగురిస్తావు
నువ్విప్పుడు ఓటమిని ఒప్పుకున్న పరాజితుడివి కాదు
సహచరులకు యుద్ధాన్ని కొనసాగించే తెగింపునిచ్చిన విజేతవు

- 'స్వాప్నికుడి మరణం' పుస్తకం నుంచి

Friday, September 3, 2010

Society: 'Development' in crimes on women


నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం మహిళల హత్యలు, వరకట్న చావులు, అత్యాచారాలు, అపహరణలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా గృహ హింస, వేధింపులు, ఆత్మహత్యలు తదితర అంశాల్లో గడచిన రెండు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానానికి 'ఎదిగింది'. 2007 కంటే 2008లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2009లో వరకట్న చావుల గ్రాఫ్ పైపైకి ఎగబాకింది. గత ఏడాది కంటే ఈ యేడాది ప్రథమార్థంలో మహిళలపై హింస, నేరాల్లో 10 శాతం పెరుగుదల నమోదయ్యింది.
మహిళలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో రాజధాని నగరంలోనే అత్యధికంగా వుంది. జంట నగరాల తర్వాత నల్గొండ, వరంగల్, పశ్చిమ గోదావరి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు మహిళలపై నేరాలలో పేరుపోందాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుండగా భారతదేశంలో ఏటా లక్షమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మొత్తం ఆత్మహత్యల్లో 10 శాతం మనదేశంలోనే వుంటున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 24 శాతం స్వయం ఉపాధి రంగంలో వారు కాగా 21 శాతం మంది గృహిణులు. ఉద్యోగుల్లో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కంటే నిరుద్యోగుల్లో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య నాలుగు శాతం ఎక్కువ. మనదేశంలో గడచిన 10 సంవత్సరాలుగా ఆత్మహత్యలు 5 శాతం మేర పెరిగాయి.