Showing posts with label chiranjeevi. Show all posts
Showing posts with label chiranjeevi. Show all posts
Thursday, November 3, 2016
Saturday, January 2, 2016
Synopsis of the movie CHIRANJEEVI (1969)
'చిరంజీవి' (1969) చిత్ర కథాంశం
బాలకృష్ణ నర్సింగ్ హోంలో 7వ నెంబర్ వార్డులోని ముగ్గురు రోగులు - సత్యం (చలం), మధు (రామకృష్ణ), వెంకటప్పయ్య (అల్లు రామలింగయ్య). సత్యం అనాథ. ఊపిరితిత్తుల వ్యాధితో బతికేది కొద్ది రోజులే అయినా అది తెలియక అందర్నీ నవ్విస్తూ, కవ్విస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. మధు పేరుపొందిన ఫుట్‌బాల్ ఛాంపియన్. ప్రపంచ ఖ్యాతి వచ్చిందని సంబరపడేంతలోనే కాలు విరిగి తన భవిష్యత్ అంధకారబంధురమైందని బాధపడుతుంటాడు. ఇక వెంకటప్పయ్యకు కడుపులో పుండు. డాక్టర్‌కు తెలీకుండా దొరికిన ప్రతిదీ తింటుండే మూర్ఖుడు.మృత్యువు సమీపంలో ఉన్న సత్యం డాక్టర్ ఇందిరాదేవి (సావిత్రి), మధు మధ్య ప్రేమను కలిగిస్తాడు. తనకు మందు ఇచ్చే నర్సు స్టెల్లా (మీనాకుమారి)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. రోగుల్ని కన్నతండ్రిగా చూసే డాక్టర్ బాలకృష్ణ (ప్రభాకరరెడ్డి)నీ, ఇందిరాదేవినీ అవసరమున్నా లేకపోయినా మాటిమాటికీ కంగారుపెడుతుంటాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకననే నిజం డాక్టర్ నోట రహస్యంగా విన్న సత్యం జీవితంలో నిజమైన బాధను తొలిసారి అనుభవిస్తాడు. జీవితం అంటే ఏమితో తొలిసారిగా అప్పుడే అర్థమవుతుంది. చనిపోయేలోగా తానూ ఒక మంచిపని చేసి చనిపోవాలనుకుంటాడు. ఆ మంచిపని మధు, ఇందిర పెళ్లనేది అతని అభిప్రాయం.
సత్యం జీవితం ముగిసిపోయే క్షణం రానే వచ్చింది. డాక్టర్ కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఇదీ వేళాకోళానికేనని భావించిన ఇందిర నిర్లక్ష్యం చేస్తుంది. చివరకు పెద్ద డాక్టర్ వచ్చినా ఫలితం ఉండదు. మధు చేతిలో సత్యం కన్ను మూస్తాడు. చనిపోయే ముందు డాక్టర్ బాలకృష్ణ మనసు మార్చి ఆయన కూతురు ఇందిరను కుంటివాడైన మధుకు ఇవ్వడానికి ఒప్పిస్తాడు. ఇదివరకు తండ్రి వ్యతిరేకించా మధు ప్రేమ కోసమే విదేశాల్లో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పిన ఇందిర, ఇప్పుడు సత్యం మరణంతో మనసు మార్చుకుంటుంది. విదేశాలకు వెళ్లి కేన్సర్ స్పెషలిస్టయి సత్యంలాంటి అభాగ్యుల్ని చిరంజీవులను చేయాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మనసారా అభినందిస్తాడు మధు. తన యావదాస్తినీ ఆమె ఆస్పత్రికి దానం చేస్తానని మాటిస్తాడు.
తారాగణం: సావిత్రి, ప్రభాకరరెడ్డి, చలం, రామకృష్ణ, అల్లు రామలింగయ్య, మీనాకుమారి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాత: ఎ.కె. వేలన్
దర్శకురాలు: సావిత్రి
Saturday, December 5, 2015
Can STAR save the movie?
'సినిమా' చూపిస్తున్నారు!
జీవనం కోసం పగలంతా కష్టపడి అలసినవాళ్లకు కొద్దిసేపైనా విశ్రాంతీ, వినోదం అవసరం. అందువల్లే వినోదాన్నిచ్చే సినిమాలు, టీవీ జన జీవనంలో ప్రాధాన్యం ఏర్పరచుకున్నాయి. నిజానికి ఇవాళ సినిమాకు పరమావధి వినోదమే. నిత్య జీవితంలో మనం పడ్డ శ్రమనూ, కష్టాన్నీ మరిపించి సినిమాలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. అందుకని మంచికో, చెడుకో ఈ సినీ పరిశ్రమ ఏర్పడిన నాటినుంచీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఇవాళున్న స్థాయికి చేరింది. హాలీవుడ్‌లో తయారయ్యే సినిమాల్లో ఎక్కువ అశ్లీలత, హింస కనిపిస్తాయి. యువత మనసుల్లో అవి విష ఫలితాల్ని కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో సామాజిక సంస్థలు, మహిళా సంఘాలూ కొన్నేళ్ల క్రితం వాటిని మన ప్రాంతంలో నిషేధించాలని ఆందోళనలు కూడా చేశాయి. కానీ ఇవాళ ఇంటర్నెట్ కారణంగా మితిమీరిన అశ్లీలత అందుబాటులోకి రావడంతో సినిమాల్లోని అసభ్యత, అశ్లీలత, హింస గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేటి మన సినిమాల్ని గమనిస్తే హాస్యం పేరుతో ఎంత అసభ్యత చలామణీ అవుతుందో అర్థమవుతుంది. అశ్లీలంగా, అభ్యంతరకరంగా తోచిన సన్నివేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి ఏర్పాటుచేసిన సెన్సార్ బోర్డులు ఆ పనిని చేయకుండా 'చూసీచూడనట్లు' పోతుండటంతో అలాంటి సన్నివేశాలు మన సినిమాల్లో సాధారణ విషయం కింద తయారయ్యాయి.
హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాల్లోని సెక్స్ సన్నివేశాల్నీ, అర్ధనగ్నత్వాల్నీ మనవాళ్లు గుడ్డిగా.. కాదు కాదు.. యథేచ్ఛగా అనుకరిస్తున్నారు. ఇవి మనదేశ పునర్నిర్మాణానికి గానీ, సంస్కృతీ వికాసానికి గానీ ఏమాత్రం తోడ్పడవు. కొన్నేళ్లుగా తెలుగులో కానీ, హిందీలో కానీ తయారవుతున్న చిత్రాల్లో చాలావరకు విదేశీ సినిమాల అనుకరణే అని చెప్పాలి. అందుకే వాటిలో నేటివిటీ అనేది కనిపించడం లేదు. కథా విశిష్టత మచ్చుకైనా కానరావడం లేదు. ఈ విషయంలో మన పొరుగున ఉన్న తమిళ సినిమా చాలా బెటర్ అని చెప్పాలి. వాళ్లు నేటివిటీతో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అక్కణ్ణించి తెలుగులో అనువాదమై వస్తున్న సినిమాలు చెబుతున్నాయి.
తెలుగు సినిమా ప్రారంభ సంవత్సరాల్లోనే గూడవల్లి రామబ్రహ్మం వంటి దర్శకుల నుంచే చక్కని చిత్రాలు, ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే సినిమాలు తీయడం మొదలైంది. అవి ప్రేక్షకుల్లో చక్కని ఆలోచనలను రేకెత్తించేవి. వాళ్ల అభిరుచి మెరుగుపడేందుకు దోహదం చేసేవి. సామాజిక దురన్యాయాల్ని అరికట్టాలనే ఆవేశాన్ని రగిలించేవి. భూస్వాముల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, వరకట్న నిర్మూలనం, ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, అవినీతి అధికార్ల దాష్టీకాల్ని ప్రశ్నించడం, కింది కులాలవారిపై అగ్రవర్ణాల పీడనను నిలదీయడం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, ఊరిని బాగుచేసుకోవడం.. ఇలా ఎన్నెన్నో అంశాలతో సినిమాలు వచ్చాయి. ఇవి ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే, మరోవైపు మానసిక వికాసాన్నీ కలిగించేవి.
కొంతకాలం చిత్ర పరిశ్రమ అభివృద్ధి మార్గంలోనే ఉంది కానీ, దురదృష్టవశాత్తూ జానపద, పౌరాణిక సినిమాల ధాటికి సామాజిక చిత్రాలు వెనకపడిపోయాయి. ఫలితంగా పరిశ్రమ ఆత్మే నాశనమయ్యే స్థిది దాపురించింది. వ్యాపారాలతో అకస్మాత్తుగా డబ్బు సంపాదించిన నయా సంపన్న వర్గం మరింత డబ్బు, పేరు సంపాదించాలనీ, తళుకుబెళుకు తారల మధ్య తారట్లాడాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. అవినీతి సంపాదన కావడం వల్ల ఇష్టమొచ్చినంత డబ్బుపెట్టి సినిమాలు నిర్మిస్తూ వాళ్ల కులాసా కొద్దీ తారలకు భారీ పారితోషికాలిస్తూ వచ్చారు. ఈ నిర్మాతలకు కళాదృష్టి కానీ, సంస్కృతిపట్ల గౌరవం కానీ లేకపోవడంతో శృంగార, అశ్లీల, హింసాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపారు. వాళ్లు ఒకే రకమైన సినిమాలు తీయడం ప్రారంభించారు. నేటికీ ఆ రకం సినిమాలే తయారవుతున్నాయి.
మొదట్లో నిర్మాతల అధీనంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉండేవాళ్లు తారలు. అయితే వాళ్లలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ బయలుదేరి, 'కాల్షీట్ల' పద్ధతిలో ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఒప్పుకోవడం మొదలుపెట్టారు. తాము అంత శ్రమ పడగలమో, లేదో కూడా ఆలోచించలేని విధంగా వాళ్ల ఆశలు మితిమీరిపోయాయి. ఫలితంగా సినిమా బడ్జెట్ నిర్మాత అదుపులో లేకుండా పోయింది. షూటింగ్‌కు అయ్యే ఖర్చు కంటే తారల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే నిర్మాత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన దరిద్రపు స్థితి వచ్చింది. మరోవైపు టెలివిజన్ రాకతో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. నూటికి పది సినిమాలు మాత్రమే గట్టెక్కే రోజులు వచ్చాయి. దీంతో అసలు చిత్ర పరిశ్రమ నిలుస్తుందా, లేదా అని అసలు సిసలు సినిమా ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తారల్లో మచ్చుకి వెతికినా సహకారమనేది కనిపించడం లేదు. వాళ్లు పూర్వం మాదిరిగానే కోట్లు కావాలని కూర్చుంటున్నారు. వాళ్లడిగిన డబ్బు ఇవ్వడమే కాదు, వాళ్లు సెట్స్‌పైకి ఎప్పుడొచ్చినా.. అదేమని అడగకూడదు. వాళ్లు వచ్చిందే భాగ్యమన్నట్లు అప్పుడే సీన్లు తీసుకోవాలి.
వాళ్లు ఇలాంటి ప్రవర్తనతో తమనెంతంగా బాధపెడ్తున్నా, నిర్మాతలు జీ హుజూర్ అంటున్నారు. చిత్రమేమంటే ఈ బడా తారలు నటిస్తున్న చిత్రాల్లో చాలా భాగం భారీ పరాజయాలు మూటగట్టుకుంటున్నాయి. నిజానికి ఇవాళ చిన్న తారలు నటిస్తున్న సినిమాలే నిర్మాతకు మనశ్శాంతినిస్తున్నాయి. అయినా పెద్ద తారల విలువ తగ్గడం లేదు. వాళ్లపై మోజు అంతకంతకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. స్టార్ సిస్టంను ఈ నిర్మాతలే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. వీళ్లే భారీ పారితోషికాలిచ్చి మరీ ముంబాయి, ఇతర భాషా చిత్రాల నాయికలను, నటులను బుక్ చేస్తున్నారు. దానితో తెలుగు కళాకారులు చికాకు ప్రదర్శిస్తున్న సందర్భాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అప్పనంగా వచ్చిపడుతున్న డబ్బు కారణంగా ఇతర భాషల నటులు తమ సొంత భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాలంటేనే మోజుపడే స్థితికి వచ్చారు.
ఇంత జరుగుతున్నా, పెద్ద తారల సినిమాలకు పరాజయం తప్పడం లేదు. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనీ, స్టార్ వాల్యూలో ఏమీ లేదనీ తెలుసుకోడానికి ఆ హీరోలు నిరాకరిస్తున్నారు. 'బ్రూస్‌లీ' సినిమాని ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాంచరణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఓ స్టార్ హీరో, ఓ స్టార్ డైరెక్టర్ కలిస్తే ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందనీ, కాసుల వర్షం కురుస్తుందనీ బయ్యర్లు ఆశించారు. జరిగింది అందుకు భిన్నం. గమనించాల్సిన విషయమేమంటే ఈ సినిమాకు మరింత స్టార్ వాల్యూ తీసుకు రావాలనే ఉద్దేశంతో చిరంజీవి కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఓ ఫైట్ చేశారు. అయినా సినిమాని చిరంజీవి స్టార్ వాల్యూ ఏమాత్రం కాపాడలేకపోయింది. ఫలితంగా బయ్యర్లు భారీ నష్టాలకు లోనయ్యారు. ఇదివరకు ఇదే శ్రీను వైట్ల, మరో సూపర్‌స్టార్ మహేశ్‌తో చేసిన 'ఆగడు' సినిమా సైతం ఘోరంగా ఫ్లాపయింది. అందుచేత నిర్మాతలు పెద్ద హీరోల కాళ్లు పట్టుకొని వేళ్లాడే కంటే, తమ దృష్టిని ఎక్కువగా కథపైనా, నిర్మాణ విలువలపైనా పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.
సినిమా నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకుండా కొంతమంది వ్యాపారులు అందులోకి దిగి అనవసరంగా డబ్బును నాశనం చేస్తున్నారు. చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబుల్లో మురిగిపోతుండటానికి వాళ్ల అజ్ఞానమే కారణం. వీటిపై వందల కోట్ల రూపాయలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితికి డిస్ట్రిబ్యూటర్లు, డబ్బు పెట్టుబడిదార్లు కూడా కారణమే. నిజాయితీ ఉన్న నిర్మాతలకు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడి, మోసగాళ్లను మేపడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అందుకే చిత్ర పరిశ్రమ నిరంతర ఒడిదుడుకులతో సతమతమవుతూ సాంకేతికంగా పురోగమిస్తున్నదే కానీ, నిర్మాతల్లో ఎక్కువ శాతం మందికి ఖేదాన్ని కలిగిస్తూ కుంటి నడకతో సాగుతూ ఉంది.
Thursday, October 22, 2015
Friday, October 16, 2015
Tuesday, October 13, 2015
Monday, October 5, 2015
Friday, April 10, 2015
Saturday, December 20, 2014
Tuesday, September 30, 2014
Friday, September 26, 2014
Thursday, July 10, 2014
Wednesday, June 18, 2014
Saturday, April 26, 2014
Telugu Cinema After Independence
1947 తర్వాత తెలుగు సినిమా
ఈ శతాబ్దంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మాధ్యమంగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ యాభైయ్యేళ్ల తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలిస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికొచ్చేది నిర్మాణమవుతున్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతి యేటా తెలుగులో సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అసలు ఉండటం లేదు. అయితే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బి.ఎన్. రెడ్డి, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు వంటి మహానటులూ, రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లూ, కాంచనమాల, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి మహా నటీమణులూ, గూడవల్లి రామబ్రహ్మం, సి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్ వంటి దిగ్దర్శకులూ మనకి లభించారు.
మొదట్లో - అంటే ఆరవ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు బహు తక్కువ. గూడవల్లి రామబ్రహ్మం తీసిన 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటివి అందుకు మినహాయింపు. అయితే 'దేవదాసు', 'పాతాళభైరవి', 'మాయాబజార్', 'మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ చిత్రాలు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర కథానాయకులుగా నిలిచారు. నటీమణుల్లో భానుమతి, సావిత్రి అగ్ర స్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించిన భానుమతి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు. 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళ భైరవి' బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన సామాజిక ప్రయోజనాత్మక చిత్రం 'రోజులు మారాయి' అఖండ విజయం సాధించి ఆ తరహా సినిమాలకు తలమానికంగా నిలిచింది.
స్వాతంత్ర్యానికి పూర్వం వ్యాపారాత్మక దృష్టితో తీసిన సినిమాలు మనకు కనిపించవు. 1950లో వచ్చిన విజయా వారి సినిమా 'షావుకారు'తో ఈ వ్యాపార పోకడలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో నటిగా పరిచయమైన జానకి, దానితోటే 'షావుకారు జానకి'గా మారిపోయారు. 1963లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అప్పట్లో టిక్కెట్ ధరలు 25 పైసలు నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో ఈ సినిమా ఒక కోటి రూపాయలు వసూలు చేసి, ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం పొందింది. ఇదే ఏడాది రూపొందిన 'నర్తనశాల' అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మొదటి తెలుగు చిత్రంగా పేరు తెచ్చుకుంది. జకార్తాలో జరిగి ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాలో కీచకునిగా ఎస్వీ రంగారావు చూపించిన అభినయం ఆ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుల్ని అమితంగా ఆకట్టుకుంది. అలా ఒక అంతర్జాతీయ సినిమా వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఎస్వీఆర్.
తొలి సాంఘిక వర్ణ చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. అదివరకు 'పదండి ముందుకు'లో చిన్న పాత్రలో కనిపించిన కృష్ణ హీరోగా పరిచయమయ్యింది దానితోటే. అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలు రాజ్యం చేస్తూ ఉంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారత చలన చిత్రసీమలోనే తొలి జేమ్స్‌బాండ్ తరహా సినిమాగా రికార్డులకెక్కింది. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి వెలువడటం మరో విశేషం. ఆ తర్వాత కాలంలో ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు సమాన ఆదరణ పొందుతూ వచ్చాయి. ఏడవ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమా ప్రభావం తెలుగు సీమకీ సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు తీయడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువుల కింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' (1972), 'చలిచీమలు' (1978) వంటి అభ్యుదయ చిత్రాలూ, 'తూర్పు వెళ్లే రైలు' (1979), 'నీడ' (1979) వంటి ప్రయోగాత్మక చిత్రాలూ కొన్ని వచ్చాయి. మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' (1971) వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్రే. ఇందులో హీరోగా నటించిన కృష్ణ 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ పతాకంపై 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని నిర్మించి ఆ పాత్రలో తానే నటించించాడు. ఇది తెలుగులో పూర్తిస్థాయి తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక చిత్రాలు వచ్చాయి. ఎన్టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి మూడు పాత్రల్లో (కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దాన వీర శూర కర్ణ' (1977) కలెక్షన్ల వర్షంలో తడిసింది. కేవలం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. కోటి వసూలు చేసిందంటే ఈ చిత్రానిది ఏ స్థాయి విజయమో గ్రహించవచ్చు. మహా భారతంలో దుష్ట పాత్రలుగా చిత్రీకరణకు గురైన కర్ణ, దుర్యోధన పాత్రలను కొత్త కోణంలో చూపించి, ఆ పాత్రలకి హీరో ఇమేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా ఎన్టీఆర్‌దే.
ఇక ఎనిమిదో దశకంలో తెలుగు సినిమా పూర్తిగా వాణిజ్యమయమై పోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ. బూతు మాటలు, శృంగార సన్నివేశాలు ఉన్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సు అనేది సినిమాకి తప్పనిసరి అంశమైంది.
ఏడవ దశకం ద్వితీయార్ధంలో నటుడిగా రంగ ప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకుంటున్న సమయంలో 'ఖైదీ' (1983) అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ సినిమాల్లో 'ఖైదీ' సరికొత్త ధోరణికి తెరతీసింది. హీరోల పరంగా నృత్యాలకు అక్కినేని ఆద్యుడైనా, వాటికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది చిరంజీవి వల్లనే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తుంటే, మరోవైపు కొద్ది సంఖ్యలోనైనా కళాత్మక విలువలున్న సినిమాలు వచ్చాయి. కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' (1980) తెలుగు చిత్రసీమకి ఏనాటికైనా గర్వంగా చెప్పుకోదగ్గ కళాఖండంగా చరిత్రలో నిలిచింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ సినిమాలో ఒక సదాచార బ్రాహ్మణ సంగీత విద్వాంసునికీ, ఒక కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీకీ మధ్య అమలిన అనుబంధాన్ని విశ్వనాథ్ చూపించిన తీరు దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కినేనితో దాసరి నారాయణరావు తీసిన 'మేఘసందేశం' (1982) కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే 'యువతరం కదిలింది' (1980), 'ఎర్రమల్లెలు' (1981), 'విప్లవ శంఖం' (1982) వంటి విప్లవ కథాంశ చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' అనే ఆరు చిత్రాలే తీసినా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
ఎన్టీఆర్ వారసునిగా అంతకుముందే హీరోగా బాలకృష్ణ ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్, అగ్ర నిర్మాతల్లో రామానాయుడి కుమారుడు వెంకటేశ్, వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు హీరోలుగా అడుగుపెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో తనపేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో మొదటి 70 ఎం.ఎం. సినిమా 'సింహాసనం' (1986) కూడా ఈ దశకంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్త రక్తం మొదలైంది. ఎంతోమంది నవ యువ దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించడంతో పాత తరం దర్శకులు చాలమంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఆ సినిమా యువతపై చేదు ప్రభావాన్ని కలిగించిందనే విమర్శలు ఉన్నాయి. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక కథలతో సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యం హెచ్చింది. టెక్నికల్ అంశాలపై శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడా వాతావరణం మచ్చుకి కూడా కనిపించదు. ఎనిమిదో దశకం నుంచే హీరోనిబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ అదే స్థితి. గతంలో సినిమా ఫెయిల్యూర్ అయితే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటుల మీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామన్నది నిజం. మన పొరుగునే ఉన్న మలయాళ సినిమాలు దేశంలో అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమిళంలోనూ ఇటీవలి కాలంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమానే దుస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల 'పెళ్లి' నేపథ్యంలో వచ్చిన ఓ సినిమా మంచి హిట్టవడంతో అదే మూసలో చిత్రాలు వస్తున్నాయి. ఒక విప్లవ కథాచిత్రం బాగా ఆడితే అదే తరహా చిత్రాల్ని తీస్తున్నారు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవడం తప్ప వాటితో చిత్రాలు తీసేవారికి చిత్తశుద్ధి ఉందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న చిత్రాల్లో మానవతా విలువలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా చలామణీ అవడం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలతో పోలిస్తే పురుషాధిక్యం ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ తీసికట్టుగా తయారైంది. వ్యాంప్ కేరక్టర్ల అవసరం లేకుండా హీరోయిన్లతోనే వ్యాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు దర్శకులు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థం కాదు. అట్లాంటి సన్నివేశాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! మన అభిరుచి స్థాయి అలా ఉంది మరి. వీటినే ఆశీర్వచనాలుగా నమ్ముతున్న నిర్మాతలు అట్లాంటి చిత్రాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్ని ఇస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చిత్రించడం, ఎంత ఏడ్పించినా ఏమీ అనని హీరోయిన్లనీ, భర్త ఎంత హింసించినా సహించే భార్యల్నీ మంచివాళ్లుగా చిత్రిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోలేదు. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవిక అంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెలుగు చిత్ర రంగాన్ని మార్పుకు గురిచేస్తోంది. ఈ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సమయంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాకుండా ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి ఉంది. అప్పుడే విమర్శకి నిల్చే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది.

- స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా
ఆంధ్రభూమి 'వెన్నెల' 15 ఆగస్ట్ 1997
Tuesday, December 3, 2013
Wednesday, February 20, 2013
సినిమాపై పన్ను పడుతోంది
మూలిగే నక్క మీద తాటికాయ పడటమంటే ఇదే. అసలే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయి, విజయాల శాతం కనిష్టస్థాయికి పడిపోయి, ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల నష్టాల్ని చవిచూస్తూ వస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు పన్నుల దాడితో మరింత ఉక్కిరిబిక్కిరవుతోంది. పరిశ్రమలో 24 శాఖల వారు పనిచేస్తున్నా, ఈ పన్నుల బెడదను అంతిమంగా ఎదుర్కోబోతున్నదీ, దాని దెబ్బ రుచి చూడబోతున్నదీ పెట్టుబడిదారుడైన నిర్మాతే. దీంతో మునుముందు సినీ నిర్మాణం మరింత క్లిష్టం కాబోతున్నదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినోదపు పన్ను కడుతోంది చిత్ర పరిశ్రమ. ఇది థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడి ద్వారా వసూలవుతోంది. సరాసరిన చూసుకుంటే రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నుంచి ఏడాదికి రూ. కోటి చొప్పున ప్రభుత్వానికి జమవుతోంది. అలాగే సినిమా తీయడానికి ఉపయోగించే ఫిల్మ్ నెగటివ్, పాజిటివ్ మీద ఎక్సయిజ్ డ్యూటీ చెల్లిస్తోంది పరిశ్రమ. సాధారణంగా ఇప్పటికే ఒక పన్ను కడుతున్న వస్తువు మీద ఇతర పన్నులు వేయరు. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మరో రెండు పన్నులు దాడి చేశాయి. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) కాగా, మరొకటేమో కేంద్ర ప్రభుత్వం వేసిన సేవా పన్ను.
నిర్మాత ఓ సినిమాని ఎవరికైనా అమ్మితే, అమ్మిన రేటు మీద 14.5 శాతం వ్యాట్ కట్టమని రాష్ట్రం ఆదేశిస్తే, సినిమాకి పనిచేసే, సంవత్సరాదాయం పది లక్షలు దాటే ప్రతి వ్యక్తీ 12.36 శాతం సేవా పన్ను (సర్వీస్ టాక్స్) కట్టమని కేంద్రం హుకుం జారీచేసింది. జూలై 1 నుంచి ఈ సర్వీస్ టాక్స్ అమల్లోకి వచ్చింది. దీంతో నిర్మాతలు గుండెలు గుభేల్మంటున్నాయి. తమ జేబులు పూర్తిగా ఖాళీ అవడమే కాకుండా నిండా మునిగిపోతామని అమితంగా ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వ్యాట్, మరోవైపు సర్వీస్ టాక్స్‌తో సినిమా వ్యాపారం చేయడమెలా అనే సంశయస్థితిలో పడిపోయారు. ఇప్పటికే చాలామంది నిర్మాతలకూ, పంపిణీదారులకూ వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ కట్టమనీ, లేదంటే ఆఫీసులు సీజ్ చేస్తామనీ శ్రీముఖాలు పంపారు.
సినిమాపై వ్యాట్ అనేది మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు. అలాంటిది ఇక్కడే దాన్ని విధించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీన్ని పూర్తిగా తొలగించాలనీ, అలా కాని పక్షంలో కనిష్టంగా మాత్రమే వసూలు చేయాలనీ కోరుతూ ఇప్పటికే పలు దఫాలు ప్రభుత్వాన్ని కలిశారు నిర్మాతలు. నాలుగు నెలల క్రితం జరిగిన నంది అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆగస్ట్‌లో దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. మన పొరుగునే ఉన్న తమిళనాడులో క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు అక్కడి ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. దీని వల్ల హింస, అశ్లీలత, అసభ్యతకు తావులేని మంచి సినిమాలకు ప్రోత్సాహం లభిస్తున్నట్లయింది. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేదు.
ఇప్పుడు సేవా పన్ను వల్ల ఖరీదైన కళాకారులు, సాంకేతిక నిపుణులు ఆ పన్ను పరిధిలోకి రానున్నారు. ఆ పన్నుని వారు నిర్మాతలపై రుద్దడం సహజం కాబట్టి ఇప్పటికే అదుపు తప్పిన నిర్మాణ వ్యయం మరింత భారీగా పెరిగే ప్రమాదముందని నిర్మాతలు భయపడుతున్నారు. ఇవాళ సినిమా బడ్జెట్‌లో ఆర్టిస్టుల, టెక్నీషియన్ల పారితోషికాలకి అయ్యే వ్యయం 50 శాతం పైమాటే. సర్వీస్ టాక్స్ కారణంగా సుమారు 8 శాతం మేర బడ్జెట్ పెరగబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన, నిరసన వ్యక్తమైతే తప్ప అది తొలగే వీలులేదు. దేశంలోని అన్ని భాషా చిత్రసీమలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే అది జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా భవిష్యత్తు ఏం కాబోతున్నదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ 'పన్ను' ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే చిత్ర పరిశ్రమ అంతా తమకు తిండి పెడుతున్న నిర్మాతకు అండగా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయడం వినా మరో దారిలేదు.
ఆఫీసులు చెన్నైకి మారిపోతాయి
-డి. సురేశ్‌బాబు, ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు
2005 నుంచి వ్యాట్ అమలు చేస్తున్నారు. సినీ పరిశ్రమకి కూడా దాన్ని వర్తింపజేశారు. ఏ డిస్ట్రిబ్యూటర్ కైనా సినిమాని అమ్మితే ఆ అమ్మిన దానిమీద 14.5 శాతం వ్యాట్ కట్టాలన్నారు. దాంతో అప్పట్నించీ వ్యాట్ తీసేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ కడుతున్నాం కాబట్టి, ఒక వస్తువు మీద రెండు పన్నులు వేయడం న్యాయంకాదని చెబుతూ వస్తున్నాం. అలా ఇప్పటివరకు వ్యాట్ కట్టలేదు. అయితే ఏడాది నుంచీ వ్యాట్ కట్టమని వాణిజ్య పన్నుల శాఖ నుంచి ప్రొడక్షన్ ఆఫీసులకీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకీ వరుసగా నోటీసులు వస్తున్నాయి. వైజాగ్ వంటి చోట్ల పన్ను కట్టకపోతే ఆఫీసుల్ని సీజ్ చేస్తామనే దాకా వెళ్లారు. పైగా 2005 నుంచి 2011 దాకా ఎరియర్స్ కూడా కట్టమంటున్నారు. అంటే ఒకేసారి పరిశ్రమ నుంచి దాదాపు రూ. 200 కోట్ల నుంచి 250 కోట్ల దాకా కట్టాల్సి వస్తుంది. ఈ వ్యాట్ స్థానిక నిర్మాణ సంస్థలకే అమలు చేస్తున్నారు. ముంబైలోనో, చెన్నైలో ఉండి ఇక్కడ సినిమాలు తీసినా వ్యాట్ పడదు. డబ్బింగ్ సినిమాలకీ వ్యాట్ వర్తించదు. ఇదింకా దారుణం. వినోదపు పన్ను కట్టి, ఈ వ్యాట్ కూడా కడితే సినిమా మీద పన్ను 24 శాతం దాటిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సినిమా ఆఫీసులన్నీ చెన్నైకి మారిపోతాయి. ఇదే విషయం ప్రభుత్వానికి చెప్పాం. అక్కడనుంచి సానుకూల స్పందనే వచ్చింది. అతి త్వరలోనే ఈ పన్నును కనీస స్థాయికి తగ్గిస్తారని ఆశిస్తున్నాం. సినిమాపై టాక్స్ ఏదైనా సరే నిర్మాతలనే కట్టమంటారు ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ. అందువల్ల కేంద్రం విధించిన సర్వీస్ టాక్స్‌ని అంతిమంగా భరించాల్సింది నిర్మాతలే. దీన్ని తగ్గించమని కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ పన్నుల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తాము చేయబోయే సినిమా వర్కవుట్ అవుతుందా, లేదా అనేది నిర్మాతలు ముందే గ్రహించుకోవాలి. మిగతా అంశాల కంటే స్క్రిప్టుకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
సినిమా హాలు కంటే షాపింగ్ కాంప్లెక్స్ మేలు
-టి. ప్రసన్నకుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి
ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, ఎక్సయిజ్ డ్యూటీ వంటివి ప్రభుత్వానికి కడుతున్నాం. ఒక్కో థియేటర్‌పై సంవత్సరానికి సగటున ఒక కోటి రూపాయలు వినోదపు పన్ను కడుతున్నాం. అదే ప్లేస్‌లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దానిలో 10 శాతం కూడా టాక్స్ కట్టం. అలాగే 1950ల నాటికీ, ఇప్పటికీ ఆస్తి పన్ను వెయ్యింతలు పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు తక్కువ, విధిస్తున్న పన్నులు మాత్రం చాలా ఎక్కువ. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు లొకేషన్ చార్జీలు కూడా చాలా ఎక్కువ. పేరుకి వీటి అనుమతులకు సింగిల్‌విండో ఉందని చెబుతున్నా ప్రాక్టికల్‌గా అమలు కావడం లేదు. ఏడాది క్రితం కాస్ట్ కంట్రోల్‌లో భాగంగా తమ వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల్ని తామే భరించుకుంటామని ఆర్టిస్టులు సంతకాలు పెట్టారు కానీ అవి ఇప్పటికీ అమలు జరగటం లేదు. వాటిని నిర్మాతలే భరిస్తున్నారు. సర్వీస్ టాక్స్ రద్దు కావడానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పోరాటం చేయబోతున్నాం.
ప్రమాదంలో నిర్మాత
-కె.ఎస్. రామారావు, సీనియర్ నిర్మాత
ఆరేళ్ల నుంచీ వ్యాట్ తీసేయమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ప్రతిసారీ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు కానీ, దీన్ని తీసేయడంలో ఎవరూ శ్రద్ధ చూపించలేదు. వ్యాట్ విధిస్తే ఏడాదికి ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి నలభై నుంచి యాభై కోట్ల దాకా వస్తుంది. దీనిలో ఉన్న సమస్య ఏమిటంటే ఎంత ఖర్చుతో సినిమా తీస్తే ముందు ఆ ఖర్చుపై వ్యాట్ కట్టి ఆ తర్వాతే సినిమాని విడుదల చేసుకోవాలి. విడుదలకు ముందు పారితోషికాలే కట్టలేని స్థితిలో ఉంటున్న నిర్మాత ఈ వ్యాట్ కూడా కట్టాల్సి వస్తే ఏమైపోవాలి? సినిమా విడుదలై ఫ్లాపయితే కష్టాల్లో ఉండే నిర్మాతకి వ్యాట్ కట్టమని నోటీసు ఇస్తే ఏం చేయాలి? అంటే నిర్మాత ప్రమాదంలో పడిపోయినట్లే. చిరంజీవిగారు కూడా శ్రద్ధ తీసుకుని మమ్మల్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. సి.ఎం. కూడా బాగా స్పందించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సినిమాలపై విధించిన సర్వీస్ టాక్స్ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కూడా అంతిమంగా నిర్మాత మీదే పడుతుంది.
- ఆంధ్రజ్యోతి, 28 జూలై 2012
Friday, June 8, 2012
కేఎస్ఆర్ దాస్ కన్నుమూత
సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.ఆర్. దాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి (జూన్ 8) తుదిశ్వాస విడిచారు. ఆయన 1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించారు. 1966లో 'లోగుట్టు పెరుమాళ్లకెరుక' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణతో అత్యధికంగా 30 పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా ఆయనకు అమితమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. తెలుగులో యాక్షన్ సినిమాల ఒరవడికి ఆయనే ఆద్యుడిగా నిలిచారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, రజనీకాంత్ వంటి హేమాహేమీలను డైరెక్ట్ చేశారు.
Saturday, June 2, 2012
చిరుకు అపూర్వ స్పందన
తిరుపతి పర్యటనలో చిరంజీవికి విశేష స్పందన లభించింది. జనం తన కోసం ఎదురు చూస్తుండటంతో సంబరపడిన చిరంజీవి హుషారుగా అడుగులు వేసుకుంటూ ఇంటింటి ముంగిటకు దూసుకుపోయి హస్తం గుర్తుకు ఓటేయమని అభ్యర్థించారు. చిరంజీవి చొరవ, మాట తీరు గమనించిన ప్రజలు ఆయన ప్రసంగంపై ఎక్కువ ఆసక్తి కనబరిచారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో యువకులు చిరంజీవితో పాటు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
Wednesday, November 16, 2011
ఆ యువ నటుడు ఎవరు?
ఇటీవల 'శ్రీరామరాజ్యం' ఆడియో అభినందన సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అన్నాడంటూ ఓ టీవీ చానల్ చేసిన హంగామా వివాదాన్ని సృష్టించింది. దాంతో తాను ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అనలేదనీ, ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో చిరంజీవి, మోహన్‌బాబుకు తెలుసనీ వివరణ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. ఇంతకీ 'శ్రీరామరాజ్యం' సభలో ఆయన ఏమన్నారు? "ఈమధ్య ఓ యువ నటుడు మన తెలుగు సినిమాల గురించీ, దర్శకుల గురించీ అవమానకరంగా మాట్లాడాడు. టాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయరని అన్నాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దనీ, బాపు వంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారని నేను అన్నాను. వారు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తీశారనీ, నేను కూడా 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాననీ చెప్పాను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పళ్లూడగొడతానని హెచ్చరించా" అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి? ఆ యువ నటుడు బాలకృష్ణ సమక్షంలోనే తెలుగు దర్శకుల్ని తూలనాడితే, బాలకృష్ణ అతణ్ణి హెచ్చరించాడని ఇట్టే అర్థమైపోతోంది. కానీ వివాదం సృష్టించిన చానల్ దీన్ని గమనించకుండా కొద్ది రోజుల క్రితం దాసరి నారాయణరావుని ఉద్దేశించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చినట్లుగా ఊహించుకొని స్టోరీ అల్లేసింది. అందుకే బాలకృష్ణ "ఏదో ఫంక్షన్‌లో షాట్స్ చూపించి నేను చరణ్‌ను ఉద్దేశించి అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. నేను అన్నది చరణ్‌ని ఉద్దేశించి కాదని సవినయంగా మనవి చేస్తున్నా. నేను ఆ మాటలు ఆ వ్యక్తితో నేరుగానే అన్నాను. కానీ చరణ్‌ను నేను కలిసి నాలుగైదు నెలలు అయింది. చిరంజీవి పిల్లలకు నేనంటే ఎంతో వాత్సల్యం. అలాగే వారన్నా నాకు ఎంతో వాత్సల్యం" అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ వివరణని సైతం సదరు చానల్ మరోరకంగా వాడుకొంది. అదలా ఉంచితే బాలకృష్ణ చేత పళ్లూడగొడతాననని అనిపించుకున్న ఆ యువ నటుడు ఎవరన్న చర్చ మొదలైంది చిత్రసీమలో. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నది హీరో నాని అనీ, అతడితోటే బాలయ్య ఆ మాటలు అని ఉంటారని ఊహిస్తున్నారు. తను ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నదీ చిరంజీవి, మోహన్‌బబుకు తెలుసని బాలకృష్ణ అనడాన్ని బట్టి మరికొంతమందికీ ఈ సంగతి తెలిసే ఉంటుంది. ఎవరో ఆ యువ నటుడు?
Sunday, November 13, 2011
బిగ్ స్టోరీ: హిందీలో మాట్లాడుతున్న మన స్టార్ హీరోలు
హిందీలో తెలుగు సినిమాల రీమేక్‌ల కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి అదనంగా అక్కడ తెలుగు సినిమాల డబ్బింగూ ఓ వెల్లువలా మారడం నడుస్తున్న చరిత్ర. మన మెగా, సూపర్ స్టార్ల సినిమాల్ని కొనుగోలు చేసుకుని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటోంది బాలీవుడ్. ఇది థియేటర్లలో ప్రదర్శన కోసం కాదు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఏదో ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్లో ఏదో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ప్రసారమవుతూ కనిపిస్తోంది.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేశ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల సినిమాల డబ్బింగులతో ముంబైలోని అంధేరీ, గుర్గావ్ వంటి ప్రాంతాలు డబ్బింగుల వాడలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ ఒక పరిశ్రమలా నెలకొంది. కేవలం గంటకు రూ. 200 నుంచి రూ. 1500 వరకు అద్దె ఉండే ఈ డబ్బింగ్ థియేటర్లలో అనువాద క్రతువు నిరంతరాయంగా నడుస్తోంది. తెలుగు సినిమాల్ని సాధ్యమైనంత హిందీ నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులతో అహోరాత్రులు కృషి జరుగుతోంది. ఈ క్రమంలో వందకు పైగా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి.
కలర్స్, సోనీ మాక్స్ చానళ్లకే కాదు, మధ్యాహ్నం పూట మరి కొన్ని మూవీ చానళ్ల ముడిసరుకు తెలుగు డబ్బింగులే. ఈ సినిమాల్లో మన స్టార్లు మరొక వాయిస్‌తో అచ్చమైన హిందీ మాట్లాడటం మనకి నవ్వు తెప్పిస్తుంటుంది కూడా. ఈ ట్రెండు ఎందుకు నడుస్తున్నదంటే - హిందీ సినిమాలు రోజురోజుకూ సూటిగా సాఫీగా కథ చెప్పే పద్ధతికి దూరమవుతుండటం. తెలుగు సినిమాల కథలు డైరెక్టుగా నడుస్తుండటం. తెలుగు సినిమాల్లో ఎమోషన్లు, డ్రామా ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలకి మాదిరిగా కాక కుటుంబ ప్రేక్షకులకి నచ్చే మోతాదులో స్ట్రాంగ్‌గా ఉండటం.
అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే మన తెలుగు డబ్బింగులు ప్రాంతీయ భోజ్‌పురి సినిమాలతో సమానం. అంతకంటే వాటికి స్థాయీ, విలువా లేవు. కాకపోతే టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా ఇవి భోజ్‌పురి సినిమా నిర్మాతలు కలలో కూడా ఊహించని భారీతనంతో ఉంటాయి. ఇంకా ఈ హిందీ చానళ్ల వీక్షకులకి బోనస్ ఏమిటంటే ఈ తెలుగు డబ్బింగుల్లో విలన్లు హిందీవాళ్లే కావడం. ముఖేశ్ రుషి, సాయాజీ షిండే నుంచి ప్రదీప్ రావత్, సోనూ సూద్ దాకా హిందీ ప్రేక్షకులకి తెలిసిన ముఖాలే ఉండటంతో అదొక ప్లస్ పాయింట్ అవుతోంది.
కొన్ని పాత్రల నేటివిటీ మార్పు పేరు మార్పుతో సులభంగా జరిగిపోతోంది. కమెడియన్ నల్లగా ఉంటే కాలూ (నల్లటివాడు) అని పేరు పెట్టేస్తారు. తెల్లగా ఉంటే సమస్య ఉండదు. అలా కొన్ని హిందీ నేటివిటీకి అతకని దృశ్యాలుంటే, అవి కథాగమనాన్ని దెబ్బతీయకపోతే తీసేస్తారు. గమనించదగ్గ సంగతేమంటే ఈ సినిమా టైటిల్స్‌లో టైగర్ అనే పదం ఎక్కువగా కనిపించడం. భవానీ ద టైగర్ (పలనాటి బ్రహ్మనాయుడు), ఇంద్ర ద టైగర్ (ఇంద్ర), టైగర్ ఎ ఒన్‌మేన్ ఆర్మీ (సుబ్బు) వంటివి అందుకు ఉదాహరణలు. మరికొన్ని టైటిల్స్ హిందీ హిట్ సినిమాల టైటిల్స్ గుర్తొచ్చేలా పెడతారు. ద రియల్ ఇండియన్ (ఒక్క మగాడు), డాన్ నెం.1 (డాన్), ఏక్ ఔర్ హిమ్మత్‌వాలా (అందరివాడు), అతిథి ఇంటర్నేషనల్ ఖిలాడీ (అతిథి), మేరీ జంగ్ (మాస్), విశ్వ (నేనున్నాను), రాబరీ (సూపర్), పెహలీ నజర్ కా పెహలా ప్యార్ (సంతోషం) వంటివి వాటిలో కొన్ని.
ప్రతినిత్యం మధ్యాహ్నం వేళ హిందీ చానళ్ల ప్రేక్షకులకి మంచి వినోద కాలక్షేపం అందిస్తున్న మన తెలుగు సినిమాలకి మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. వీటిలో హీరోయిన్లు హిందీవాళ్లే! ఏదేమైనా తెలుగు సినిమాల హిందీ డబ్బింగులతో మన స్టార్ల టాలెంట్ హిందీ ప్రేక్షకులకి - అదీ వాళ్ల ఇంటిల్లిపాదికీ పరిచయం కావడమంటే మామూలు విషయం కాదు.
Subscribe to:
Posts (Atom)