Wednesday, October 12, 2011
న్యూస్: అభిమానుల మధ్య రికార్డుల గోల!
మహేశ్ 'దూకుడు' బాక్సాఫీస్ వద్ద యమ దూకుడుతో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'ని అంతకంటే హెచ్చు స్థాయిలో 'ప్రమోట్' చేయడానికి నానా హంగామా జరుగుతోంది. తొలిరోజు 'దూకుడు' రూ. 12 కోట్ల గ్రాస్ సాధించిందని దాని నిర్మాతలు ప్రకటిస్తే, 'ఊసరవెల్లి' ఏకంగా 15 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని దాని నిర్మాత ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులు 'రికార్డుల'పై దృష్టిపెట్టారు. 'దూకుడు'కి మార్నింగ్ షో నుంచే జెన్యూన్‌గా హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే అది సరికొత్త రికార్డులు సాధించే దిశగా వెళ్తుంటే, దాని నిర్మాతలు అది సాధించే రికార్డుల్నే హైలైట్ చేస్తూ రావడం మిగతా హీరోల అభిమానుల్లో పౌరుషాన్ని రగిల్చింది. 'ఊసరవెల్లి' విషయంలో అదే జరుగుతోంది. 'దూకుడు' కంటే తమ హీరో సినిమాయే పెద్ద హిట్టని చెప్పడానికి ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే విడుదలైన రోజే 'ఊసరవెల్లి'కి బ్యాడ్ టాక్ వచ్చింది. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్రని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చూపించిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 'ఊసరవెల్లి' వచ్చాక టాప్ హీరోల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో సురేందర్‌రెడ్డికి తెలీడం లేదనే వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పటివరకు అతను కల్యాణ్‌రాం (అతనొక్కడే), రవితేజ (కిక్)కి మాత్రమే హిట్లివ్వగలిగాడు. ఎన్టీఆర్‌తో చేసిన 'అశోక్', మహేశ్‌తో చేసిన 'అతిథి' ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'ఊసరవెల్లి'తో అదే ట్రెండుని అతను కొనసాగించాడని విమర్శకులు అంటున్నారు. వీకెండ్‌లో బాగానే కలెక్ట్ చేసిన 'ఊసరవెల్లి' అసలు సత్తా సోమవారంతో తేలిపోయింది. చాలా థియేటర్లు సగం కూడా నిండలేదు. మరోవైపు మూడో వారంలో ఉన్న 'దూకుడు'కి సోమవారం కూడా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తమ హీరోల అభివృద్ధిని కాంక్షించే నిజమైన అభిమానులు చేయాల్సింది వాస్తవ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఎదుటి హీరోల సినిమాలు హిట్టయితే మనస్ఫూర్తిగా అభినందించి, తమ వంతు సూపర్‌హిట్ వచ్చేదాకా సంయమనం పాటించడం. 'ఊసరవెల్లి' కాకపోతే 'దమ్ము' ఉంది. అది బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపవచ్చు. అప్పటిదాకా ఓపిక పట్టండి. లేకపోతే ఈ రికార్డుల గోల ముదిరిపోయి, ఏ సినిమా విడుదలైనా మొదట రికార్డులకే ప్రాధాన్యం ఇచ్చి ఊదరగొట్టే ప్రమాదం ఉంది. ఇది అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment