Showing posts with label Raviteja. Show all posts
Showing posts with label Raviteja. Show all posts

Thursday, November 12, 2015

BENGAL TIGER Fulfilling The Hopes?

'బెంగాల్ టైగర్'పై ఆశలెన్నో!

రెండు వరుస హిట్లు - 'బలుపు', 'పవర్'తో రవితేజ మళ్లీ రిథంలోకి వచ్చాడు. అయితే మునుపటి సినిమా 'కిక్ 2' డిజాస్టర్ కావడంతో పరిస్థితి మొదటికి వస్తుందేమోనని అతని అభిమానులు, శ్రేయోభిలాషులు కాస్త ఆందోళన చెందుతున్నారు. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 'కిక్' కంటే కూడా పెద్ద హిట్టవుతుందని రవితేజ చాలా గట్టిగా నమ్మాడు. అదే విషయాన్ని అంత నమ్మకంతోనూ అందరితోనూ చెప్పాడు. కానీ ఫలితం దానికి భిన్నంగా వచ్చింది. ఆ సినిమా నిర్మించిన నందమూరి కల్యాణ్‌రాంకు భారీగా నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఆ సినిమా విడుదలకే అతను కష్టాలు ఎదుర్కొన్నాడు. ఖర్చుకు తగ్గట్లు బిజినెస్ కాకపోవడంతో ఎన్టీఆర్ చేసిన ఆర్థిక సాయంతో ఎట్లాగో విడుదల చేశాడు. ఆ సినిమాలో రవితేజ లుక్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సన్నపడ్డం సరేకానీ, మొహంలో గ్రేస్‌లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. వయసు పెరుగుతున్న ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో 'బెంగాల్ టైగర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాయికగా తమన్నా చేస్తోంది. వయసు ముదురుతున్న రవితేజ పక్కన మిల్కీ బ్యూటీనా అని కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఆ జంట తెరపై ఆకట్టుకుంటుందా?.. అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'బలుపు' రాకముందు రవి కెరీర్‌లో ఎంత బ్యాడ్ ఫేజ్ నడిచిందీ తెలిసిందే. 'దొంగల ముఠా', 'వీర', 'నిప్పు', 'దరువు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు' సినిమాలతో అతని ఇమేజ్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. 'కిక్ 2' ఫ్లాపవడం, అందులో అతను  కనిపించిన తీరుతో, ఇప్పుడందరి దృష్టీ 'బెంగాల్ టైగర్' మీదే ఉంది. పైగా పవన్ కల్యాణ్ కోసం తయారు చేసుకున్న స్క్రిప్టులో కొద్దిపాటి మార్పులు చేసుకొని సంపత్ తీస్తున్న సినిమా కావడం వల్ల, ఇది రవితేజకు ఏ మేరకు ఉపకరిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Friday, August 21, 2015

Saturday, December 20, 2014

Tuesday, May 13, 2014

Sindhooram (1997) Movie Review

సినిమా సమీక్ష: సిందూరం

తారాగణం: బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి, పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, అన్నపూర్ణ
బేనర్: ఆంధ్రా టాకీస్
దర్శకత్వం: కృష్ణవంశీ

రొటీన్ సినిమాలకి భిన్నంగా అప్పుడప్పుడు కొన్ని దర్శకుడి సినిమాలు వస్తుంటాయి. నటీనటులెవరనే దానికంటే దర్శకుని పేరునిబట్టే ప్రేక్షకులు ఆ సినిమాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆ కోవకి చెందిందే 'సిందూరం'. దానికి దర్శకుడు కృష్ణవంశీ కావడమే జనం ఆసక్తికి కారణం. ఒక ప్రేమ కథాచిత్రం, ఒక కుటుంబ కథాచిత్రం తర్వాత కృష్ణవంశీ తన దృష్టిని ఈ వ్యవస్థ మీదికి మళ్లించాడు. ఒక గంభీరమైన ఇత్రివృత్తాన్ని తనదైన టేకింగ్‌తో ఆద్యంతం పట్టుసడలని రీతిలో తెరకెక్కించాడు. ఐతే అడుగడుగునా సెన్సార్ తన కత్తెరకి పదునుపెట్టిన ఛాయలు కనిపించడం ఇబ్బందికరం.
గొప్ప పోలీసాఫీసర్ కావాలనే లక్ష్యంతో బుల్లిరాజు పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తాడు. ట్రైనింగ్ పూర్తయి తన గ్రామానికి వచ్చిన బుల్లిరాజుకి బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలుకుతారు. అయితే గ్రామంలో జరుగుతున్న అరాచకాల్నీ, దౌర్జన్యాల్నీ చూసి అతను కలత చెందుతాడు. అక్కడి ఎస్ఐ దురాగతాల్ని చూసి సహించలేక ఎదురు తిరగడానికి యత్నిస్తాడు. మరోపక్క నక్సలైట్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మందుపాతర్లతో పోలీసుల్ని చంపుతుంటారు. చిన్న రైతుల్ని హింసిస్తున్న భూస్వామిని చావబాదుతుంటారు. నక్సలైట్లని అసహ్యించుకుంటాడు బుల్లిరాజు. అతడి మేనకోడలు బేబి తన మావయ్య అయిన బుల్లిరాజునే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. చదువు సంధ్యలు లేకుండా అల్లరి చిల్లరిగా జల్సారాయుడిగా తిరిగే చంటి ఆమెని అల్లరి పెడుతుంటాడు. లక్ష్మి అనే యువతిని అల్లరి చేస్తున్న ముగ్గురు పోకిరీ రాయుళ్లని చంటి ఎదుర్కోవడం చూసి బుల్లిరాజు అతడికి సాయం వెళ్లి వాళ్లని చితగ్గొట్తాడు. చిత్రంగా ఎస్ఐ పోకిరీ రాయుళ్ల కొమ్ముకాయడం చూసి సహించలేక తిరగబట్తాడు. అతడి స్నేహితుడు బైరాగి అతణ్ని శాంతపరచి ఎస్ఐని బతిమాలుతాడు.
మారువేషంలో స్టేషన్‌లోనే ఉండి ఇదంతా గమనిస్తుంటాడు తీవ్రవాద నాయకుడు. బుల్లిరాజు వాళ్లు వెళ్లిపోయాక పోలీస్‌స్టేషన్‌ని పేల్చివేస్తారు తీవ్రవాదులు. ఐతే ఎస్ఐ తప్పించుకుంటాడు. పగబట్టిన ఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉన్న బుల్లిరాజు మిత్రుడు సత్తిపండుని బలవంతంగా తీసుకుపోతుంటే బోగిపండగ సంబరాల్లో ఉన్న బుల్లిరాజు అడ్డుకోబోతాడు. అతన్ని కూడా లాక్కుపోతారు పోలీసులు. బుల్లిరాజు కళ్ళముందే సత్తిపండుని కాల్చి చంపుతాడు ఎస్ఐ. తట్టుకోలేకపోయిన బుల్లిరాజు ఎస్ఐతో కలపడతాడు. పెనుగులాటలో ఎస్ఐ చేతిలోని రివాల్వర్ పేలి అతనే చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు బుల్లిరాజు. తీవ్రవాదులు అతనికి ఆశ్రయమిస్తారు. అక్కడ బైరాగిని చూసి ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజు తనకి తీవ్రవాదం అంటే నచ్చదని అందుకని వెళ్లిపోతున్నానని బయలుదేరుతుంటే తీవ్రవాదుల నాయకుడు అతనికి ఒక దినపత్రికనిస్తాడు. 'ఎస్ఐ కాల్చివేత - పోలీసు ముసుగులో టెర్రరిస్టు ఘాతుకం' అనే శీర్షికతో బుల్లిరాజు ఫొటోతో పెద్ద వార్త అచ్చయి ఉంటుంది. షాకవుతాడు బుల్లిరాజు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తోస్తుంది. బేబి విషయంలో అనుక్షణం బుల్లిరాజుతో గొడవపడుతూ చివరికి మారిపోయిన చంటి అతన్ని వెతుక్కుంటూ వచ్చినవాళ్లతో కలుస్తాడు. గతంలో చంటి, బుల్లిరాజు చేతుల్లో తన్నులుతిన్న ముగ్గురు పోకిరీరాయుళ్లు లక్ష్మిపై అత్యాచారం చేస్తారు. ఉద్రేకం కట్టలు తెంచుకున్న బుల్లిరాజు వాళ్ల ముగ్గిర్నీ జనం మధ్య పట్టుకొని లక్ష్మిచేత చావగొట్టిస్తాడు. ఆ పోకిరీలని తీవ్రవాదులు చంపేస్తారు. ఎస్ఐ చావుని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ అధికారులు ఆ విషయమై బుల్లిరాజుని పట్టుకునేందుకు, తీవ్రవాదుల్ని అణచివేసేందుకు స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తారు. అతను పోలీస్ అకాడమీలో బుల్లిరాజుకి శిక్షణనిచ్చిన పోలీసాఫీసరే. స్పెషల్ ఆఫీసర్ తీవ్రవాదుల కోసం, బుల్లిరాజు కోసం వేట మొదలుపెడతాడు.

పోలీసులతో జరిగిన ఘర్షణలో తీవ్రవాద నాయకుడు మరణిస్తాడు. బైరాగి పోలీసుల చేతికి చిక్కి, చిత్రహింసలకి గురవుతాడు. మావయ్యని వెతుక్కుంటూ వస్తుంది బేబి. ఆమెని తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకొమ్మని, తనని మరిచిపొమ్మని చెబుతాడు బుల్లిరాజు. విషంతాగి పెళ్లి మండపంలోనే చనిపోతుంది బేబి. బైరాగిని విడిపించుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి చలపతిరావుని బుల్లిరాజు కిడ్నాప్ చేస్తాడు. తీవ్రవాదుల ఒత్తిడికి లొంగమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. పోలీసులతో ఘర్షణల్లో ఒక్కొక్క అనుచరుడే మరణిస్తుంటే బుల్లిరాజు వ్యధ చెందుతాడు. లక్ష్మిని కూడా పోలీసులు కాల్చివేస్తారు. ఇది సహించలేని చంటి బాంబు విసిరి ఓ పోలీస్ వ్యాన్‌ని ధ్వంసం చేస్తాడు. పోలీసుల నుంచి చంటిని రక్షించాలనే ఆదుర్దాలో పోలీసు తుపాకీ గుళ్లకి బలవుతాడు బుల్లిరాజు. ఇదిచూసి మిగతా అనుచరులు రాష్ట్ర మంత్రితో అడవుల్లోకి పారిపోతారు. స్పెషలాఫీసర్ నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. ఆఖరున ఈ మారణహోమానికి అంతం ఎక్కడ? ఎప్పుడు? అని దర్శకుడు ప్రశ్నిస్తాడు. అవును. దానికి అంతం లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడున్న మాదిరిగానే ఉంటే మారణహోమం కొనసాగుతూనే ఉంటుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది స్పష్టం. వ్యవస్థ మీద కోపంతో తీవ్రవాదులుగా మారిన యువకుల జీవితాలు ఎలా పరిసమాప్తి అవుతున్నాయో, వ్యవస్థ మీద కసితో పొట్టకోసం ఉద్యోగం చేస్తున్న సాధారణ పోలీసుల్ని ఎట్లా చంపివేస్తున్నారో, పోలీసులు రాజకీయ నాయకులకి, డబ్బున్న వాళ్లకి ఎట్లా తొత్తులుగా మారుతున్నారో, రాజకీయ నాయకులు పోలీసుల్ని తమ స్వార్థం కోసం ఎట్లా వాడుకుంటున్నారో, వాళ్ల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో కళ్లకి కట్టించాడు దర్శకుడు. అడుగడుక్కీ ఈ వ్యవస్థ మీద సంధించిన బాణాల్లాంటి సంభాషణలు అగుపిస్తాయి. ఐతే అనేక సన్నివేశాల్లో కొన్ని డైలాగులకి సెన్సార్ కత్తెర వేసి, తానున్నది కత్తిరించడానికే అని రుజువు చేసుకుంది. ప్రేక్షకుడికి మాత్రం ఇది కాస్త విసుగు తెప్పిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ఒక సన్నివేశం పూర్తికాకముందే మరో సన్నివేశం రావడం తికమక కలిగిస్తుంది.
బుల్లిరాజుగా బ్రహ్మాజీ చాలా బాగా చేశాడు. ఇంతదాకా చిన్న చిన్న పాత్రలకే పరిమితమవుతూ వచ్చిన బ్రహ్మాజీకి ఈ సినిమా మంచి బ్రేక్‌నిస్తుంది. ఉద్రేకం, ఉద్వేగం ప్రదర్శించే సన్నివేశాల్లో అతను సరిగ్గా అతికిపోయాడు. చంటిగా రవితేజ చాలా ఈజ్‌తో చేశాడు. నృత్యాలు చలాకీగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. బేబి పాత్రలో సంఘవి అమాయకంగా, చురుగ్గా, అందంగా కనిపించింది. పాటల్లో శృంగారం ఒలికించింది. ఆమె పాత్ర పరిధి మరింత పెంచితే బాగుండేదనిపించింది. బైరాగిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఆ పాత్రని పండించాడు. స్పెషల్ ఆఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో భానుచందర్, బ్రహ్మాజీకి తల్లిగా అన్నపూర్ణ నటించారు. చిత్రంలో చెప్పతగ్గవి సంభాషణలు, దర్శకుడి ప్రతిభా. కె.ఎన్.వై. పతంజలి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. పాటల చిత్రీకరణ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. శ్రీనివాస చక్రవర్తి సంగీతం పాటలకంటే బ్యాక్‌గ్రౌండ్‌కి వినిపించిందే బాగుంది. భూపతి సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్. కృష్ణవంశీ టేస్ట్‌కి తగిన పనితనం అతని కెమెరాలో కనిపించింది. సినిమా విజయం సాధించినా, కాకపోయినా 'సిందూరం'ని ఒక సృజనాత్మక దర్శకుడి నుంచి వచ్చిన మంచి చిత్రంగానే చెప్పుకోవాలి.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 19 సెప్టెంబర్ 1997

Monday, June 25, 2012

'దేవుడు చేసిన మనుషులు' పాటల విడుదల


రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించిన పాటలన్నీ అలరిస్తాయని నమ్ముతున్నానీ, సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోవాలనీ ఆకాంక్షించారు.
గేయ రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ "ఇది చాలా మంచి ఆడియో. సింగిల్ కార్డ్ రాశా. 'ఏమి సేతుర సామీ' అనేది నా మనసుకు బాగా నచ్చిన పాట. 'బంపర్ ఆఫర్' తర్వాత రఘు కుంచెతో పనిచేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది వేరే సెటప్‌తో తీసిన సినిమా. కథలేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసిన సినిమా. మొదట ఈ కథని ఇలియానాకి చెప్పా. తను టాక్సీ డ్రైవర్‌గా బాగా చేసింది. రవితేజతో ఇది నాకు ఐదో సినిమా. రవి అంటే నాకు మోజు. హైదరాబాద్‌లో నాకు తగిలిన మొదటి ఫ్రెండు రఘు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బర్తాంతే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ చేసింది'' అని చెప్పారు. ఈ పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాయనీ, జగన్‌తో, రవితో పనిచేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందనీ హీరోయిన్ ఇలియానా చెప్పింది.
రఘు కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్‌గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి'' అని తెలిపారు.
రవితేజ మాట్లాడుతూ "ఈ సినిమాతో రఘు కుమ్మేయబోతున్నాడు. జగన్ నమ్మకమే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది'' అని చెప్పారు. జూలై 27న 'దేవుడు చేసిన మనుషులు'ను విడుదల చేస్తామని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు గుణ్ణం గంగరాజు, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, వీరభద్రం, రిలయెన్స్ ప్రతినిధి మహేశ్ రామనాథన్, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బండ్ల గణేష్, లవ్‌లీ రాజు, సహ నిర్మాత భోగవల్లి బాపినీడు, నటులు ఆలీ, సుబ్బరాజు, తారలు జ్యోతిరాణా, గాబ్రియేలా, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, కల్యాణ్, కళా దర్శకుడు చిన్నా, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, సోనీ మ్యూజిక్ ప్రతినిధులు అశోక్, అశ్విన్, బ్యాంకాక్ బాబీ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, June 13, 2012

రవితేజ కోసమే పుట్టిన 'దరువు'


"ఇది రవితేజ కోసమే పుట్టిన కథ. ఇందులో తను చేసిన సీన్లు ఇప్పటివరకు చేయలేదని రవి అన్నారు'' అని చెప్పారు శివ. రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన 'దరువు'కు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి శివ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
'దరువు' పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్. యువతతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి చేస్తే మంచే జరుగుతుందనే సందేశం వాళ్లని ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలవగానే బాగుందన్నారు. ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి.
ఇదే తొలి చిత్రం
తెలుగులో ఇంతవరకు సోషియో పాంటసీ, సామాజిక అంశాల మేళవింపుతో సినిమా రాలేదు. ఆ తరహాలో ఇదే తొలి చిత్రం. చిరంజీవిగారి 'యముడికి మొగుడు'కీ, 'దరువు'కీ ఇదే తేడా. ఇది అవినీతిపై పోరాడే హీరో కథ. అవినీతిపై పోరాటం అంటేనే మనకు శంకర్ గుర్తుకొస్తారు. అందువల్ల ఈ సినిమాకీ, ఆయన సినిమాలకీ పోలిక రావడం సహజం. కానీ సన్నివేశాల్ని నా శైలిలో చిత్రీకరించా. ఇందులోని 3డి గ్రాఫిక్స్‌ని ప్రైమ్ ఫోకస్ వాళ్లు చాలా బాగా చేశారు.
అలసట ఎరుగని హీరో
ఆయన వద్దకు బౌండ్ స్క్రిప్టుతో వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆయన ఎనర్జీ మనకి కూడా వస్తుంది. ఆయనకు అలసట అనేది ఉండదు. ఈ సినిమా అవగానే వెంటనే మరో సినిమా కలిసి చేద్దామన్నారు రవి. రానున్న రోజుల్లో తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తా.
యాక్టింగ్ కష్టం
నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని ఇందులో చిన్న యముడి కేరక్టర్‌ని నన్నే వెయ్యమన్నారు రవితేజ. కానీ నా వరకు డైరెక్షన్ చేయడమే బెటర్. యాక్టింగ్ చాలా కష్టం. ఆ పాత్రను ప్రభు చాలా బాగా చేశారు. సీనియర్ యుమునిగా నటించిన కైకాల సత్యనారాయణగారు కూడా ప్రభు ఛాయిస్‌ను మెచ్చుకున్నారు. ఆడతనం ఉన్న పాత్ర చెయ్యడం బ్రహ్మానందంకు ఇదే తొలిసారి. అందుకే ఆయన పాత్రకు విద్యాబాలన్ పేరు పెట్టాం. ఆయన తెరమీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ పాత్రకు మంచి డాన్సర్ కావాలి. తాప్సీకి భరతనాట్యం వచ్చు. అందుకే ఆమెని తీసుకున్నాం. ఇప్పటివరకు ఆమె కామెడీ చేయలేదు. ఈ సినిమాలో ఆమె బాగా చేసింది.
మాట నిలబెట్టుకున్నా
తొమ్మిదేళ్ల గ్యాప్‌తో బూరుగుపల్లి శివరామకృష్ణగారు నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాని నేననుకున్న విధంగా తీయడానికి ఆయనిచ్చిన సహకారం మరచిపోలేనిది. సినిమా మొదలుపెట్టేప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేవిధంగా సినిమా ఉండాలనీ, వల్గారిటీ ఉండకూడదనీ చెప్పారు నిర్మాత శివరామకృష్ణగారు. ఆయనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నా. ఆయన బేనర్‌లో గతంలో 'ప్రేమంటే ఇదేరా'కి అసిస్టెంట్ కెమెరామన్‌గా, 'శ్రీరామ్'కు సినిమాటోగ్రాఫర్‌గా, ఇప్పుడు 'దరువు'కు డైరెక్టర్‌గా పనిచేశా. నన్నో కుటుంబ సభ్యునిలా ఆయన చూసుకుంటారు.
అజిత్‌తో సినిమా
తమిళంలో అజిత్ హీరోగా సెప్టెంబర్ నుంచి ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా. ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మించబోతోంది. తర్వాత తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తా.

Sunday, May 27, 2012

హారర్ సినిమాలు ఇష్టం


బాలీవుడ్‌లో వరుసగా రెండు యాక్షన్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రభుదేవా ఇప్పుడు జనాన్ని భయపెట్టే హారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్, ఆయేషా తకియా జంటగా రూపొందించిన 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను దాని తర్వాత అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా 'రౌడీ రాథోర్' ('విక్రమార్కుడు' రీమేక్)ను రూపొందించాడు. కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. "నా కంటే ఎక్కువగా జనం నేను యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ నాకేమో హారర్ సినిమాలు చేయాలంటే ఇష్టం'' అని తెలిపాడు ప్రభుదేవా. దక్షిణాదిలో కానీ బాలీవుడ్‌లో కానీ టీమ్ బాగుండటం ముఖ్యమనీ, టీమ్ బాగుంటే చివరకు ఓ స్పానిష్ సినిమానైనా తీసేయొచ్చనీ అతనంటాడు.
ఒరిజినల్‌లో రవితేజ చేసిన పాత్రకు 'రౌడీ రాథోర్'లో అక్షయ్‌కుమార్ సరిగ్గా సరిపోయాడనేది అతని అభిప్రాయం. "అతనికి టైలర్‌మేడ్ కేరక్టర్ కావడం వల్లే అక్షయ్‌ను ఆ పాత్రకు ఎంచుకున్నా. అతనేవిధంగా చేశాడో తెరపై మీరే చూస్తారు. అతనితో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. అతను దర్శకుడి నటుడు'' అని చెప్పాడు ప్రభుదేవా.

Monday, December 26, 2011

బిగ్ స్టోరీ: సంక్రాంతికి సై

సంక్రాంతికి ఏయే సినిమాలు రానున్నాయో దాదాపు తేలిపోయింది. తెలుగు సినిమాకు సంబంధించి ఓ కేలండర్ సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద సీజన్ సంక్రాంతి అనేది తెలిసిందే. సంక్రాంతికి వారం నుంచి పది రోజుల దాకా బడులకు ఇచ్చే సెలవుల్ని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు భావిస్తుంటారు. పెద్ద సినిమాలు రంగంలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఆ సినిమాల నిర్మాతలు నిరాశ పడటం మామూలే. ఇప్పుడూ అదే స్థితి. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీ అంటుండటంతో చిన్న సినిమాకు చోటెక్కెడ దొరుకుతుంది? పైగా ఈ పెద్ద సినిమాలే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుండటం వల్ల వాటికీ మిగతా సమయాల్లో లభ్యమయ్యే రీతిలో థియేటర్లు దొరకవనేది నిజం. ఫలితంగా వాటి కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపడం తథ్యం. సంక్రాంతి విజేతలుగా నిలవాలనే తపనతో వస్తున్న ఆ నాలుగు సినిమాలు - 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్', 'నిప్పు', 'పూలరంగడు'.
మళ్ళీ కలిశారు 
'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేశ్ హీరోగా వస్తున్న 'బిజినెస్‌మేన్' సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకుడవడం వల్ల కూడా ఈ సినిమా పట్ల ఇటు సినీ వర్గాలవారూ, అటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'బిజినెస్‌మేన్' ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బారులు తీరారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. 'దూకుడు' మీదున్న తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో అన్నిటికంటే ముందుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడు తెలుగులో... 
వెంకటేశ్ హీరోగా నటించిన 'బాడీగార్డ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం - ఇప్పటికే ఈ సినిమా మూడు భాషల్లో జయకేతనం ఎగురవేయడం. మొదట మలయాళంలో (దిలీప్ హీరో), తర్వాత తమిళంలో (విజయ్ హీరో), ఆ పిమ్మట హిందీలో (సల్మాన్‌ఖాన్ హీరో) కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. వాటికంటే తెలుగు వెర్షన్ మరింత బాగా వచ్చిందని శ్రీ సాయిగణేశ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బెల్లకొండ సురేశ్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన వెంక టేశ్ చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇప్పుడే. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేయడం ఇది మూడోసారి. 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ కూర్చిన ఫైట్లు, తమన్ సంగీతం అందించిన పాటలు హైలైట్ అవుతాయంటున్నారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ముగ్గురు మిత్రులు 
ముగ్గురు మిత్రుల సినిమా 'నిప్పు'. కెరీర్ తొలినాళ్లలో చెన్నైలో ఒకే ఇంట్లో ఉండి అవకాశాలు వెతుక్కున్న ఆ ముగ్గురు - గుణశేఖర్, రవితేజ, వైవీఎస్ చౌదరి. రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ నిర్మిస్తున్నారు. ఇలా ఓ అరుదైన కాంబినేషన్‌తో, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ మార్కు వినోదానికి, గుణశేఖర్ శైలి టేకింగ్ తోడైన ఈ సినిమాకి సైతం తమన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఇలా ఒకే సంగీత దర్శకుడు పనిచేసిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడనుండటం అనేది కూడా అరుదైన సందర్భం. జనవరి 13న 'నిప్పు' విడుదలవుతోంది.
నవ్వులు పువ్వులు 
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని, కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ ఇప్పుడు 'పూలరంగడు'గా అవతారమెత్తాడు. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' చిత్రాలతో ఘన విజయాలు సాధించిన ఈ భీమవరం నటుడు తనకంటూ సొంత మార్కెట్‌ని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. అందుకు తగ్గట్లే 'పూలరంగడు' పట్ల బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 'అహ నా పెళ్లంట' ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో దాని సోదర సంస్థ మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జనవరి 5న ఆడియో ఆవిష్కరణ జరగనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా నాయిక. ఒకే సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండటాన్నీ ఈసారి మనం చూడబోతున్నాం.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 26, 2011

Thursday, December 15, 2011

గుణశేఖర్‌కి 'నిప్పు' పరీక్ష!

లాఠీ, సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు... ఈ సినిమాలకీ, గుణశేఖర్‌కీ సంబంధం ఉంది. అది - ఆ సినిమాలకు దర్శకుడు ఆయనే. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే 2003లో వచ్చిన 'ఒక్కడు' తర్వాత ఆయనకు మరో హిట్ లేదని అర్థమైపోతుంది. 
'ఒక్కడు'తో మహేశ్ ఇమేజ్‌ని ఎంతో పెంచిన గుణశేఖర్ అదే హీరోతో 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు తీసి అటు మహేశ్‌ని దెబ్బకొట్టడమే కాకుండా తానూ దెబ్బతిన్నాడు. 'అర్జున్' స్వయంగా మహేశ్ వాళ్ల బేనర్ నిర్మించినదే. దాని కోసం మధుర మీనాక్షి దేవాలయం సెట్‌ని భారీ ఖర్చుతో నిర్మించారు. ఫలితంగా 'అర్జున్' కాస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలింది. ఇక అశ్వనీదత్ నిర్మించిన 'సైనికుడు' డిజాస్టరైంది. దీని కోసం కూడా ఓ సునామీ సెట్‌ని భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించాడు గుణశేఖర్. వీటి తర్వాత పెళ్లి ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నానంటూ అల్లు అర్జున్ హీరోగా అతను రూపొందించిన 'వరుడు' సినిమా సైతం ఘోరంగా ఫెయిలైంది. దీనికి సైతం బిగ్ బడ్జెట్ అయింది. 
ఇలా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదుచేసిన గుణశేఖర్ ఇప్పుడు రవితేజ హీరోగా 'నిప్పు' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దీన్ని బొమ్మరిల్లు బేనర్‌పై వైవీఎస్ చౌదరి నిర్మిస్తుండటం విశేషం. తన మునుపటి సినిమాలకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న గుణశేఖర్ 'నిప్పు'ను మాత్రం యమ స్పీడుగా తీసేస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కూడా బాగా తక్కువని తెలుస్తోంది. అంటే అతడు మారాడని అనుకోవాలి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చౌదరి ప్రకటించాడు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాతో గుణశేఖర్ మునుపటి ఫాంని అందుకుంటాడా? క్రియేటర్‌గా ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టిన అతడి క్రియేటివిటీకి ఇది అగ్ని పరీక్ష. ఇందులో అతను పాసవుతాడా, ఫెయిలవుతాడా అన్నది ఇప్పుడు తేలాలి

Wednesday, October 12, 2011

న్యూస్: అభిమానుల మధ్య రికార్డుల గోల!


మహేశ్ 'దూకుడు' బాక్సాఫీస్ వద్ద యమ దూకుడుతో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'ని అంతకంటే హెచ్చు స్థాయిలో 'ప్రమోట్' చేయడానికి నానా హంగామా జరుగుతోంది. తొలిరోజు 'దూకుడు' రూ. 12 కోట్ల గ్రాస్ సాధించిందని దాని నిర్మాతలు ప్రకటిస్తే, 'ఊసరవెల్లి' ఏకంగా 15 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని దాని నిర్మాత ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులు 'రికార్డుల'పై దృష్టిపెట్టారు. 'దూకుడు'కి మార్నింగ్ షో నుంచే జెన్యూన్‌గా హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే అది సరికొత్త రికార్డులు సాధించే దిశగా వెళ్తుంటే, దాని నిర్మాతలు అది సాధించే రికార్డుల్నే హైలైట్ చేస్తూ రావడం మిగతా హీరోల అభిమానుల్లో పౌరుషాన్ని రగిల్చింది. 'ఊసరవెల్లి' విషయంలో అదే జరుగుతోంది. 'దూకుడు' కంటే తమ హీరో సినిమాయే పెద్ద హిట్టని చెప్పడానికి ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే విడుదలైన రోజే 'ఊసరవెల్లి'కి బ్యాడ్ టాక్ వచ్చింది. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్రని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చూపించిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 'ఊసరవెల్లి' వచ్చాక టాప్ హీరోల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో సురేందర్‌రెడ్డికి తెలీడం లేదనే వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పటివరకు అతను కల్యాణ్‌రాం (అతనొక్కడే), రవితేజ (కిక్)కి మాత్రమే హిట్లివ్వగలిగాడు. ఎన్టీఆర్‌తో చేసిన 'అశోక్', మహేశ్‌తో చేసిన 'అతిథి' ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'ఊసరవెల్లి'తో అదే ట్రెండుని అతను కొనసాగించాడని విమర్శకులు అంటున్నారు. వీకెండ్‌లో బాగానే కలెక్ట్ చేసిన 'ఊసరవెల్లి' అసలు సత్తా సోమవారంతో తేలిపోయింది. చాలా థియేటర్లు సగం కూడా నిండలేదు. మరోవైపు మూడో వారంలో ఉన్న 'దూకుడు'కి సోమవారం కూడా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తమ హీరోల అభివృద్ధిని కాంక్షించే నిజమైన అభిమానులు చేయాల్సింది వాస్తవ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఎదుటి హీరోల సినిమాలు హిట్టయితే మనస్ఫూర్తిగా అభినందించి, తమ వంతు సూపర్‌హిట్ వచ్చేదాకా సంయమనం పాటించడం. 'ఊసరవెల్లి' కాకపోతే 'దమ్ము' ఉంది. అది బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపవచ్చు. అప్పటిదాకా ఓపిక పట్టండి. లేకపోతే ఈ రికార్డుల గోల ముదిరిపోయి, ఏ సినిమా విడుదలైనా మొదట రికార్డులకే ప్రాధాన్యం ఇచ్చి ఊదరగొట్టే ప్రమాదం ఉంది. ఇది అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Monday, October 10, 2011

స్పెషల్ స్టోరీ: రాజమౌళి విజయ దరహాసం!

దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

Friday, September 16, 2011

న్యూస్: నిర్మాతల పాలిట కొంగు బంగారం

కష్టపడి పనిచేసే తత్వం, సాధారణ జీవితం... రవితేజని స్టార్‌ని చేసిన గుణాలు. తన ప్రయారిటీస్ ఏమిటో అతడికి తెలుసు. అందుకు తగ్గట్లుగా కెరీర్‌ని మలచుకోడానికి అతనెంతో కష్టపడ్డాడు. దానికి దక్కిన ఫలమే ఈనాటి అతడి స్టార్‌డం. ఈమధ్య కొంతమంది 'లేట్ లతీఫ్'లు ఇండస్ట్రీలో తయారయ్యారు. సెట్స్ మీదకి ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలైతేగానీ రారు. కానీ రవితేజ మాత్రం పొద్దునే 7 గంటలకు షూటింగంటే అంతకు 5 నిమిషాల ముందే సెట్స్ మీదుంటాడు. ఈమధ్యే అతను శాకాహారిగా మారాడు. "ఈ అలవాటు మార్పు వల్ల నా ప్రవర్తనలోనూ మార్పు రావడం నాకే తెలుస్తోంది. కోపం, చిరాకు తగ్గిపోయాయి. రకరకాల శాకాహార పదార్థాల్లోని రుచిని అనుభవిస్తున్నా" అని చెప్పాడు.
ఓ ఔత్సాహిక దర్శకుణ్ణీ లేదంటే పేరున్న దర్శకుణ్ణీ మీరే హీరోతో చేయాలనుకుంటున్నారు అనడిగితే రవితేజ పేరే చెబుతారు. 'మిరపకాయ్' రిలీజయ్యాక చాలామంది జనం ఆ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని కలిసి రవితేజని పరిచయం చేయాల్సిందిగా పీడించారు. అదీ రవితేజ మాస్ ఇమేజ్. అతని మొత్తం కెరీర్‌ని గమనిస్తే మాస్ జనానికి వినోదాన్నిచ్చే సబ్జెక్టులే ఎంచుకుని, తద్వారా తన మార్కెట్‌ని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వచ్చినట్లు అర్థమవుతుంది. పైగా బడ్జెట్ విషయంలోనూ అతడు ఆర్భాటాలకు ఎన్నడూ పోలేదు. తన మార్కెట్‌కు తగ్గ బడ్జెట్‌లోనే సినిమాలు చేస్తూ నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారాడు.
మిగతా మాస్ హీరోల సినిమాలకీ, అతడి సినిమాలకీ కొట్టొచ్చినట్లు కనిపించే తేడా ఒకటుంది. వాళ్లలోలేని కమెడియన్ రవితేజలో ఉన్నాడు. అందుకే అతడు బ్రహ్మాండమైన వినోదాన్ని ప్రేక్షకులకు పంచివ్వగలుగుతున్నాడు. అంతే కాదు, మిగిలినవాళ్లు ఏడాదికో సినిమా మాత్రమే చేస్తుంటే అతను మాత్రం మూడు సినిమాలకి తగ్గకుండా చేసుకుపోతున్నాడు. అందుకే ప్రతి యేటా హిట్లిస్తున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఏ డైరెక్టరైనా హీరో నుంచి కోరుకునే ఎనర్జీ లెవల్స్ ఉండబట్టే వాళ్లని కూడా ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతున్నాడు 'మాస్ మహారాజా'.

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.

Wednesday, September 7, 2011

న్యూస్: మెహర్ రమేశ్ భలే మాయగాడు!

మాయగాడంటే మెహర్ రమేశే అంటున్నారు ఫిలింనగర్ జనాలు. అతను తీసిన మూడు తెలుగు సినిమాల్లో ఏ ఒక్కటీ హిట్ కాకపోయినా పెద్ద హీరోలతో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అతను రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించిన సంగతి తెలిసిందే. 'పవర్' టైటిల్‌తో రూపొందే ఈ సినిమాకు మళ్ల విజయప్రసాద్ నిర్మాత.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'కంత్రి'తో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేశ్‌కి ఆ సినిమా ఆడకపోయినా ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'బిల్లా'ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులోనే అనుకున్నట్లు ఆడలేదు. అయినా ఏకంగా 40 కోట్ల రూపాయల మెగా బడ్జెట్‌తో సి. అశ్వనీదత్ నిర్మించిన 'శక్తి' సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు. అది ఎన్టీఆర్‌తో రెండో సినిమా. బాక్సాఫీసు వద్ద 'శక్తి' ఎంత ఘోరంగా ఫ్లాపయ్యిందీ తెలిసిందే. ఆ సినిమాని కొన్న బయ్యర్లంతా మట్టికొట్టుకు పోయారు.
మరో డైరెక్టర్‌కైతే అంతటితో కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యేదే. లేదంటే చిన్నా చితకా హీరోల సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే. కానీ మెహర్ రమేశ్ అలాంటి వాడు కాడయ్యే. మాటల్తో ఎలాంటివాళ్లనైనా చిత్తుచేసే కోడి రామకృష్ణ తరహాకి చెందినవాడయ్యే. అందుకే రవితేజతో 'పవర్' సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అతనెంతగా మళ్ల విజయప్రసాద్‌ని నమ్మించాడో ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది."ఈ సినిమాకి వక్కంతం వంశీ అద్భుతమైన కథను అందించారు. రవితేజ పవర్, ఎనర్జీతో పాటు, మెహర్‌ రమేష్ టేకింగ్ స్టయిల్ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. బడ్జెట్ లిమిట్ లేకుండా చాలా లావిష్‌గా, స్టయిలిష్‌గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ 'ఇడియట్-2' తరువాత 2012 మార్చిలో ప్రారంభిస్తాం" అన్నారు విజయప్రసాద్. మెహర్ రమేశ్ మాయ చూసి ఫిలింనగర్ వాసులంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

Thursday, September 1, 2011

ఇంటర్వ్యూ: బూరుగుపల్లి శివరామకృష్ణ

హీరో, డైరెక్టర్ ఒకటై నిర్మాతని వేరు చేస్తున్నారు

"ఇదివరకు నిర్మాత, హీరో ఓ జట్టుగా ఉండేవాళ్లు. ఇప్పుడు హీరో, డైరెక్టర్ ఒక జట్టయి, నిర్మాతని వేరు చేస్తున్నారు. నిర్మాతకి హీరోలు, డైరెక్టర్లు కలిసి రావాలి. ఆ ఇద్దరూ తలచుకుంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది'' అని తేల్చిచెప్పారు నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తనముందున్న లక్ష్యాలతో పాటు చిత్ర నిర్మాణ రంగానికి చెందిన పలు అంశాలపై మంగళవారం తమ స్వగృహంలో చిత్రజ్యోతితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
మేం పనిచేయగలమనే నమ్మకంతోటే మా సోదర నిర్మాతలు మా ప్యానల్‌కు ఘన విజయం చేకూర్చారు. 'వియ్ ఆర్ టుగెదర్' అనే భావాన్ని సభ్యుల్లో తీసుకు రాగలిగాం. మా ప్యానల్‌లో చిన్న, పెద్ద నిర్మాతలున్నారు. నిర్మాతలు ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసికట్టుగా పనిచేయడానికి మా కార్యవర్గం కృషి చేస్తుంది.
నిర్మాత చేతుల్లో లేదు
చిత్రసీమలో సంక్షోభం అనేది నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. నిర్మాణ వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోవడం దీనికి ప్రధాన కారణం. పేరుకి నిర్మాతే ప్రధానం కానీ 'కెప్టెన్ ఆఫ్ ద షిప్' అని అందరూ అంటుండే డైరెక్టర్ చేతుల్లోనే బడ్జెట్ వ్యయం ఆధారపడి ఉంటోంది. నిర్మాత చేతుల్లో ఏమీ ఉండటం లేదు. ఇవాళ 40 నుంచి 50 శాతం సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అవడానికి ఇదే కారణం.
పరిస్థితులు మారాయి
కాస్ట్ ఫెయిల్యూర్స్ సమస్య ఇప్పుడే ఉందని నేను చెప్పను. మొదట్నించీ ఉంది. అప్పట్లో వాటి సంఖ్యతో పోలిస్తే ఇప్పుటి సంఖ్య విపరీతం. డైనమిక్స్ మారడం వల్లే ఈ స్థితి. ఇదివరకు నిర్మాత, హీరో ఓ జట్టుగా ఉండేవాళ్లు. ఇప్పుడు హీరో, డైరెక్టర్ ఒక జట్టయి, నిర్మాతని వేరు చేస్తున్నారు. చాలామంది హీరోలు, దర్శకులకి నిర్మాణంలో ఏమాత్రం జోక్యం చేసుకోని నిర్మాతలే కావాలి. సినిమా నిర్మాణంలో వాళ్ల జోక్యం 100 శాతం ఉంటే, నిర్మాత జోక్యం 10 శాతం ఉంటోంది.
నిజానికి మిగతా రంగాల్లో పెట్టుబడిదారుడు అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. సినీ రంగంలో అది జరగడం లేదు. ఈ పరిస్థితికి విరుగుడు ఒక్కటే. నిర్మాతకి హీరోలు, డైరెక్టర్లు కలిసి రావాలి. ఆ ఇద్దరూ తలచుకుంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది. ఇది వాస్తవం. ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ఆలోచన వాళ్లకి ఉండాలి. నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు కలిసి మాట్లాడుకుని, ఒక మాట మీదుంటేనే ఏవైనా అనుకున్నవి చెయ్యగలం. అలా కాకుండా ఎన్ని ఒన్ సైడెడ్‌గా ఎన్ని రెగ్యులేషన్లు పెట్టుకున్నా ప్రయోజనం లేదు.
ప్రొఫెషనలిజం కావాలి
పబ్లిసిటీ అనేది కేవలం నిర్మాతల చేతుల్లో ఉండటం వల్ల దానిలో మాత్రమే కంట్రోల్ చెయ్యగలుగుతున్నాం. మిగతా వాటిలో మిగతా రంగాల వాళ్ల ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండటం వల్లే అవి చెయ్యలేకపోతున్నాం. అందుకే అందరిలో ప్రొఫెషనలిజం రావాలి. వాస్తవికంగా ఆలోచించాలి. మనలో ఆ ప్రొఫెషనలిజం 100 శాతం కొరవడిందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. జనం థియేటర్లకి వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. బాగా ఉందని టాక్ వస్తేనే వెళ్తున్నారు. ఎందుకంటే టీవీతో పాటు అనేక వినోదాత్మక విశేషాలు వాళ్లకి అందుబాటులో ఉన్నాయి. దీన్ని అందరూ గ్రహించి, నాణ్యత విషయంలో రాజీలేకుండా మంచి సినిమాలు తియ్యాలి.
ఖర్చులోనే పోటీ
హిందీ రంగానికి మార్కెట్ విస్తృతి ఎక్కువ కాబట్టి వాళ్లు భారీగా ఖర్చుపెట్టడంలో అర్థం ఉంది. దక్షిణాదిలో తమిళ సినిమాకీ ఓవర్సీస్ మార్కెట్ ఉంది. అందువల్ల వాళ్లూ ఖర్చు పెట్టగలరు. వాళ్లతో పోలిస్తే తెలుగు సినిమా మార్కెట్ విస్తృతి తక్కువ. అయినా వాళ్లతో ఖర్చు పెట్టడంలో పోటీపడుతున్నాం. కానీ వాళ్లలా క్వాలిటీ సినిమా తీయలేకపోతున్నాం.
10 శాతం మాత్రమే
నిర్మాతలు రెండు రకాలు. అంకితభావంతో, అదే లోకంలో ఉంటూ సినిమా తీసే నిర్మాతలు, వేరే వ్యాపారాలు చేస్తూ, సినిమానీ ఓ చూపు చూద్దాం అనుకుంటూ సినిమా తీసే నిర్మాతలు. ఇవాళ ఇండస్ట్రీలో సినిమా వ్యాపారం తప్ప మరో వ్యాపారం తెలీని నిర్మాతలు 10 శాతం మించి లేరు. నిర్మాతల మండలిలో 928 మంది నిర్మాతలుంటే వాళ్లలో ఒకట్రెండు సినిమాలు తీసి ఆగిపోయినవాళ్లే ఎక్కువ. ఐదు అంతకంటే ఎక్కువ సినిమాలు తీసిన వాళ్ల సంఖ్య తక్కువ. అవగాహన లేకుండా సినిమాలు తియ్యడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికీ, సక్సెస్ రేటు తగ్గడానికీ దోహదం చేస్తోంది.
థియేటర్లు తగ్గిపోతున్నాయి
చిత్ర రంగంలోని నాలుగు సెక్టార్లయిన ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లు అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. లీజుదారుల వల్ల డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ బాగా దెబ్బతింది. ఆ ప్రభావం ఎగ్జిబిటర్ల మీదా పడింది. అందుకే థియేటర్ల సంఖ్య రానూ రానూ తగ్గుతోంది. కాబట్టి ఒకర్నొకరు దోచుకునే స్థితినుంచి బయటపడి, నమ్మకంతో పని చేసుకుపోవాలి. మండలి అధ్యక్షుడిగా అన్ని సెక్టార్లవాళ్లనీ కలిసి ఇండస్ట్రీని రక్షించేందుకు కలిసి రావాలని కోరుతాను.
భేదాలు కరెక్టు కాదు
చిన్నది కానీ, పెద్దది కానీ సినిమా అంటే సినిమానే. ఇందులో చిన్నా, పెద్దా నిర్మాతలంటూ తారతమ్యాలు సృష్టించడం మంచిది కాదు. ఇవాళ పెద్ద సినిమాలు తీస్తున్నవాళ్లంతా ఒకప్పుడు చిన్న సినిమాలు తీసినవాళ్లే. నేను చిన్న సినిమాలతోటే నిర్మాతనయ్యా. ఉండాల్సింది నాణ్యంగా సినిమా ఎలా తియ్యాలనే అవగాహన. నా దృష్టిలో చిన్న, పెద్ద నిర్మాతనే భేదాలు తప్పు.
సమయం, డబ్బు వృథా
అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరుగుతుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తోంది. దాంతో పాటు వేస్టేజి, ఉత్పత్తి సమయం తగ్గుతోంది. కానీ సినీ రంగం ఒక్కటే దానికి మినహాయింపు. ఇక్కడ టెక్నాలజీ పెరుగుతుంటే వేస్టేజి పెరుగుతోంది. పని దినాలు పెరుగుతున్నాయి. అనవసరమైన దానికోసం సమయాన్నీ, డబ్బునీ వృథా చేస్తున్నాం. సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందు ఎవరూ సరైన రీతిలో హోమ్‌వర్క్ చెయ్యడం లేదు. 15 వేల అడుగుల సినిమాకి మూడు నాలుగు లక్షల నెగటివ్ ఖర్చవుతున్నది దీని మూలంగానే. పక్కా స్క్రిప్టు సిద్ధం చేసుకుని, ఆ స్క్రిప్టు ప్రకారమే తీస్తే ఈ వృథాని అరికట్టవచ్చు.
ఇన్ని పన్నులా?
ప్రతి సమస్యకీ పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పడాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వం కూడా ఒకటి కంటే ఎక్కువ పన్నులు వేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌కి తోడు వ్యాట్ వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సేవా పన్ను కూడా కట్టమంటూ నోటీసులు ఇస్తోంది. ఇది బాధాకరం. ఈ బరువంతా ఒక్క నిర్మాతమీదే పడుతోంది.
'డబ్బింగ్' టాక్స్ పెంచాలి
తమిళులకి తమది అనే భావన ఎక్కువ. వాళ్లు తమ భాషనీ, తమ సంస్కృతినీ బాగా అభిమానిస్తారు. సినిమాల్లోనూ ఆ కమిట్‌మెంట్ కనిపిస్తుంది. ఆ విషయంలో మనవాళ్లది వెనకడుగే. మనవాళ్ల డబ్బింగులు తమిళంలో అంతగా ఆడకపోవడానికీ, వాళ్ల డబ్బింగులు ఇక్కడ బాగా ఆడటానికీ అదే కారణమనిస్తుంది. ఎగ్జిబిటర్లను పరిగణనలోకి తీసుకుంటే డబ్బింగ్ సినిమాల్ని పూర్తిగా తీసేయమనడం కరెక్ట్‌కాదు. మన స్టార్ హీరోలు ఏడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే థియేటర్లకు ఫీడింగ్ ఎలా? ఆ గ్యాప్‌ని డబ్బింగ్ సినిమాలు పూరిస్తున్నాయి. కాకపోతే వాటికి టాక్స్ పెంచడం కరెక్టే. దాని కోసం గట్టిగా ప్రయత్నిస్తాం.
శివ సామర్థ్యం తెలుసు
సెప్టెంబర్ నుంచి రవితేజ హీరోగా నేను నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డైరెక్టర్ శివ మా బేనర్‌లో ఇదివరకు సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. అతని సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. అందుకే అతని డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నా. 'శ్రీరామ్' తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇదే. ఆ సినిమాకి కూడా శివ పనిచేశాడు. వచ్చే ఏడాది మార్చికి మా కొత్త సినిమా రిలీజవుతుంది. 

Thursday, August 25, 2011

న్యూస్: 'శంఖం' దర్శకుడితో రవితేజ కొత్త సినిమా!

రవితేజ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఇదివరకు గోపీచంద్ హీరోగా 'శౌర్యం', 'శంఖం' సినిమాల్ని రూపొందించిన సినిమాటోగ్రాఫర్ శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న లాంఛనంగా మొదలైంది. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ "శివ సెన్సిబుల్ డైరెక్టర్. అతనికి మాస్ పల్స్ బాగా తెలుసు. అతను చెప్పిన కథ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది" అని చెబితే, "రవితేజ ఇప్పటివరకు చెయ్యని కేరక్టర్ ఇది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది" అని శివ తెలిపాడు. ఇంకా హీరోయిన్‌ని ఎంపికచేయని ఈ సినిమాకి ఇద్దరు తమిళ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఒకరు సంగీత దర్శకుడు విజయ్ ఆంథోని, మరొకరు సినిమాటోగ్రాఫర్ వెట్రి. ఇంకో చెప్పుకోదగ్గ సంగతేమంటే సీనియర్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తుండటం.
డైరెక్టర్ శివకి మాస్ పల్స్ బాగా తెలుసని రవితేజ అన్నాడు కానీ 'శంఖం' సినిమా చూసినవాళ్లు మాత్రం ఆ మాటలతో ఏకీభవించరు. నిజానికి అది క్రేజీ కాంబినేషన్‌తో తయారైన సినిమా. అదివరకు విలన్, హీరోయిన్‌గా 'వర్షం'లో నటించిన గోపీచంద్, త్రిష ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించడంతో విడుదలకి ముందు దానికి ఎంతో క్రేజ్ వచ్చింది. కానీ సినిమా చూశాక జనం ఉసూరుమన్నారు. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడి వాసన వేయడం, చాలా సీన్లు బోర్ కొట్టించడంతో 'శంఖం'ని వారు తిరస్కరించారు. దాంతో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భారీగా నష్టపోయారు. దానికి ఓవర్ బడ్జెట్ అవడం కూడా ప్రధాన కారణం. ఇప్పుడు రవితేజ సినిమాకి అతను ఖర్చుపెట్టించే దానిపైనే దాని విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాకపోతే రవితేజ అంటే మినిమం గ్యారంటీ హీరో కాబట్టి ఆ మేరకు నిర్మాతకి ఒకింత లాభం కలగవచ్చు.

Wednesday, August 24, 2011

న్యూస్: ఈ సారైనా ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ హిట్ కొట్టేనా?

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందబోతోంది. ఈ కాంబినేషన్‌లో తయారయ్యే రెండో సినిమాని బండ్ల గణేశ్ నిర్మించనున్నాడు. ఈ బండ్ల గణేశ్ మరెవరో కాదు. ఇదివరకు రవితేజతో 'ఆంజనేయులు', పవన్ కల్యాణ్‌తో 'తీన్‌మార్' నిర్మించిన హాస్యనటుడు గణేశ్‌బాబు. మనవాళ్లకి న్యూమరాలజీ అంటే పిచ్చి కాబట్టి, ఆ రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిపేరుని తెరపేరుగా వాడుతున్నాడు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మాణమయ్యే ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్లో మొదలు కానున్నది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని సహజంగానే జగన్నాథ్ అందించనున్నాడు. "జగన్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చెయ్యాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులు, అభిమానులు, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది. జగన్, నేను కలిసి పనిచేస్తున్నామంటే అంచనాలు భారీగానే ఉంటాయి" అని చెప్పాడు ఎన్టీఆర్.
నిజమే. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరై ఆ సినిమా నిర్మాత గిరికి పీడకలగా పరిణమించిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా దెబ్బతో గిరి తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. 20 యేళ్ల వయసులో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఆ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. అంతేనా.. తండ్రి పాత్రకి జోడీగా అప్పటికే ముదురు తార అయిన సంఘవి చేయడం ఇంకా ఎబ్బెట్టు అనిపించింది ప్రేక్షకులకి. అందుకే ఆ సినిమాని మరో ఆలోచనకు తావులేకుండా తిరస్కరించారు. మిస్ కేస్టింగ్ అనేది ఓ మోస్తరు సినిమాని ఎలా ఘోరమైన సినిమాగా మారుస్తుందో 'ఆంధ్రావాలా' చక్కని ఉదాహరణ. చాలా సన్నిహితులైన ఎన్టీఆర్, జగన్నాథ్ కాంబినేషన్ రెండో సినిమాకి ఎనిమిదేళ్లు పట్టిందంటే ఆ సినిమా అనుభవమే కారణం. వచ్చే యేడాది రూపొందే ఈ రెండో సినిమా అయినా ఆ పీడకలని మర్చిపోయేలా చేస్తుందా?