Showing posts with label paruchuri brothers. Show all posts
Showing posts with label paruchuri brothers. Show all posts

Wednesday, July 18, 2012

నిర్మాత దిల్ రాజుతో ఇంటర్వ్యూ

అవి కనెక్టయితే 'తూనీగ తూనీగ' సూపర్ హిట్టే
"హీరోకి సంగీతమంటే పిచ్చి. హీరోయిన్‌కి జంతువులంటే ప్రేమ. వారి అభిరుచులు కథలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులకి అవి కనెక్టయితే సినిమా సూపర్ డూపర్ హిట్టవడం ఖాయం" అని చెప్పారు దిల్ రాజు. పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రాంజీ నిర్మించిన్న 'తూనీగ తూనీగ' సినిమాని ఆయన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించీ, మరికొన్ని ఆసక్తికర అంశాల గురించీ దిల్ రాజు చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
మేకర్‌గా ఎమ్మెస్ రాజు ప్రతిభ ఏమిటో తెలుసు. వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో మాగంటి రాంజీతో పాటు నిర్మాణంలో నేనూ పాలు పంచుకున్నా. నా సొంత సినిమాకి ఎలాగైతే అన్ని విషయాలూ చూసుకుంటానో అలాగే ఈ సినిమాకీ చేయాలని నిర్ణయించుకుని 70 శాతం షూటింగ్ అయ్యాక రషెస్ చూపించమన్నా. అప్పటికి క్లైమాక్స్, కొన్ని కీలక సన్నివేశాలు తియ్యలేదు. అందులో పొరబాట్లుగా నాకు అనిపించినవీ, నాకు కలిగిన సందేహాలనూ చెప్పాను. రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో చర్చించా. ఈ సినిమాని సూపర్‌హిట్ చెయ్యాలంటే ఏం చెయ్యొచ్చో వాటిని అందరినీ కూర్చోపెట్టి చర్చించాను. అప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కడ మార్పులు చెయ్యాలో, తర్వాత కథ ఎలా ఉండాలో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజుగారు కూడా కన్విన్స్ అయ్యారు. దానికి తగ్గట్లే సినిమా తీశారు.

అంచనాలకు తగ్గ సినిమా
ఎమ్మెస్ రాజు, దిల్ రాజు కలిసి చేస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో, దానికి తగ్గట్లే ఈ సినిమా ఉంటుంది. ఇది లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా మేళవించిన సినిమా. నిర్మాణ విలువలు, కథ, సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్. హీరో హీరోయిన్లది చూడ ముచ్చటైన జంట. ఇళయరాజా గారబ్బాయి కార్తీక్‌రాజా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.
సుమంత్ భలే చేశాడు
హీరో సుమంత్ అశ్విన్ చాలా అందంగా ఉన్నాడు. తన కేరక్టర్‌ను సూపర్బ్‌గా చేశాడు. కథని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. హీరో సరిగా నటించకపోతే ఎంత మంచి కథయినా కిందికి పడిపోతుంది. సుమంత్ వల్ల ఈ సినిమా పై స్థాయికి వెళ్లిందని గట్టిగా చెప్పగలను. థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లు 'సినిమా భలే ఉంది, అబ్బాయి భలే ఉన్నాడు' అంటారు. సుమంత్ రెండో సినిమా మా బేనర్‌లో ఉంటుంది. నా వద్ద ఉన్న రెండు స్క్రిప్టులకు అతను సరిపోతాడు. 'తూనీగ తూనీగ' ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూసి, అప్పుడు స్క్రిప్టు ఎంచుకుంటా.
సినిమా హిట్టవ్వాలంటే...
మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేది కేవలం 10 శాతం లోపే. 40 శాతం మంది టీవీలు చూస్తుంటే, మిగతా 50 శాతం మందికి సినిమా అంటేనే అవగాహన లేదు. టీవీల్ని దాటి థియేటర్‌కు జనం వచ్చేలా చేస్తేనే సక్సెస్. 'ఈగ'లో ఏం ఉందని అంతమంది చూస్తున్నారు. 'బొమ్మరిల్లు', 'దూకుడు', 'గబ్బర్‌సింగ్' సినిమాల్ని ఎందుకు అంతమంది చూశారు. వాటిలో విషయం ఉంది కాబట్టి. ఓ సినిమా హిట్టవ్వాలంటే నా దృష్టిలో మూడు విషయాలు కీలకం. కంటెంట్ (కథాంశం), కాస్టింగ్ (తారాగణం), టెక్నీషియన్స్ (సాంకేతిక నిపుణులు). 'తూనీగ తూనీగ'లో కంటెంట్, కాస్టింగ్, టెక్నీషియన్స్ పర్‌ఫెక్ట్. తమ ప్రేమకు ఎదురైన అడ్డంకుల్ని హీరో హీరోయిన్లు ఎలా అధిగమించి ఒక్కటయ్యారనేదే కథ. దాన్ని ఎంత ఇంటరెస్టింగ్‌గా రాజుగారు మలిచారన్నది తెరమీద చూడాల్సిందే.
కౌన్సిలింగ్‌కి రెడీ
ప్రతి నెలా రెండో ఆదివారం కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో నేను ప్రపోజల్ పెట్టాను కానీ ఎందుకనో దాన్ని పట్టించుకోలేదు. సినిమా ఎలా తియ్యాలనే విషయంలో కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను రెడీ. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయనే విషయంలో నిర్మాతలకి జడ్జిమెంట్ ఉండాలి. కథ విన్నాక తన సినిమా ఎలా ఉంటుందో అనే విజన్ ఉండాలి. సినిమా మేకింగ్ పట్ల తపన, ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండాలి. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఇక్కడ ఆదాయం తక్కువనే విజ్ఞత ఉండాలి. లాభం సంగతి తర్వాత, పెట్టుబడి వస్తుందనే గ్యారంటీ లేదనే సంగతి గ్రహించాలి. వీటిలో అవగాహన ఉంటే సక్సెస్ రేట్ కచ్చితంగా పెరుగుతుంది. నేను ఇప్పుడు తీస్తున్న సినిమాలకి పెట్టిన పెట్టుబడి వేరే వ్యాపారాల మీద పెడితే గ్యారంటీగా లాభాలు ఎక్కువే ఉంటాయి. కానీ సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తోనే ఇక్కడ ఉన్నా.
అంజలి నటన అసాధారణం
వచ్చే దసరా సెలవులకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలవుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా తీస్తున్నాడు. రాజమండ్రి, తణుకు, భద్రాచలంలో రెండో షెడ్యూల్ చేశాం. ఆగస్టు 7 నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చేస్తాం. సెప్టెంబర్ 5 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్. సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఎస్సెట్. 'సీతమ్మ వాకిట్లో..'కీ, బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'కభీ ఖుషి కభీ ఘమ్'కీ ఎలాంటి పోలికా లేదు. 'సీతమ్మ వాకిట్లో' అంటే భారతదేశం, 'సిరిమల్లె చెట్టు' అంటే ఓ కుటుంబం. భారతదేశంలోని ఓ అందమైన కుటుంబం కథ ఈ సినిమా. వెంకటేశ్ సరసన అంజలి, మహేశ్ జోడీగా సమంత నటిస్తున్నారు. నిజానికి వెంకటేశ్‌కి జోడీగా త్రిషను కానీ, అనుష్కను కానీ తీసుకోవాలనుకున్నాం. కానీ పాత్ర కంటే మహేశ్‌కి వదినగా నటించాలనే అంశం హైలైట్ అవడంతో వారు వెనుకంజ వేశారు. చివరకు అంజలిని తీసుకున్నాం. ఆమె అసాధారణంగా నటిస్తోంది. ఈ సినిమా కథ ప్రధానంగా వెంకటేశ్, మహేశ్, అంజలి పాత్రల చుట్టూ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత అంజలి తెలుగులో పెద్ద రేంజ్ హీరోయిన్ అవుతుంది.

Saturday, July 14, 2012

'ఆకాశంలో సగం' యండమూరి 'అనైతికం'


యండమూరి వీరేంద్రనాథ్ నవల 'అనైతికం' ఆధారంగా 'ఆకాశంలో సగం' అనే సినిమా రూపొందుతోంది. రవిబాబు, ఆశా షైనీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నంది ప్రొడక్షన్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. 'నగరంలో నిద్రపోతున్న వేళ' ఫేమ్ ప్రేమరాజ్ దర్శకుడు.
రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "అందరూ దర్శకులే నటిస్తున్న ఈ చిత్రం నిజంగా ప్రయోగాత్మక చిత్రం. యండమూరి అద్భుతంగా రాసిన 'అనైతికం'ను ప్రేమరాజ్ చక్కగా తెరమీదకు తీసుకొస్తున్నాడు'' అన్నారు. రవిబాబు మాట్లాడుతూ "ప్రేమరాజ్ నా సినిమాలకూ పనిచేశాడు. నేను చదివిన తొలి తెలుగు నవల 'అనైతికం'. ఆ కథలో ప్రధాన వేషం నేను వెయ్యడం చాలా గర్వంగా ఉంది'' అని చెప్పారు. 'అనైతికం'ను సినిమాగా తీయాలనే ప్రేమరాజ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాననీ, ఇది హిట్టయితే ఇండస్ట్రీలో కొత్త ధోరణి మొదలవుతుందనీ యండమూరి అన్నారు. ఇంతమంది దర్శకులు నటిస్తున్న సినిమాని నిర్మించడం తన అదృష్టమని శివకుమార్ చెప్పారు. దర్శకుడు ప్రేమరాజ్ మాట్లాడుతూ "చాలా కాలం క్రితం 'అనైతికం' చదివినప్పుడు సినిమాగా తీస్తే బాగుంటుందనుకున్నా. జనానికి ఓ మంచి సినిమా అందించాలనే తపనతో అందరూ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆశా షైనీకి ఇది జీవితకాల పాత్ర అవుతుంది. ఈ నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది'' అన్నారు.
రేవా, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సాగర్, రాంప్రసాద్, మద్దినేని రమేశ్, దేవీప్రసాద్, కామేశ్వరరావు, కాదంబరి కిరణ్, కాకినాడ శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, ఛాయాగ్రహణం: కల్యాణ్ సమీ, కళ: రాజీవ్ నాయర్, సహ నిర్మాత: టి. వెంకటేశ్ యాదవ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమరాజ్.

Monday, June 25, 2012

జూలైలో 'తూనీగ.. తూనీగ'

తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న 'తూనీగ..తూనీగ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దిల్ రాజు సమర్పణలో పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రామ్‌చంద్రన్ (రాంజీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి సమర్పకుడు రాజు మాట్లాడుతూ ' హై టెక్నికల్ వాల్యూస్‌తో యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రేమకథల్లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఎం.ఎస్.రాజుగారు తీసిన ఈ చిత్రం 2012 టాప్ హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలవడం ఖాయం. హీరోగా సుమంత్ అశ్విన్‌కు మంచి బిగినింగ్ లభించనుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. త్వరలోనే అగ్రహీరోల సమక్షంలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ని నిర్వహిస్తాం.జూలైలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: కార్తీక్‌రాజా, ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, పాటలు: సిరివెన్నెల, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, కళ: వివేక్.

Thursday, November 10, 2011

ఏడేళ్ల తర్వాత బాలయ్యతో పరుచూరి బ్రదర్స్!

'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల కాంబినేషన్ బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్ ఏడేళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నారు. చివరిసారిగా వారు 'లక్ష్మీనరసింహా' సినిమాకి పనిచేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకి వారు 'హరహర మహాదేవ' సినిమా కోసం కలిశారు. బి. గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. 'లక్ష్మీ నరసింహా' నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. ఇక బి. గోపాల్ విషయానికొస్తే ఎనిమిదేళ్ల తర్వాత ఆయన బాలకృష్ణని డైరెక్ట్ చేస్తున్నాడు. 2003లో వచ్చి ఘోరంగా ఫెయిలైన 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాకి చివరగా ఆ ఇద్దరూ కలిసి పనిచేశారు. దీనికి రచన చేసింది కూడా పరుచూరి సోదరులే. ఇప్పుడు ఈ నలుగురి (పరుచూరి బ్రదర్స్ ఇద్దరు కాబట్టి) కలిసి 'పలనాటి బ్రహ్మనాయుడు' చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో పనిచేస్తున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి పెట్టింది పేరైన బ్రదర్స్ ఇందులో 'సై అంటే శరభ శరభ.. జై అంటే ఆయుష్మాన్‌భవ.. కాదని ఎదురొస్తే హరహర మహాదేవ' వంటి శక్తివంతమైన డైలాగులు రాశారు. అయితే ఏ సినిమాకైనా కథే ప్రాణాధారం కాబట్టి 'హరహర మహాదేవ' కథ విషయంలో బి. గోపాల్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మంచి పాటలు, యాక్షన్ పార్ట్, పవర్‌ఫుల్ కేరక్టర్, కావలసినంత సెంటిమెంట్ రంగరించి ఈ సినిమా కథని వండారు. ఈ సినిమాతో పునర్వైభవం పొందాలని ఇటు పరుచూరి బ్రదర్స్, అటు బి. గోపాల్ చేస్తున్న కృషి ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.

Friday, September 2, 2011

ప్రివ్యూ: నందీశ్వరుడు

నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న సినిమా 'నందీశ్వరుడు'. రవిబాబు డైరెక్షన్‌లో నెగటివ్ రోల్ చేసిన 'అమరావతి' తర్వాత అతను నటిస్తున్న సినిమా ఇదే. అతడు ఇదివరకే నటించిన 'ముక్కంటి' సినిమా ఇంకా విడుదల కావలసి ఉంది. 'నందీశ్వరుడు'లో హీరోయిన్ 'బిందాస్' ఫేం షీనా. ఇందులో పొడవాటి మీసాలతో తారకరత్న కొత్తగా కనిపించబోతున్నాడు. కన్నడంలో హిట్టయిన 'డెడ్లీ సోమా' ఆధారంగా ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీను యరజాల రూపొందిస్తున్నాడు. "కన్నడ సినిమా 'డెడ్లీ సోమా' లైన్‌ను మాత్రం తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. కోలూరులో జరిగిన ఓ యదార్థ సంఘటన దీనికి ఆధారం" అని అతను చెప్పాడు. కోటా ఫిల్మ్ కార్పొరేషన్, ఎస్ఆర్‌బీ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థలపై కోట గంగాధరరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ రచన చేస్తుండటం ఈ సినిమాకి సంబంధించిన విశేషం. "డెడ్లీ సోమా లైన్ తీసుకుని మన రాజకీయాలు, రౌడీయిజం ఎలా ఉన్నాయనే విషయాలతో కథ సిద్ధం చేశాం. ఈ నందీశ్వరుడు రంకెలేసేది ఎవరిమీద? ఓ వ్యక్తిమీదా? వ్యవస్థ మీదా? అనేది ఆసక్తికరం" అని వారు చెప్పారు.
మరో హీరో నటించే ఈ సినిమాలో సుమన్, సీత, అజయ్, జీవీ సుధాకర్‌నాయుడు, రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, బెనర్జీ, నాగినీడు, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, కోట శంకర్రావు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మూలకథ: రవి బిళహరి, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: పైడిశెట్టి రాము, సంగీతం: పార్థు, ఛాయాగ్రహణం: సుధాకర్‌రెడ్డి, కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను యరజాల.

Thursday, September 1, 2011

న్యూస్: చిన్నికృష్ణ కల చెదిరింది!

నందమూరి బాలకృష్ణ కోసం 'నందీశ్వరుడు' అనే కథని రాశాననీ, అది తన డ్రీం ప్రాజెక్ట్ అనీ చెబుతూ వచ్చిన రచయిత చిన్నికృష్ణ కలలు కల్లలయ్యాయి. 'నందీశ్వరుడు'గా బాలకృష్ణ కాక, నందమూరి వంశానికే చెందిన తారకరత్న నటిస్తున్నాడు. అయితే అది చిన్నికృష్ణ కథతో కాదు. కన్నడంలో సూపర్ హిట్టయిన 'డెడ్లీ సోమా' అనే సినిమా ఆధారంతో. ఆగస్ట్ 25నే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. చిన్నికృష్ణకి సన్నిహితులైన పరుచూరి బ్రదర్స్ ఈ 'నందీశ్వరుడు'కి డైలాగ్స్ రాస్తుండటం ఇక్కడ గమనార్హం. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తారకరత్నని పరుచూరి గోపాలకృష్ణ 'ఎన్టీఆర్' అని పదే పదే సంబోధించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. తారకరత్న అసలు పేరు ఓబులేశ్. అయితే నటసార్వభౌమ ఎన్టీ రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ (అతని పేరు కూడా నందమూరి తారకరామారావే) తెరమీదకు రావడంతో హడావుడిగా ఓబులేశ్ పేరుని తారకరత్నగా (నందమూరి తారకరత్న - ఎన్.టి.ఆర్.) మార్చి హీరోగా పరిచయం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ లాగా తారకరత్న సక్సెస్ కాలేకపోయాడు. పైగా అతన్నెవరూ ఇంతదాకా ఎన్టీఆర్ అని పిలవలేదు. ఇప్పుడు గోపాలకృష్ణ ఆ పేరుతో పిలిచి ఆశ్చర్యపరిచారు. ఆ సంగతలా ఉంచితే ఈ 'నందీశ్వరుడు' సినిమా ద్వారా శ్రీను యరజాల అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. 'బిందాస్' ఫేం షీనా హీరోయిన్‌గా నటిస్తోంది.
"డెడ్లీ సోమా అద్భుతంగా ఆడింది. దాని లైన్ తీసుకుని మన రాజకీయాలు, రౌడీయిజం, ఇక్కడి విభేదాలు ఎలా ఉన్నాయి? అనే ఆలోచనలతో కథ సిద్ధం చేశాం. దమ్మున్న కథ ఇది. ఈ నందీశ్వరుడు రంకెలేసేది ఎవరి పట్ల? వ్యక్తి పట్లనా? వ్యవస్థ పట్లనా? అనేది ఆసక్తికరం'' అని అన్నారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమాని కేఎఫ్‌సీ (కోటా ఫిల్మ్ కార్పొరేషన్), ఎస్ఆర్‌బీ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోట గంగాధర రెడ్డి నిర్మాత. దర్శకుడు శ్రీను యరజాల"మాస్ చిత్రమిది.
'నందీశ్వరుడు' టైటిల్ ఇచ్చిన పెద్దలకు థాంక్స్. 'డెడ్లీ సోమా' అనే కన్నడ సినిమాలో లైన్‌ను మాత్రం తీసుకున్నాం. తారకరత్న పాత్రతో పాటు షీనా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సముద్ర సాయం మర్చిపోలేనిది'' అని చెప్పాడు.
ఇంతకీ ఆ టైటిల్ ఇచ్చిన పెద్దలెవరు? విశ్వసనీయ సమాచారం ప్రకారం 'నరసింహనాయుడు' నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. 'నందీశ్వరుడు' టైటిల్‌ని మేడికొండ చేత రిజిస్టర్ చేయించింది చిన్నికృష్ణే. అయితే ఆ టైటిల్‌ని రెన్యువల్ చేయించడంలో మేడికొండ ఉదాసీనంగా వ్యవహరించాడనీ, అందుకే ప్రస్తుత 'నందీశ్వరుడు' నిర్మాతలు ఆ టైటిల్'ని చేజిక్కించుకున్నారనీ తెలిసింది. ఫలితంగా నిన్నటిదాకా 'నందీశ్వరుడు' గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన చిన్నికృష్ణకి తీవ్ర నిరాశ ఎదురైంది. తారకరత్న హీరోగా 'నందీశ్వరుడు' మొదలైందని తెలియగానే సన్నిహితుల వద్ద ఆయన తన అసంతృప్తిని దాచుకోలేక పోయాడనీ, మేడికొండ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వాపోయాడనీ తెలిసింది.

Saturday, August 27, 2011

న్యూస్: తెలుగు సినిమాలో శ్రీలంక అందం!

ఓ తెలుగు సినిమా ద్వారా తొలిసారిగా ఓ శ్రీలంక అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ సినిమా 'మిస్టర్ రాస్కెల్' కాగా, ఆ అమ్మాయి నదీషా హేమమాలి. చక్కని ముఖ వర్చస్సు, మంచి ఫిజిక్ ఉన్న నదీషా ఈ సినిమాలో పరుచూరి రవీంద్రనాథ్ సరసన నటించింది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించిన ఆమెకి ఆడిషన్ నిర్వహించి ఈ సినిమాకి ఎంపిక చేశారు రచయితలు పరుచూరి బ్రదర్స్. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె మనోజ్ సినిమా 'ప్రయాణం' ద్వారా పరిచయమైన పాయల్ ఘోష్ అలియాస్ హారిక. ఇప్పటివరకు ప్రోమోస్‌లో పాయల్ స్టిల్సే ఎక్కువగా కనిపిస్తూ వచ్చాయి. అయితే దీనికి నదీషా పెద్దగా బాధ పడటం లేదు. "ఈ సినిమాలో ప్రేమ కోసం తపించే మధుమతి అనే ఇంపార్టెంట్ కేరక్టర్ చేశా. హీరోతో షేర్ చేసుకున్న ఓ ఇంటిమేట్ సీన్‌ని మర్చిపోలేను. ఆ సీనులో అడవిలో ఓ పాము నా పక్క నుంచి జరజరా పాక్కుంటూ వెళ్తుంది. నేను భయంతో హీరోని కావలించుకుంటా" అని ఆమె తెలిపింది. తెలుగు వాళ్లు చాలా ఆదరాభిమానాలు చూపిస్తున్నారనీ, అయితే తెలుగు భాష పలకడం తనకి కాస్త కష్టంగా ఉందనీ నిజాయితీగా చెప్పింది ఈ సింహళీ బ్యూటీ. తమిళ దర్శకుడు ఆర్.వి. ఉదయశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి బ్యాడ్ టాక్ నడుస్తున్నా నదీషా మాత్రం అందరి దృష్టిలో పడింది. రానున్న రోజుల్లో ఆమె మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Wednesday, August 3, 2011

న్యూస్: 'శిరిడి సాయి'గా నాగార్జున మెప్పించగలరా?

తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా నటిస్తున్న అక్కినేని నాగార్జున మరో చారిత్రక పురుషుని పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. అది షిర్డీసాయి పాత్ర. సినిమాకి మాత్రం 'శిరిడి సాయి' అనే పేరు పెట్టారు. నిరాడంబరత్వాన్నీ, ప్రేమ తత్త్వాన్నీ, శాంతి తత్త్వాన్నీ ప్రపంచానికి బోధించిన షిర్డీసాయిగా నాగార్జున నటించబోతున్నారనే సంగతి ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచ లేదు. కారణం, అలాంటి పాత్రల వైపు మొగ్గు చూపుతున్న అగ్ర కథానాయకుడు ఆయనే కాబట్టి. ఇప్పటికే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రల పోషణతో నటునిగా ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. తోటి హీరోలతో పోలిస్తే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపే పాత్రలవి. భవిష్యత్తులోనూ నిలిచిపోయే పాత్రలవి. ఇప్పుడు 'రాజన్న', 'శిర్దిడి సాయి' పాత్రలతో ఆయన తనని తానే అధిగమించుకునే యత్నంలో ఉన్నారు. కొన్నేళ్లుగా భక్తిరస చిత్రాలకే ప్రాధాన్యమిస్తున్న సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికీ దర్శకుడు. కాకపోతే రచయిత మారాడు. ఇదివరకు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'కు జె.కె. భారవి రచన చేస్తే, 'శిరిడి సాయి'కి పరుచూరి బ్రదర్స్ రచన చేస్తున్నారు. ఎప్పటిలా ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. షిర్డీలోనే వారం రోజుల పాటు జరిపిన సిట్టింగ్స్‌లో మూడు పాటల్ని కంపోజ్ చేశారు. నవంబర్ నాటికి పాటల రికార్డింగ్‌ని పూర్తి చేయాలనేది సంకల్పమని నిర్మాత ఎ. మహేశ్‌రెడ్డి తెలిపారు.
ఇప్పటికే తెలుగులో షిర్డీసాయిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ 1986లో వచ్చిన 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' ఎక్కువ జనాదరణ పొందింది. షిర్డీసాయి పాత్రలో విజయచందర్ బాగా రాణించారు. ఇప్పటివరకు మరొకరినెవర్నీ ప్రేక్షకులు ఆ పాత్రలో ఆమోదించలేదు. ఇప్పుడు 'శిరిడి సాయి'కి జనామోదం లభించాలంటే విజయచందర్‌ని నాగార్జున మరిపించ గలగాలి. దాన్ని ఆయన సాధించగలరా?

Friday, April 1, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఆది

తారాగణం: ఎన్‌టీఆర్, కీర్తి చావ్లా, రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, రాజీవ్ కనకాల, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, నారాయణరావు, సంగీత, హరిత, బెంగుళూరు పద్మ, రమ్యశ్రీ, మాస్టర్ నందన్, విజయ్, ప్రసన్నకుమార్, చిత్రం శ్రీను
మాటలు: పరుచూరి బ్రదర్స్
పాటలు: చంద్రబోస్, భువనచంద్ర, పోతుల రవికిరణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
కూర్పు: గౌతంరాజు
స్టంట్స్: విక్రం ధర్మా
నృత్యాలు: రాఘవేంద్ర లారెన్స్, అమ్మ రాజశేఖర్, ప్రదీప్ ఆంథోని
కళ: పార్థసారథి వర్మ
డీటీఎస్ మిక్సింగ్: మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
నిర్మాత: పి. నాగలక్ష్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి. వినాయక్
బేనర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
నిడివి: 2.30 గంటలు
విడుదల తేది: 28 మార్చి 2002

కేవలం పద్దెనిమిదేళ్ల కుర్రాడు సినిమానంతా తన భుజాల మీద మోసి. 'ఆది'గా బాక్సాఫీసు వద్ద చెలరేగిన తీరు చూసి ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపడని వాళ్లు లేరు. ఆ కుర్రాడు జూనియర్ ఎన్‌టీఆర్. తాత నందమూరి తారక రామారావు పేరునే పెట్టుకున్న అతను మొదట 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయమై, పరాజయాన్ని పొందాడు. కానీ రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో ప్రేక్షకుల మన్ననల్ని పొందడంలో విజయం సాధించాడు. ఇక మూడో సినిమా 'ఆది'తో స్టార్ హీరో అయిపోయాడు (గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం'ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే అప్పటికి ఎన్‌టీఆర్ బాలనటుడు). వి.వి. వినాయక్ అనే ఇరవై ఆరేళ్ల కొత్త దర్శకుడు ఎలా గమనించాడో ఏమో కానీ, ఎన్‌టీఆర్‌లోని మాస్ పొటెన్షియాలిటీని వెలికితీసి, ప్రపంచానికి తొలిగా రుచి చూపించాడు. అందుకే 2002 మార్చిలో విడుదలైన ఆ చిత్రం ఆ ఇద్దరి కెరీర్‌కి బంగారు బాట వేసింది. 105 కేంద్రాల్లో విడుదలైన 'ఆది' అన్ని కేంద్రాల్లోనూ యాభై రోజులు, 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం విశేషం కాక మరేమిటి! కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో రూపొందించిన ఆ చిత్రం ఏకంగా పాతిక కోట్ల రూపాయల్ని వసూలు చేసి, ఆ ఘనతని సాధించిన తొలి తెలుగు చిత్రంగా బాక్సాఫీసు చరిత్రకెక్కింది! అంటే వ్యయానికి పది రెట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాడు 'ఆది'.
అలాంటి 'ఆది'కి బీజం ఎలా పడింది? "నేను 'చెప్పాలని ఉంది' సినిమాకి కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరైన బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) నన్ను కథ చెప్పమన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శివుని బొమ్మ దగ్గర కూర్చొని ఓ కథ చెప్పా. అది ఆయనకి బాగా నచ్చింది. అప్పట్లో సినీ పాత్రికేయుడిగా ఉన్న నేటి సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమర్‌ని పిలిచి 'మా బేనర్‌లో తర్వాతి సినిమాని వినయ్‌తో చేస్తున్నామ'ని చెప్పాడు బుజ్జి. నేను భాస్కరభట్లతో నా పేరుని వి.వి. వినాయక్‌గా రాయమని చెప్పా. నేను బుజ్జికి కథ చెప్పింది 'ఆనందం' హీరో ఆకాశ్‌ని దృష్టిలో పెట్టుకుని. మేం 'చెప్పాలని వుంది' పాటల కోసం స్విట్జర్లాడ్ వెళ్లినప్పుడు అప్పటికే 'స్టూడెంట్ నెం.1' పాటల కోసం అక్కడ ఉన్నాడు ఎన్‌టీఆర్. బుజ్జి అతనితో నా గురించి చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక నా కథ విన్నాడు. నచ్చిందని చెప్పాడు. అయితే తర్వాత లవ్ స్టోరీ కాకుండా మంచి మాస్ కథ ఉంటే చెప్పమన్నాడు. మాస్ స్టోరీకి సంబంధించి, నా మనసులో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి. కానీ వచ్చిన అవకాశం పోతుందేమోననే టెన్షన్‌లోనే రెండంటే రెండు రోజుల్లో అరవై సీన్లతో కథ తయారుచేశా. ఆ కథ చెప్పగానే ఉద్వేగానికి గురయ్యాడు ఎన్‌టీఆర్. 'అన్నా. ఈ కథతో మనం సినిమా చేస్తున్నాం' అన్నాడు. అలా 'ఆది' తెరమీదకి వచ్చింది" అని చెప్పుకొచ్చారు వి.వి. వినాయక్.
తన తల్లిదండ్రుల్ని తలనరికి కిరాతకంగా హత్య చేసిన నాగిరెడ్డి అనే ఫ్యాక్షనిస్టుపై ప్రతీకారం తీర్చుకునే 'ఆది'కేశవరెడ్డి అనే రాయలసీమ కుర్రాడిగా ఎన్‌టీఆర్ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాడు. 'పిట్ట కొంచెం కూత ఘనం' నానుడిని నిజంచేస్తూ ఆ సినిమాతో అతను అగ్ర యువ కథానాయకుల్లో ఒకడిగా పేరుపొందాడు. ఒక కొత్త దర్శకుడిలోని కసికీ, మాస్ హీరోగా తాత పేరుని నిలబెట్టాలనే ఓ కుర్రాడి తాపత్రయానికీ దక్కిన ఈ విజయంలో అప్పట్లో 'పీక్ స్టేజ్'లో ఉన్న మణిశర్మ సంగీతానికీ ప్రధాన భాగముంది. అతని సినీ జీవితంలో ఎన్నదగిన పాటల్లో ఒకటైన 'నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ ఇవ్వొద్దూ ఇవ్వొద్దూ' పాట ఈ చిత్రంలోనిదే. ఆ పాట జాలువారింది చంద్రబోస్ కలం నుంచి. ఈ చిత్రంలోని భావోద్వేగపూరిత డైలాగులు కూడా బాగా పాపులర్. ఎన్‌టీఆర్ నోట పలికిన 'తలదించే వంశంలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా', 'అరవకు. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా' వంటి డైలాగులకి థియేటర్లలో మోగిన చప్పట్లు చాలామందికి జ్ఞాపకముండే ఉంటాయ్.
కథాసంగ్రహం
అమెరికా నుంచి కడపకు వచ్చిన వీరారెడ్డి (ఆహుతి ప్రసాద్)తో అతనికి చెందిన భూములన్నింటినీ నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) ఆక్రమించేశాడనీ, ఈ వేల ఎకరాల బంజరు భూమిని పేదలకిస్తే తమ చెమటని చిందించి, ఈ నేలను తడిపి, నాలుగు మెతుకులు తింటారనీ చెబుతాడు ఎర్రన్న (చలపతిరావు). సరేనంటాడు వీరారెడ్డి. అయితే ఈ భూముల్ని పేదోళ్లకి పంచిపెడితే, రాజకీయంగా తనకు పుట్టగతులు వుండవని భావించిన నాగిరెడ్డి ఓ రాత్రివేళ దాడిచేసి వీరారెడ్డినీ, అతని భార్యనీ తలనరికి చంపేస్తాడు. పిల్లవాడైన ఆదికేశవరెడ్డిని తీసుకుని హైదరాబాద్ పారిపోతాడు ఎర్రన్న. హత్యానేరాన్ని వీరారెడ్డి మనుషులపైనే మోపి, వాళ్లని జైలుపాలు చేస్తాడు నాగిరెడ్డి.
పన్నెండేళ్లు గడిచిపోతాయి. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆది (ఎన్‌టీఆర్), నందిని (కీర్తి చావ్లా) ప్రేమలో పడతారు. కడప జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ మనుషుల వద్దకు ఆదిని తీసుకుపోతాడు ఎర్రన్న. అతడి తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి ఎట్లా చంపి, తమ మీద నెరం మోపి, జైలుపాలు చేశాడో చెబుతారు వాళ్లు. నాగిరెడ్డిని అప్పుడే చంపాలన్నంత ఆవేశానికి గురవుతాడు ఆది. నందిని ఎవరో కాదు, నాగిరెడ్డి కూతురనే సంగతి తెలిసి, బాధపడతాడు. ఆమెని మరచిపోదామనుకుంటాడు. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదలొద్దని చెబుతాడు ఎర్రన్న.
తండ్రికి ఆదితో తన ప్రేమ సంగతి చెబుతుంది నందిని. అతణ్ణి రమ్మనమనీ, తనకి నచ్చితే పెళ్లి చేస్తాననీ అంటాడు నాగిరెడ్డి. నందిని చెప్పడంతో కడపకు వస్తాడు ఆది. అతణ్ణి తండ్రికి పరిచయం చేస్తుంది నందిని. "వాహ్. ఏం తేజస్సు బిడ్డా. కోహినూర్ వజ్రం గురించి వినడమే కానీ ఎప్పుడూ చూళ్లేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. బాగా నచ్చావ్" అంటాడు నాగిరెడ్డి. అప్పుడు "నా పేరు ఆదికేశవరెడ్డి" అంటాడు ఆది. అతడి తాత పేరు కూడా అదే. తనెవరో తెలిసిన నాగిరెడ్డితో "నేనెవరో తెలిశాక నీ పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా, చెయ్యకపోయినా నీ పరువుకి తాళికట్టేది నేనే" అంటాడు ధైర్యంగా. విజయదశమి వరకు టైమిస్తున్నాననీ, ఈలోపు తన ఆస్తులు మొత్తం తనకు అప్పగించమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులు వేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ హెచ్చరిస్తాడు. పాడుబడిపోయిన తమ ఇంటికి వెళ్తాడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి తామంతా అతని వెనకాల ఉంటామని చెబుతారు.
నందినికి పులివెందుల నుంచి ఓ సంబంధం మాట్లాడుకుని వస్తాడు నాగిరెడ్డి. ఆది వద్దకు రాత్రి పూట వస్తుంది నందిని. అది తెలిసి అక్కడకు వస్తాడు నాగిరెడ్డి. అతడి ముందే ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకుంటాడు ఆది. ఇంటికెళ్లాక తనని చంపినా ఆది మీద ప్రేమపోదని తండ్రితో అంటుంది నందిని. ఆమె రమ్మంటున్నదని తప్పుడు సమాచారమిచ్చి, ఒక్కణ్ణే రప్పించి, ఎర్రన్నని చంపుతారు నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన గంగిరెడ్డి (రఘుబాబు), అతని మనుషులు. తను బాబాయ్‌గా పిలుచుకునే తన సర్వస్వమైన ఎర్రన్నని చంపడంతో మహోగ్రుడవుతాడు ఆది. తల్లిని తండ్రి మెడకొరికి చంపబోతుండటంతో అతడు చూసిన సంబంధం చేసుకుంటానని ఏడుస్తుంది నందిని. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు నాగిరెడ్డి. పెళ్లి వేదిక వద్దకు వస్తాడు ఆది. పెళ్లికొడుకు తాళి తీసుకుని వచ్చి, ఆదికి ఇస్తాడు. ఆదిని పిస్టల్‌తో పొట్టమీద కాలుస్తాడు నాగిరెడ్డి. కానీ చలించని ఆది అతణ్ణి బతికుండగానే అప్పటికే అతడి కోసమే తవ్వించిన గుంటలో పడేస్తాడు. మొదటగా నాగిరెడ్డి భార్యాకొడుకులే అతడి మీద మట్టిపోస్తారు. జనమంతా అతణ్ణి సజీవ సమాధి చేసేస్తారు.

శతదినోత్సవం చెయ్యకపోవడం వెలితి
-నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
దివంగత ఎన్‌టీ రామారావు అంటే నాకు విపరీత అభిమానం. అదే పేరున్న ఆయన మనవడు నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' విడుదలైనప్పుడు మనోడు కదా, ఎలా చేశాడో చూద్దామని వెళ్లా. క్లైమాక్సులోని ఎమోషనల్ సీన్‌ని అతడు చేసిన తీరుకి చాలా ఆశ్చర్యమేసింది. అతడితో సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మేం తీసిన 'చెప్పాలని ఉంది' సినిమాకి వినయ్ (వి.వి. వినాయక్) కో-డైరెక్టరుగా పనిచేశాడు. చాలా తక్కువ కాలంలో నాకు సన్నిహితమయ్యాడు. అతడు చెప్పిన కథ నచ్చి, దాన్ని ఎన్‌టీఆర్‌కి చెప్పించా. అది అతనికి నచ్చింది కానీ మాస్ కథ కావాలన్నాడు. అప్పుడు వినయ్ 'ఆది' కథ చెప్పాడు. వెంటనే ఓకే అనేశాడు ఎన్‌టీఆర్.
క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు గాజు ముక్క కోసుకుని ఎన్‌టీఆర్ కుడి చేతికి పెద్ద గాయమైంది. చాలా రక్తం పోయింది. అతను మొండోడు. చేతికి కట్టు కట్టుకుని మిగతా సీన్లు చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్టయి, దీని మీద ఆధారపడిన చాలా మంది జీవితాల్ని నిలబెట్టింది. ఎన్‌టీఆర్ స్టామినా ఏమిటో లోకానికి తెలిపింది. 98 సెంటర్లలో వంద రోజులు నడిచింది. వినయ్‌కీ, బెల్లంకొండ సురేశ్‌కీ, నాకూ మంచి బ్రేక్‌నిచ్చింది. అయితే శతదినోత్సవం జరపకపోవడం ఇప్పటికీ నా జీవితంలో వెలితిగానే అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో యాక్టర్లు గానీ, టెక్నీషియన్లు గానీ వినయ్ కోరుకున్నవాళ్లే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వినయ్ సినిమా. మొత్తం స్క్రిప్టు అతనిదే. పరుచూరి బ్రదర్స్‌కి డైలాగ్ రైటర్స్‌గా క్రెడిట్ ఇచ్చినా, డైలాగ్ వెర్షన్ సహా అంతా తనే తయారుచేసుకున్నాడు. అందుకే ఈ సినిమా క్రెడిట్ అంతా అతనిదే. ఎన్‌టీఆర్‌తో అతని కాంబినేషన్‌ని కుదిర్చిన ఘనత మాత్రం నాది.
అల్లరి చేసే పద్దెనిమిదేళ్ల వయసులో ఎన్‌టీఆర్ 'ఆది'గా ఏం చేశాడండీ! అతను పెద్దాయన (దివంగత ఎన్‌టీఆర్) అంశతోనే పుట్టాడని అనిపిస్తుంటుంది. అన్ని సీన్లూ సింగిల్ టేక్‌లో చేసేవాడు. 'ఆది'కి పనిచేయడం 'ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్'.
(వచ్చే వారం 'ఆది' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Saturday, March 19, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: మనసంతా నువ్వే-2

చిన్ననాటి స్నేహితులు పెద్దవాళ్లయ్యాక ప్రేమికులు కావడం చాలా సినిమాల్లో చూశాం. చిన్నతనంలో స్నేహితులుగా విడిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి పెద్దయ్యాక ఒకర్నొకరు చూసుకోకపోయినా ఒకరిపట్ల మరొకరు విపరీతమైన ఆరాధనా భావాన్ని పెంచుకోవడం, తమ ఉనికి తెలీకుండా తమ పట్ల ఎదుటివాళ్లకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకోవడం వైవిధ్యమైన పాయింట్. 'మనసంతా నువ్వే' ఘన విజయానికి దోహదం చేసిన ప్రధానాంశం ఇదే. నిర్మాత ఎమ్మెస్ రాజు ఇచ్చిన లైన్‌ని దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, స్క్రిప్టు సహాయకుడు వీరు పోట్ల కలిసి డెవలప్ చేసి, కల్పించిన సన్నివేశాలూ, ఆ సన్నివేశాలకి పరుచూరి సోదరులు కూర్చిన సంభాషణలూ ఓ సున్నితమైన, భావోద్వేగపూరితమైన ప్రేమకథని సృజించాయి.
ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో బలవంతపు ప్రేమలే ఎక్కువ. హీరోనో, హీరోయినో 'నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపేస్తా', 'నన్ను కాకుండా ఇంకొకర్ని చూశావా?' అనే బెదిరింపులే కనిపిస్తాయి. ఆ బెదిరింపులతోటే ప్రేమలు పుట్టినట్లు ఆ సినిమాల్లో చూపిస్తారు. అట్లా ప్రేమ స్థాయిని దిగజార్చిన సినిమాలు వస్తున్న కాలంలో ఒకరిపట్ల మరొకరు గుండె నిండా ప్రేమ నింపుకొని, వేరే ఇంకే ఆకర్షణకీ లొంగని ప్రేమికుల కథ వస్తే, గుండెల మీద పన్నీటి జల్లు కురిసినట్లే కదా!
మ్యూజికల్ వాచ్‌తో మ్యాజిక్
చిన్నతనంలో అనుకి జ్వరం తగిలినప్పుడు చంటి గుళ్లోని ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి అను వద్ద పెడతాడు. "నువ్వు గుడికి రాలేవు కదా. అందుకని దేవుణ్ణే నీ దగ్గరకు తీసుకొచ్చా" అన్న చంటి మాటల్లోని అమాయకత్వం, నిజాయితీకి ముచ్చటపడని వాళ్లెవరు? ఆ పిల్లల స్నేహం మనసుకి హత్తుకుంటే, ఆ ఇద్దరూ విడిపోయే సన్నివేశం బాధ కలిగిస్తుంది. ఆ సన్నివేశాన్ని కల్పించిన కథకుడూ, వాటిని కదిలించేలా చిత్రీకరించిన దర్శకుడూ.. ఇద్దరూ అభినందనీయులే. విడిపోయిన ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక తిరిగి కలవాలంటే ఏదో ఒక 'సంధాన కర్త' ఉండాలి. అది ఓ జ్ఞాపకం కావచ్చు, ఓ వస్తువు కావచ్చు, ఓ వ్యక్తి కావచ్చు. ఈ సినిమాలో అలాంటి 'సంధానకర్త'గా కనిపించేది ఓ మ్యూజికల్ వాచ్. ఎమ్మార్వోగా పనిచేసే తన తండ్రికి బదిలీ కావడంతో చంటి నుంచి విడిపోక తప్పని స్థితిలో అను అతనికి ఆ మ్యూజికల్ వాచ్ ఇచ్చి, తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దానితో ఆడుకొమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఆ గడియారం కథలో ఓ మలుపుకి కారణమవుతుంది. ఆ గడియారాన్ని శ్రుతి (తనూరాయ్) వద్ద చూసి, ఆమె చెప్పిన మాటలు విని, చంటి అలియాస్ వేణు (ఉదయ్ కిరణ్)ని అపార్థం చేసుకుంటుంది అను. అలాగే ప్రీ క్లైమాక్స్‌లోనూ ఆ గడియారం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎంపీ కొడుకుతో అను పెళ్లి జరిగితేనే నీ చెల్లెలి పెళ్లి అనుకున్న ప్రకారం జరుగుతుందని అను తండ్రి వేణుని హెచ్చరిస్తే, చెల్లెలి కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటాడు వేణు. అందుకే 'మనసంతా నువ్వే' సీరియల్ రచయిత్రి రేణు, తను ప్రేమించిన అను.. ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ సంగతి ఆమెకి చెప్పకుండా "ఇప్పుడు నాకు ఆ అమ్మాయే (అను) గుర్తురావడం లేదు. అసలు ఉందో, లేదో తెలీని అమ్మాయి మీద ప్రేమేంటండీ రేణు గారూ. నా మనసంతా మీరే ఉన్నారండీ..." అంటాడు వేణు.
"అనూయే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది?" అనడుగుతుంది అను. నిజమే కదా అంటూ ఆ గడియారాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు వేణు. అప్పుడు అతడి చెంప చెళ్లుమనిపించి, "యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు" అంటా వెళ్లిపోతుంది అను. వేణు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వాన కూడా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన సునీల్ ఒడ్డున నీళ్లలో కనిపిస్తున్న గడియారాన్ని తీసుకుని వేణు వద్దకొస్తాడు. అతణ్ణి చూసి లేని నవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ ఇప్పటిదాకా అను, తను కలిసి మాట్లాడుకున్నామనీ, తను చాలా హ్యాపీగా ఫీలయ్యిందనీ అంటాడు వేణు.
గడియారాన్ని వేణు చేతిలో పెట్టిన సునీల్ "రేయ్. అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లని ఎదుటివాళ్లకి కనిపించకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావో భగవంతుడు నీకు ఆ కన్నీళ్లే మిగిల్చాడురా. ఏడవరా. వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడువ్" అంటాడు ఉద్వేగంగా. దాంతో సునీల్‌ని గట్టిగా వాటేసుకుని ఏడ్చేస్తాడు వేణు.
ఇట్లా ఆ మ్యూజికల్ వాచ్‌ని ఈ ప్రేమకథలోని మలుపులకు ఉపయోగించుకున్నారు. గమనించాల్సిన అంశమేమంటే ఓసారి అపార్థానికి కారణమైన ఆ గడియారం ఇంకోసారి ప్రేమికులిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఈ రెండో సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా కదిలిస్తుంది. ముఖ్యంగా సునీల్ డైలాగులతో వేణు పాత్ర పట్ల సానుభూతి పెల్లుబుకుతుంది. చెల్లెలి కోసం ప్రేయసికి తనంతట తానుగా దూరమయ్యే అతని పరిస్థితి ఎవర్ని మాత్రం కదిలించదు! ఆ సన్నివేశంలో వానపడటం, ఆ వానలో సునీల్ వద్ద కన్నీళ్లని దాచుకోవాలని వేణు ప్రయత్నించడం, దాన్ని గమనించిన సునీల్ మన కన్నీళ్లని ఎదుటివాళ్లకు కనిపించకుండా వర్షం దాచేస్తుందని అనడం.. రచయిత సన్నివేశ కల్పనా చాతుర్యానికి ఓ చక్కని ఉదాహరణ.
కీలకం చర్చావేదిక సన్నివేశం
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ రోజుల్లో టెలివిజన్లో పాపులర్ అయిన 'ప్రజావేదిక' కార్యక్రమం తరహాలో ఈ సినిమాలో 'స్నేహం-ప్రేమ' అనే అంశంపై పెట్టిన చర్చావేదిక సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. సినిమా మొత్తానికీ కీలకమైంది ఈ ఎపిసోడే. కథ ప్రధానమైన మలుపు తిరిగేది ఆ ఎపిసోడ్‌లోనే. సాధారణంగా సినిమాలో చర్చావేదిక అంటే సగటు ప్రేక్షకుడి దృష్టిలో విసుగు పుట్టించే వ్యవహారం. కానీ దాన్ని జనరంజకం ఎలా చేయొచ్చో ఈ సినిమా చూపించింది. ఆ చర్చావేదికలో పాల్గొన్న అను ఒక్కసారి ఆడది మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురుచూస్తుందంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. వేణు, శ్రుతి ప్రేమించుకుంటున్నారనే అపోహే ఆమె ఆవేశానికి మూలం. ఆ తర్వాత తన చిన్ననాటి నేస్తం గురించీ, ఆమె మీద ప్రేమ గురించీ ఆ కార్యక్రమంలో చెప్పిన వేణు.. ఆ స్నేహితురాలు కలిస్తే తనెవరో చెప్పకుండా ఆమె మనసులో ఏముందో తెలుసుకుంటాననీ చెబుతాడు. 'తూనీగా తూనీగా' పాట పాడతాడు. దాంతో అనుకి అతడి పట్ల ఉన్న అపోహ పటాపంచలవుతుంది. తన పట్ల అతడికి ఉన్న ప్రేమ సంగతి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తను ఎదురైతే అతను ఏం చేయదలచుకున్నాడో అదే ప్రయోగాన్ని అతడి మీద తనే చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పట్నించీ తనెవరో చెప్పకుండా వేణుకి ఆమె దగ్గరయ్యే విధానం, అతడితో ఆమె ఆడే దాగుడుమూతలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తన చిన్ననాటి నేస్తాన్ని తెలుసుకోవడం కోసం రేణు పేరుతో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ని అను రాయడం మరో ఆసక్తికర అంశం. ఇది రంగనాయకమ్మ 'రచయిత్రి' నవలని గుర్తు చేస్తుంది. ఆ నవలలో అనూరాధ అనే కలం పేరుతో రచనలు చేస్తుంది కథానాయిక విజయ. తన భార్యే అనూరాధ అనే సంగతి ఆమె భర్తకి తర్వాత తెలుస్తుంది. చిత్రమేమంటే 'రచయిత్రి' నవలా నాయిక కలం పేరు 'మనసంతా నువ్వే'లో నాయిక అసలు పేరు కావడం. కాకపోతే అ కథ వేరు, ఈ కథ వేరు.
సమష్టి కృషి ఫలితం
కథాకథనాలు రెండూ చక్కగా అమరడమే ఈ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణం. ఆ క్రెడిట్ కథా రచయిత ఎమ్మెస్ రాజు, సంభాషణల రచయితలు పరుచూరి సోదరులు, దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు దక్కుతుంది. తొలి సినిమా కావడం వల్లనేమో ఆదిత్యలోని 'ఫైర్' ప్రతి సన్నివేశ చిత్రణలోనూ కనిపిస్తుంది. ప్రధాన పాత్రలతో పాటు సపోర్టింగ్ కేరెక్టర్లనీ దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. హీరో స్నేహితుడిగా చేసిన సునీల్ పాత్ర, వీక్లీ ఎడిటర్ కూతురు శ్రుతి పాత్ర, అను తండ్రి గంగాధరం పాత్ర కథకి మంచి 'సపోర్ట్'నిచ్చాయి. ఆ పాత్రల్లో సునీల్, తనూరాయ్, తనికెళ్ల భరణి సరిగ్గా ఇమిడిపోయారు. ఇక హీరో వేణు పాత్రకి అతికినట్లు సరిపోయాడు ఉదయ్ కిరణ్. పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది. అప్పటికే అతడికొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ దీనికి మరింత వన్నె అద్దింది. నిజానికి అనూరాధ పాత్రకి రీమాసేన్ ఛాయిస్ కాదు. హీరో పాత్రలో ఉన్న భావోద్వేగాలన్నీ ఆ పాత్రలోనూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోకి తన ఐడెంటిటీ తెలీకుండా నటించే సన్నివేశాల్లో 'అండర్‌ప్లే' అవసరం. ఆ విషయంలో రీమాసేన్ ఓ మోస్తరుగానే నటించింది. అయినా ఆమెని ఆ పాత్రలో ప్రేక్షకులు ఆమోదించడానికి కారణం, ఆ పాత్రలోని బలమే. ఇక ప్రత్యేక పాత్రలో సీతారామశాస్త్రి కనిపించేది స్వల్ప సమయమే అయినా తమవైన డైలాగులతో, 'వాయిస్'తో బలమైన ముద్ర వేశారు. చంద్రమోహన్, సిజ్జు వంటివాళ్లు పాత్రల పరిధుల మేరకు రాణించారు.
సినిమాకి సగం బలం సంగీతమే అనేది నానుడి. ఈ సినిమాకి సంబంధించి అది అక్షరాలా నిజం. అప్పుడే ఎగిసిన సంగీత కెరటం ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా పాటలకి వినసొంపైన, ఆహ్లాదకరమైన బాణీలనిస్తే, పదాలతో ఆడుకునే సీతారామశాస్త్రి చక్కని సాహిత్యాన్నందించారు. 'తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే రావే నా వంకా', 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' (టైటిల్ సాంగ్) పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే వుంటే, 'కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం', 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా', 'ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా' పాటలు మంచి హిట్టయ్యాయి. ఆర్పీ కూర్చిన నేపథ్య సంగీతమూ ప్రభావవంతమైందే. మిగతా సాంకేతిక నిపుణులూ తమ వంతు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఎస్. గోపార్‌రెడ్డి కెమెరా అత్యుత్తమ స్థాయి పనితనాన్ని ప్రదర్శించింది. ఆరంభ సన్నివేశాల్లో, సముద్రం ఒడ్డున సన్నివేశాల్లో, పాటల్లో అది ఎలా హొయలు పోయిందో చూసి తీరాల్సిందే. అరకు అందాల్ని లాఘవంగా ఒడిసిపట్టింది ఆ కెమెరా. దర్శకుడు ఆదిత్య చెప్పినట్లు కె.వి. కృష్ణారెడ్డి ఎడిటింగ్ ప్రతిభ ఈ సినిమా కథనానికి బిగువుని చేకూర్చిపెట్టింది. 'మనసంతా నువ్వే' అందరి మనసుల్నీ దోచుకుని, పెట్టుబడికి ఐదు రెట్ల ఆదాయాన్ని అందించిందంటే అది సమష్టి పనితనం వల్లే.
(వచ్చే వారం ఎన్‌టీఆర్ 'ఆది' చిత్ర విశేషాలు)

Friday, March 11, 2011

హిట్.. హిట్.. హుర్రే!: మనసంతా నువ్వే

తారాగణం: ఉదయ్ కిరణ్, రీమాసేన్, సిజ్జు, తనూరాయ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవదాస్ కనకాల, సుధ, రజిత, శివారెడ్డి, శివపార్వతి, కృష్ణవేణి, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబీ జీబా, రఘునాథరెడ్డి, పావలా శ్యామల, శిరీష
కథ: ఎమ్మెస్ రాజు
స్క్రీన్‌ప్లే, రచన: పరుచూరి బ్రదర్స్
రచనా సహకారం: వీరు పోట్ల
పాటలు: సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం: ఎస్. గోపాల్‌రెడ్డి
కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
డాన్స్: సుచిత్రా చంద్రబోస్
కళ: రాజేశ్
డి.టి.ఎస్. మిక్సింగ్: డి. మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. భాస్కరరాజు
నిర్మాత: ఎమ్మెస్ రాజు
దర్శకత్వం: వి.ఎన్. ఆదిత్య
బేనర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి: 2 గంటల 37 నిమిషాలు
విడుదల తేది: 19 అక్టోబర్ 2001

గ్రాఫిక్స్‌ని నమ్ముకుని భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'దేవీ పుత్రుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కుదేలవడంతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు బాణీ మార్చాలనుకున్నారు. అందమైన ప్రేమకథని తెరకెక్కించాలని సంకల్పించారు. ఆ సమయంలో వి.ఎన్. ఆదిత్య అనే కుర్రాడి గురించి విన్నారు. డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ వద్ద వరుసగా మూడు సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశాడు ఆదిత్య. అప్పటికే అతను తన స్నేహితుడైన త్రివిక్రం కథతో డైరెక్టర్ కావాలని ప్రణాళికలు వేస్తున్నాడు.
"ఎమ్మెస్ రాజు గారు కబురు పంపించిన వారం రోజులకి వెళ్లి కలిశా. ఆయనే ఓ లైన్ చెప్పారు. 'ఇది ప్రేమించుకుందాం రా సినిమా లైన్ సర్' అని చెప్పా. ఆయన నన్ను మెచ్చుకుని, అప్పుడు తన మనసులోని లైన్ చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల పాటు ఇద్దరం చాలా సినిమాల గురించి క్యాజువల్‌గా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అంతాకా హీరో ప్రేమ విషయం స్నేహితులకి తెలియదన్నట్లుగా చూపించే సినిమాలే ఎక్కువగా వచ్చాయ్. కానీ ఎవరైనా తన ప్రేమని మొదటగా చెప్పుకునేది స్నేహితులకేననీ, సినిమాలో ఆ కోణం పెడితే బాగుంటుందనీ చెప్పా. ఆయన నన్ను హత్తుకుని 'నువ్వే నా డైరెక్టర్‌వి' అన్నారు. అడ్వాన్స్ ఇచ్చారు" అని ఆ రోజులు జ్ఞాపకం చేసుకున్నారు ఆదిత్య.
అలా ఎమ్మెస్ రాజు కథతో, పరుచూరి సోదరుల స్క్రీన్‌ప్లేతో, ఆదిత్య దర్శకత్వంలో తయారైన ప్రేమ కథాచిత్రం 'మనసంతా నువ్వే' 45 ప్రింట్లతో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమా దానికి ఐదు రెట్లు అంటే 15 కోట్ల రూపాయల్ని వసూలుచేసి పెట్టింది. 'దేవీపుత్రుడు' కారణంగా ఎంతో డబ్బు పోగొట్టుకున్న ఎమ్మెస్ రాజు ఎంతో నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేసి, అనూహ్యమైన ఫలితాన్ని పొందారు. అప్పటికే 'చిత్రం', 'నువ్వు నేను' వంటి వరుస హిట్లు సాధించి, యువతలో క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే'తో హ్యాట్రిక్ సాధించాడు. 'లవర్ బాయ్' ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'చిత్రం'లో హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఉదయ్ కిరణ్, రీమాసేన్ జోడీ ఈ సినిమాతో రెండో సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లో ఎక్కడ విన్నా 'తూనీగా.. తూనీగా' పాటే. ఆ పాటతోటే 'పాడుతా తీయగా' ఫేం ఉష సినీ గాయనిగా తళుక్కున మెరిసిపోయింది. అలాగే టైటిల్ సాంగ్ 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' కూడా హిట్.
ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విశేషం మరోటుంది. ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో ఏడుగురు తదనంతర కాలంలో దర్శకులయ్యారు. కథా రచయిత అయిన నిర్మాత ఎమ్మెస్ రాజు 'వాన'తో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ 'అందమైన మనసులో'తో, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి 'నా ఆటోగ్రాఫ్'తో, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ 'పల్లకిలో పెళ్లికూతురు'తో, కో-డైరెక్టర్ శంకర్ కె. మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా'తో, పబ్లిసిటీ డిజైనర్ రమేశ్‌వర్మ 'ఒక ఊరిలో'తో, రచనా సహకారం అందించిన వీరు పోట్ల 'బిందాస్'తో దర్శకులుగా పరిచయమయ్యారు.

కథా సంగ్రహం:
అరకులో చంటి, అనూరాధ ఇరుగుపొరుగు వాళ్లు. చంటివాళ్లు కడు బీదలైతే, అను తండ్రి గంగాధరం ఎమ్మార్వో. అంతస్తులు వాళ్ల దోస్తీకి అడ్డుకాలేదు. తండ్రికి ట్రాన్స్‌ఫర్ కావడంతో అను వెళ్లిపోతుంది. వెళ్లేప్పుడు చంటికి తన జ్ఞాపకంగా ఓ మ్యూజిక వాచ్ ఇచ్చి వచ్చే ఏడాది తన పుట్టినరోజున అక్కడి ఆంజనేయస్వామి గుడివద్ద కలుసుకుందామని చెబుతుంది అను. తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథ అయిన చంటి రైల్వే స్టెషన్లో ఇడ్లీలు అమ్ముకుని బతుకుతుంటాడు. ఓ రోజు రైలెక్కుతున్న ఓ పాప బంగారు గోలుసు జారి కిందపడిపోతే, దాన్ని తీసుకెళ్లి ఆ పాప తండ్రి మోహన్ (చంద్రమోహన్)కి ఇస్తాడు. చంటి అనాథ అని తెలుసుకుని ఆ కుటుంబం అతన్ని తమతోపాటు తీసుకువెళ్తుంది. చంటికి వేణు అని పేరు పెడతారు.
వేణు (ఉదయ్ కిరణ్)కి 22 యేళ్లు వస్తాయి. అతనికి సునీల్ (సునీల్) మంచి ఫ్రెండ్. పన్నెండేళ్ల నుంచీ ప్రతి ఏడాదీ అరకులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్తూనే వుంటాడు వేణు. కానీ ఇంతవరకు అను తారసపడలేదు. చెల్లెలు రేఖ (శిరీష)ని కాలేజీ వద్ద ఎంపీ కొడుకు స్నేహితుడు అల్లరి పెడుతుంటే వాణ్ణి కొడతాడు వేణు. అతను ఓ సూపర్‌మార్కెట్లో దూరితే వెంటపడి కొట్టే క్రమంలో పొరపాట్న అతడి దెబ్బ ఆ సూపర్ మార్కెట్ ఓనర్‌కి తగులుతుంది. పోలీసులు వేణుని తీసుకుపోబోతుంటే కొట్లాట సంఘటనని షూట్ చేసిన ఓ టీవీ చానల్ ప్రతినిధి శ్రుతి (తనూరాయ్) నిజంచెప్పి అతణ్ణి విడిపిస్తుంది. అదివరకే వేణు, 'స్వాతి' ఎడిటర్ కూతురైన శ్రుతి స్నేహితులవుతారు. మలేషియాలో మేనమామ వద్ద ఉన్న అను (రీమాసేన్) చదువు పూర్తికాగానే ఇండియాకి తిరిగొస్తుంది.
తన చిన్నటి జ్ఞాపకాలతో స్వాతి వీక్లీలో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ రాయడం ప్రారంభిస్తుంది అను. అది చూసి చంటి వస్తాడనేది ఆమె ఆశ. అతి తక్కువ కాలంలోనే ఆ సీరియల్ పాపులర్ అవుతుంది. వేణు చెల్లెలు రేఖకి పెళ్లిచూపులు జరుగుతాయి. ఆ పెళ్లికొడుకు తండ్రి ఎవరో కాదు. ఇదివరలో వేణువల్ల పొరపాట్న దెబ్బతిన్న సూపర్‌మార్కెట్ ఓనర్. వేణుని చూసి అతను ఆగ్రహంతో ఊగిపోయి, ఆ సంబంధం ఒద్దనుకుని వెళ్లిపోబోతాడు. అప్పుడు పొరబాట్న కొట్టాననీ, దయచేసి పెళ్లి ఆపకండనీ, తానసలు వాళ్ల కొడుకునే కాదనీ బ్రతిమలాడుతూ క్షమాపణలు కోరతాడు వేణు. అయితే వేణుని అవమానించినందుకు మోహన్ పెళ్లివాళ్లని తిట్టి పంపేస్తాడు. బాధలో ఉన్న వేణుని బార్‌కి తీసుకెళ్లి తనతో పాటు మందు తాగిస్తాడు మోహన్. డబ్బులు తక్కువవుతాయి. శ్రుతికి ఫోన్ చేస్తాడు వేణు. ఆమె వచ్చి డబ్బు కడుతుంది. మత్తులో ఆమెకి మ్యూజికల్ వాచ్ ఇస్తాడు వేణు. మరుసటిరోజు ఆ వాచ్‌ని గమనించి, దాని గురించి శ్రుతిని ఆరా తీస్తుంది అను. అది తన బాయ్‌ఫ్రెండ్ వేణు ఇచ్చాడని చెబుతుంది శ్రుతి. నిర్ఘాంతపోతుంది అను. వేణుని తప్పుగా అర్థం చేసుకుంటుంది. శ్రుతికి వాచ్ ఇచ్చాననన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఆమె ఇంటికి వెళ్లి, ఆ వాచ్ తనకు చిన్ననాటి స్నేహితురాలు అను ఇచ్చిన సంగతి చెప్పి, తిరిగి తీసుకుంటాడు. టీవీ చానల్లో జరుగుతున్న 'స్నేహం-ప్రేమ' చర్చా కార్యక్రమంలో అను, వేణు పాల్గొంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సంధానకర్తగా వ్యవహరించే ఆ చర్చలో ప్రేమ సక్సెస్ అయినా, ఫెయిలైనా అందులో ఆడా, మగా ఇద్దరికీ సమాన పాత్ర ఉందంటూ, తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతాడు వేణు. తన నేస్తం కలిస్తే తనెవరో చెప్పననీ, ఆమె మనసులో ఏముందో మొదట తెలుసుకుంటాననీ అంటాడు. అది విని అతడి మనసులో తనకున్న స్థానం అర్థమై ఆనందంతో ఉప్పొంగిపోతుంది అను. తన మీద అతడు చేయాలనుకున్న ప్రయోగాన్ని అతడిమీద తనే చేస్తుంది. తనెవరో చెప్పకుండా వేణుతో స్నేహం పెంచుకుంటుంది. వేణు కుటుంబానికీ సన్నిహితమవుతుంది. వేణు చెల్లెలికి మరో సంబంధం కుదురుతుంది.
అయితే అనుకోని రీతిలో తనతో వియ్యమందమంటూ ఎమ్మార్వోతో పెళ్లి ప్రపోజల్ పెడతాడు ఎంపీ (దేవదాస్ కనకాల). వియ్యమందితే వచ్చే 500 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్టుకి ఆశపడి అనుని ఎంపీ కొడుక్కిచ్చి చేయడానికి ఆనందంగా ఒప్పుకుంటాడు గంగాధరం. తండ్రికి చంటితో తన ప్రేమ గురించి చెబుతుంది అను. 'మనసంతా నువ్వే' సీరియల్లో జరుగుతున్న సంఘటనలు చదివి రేణు, అను ఒక్కరే అని తెలుసుకుంటాడు వేణు. అనుని కలవడానికి తహతహలాడుతున్న వేణుని గంగాధరం కలిసి, నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో తన కూతురి పెళ్లి జరగాలనీ అంటాడు. ఇప్పటికే ఓసారి పెళ్లి ఆగిందనీ, ఈ పెళ్లి కూడా ఆగితే నీ తండ్రి గుండె ఆగిపోతుందనీ బెదిరిస్తాడు. చెల్లి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు వేణు. ఆ తర్వాత ఏమయ్యింది? అను, వేణు ఎలా ఒక్కటయ్యారు? అనేది క్లైమాక్స్.

నేను దాన్ని పట్టుకోలేకపోయా
-వి.ఎన్. ఆదిత్య
అప్పట్లో పరుచూరి బ్రదర్స్ వద్ద వీరు పోట్ల అసిస్టెంట్‌గా ఉన్నాడు. నేను, వీరు స్క్రిప్ట్ వర్క్ చేశాం. మేం చేసిన వర్క్‌ని ఎప్పటికప్పుడు రాజు గారు చెక్‌చేసి, మమ్మల్ని సరైన ట్రాకులో పెడుతూ వచ్చారు. మరోవైపు గోపాలకృష్ణ గారు డైలాగ్ వెర్షన్ రాస్తూ వచ్చారు. స్క్రిప్టు పూర్తయ్యాక 'మహేశ్‌తో చేద్దామా?' అనడిగారు రాజు గారు. అది మహేశ్ వంటి మాస్ హీరోకి సరిపోదనీ, అప్పుడే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటున్న ఉదయ్ కిరణ్ అయితే బాగుంటుందనీ చేప్పా. అలా అతను ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. చంటి పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది.
ఆ రోజుల్లో టీవీలో గొల్లపూడి మారుతీరావు గారి 'ప్రజావేదిక' కార్యక్రమం సూపర్‌హిట్. సినిమాలో మేం పెట్టిన 'ప్రేమ-స్నేహం' చర్చావేదికకి ప్రేరణ అదే. మా ప్రేమకథకి కీలకమైంది ఆ ప్రజావేదిక సన్నివేశమే. అందులో ప్రయోక్తగా వ్యవహరించే పాత్రకి మారుతీరావు గారినే తీసుకోవాలనుకున్నాం. చివరికి సీతారామశాస్త్రి గారు దాన్ని అమోఘంగా చేశారు. ఆ సీనులో తను చెప్పే డైలాగ్స్‌తో పాటు ఉదయ్ డైలాగ్స్‌ని రాసింది ఆయనే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో రీషూట్ లేని ఏకైక చిత్రం 'మనసంతా నువ్వే'. మీకో సంగతి చెప్పాలి. నేను పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంటే, 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా' పాటలో కొంత భాగాన్ని రాజు గారే చిత్రీకరించారు. రీమాసేన్, సిజ్జు మధ్య ఎయిర్‌పోర్ట్ సీనుని తీసిందీ ఆయనే.
సినిమా విడుదలయ్యాక మారుతీరావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సినిమాలోని ప్రతి షాట్ గురించీ ఆయన విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ మాట్లాడారు.
కృష్ణారెడ్డి ఎడిటింగ్ గురించి కూడా చెప్పాలి. ఎడిటింగ్ రూములో ఉన్నప్పుడు చివరలో ఎమోషన్స్ మిస్సయ్యాయని రాజు గారు, గోపాలకృష్ణ గారు భావించారు. అప్పుడు 'నీ స్నేహం..' పాటని మరో చోట కూడా 'కట్.. పేస్ట్' చేశారు కృష్ణారెడ్డి. దాంతో ఎమోషన్స్ బ్రహ్మాండంగా క్యారీ అయ్యాయి. నేను దాన్ని పట్టుకోలేకపోయా. రీ రికార్డింగ్‌తో ఆ సీన్ బాగా పండింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక 'నీ స్నేహం' సినిమా కోసం అందులో నటిస్తున్న కె. విశ్వనాథ్ గారు రాజు గారి ఆఫీసుకి వచ్చారు. 'ఏడయ్యా. నీ డైరెక్టర్ని పరిచయం చెయ్యవా?' అనడిగారు రాజు గార్ని. నన్ను పరిచయం చెయ్యగానే 'ఇంత చిన్నవాడివా. యాన్ యంగ్‌స్టర్ విత్ గుడ్ టేస్ట్' అని మెచ్చుకున్నారు. అలాగే ఓసారి చిరంజీవి గారింటికి నేను వెళ్లిన సమయంలో ఆయన 'మనసంతా నువ్వే'ని డీవీడీలో చూస్తున్నారు. స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడి మెచ్చుకున్నారు. ఇలా చాలామంది పెద్దవాళ్ల నుంచి మంచి మంచి ప్రశంసలు అందుకున్నా.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Saturday, January 29, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (రెండో భాగం)

'నరసింహనాయుడు' నిర్మాణ వ్యయం దాదాపు 8 కోట్ల రూపాయలు. పదేళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. ఈ సినిమాలో భారీ సంఖ్యలో టాటా సుమోలు కనిపిస్తాయి. విలన్, హీరో గ్రూపులకు ఇలా అధిక మొత్తంలో సుమోలను ఉపయోగించడం దర్శకుడు గోపాల్ ప్రారంభించిన ధోరణే. భావోద్వేగ సన్నివేశాల సందర్భాల్లో అలా బారులు బారులుగా తెల్లటి సుమోలు కనిపిస్తుంటే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత రోజుల్లో సందర్భం ఉన్నా, లేకున్నా అధిక సంఖ్యలో సుమోలు వాడటం విపరీత ధోరణిగా మారి, ప్రేక్షకులకి మొహం మొత్తడం వేరే సంగతి. 'నరసింహనాయుడు'లో టాటా సుమోల సన్నివేశాలన్నీ ఉద్వేగభరిత సన్నివేశాల్లో వచ్చేవే. అందుకే అవి కథలో అంతర్భాగంగా ఇమిడిపోయాయి. ఆయా సన్నివేశాల్ని పండించాయి. వాటితో పాటు రైలుబండి వద్ద యాక్షన్ సన్నివేశాలు, హెలికాప్టర్‌ని వినియోగించడం వంటివి ఈ సినిమా వ్యయాన్ని బాగా పెంచాయి. అంత వ్యయమంటే అప్పట్లో చాలా రిస్కే. చిన్నికృష్ణ కథనీ, గోపాల్ దర్శకత్వ సామర్థ్యాన్నీ నమ్మినందునే నిర్మాత మురళీకృష్ణ అంత మొత్తాన్ని వెచ్చించారు. "ఎందుకు, ఏమిటి అనకుండా అడిగిందల్లా సమకూర్చిపెట్టారు నిర్మాత మురళీకృష్ణ గారు. ఎప్పుడూ 'ఇదొద్దు' అనలేదు. సూట్‌కేసులతో డబ్బులు కుమ్మరించారు. ఆయనకి హేట్సాఫ్ చెప్పాలి" అని కృతజ్ఞత వ్యక్తం చేస్తారు దర్శకుడు గోపాల్. బడ్జెట్ విషయంలో తీసుకున్న రిస్కుకి తగ్గట్లుగానే అనూహ్యమైన ఫలితం దక్కింది. ఖర్చుకి రెండు రెట్లకి మించి 21 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది ఈ చిత్రం. ఆ విధంగా 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఫలితాన్ని ఊహించింది ఒకే ఒక్కడు. అతను చిన్నికృష్ణ. తను రాసిన స్క్రిప్టు చివరి పేజీలోనే ఆయన 'ఈ సినిమా 20 కోట్ల రూపాయల్ని వసూలు చేస్తుంది' అనే మాట కూడా రాశాడు. అది నూటికి నూరు శాతమూ నిజమవడం విశేషమే.
మరి ఇంతటి విజయాన్ని సాధించిన 'నరసింహనాయుడు' బలం ఎక్కడుంది? ఏయే అంశాలు ఆ సినిమాకి అంతటి విజయాన్ని చేకూర్చిపెట్టాయి? ఈ సినిమాలో లోపాలే లేవా? ఎందుకు లేవు! నరసింహనాయుడు పెద్దవాడై మనకి కనిపించడమే నాట్యాచార్యునిగా కనిపిస్తాడు. అయితే చిన్నతనంలోనే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని తర్వాత ప్రత్యర్థుల పీచమణూస్తూ వచ్చిన నరసింహనాయుడు ఎప్పుడు నాట్యం నేర్చుకున్నాడు? నేర్చుకున్నా అంత తొందరగా నాట్యాచార్యుడు ఎలా అయ్యాడు? అనేవి సమాధానం లభించని ప్రశ్నలు. అలాగే 'సర్వకాల సర్వావస్థల్లోనూ నీ తోడుగా, నీడగా ఉంటాను' అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యను అన్నావదినల్ని తూలనాడిందనే కారణంతో కనీసం ఆమె వాదన కూడా వినకుండా పుట్టింటికి పంపేయడం ధీరోదాత్త నాయకుని లక్షణం కాదు. నరసింహనాయుడు ఆ పని చేశాడు. భార్య పట్ల చాలా కఠినంగా వ్యవహరించి, ఆమెని వ్యధకు గురిచేశాడు. అంటే కథలో శ్రావణి పాత్రకు అన్యాయం జరిగింది.
అయితే మామాలు ప్రేక్షకుడికి ఇవేవీ పట్టలేదు. కారణం, వాటిని గుర్తించని రీతిలో అమరిన స్క్రీన్‌ప్లే. ఆరంభం నుంచి శుభం దాకా కుర్చీల్లో కదలనివ్వని కథాగమనం 'నరసింహనాయుడు'కి పెద్ద బలం. ఆ పాత్రని ప్రేక్షకులు అంతగా ప్రేమించడానికి దోహదం చేసింది అదే. ఇంటర్వెల్ వచ్చినప్పుడు సాధారణంగా ప్రేక్షకుడు రిలీఫ్ పొందడానికి కుర్చీలోంచి లేస్తాడు. కానీ ఎప్పుడు ఇంటర్వెల్ టైం అయిపోతుందా, ఎప్పుడు సెకండాఫ్ మొదలవుతుందా.. అనే క్యూరియాసిటీని కలిగించింది ఈ చిత్రం. అంతదాకా అజ్ఞాతంలో ఉన్న నరసింహనాయుడు ఉనికి తెలిపే ట్రైన్ ఎపిసోడ్ కచ్చితమైన ఇంటర్వెల్ బ్యాంగ్. ప్రత్యర్థులకు మొదట వీపు చూపించి, 'స్లో మోషన్'లో నరసింహనాయుడు మొహాన్ని చూపిస్తుంటే, ఆ రూపాన్ని చూసీ చూడగానే ఠారెత్తి ఆ ప్రత్యర్థులు ఆయుధాలు అక్కడే పడేసి పరుగులు తీస్తుంటే, 'మాస్' ప్రేక్షకుడికి అంతకంటే ఉద్వేగభరిత సన్నివేశం ఇంకేముంటుంది! అంతకుముందు దాకా సాఫ్ట్‌గా కనిపించి, సింహాచలం నాయుడు తమ్ముళ్లని చితగ్గొట్టినా నరసింహనాయుడులోని హీరోయిజాన్ని ఒకేసారి వెయ్యి రెట్లు పెంచేసిన సన్నివేశం అది. నరసింహనాయుడు వంటి బలమైన పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అది త్యాగం, పౌరుషం సమపాళ్లలో రంగరించిన పాత్ర. ఆ పాత్ర జనానికి అంతగా ఎందుకు నచ్చింది? "అతను (నరసింహనాయుడు) ఊరికోసం ప్రత్యర్థిని చంపుతాడు. కుటుంబం కోసం చదువుసంధ్యలు వదిలేశాడు. అన్నయ్యలను తూలనాడింది అన్ని కట్టుకున్న భార్యను వదిలేస్తాడు. సోదరుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. వాళ్లను రక్షించుకునే సమయంలో భార్యను పోగొట్టుకుంటాడు. కొడుకు వేరే కథానాయికలో అమ్మను వెతుక్కుంటే అంగీకరించడు. కానీ తండ్రి 'ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా' అంటే వెళ్లి తీసుకొస్తాడు. విచిత్రం ఏమిటంటే ఏదీ తనకోసం చేయడు. తనవారికోసమే చేస్తాడు. అందుకే అందరికీ నచ్చిందా పాత్ర" అని వివరిస్తారు పరుచూరి కోపాలకృష్ణ.
అలాంటి పాత్రను తనదైన శైలితో రక్తి కట్టించారు బాలకృష్ణ. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎంతటి సాత్త్వికాభినయం చేశారో, భావోద్వేగ సన్నివేశాల్లో అంతటి గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పోరాట సన్నివేశాల్లో ఎంతటి పరాక్రమాన్ని చూపించారో, సరదా సన్నివేశాల్లోనూ, పాటల్లోనూ అంతటి హుషారు కనపరిచారు. అలా 'నరసింహనాయుడు'కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలకృష్ణ. అందుకే ఆ పాత్రని నెత్తికెత్తుకున్నారు జనం. అందుకే ఆ పాత్రకి 'ఉత్తమ నటుడు'గా నంది అవార్డు అందుకున్నారు బాలకృష్ణ.
ఆయనకు దీటుగా శ్రావణి పాత్రలో సిమ్రాన్ ప్రదర్శించిన అభినయం కూడా ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోయింది. భర్తను అతని అన్నావదినలు ఇష్టం వచ్చినట్లు తూలనాడుతుంటే తట్టుకోలేక వారిమీద ఆమె తిరగబడే సన్నివేశం 'నరసింహనాయుడు' పాత్రౌచిత్యాన్ని పరిపుష్ఠం చేసింది. ఇక తండ్రి పాత్రలో కాశీనాథుని విశ్వనాథ్ ప్రదర్శించిన హుందాతనం, ప్రతినాయకునిగా ముఖేష్‌రుషి చూపించిన క్రూరత్వం జనాన్ని మెప్పించాయి. మిగతా తారలంతా తమకి అప్పగించిన పాత్రల్ని సమర్థంగా చేసుకుంటూ వెళ్లారు.
బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపించే ఈ సినిమా విజయానికి దోహదం చేసిన అంశాల్లో ప్రముఖమైంది మణిశర్మ కూర్చిన సంగీతం. బాలకృష్ణ, ఆషా సైనీపై చిత్రీకరించిన 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా' పాట మాస్‌ని ఓ ఊపు ఊపింది. 'కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో', 'చిలకపచ్చ కోక పెట్టినాది కేక', 'మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది' పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చిన నేపథ్య సంగీతాన్నీ విస్మరించలేం. చిన్నికృష్ణ స్క్రీన్‌ప్లేకి మరింత బలాన్నిచ్చినవి పరుచూరి సోదరుల సంభాషణలు. బావోద్వేగ సంభాషణలకు పెట్టింది పేరైన వారు 'కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా' తరహా డైలాగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన బావలు, తోడికోడళ్ల వద్ద ఆవేశభరితంగా శ్రావణి నోట పలికే ఇంగ్లీషు డైలాగులకు చప్పట్లు పడ్డాయంటే ఆ క్రెడిట్ వాళ్లదే. సినిమాకి మంచి 'లుక్' రావడంలో కీలకమైంది వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రఫీ. చేజింగ్ సీన్లలో ఆయన కెమెరా ఎక్కడా షేక్ కాలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన కెమెరా యాంగిల్స్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. అలాగే పోరాట సన్నివేశాల్ని గొప్పగా రూపొందించి 'నరసింహనాయుడు' విజయంలో తనదీ ప్రముఖ పాత్రేనని చాటిచెప్పారు స్టంట్ మాస్టర్ విక్రం ధర్మా. ఇవన్నీ తెరమీద ఇలా పండాయంటే అందుకు ఎడిటింగ్ నిర్వహించే పాత్ర చాలా ఎక్కువ. ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించారు కోటగిరి వెంకటేశ్వరరావు.
ఇలా ఇందరి సమష్టి కృషి వల్లే 'నరసింహనాయుడు' చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. మునుపటి బాక్సాఫీసు వసూళ్ల చరిత్రని తిరగరాసింది. 105 కేంద్రాల్లో శతదినోత్సవం, 17 కేంద్రల్లో రజతోత్సవం జరుపుకుంది. ఏలూరులో 275 రోజులు ఆడింది. 'సమరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - బి. గోపాల్ ద్వయానికి మరో సంచలన చిత్రంగా నిలిచింది.

'నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలిపిన సినిమా' 
-బి. గోపాల్
చిన్నికృష్ణ 'సమరసింహారెడ్డి' టైంలోనే కలిసేవాడు. కథలు చెప్పేవాడు. అప్పుడు ఆ కథలు వర్కవుట్ కాలేదు. తర్వాత నేనే పిలిపించా. ఈ కథ చెప్పాడు. ఇంటర్వెల్ వరకు చెప్పాడు. బాగుంది. నిర్మాతకీ, బాలకృష్ణకీ నచ్చింది. మొదట సెకండాఫ్‌లో హీరో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని చెప్పాడు. నాకు ఐపీఎస్ ఆఫీసర్ అనే పాయింట్ నచ్చలేదు. అప్పటికే బాలయ్యతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' చేసివున్నా. నాలుగు రోజుల్లో బాలయ్యకు సెకండాఫ్ చెప్పాలి. పోలీసాఫీసర్ గెటప్ లేకుండా చెప్పమన్నా. చిన్ని కొంత అప్సెట్ అయ్యాడు. దాంతో పరుచూరి బ్రదర్స్‌తో చిన్నికి మీటింగ్ ఏర్పాటు చేయించా. అప్పుడు ఇంటికొక్కడు బలిదానమయ్యే పాయింట్ చెప్పాడు చిన్ని. నేను డౌట్‌పడ్డా. గోపాలకృష్ణ బాగుందన్నారు. ఆ తర్వాత సీనార్డర్ వేసుకొచ్చాడు చిన్ని. అది అందరికీ నచ్చింది. 'నరసింహనాయుడు' పాత్ర చెబుతుంటేనే బాలయ్య ఎగ్జయిట్ అయ్యారు. వెంటనే 'ఈ సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాం' అన్నారు. స్క్రీన్‌ప్లే గొప్పగా చేశాడు చిన్ని. షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో సినిమాని విడుదల చేశాం. వేస్టేజ్ లేకుండా రీజనబుల్ బడ్జెట్‌లో సినిమా చేశాం. నిర్మాత ధైర్యంగా కొన్ని ఏరియాలు అమ్మకుండా ఉంచుకున్నారు. పెద్ద హిట్టవడంతో బాగా డబ్బు వచ్చింది.
బాలయ్య పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. మొదట సాఫ్ట్‌గా, తర్వాత ఎమోషనల్ మేన్‌గా గొప్పగా నటించాడు. లుక్స్‌తోనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రిప్టుకు తగ్గట్టు వంద శాతం కాదు వెయ్యి శాతం న్యాయం చేశాడు.
'సమరసింహారెడ్డి' తర్వాత నేను చేసిన సినిమాలు సరిగా రాలేదు. ఈ సినిమా నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలబెట్టింది. టెక్నీషియన్లకి ఇక సక్సెస్ వస్తే చెప్పలేని ఆనందం. ఆయుష్షు పెంచినంత బలాన్నిస్తుంది. ఇంకా మంచి సినిమా చెయ్యాలన్న ఉత్సాహాన్నిస్తుంది.

'నా అంచనా తప్పలేదు' 
-చిన్నికృష్ణ
ఉత్తర భారతంలో దేశభక్తి ఎక్కువ. దక్షిణ భారతంలో వ్యక్తుల్ని పూజిస్తే, పంజాబ్‌లాంటి చోట్ల దేశాన్ని పూజిస్తారు. అందుకే ఆర్మీలో నార్త్‌వాళ్లు ఎక్కువ. అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఒక్కో కొడుకు దేశ రక్షణలో ఉన్నాడు. నేను అలాంటి గ్రామాల్ని ప్రత్యక్షంగా చూశా. దానికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా.
మన ఊరి సమస్యని కాపాడ్డానికి లా అండ్ ఆర్డర్ ఫెయిలయినప్పుడు ఒక్కో ఇంట్లో ఒక్కొక్కణ్ణి బలిదేవుడి (వారియర్)గా ఇస్తే వాళ్లు తమ ఊర్ని కాపాడుకుంటారనే ఐడియా అలా వచ్చింది. అట్లాంటి యోధులకి పెళ్లి సంబంధాలు రావు. ఒకవేళ పెళ్లయితే ఆ భార్యకి ఎన్నో కష్టాలుంటాయి. ఈ అంశాలు నా స్క్రిప్టులో 'బై-ప్రొడక్ట్స్'గా బాగా వర్కవుట్ అయ్యాయి.
నిజానికి నా మైండ్‌లో పోలీస్ కేరక్టర్ లేదు. మొదట సినిమా పోలీస్ అనుకుని మొదలుపెట్టినందునే అలా చెప్పా. తర్వాత గోపాల్ పోలీస్ ఆఫీసర్ కాకుండా చెప్పమన్నారు. నా మైండులో ఉన్న అసలు కథ అప్పుడు చెప్పా. 'లక్ష్మీనరసింహస్వామి' అనే థాట్ క్రియేట్‌చేసి తొలిగా చెప్పింది నేనే. నేను సృష్టించిన నరసింహనాయుడు కేరెక్టర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం సంతోషకరం.
తమ ఇంట్లో ఈ స్క్రిప్టు వినగానే లోపలికి వెళ్లి స్వీట్ పాకెట్, పళ్లు తెచ్చిచ్చి, 'ఈ అబ్బాయి గొప్ప రైటర్ అవుతాడు' అని ఆశీర్వదించారు బాలకృష్ణ. ఆయన మిగతా హీరోలందరికంటే ఎంతో గొప్పవారు. సినిమా సక్సెస్ అవగానే కొన్ని లక్షల రూపాయలు విలువచేసే పురాతన పచ్చల పతకం, పట్టుబట్టలు ఇచ్చి, కారుదాకా మమ్మల్ని తీసుకువచ్చి పంపిన గొప్పవారు. నా 'నరసింహనాయుడు' పాత్రకి వంద శాతం జస్టిఫై చేశారు బాలకృష్ణ. చిన్నపిల్లాడిగా విని, పెద్ద నటునిగా చేశారు. విశ్వరూపాన్ని ప్రదర్శించారు కాబట్టే అంత పెద్ద హిట్టు.
ఈ సినిమా స్క్రిప్టు ఎ టు జడ్ నాదే. నా స్క్రిప్టు ఆఖరి పేజీలో '20 కోట్లు వస్తాయి' అని రాశా. బడ్జెట్ 8 కోట్లయితే, 21 కోట్లు వచ్చాయి. ప్రతి సినిమాకీ అలాగే రాస్తుంటా. అది అహంకారమనుకోండి, ఆత్మవిశ్వాసం అనుకోండి. ఇంతవరకు నా అంచనా తప్పలేదు. ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకుంటూ 'సాక్షాత్తూ లక్ష్మీనరసింహస్వామి చిన్నికృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి ఈ కథ చెప్పాడు' అన్నారు బాలకృష్ణ. అంతకుమించిన కాంప్లిమెంట్ నాకు ఇంకేముంటుంది! మళ్లీ ఆయనా, నేనూ కలుస్తాం. అది చరిత్ర అవుతుంది. అదే 'నందీశ్వరుడు'. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలన్నీ అదే రోజు రిలీజైనా నేను రెడీ. 'నందీశ్వరుడు' మీద అంత గట్టి నమ్మకం.

(వచ్చే వారం 'ఖుషి' సినిమా కబుర్లు) 

Saturday, January 22, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (2001)

తారాగణం: బాలకృష్ణ, సిమ్రాన్, ప్రీతి జంగియాని, కె. విశ్వనాథ్, ముఖేష్ రుషి, మోహన్‌రాజ్, ఆశా షైనీ, జయప్రకాశ్‌రెడ్డి, సత్యప్రకాశ్, హేమంత్ రావణ్, రాఖీ, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, శివాజీరాజా, ముక్కురాజు, నర్రా వెంకటేశ్వరరావు
కథ, స్క్రీన్-ప్లే: చిన్నికృష్ణ
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రాజు
ఫైట్స్: విక్రం ధర్మా
డాన్స్: రాఘవేంద్ర లారెన్స్, బృంద, శ్రీను
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
దర్శకత్వం: బి. గోపాల్
బేనర్: శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11 జనవరి, 2001

'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా'.. సుమారు పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ డైలాగ్‌ని జనం నేటికీ మరచిపోలేదు. ఆ తర్వాత దానికి ఎన్నో పేరడీలు వచ్చాయి. అంతగా జనం నోళ్లలో నానిన, నానుతోన్న డైలాగ్ 'నరసింహనాయుడు' చిత్రంలోనిది. అది చెప్పింది కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 2001లో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా అంతకు మునుపటి డెబ్భై ఏళ్ల తెలుగు చలనచిత్ర బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డుని తిరగరాసింది. అంతేకాదు. నేటివరకు బాలకృష్ణ కెరీర్‌లోనూ అతిపెద్ద హిట్టు 'నరసింహనాయుడు'. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆ సినిమాకి విజయాన్ని చేకూర్చి పెట్టారంటే, అందులో అప్పటివరకు కనిపించని కొత్తదనమేదన్నా వాళ్లకి కనిపించిందా? లేదు. ఈ సినిమాలో అసాధారణ కథ లేదు. ఫార్ములాకి భిన్నమైన కథ కూడా కాదు. పోనీ కథనంలో ఏమన్నా కొత్తదనం వుందా అంటే - అదీ లేదు. మరెందుకు అంత సంచలనాత్మక విజయాన్ని 'నరసింహనాయుడు' సాధించాడు?
సినిమా అనేది సమష్టి కృషి. సినిమా విజయానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. విజయం సాధించే సినిమాకి అన్ని అంశాలూ కలిసొస్తాయి. 'నరసింహనాయుడు' విషయంలో జరిగింది అదే. అయితే ఈ విజయంలో మొదటగా చెప్పుకోవాలసింది నిస్సందేహంగా 'నరసింహనాయుడు' పాత్రనీ, ఆ పాత్రని బాలకృష్ణ పోషించిన తీరునీ. ఆ చిత్ర సంభాషణల రచయితలు పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ తమ 'తెలుగు సినిమా సాహిత్యం' పుస్తకంలో 'నరసింహనాయుడు చిత్రం ఏడు దశాబ్దాల చలనచిత్ర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి కారణం నరసింహనాయుడి పాత్రను తీర్చిదిద్దిన తీరే' అని చెబుతారు. ఆ పాత్రని అలా మలిచిందెవరు? కథా రచయిత చిన్నికృష్ణ. కథతో పాటు సినిమాకి ప్రాణమైన స్క్రీన్‌ప్లేనీ ఆయనే సమకూర్చాడు. తెలుగులో చిన్నికృష్ణకి ఇదే తొలి చిత్రం. అంటే తన మొదటి సినిమాతోటే రికార్డులు సొంతం చేసుకున్నాడు చిన్నికృష్ణ. అదివరకు రజనీకాంత్ సూపర్‌హిట్ తమిళ సినిమా 'పడయప్పా' (తెలుగులో 'నరసింహా') స్క్రిప్టు రచయితల్లో ఒకడిగా ఆయన వెలుగులోకి వచ్చాడు. 'నరసింహనాయుడు' అవకాశాన్ని కల్పించింది అదే. నిజానికి ఆ అవకాశం అనుకోని రీతిలో ఆయనకి వచ్చింది. అప్పటికే పోసాని కృష్ణమురళి కథతో సినిమాని ప్రారంభించారు దర్శకుడు గోపాల్, నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. ఆ కథలో బాలకృష్ణ పోలీసాఫీసర్. అదే గెటప్‌తో ఆయన మీద తీసిన తొలి సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు.
అయితే తర్వాత ఎందుకనో గోపాల్‌కి ఆ కథ నచ్చలేదు. కారణం ఆయన అప్పటికే బాలకృష్ణతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' తీసి ఉన్నాడు. అది పెద్ద హిట్టు కూడా. దానికంటే ఆ కథ గొప్పగా లేదనిపించింది. అప్పుడు 'సమరసింహారెడ్డి' కాలంలోనే తనకి పరిచయమైన చిన్నికృష్ణని పిలిపించాడు గోపాల్. హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చిన్నికృష్ణకు ఓ సంగతి తెలిసింది. "అప్పటికే చాంబర్ బిల్డింగ్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రసిద్ధ రచయితలు విజయేంద్రప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సుందర్ ('పెదరాయుడు' కథారచయిత), పోసాని కృష్ణమురళి ఒక్కో గదిలో ఉండి కథలు చెబుతున్నారు. అందరికంటే నేనే చిన్నవాణ్ణి. అప్పుడు నా వయసు 32 యేళ్లు. నేను గోపాల్‌గారికి ఒకే స్క్రిప్టు చెప్పా. ఆయన పరుచూరి గోపాలకృష్ణగార్ని పిలిపించారు. కథ విన్న ఆయనకి ఓపెనింగ్ సీన్ బాగా నచ్చింది. హీరో ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతూ కొడుకుతో పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రశాంత జీవితం గడపడమనే పాయింట్ కొత్తగా ఉందని చెప్పి, నా కథని ఓకే చేశారు. ఆ తర్వాత బాలకృష్ణగారికీ వినిపిస్తే, ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. 'నరసింహనాయుడు'తో నేను తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యానంటే సగం ఘనత గోపాల్ గారిదీ, సగం ఘనత గోపాలకృష్ణ గారిదీ" అని చెప్పారు చిన్నికృష్ణ. అలా పోసాని కృష్ణమురళి కథ స్థానంలో చిన్నికృష్ణ కథ వచ్చింది.
కథా సంగ్రహం:
రాయలసీమ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక గ్రామానికి పెద్ద రఘుపతినాయుడు (కె. విశ్వనాథ్) అయితే ఇంకో గ్రామం అప్పల్నాయుడు (మోహన్‌రాజ్), అతని బావమరిది కుప్పుస్వామినాయుడు (ముఖేష్‌రుషి) అజమాయిషీలో ఉంటుంది. వాళ్లనుంచి తమ గ్రామాన్ని కాపాడుకోడానికి ఒక సైన్యాన్ని తయారుచేయడం కోసం ఊళ్లోవాళ్లందర్నీ ఇంటికొక బిడ్డని బలిదానం చేయమంటాడు రఘుపతినాయుడు. తన వంతుగా నలుగురు కొడుకుల్లో చిన్నవాడైన నరసింహనాయుణ్ణి దానం చేస్తాడు.
సంవత్సరాలు గడుస్తాయి. నాట్యాచార్యుని అవతారమెత్తిన నరసింహ (బాలకృష్ణ) ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతుంటాడు. అదే ఊళ్లో కుప్పుస్వామినాయుడు కూతురు అంజలి (ప్రీతి జంగియాని) మేనమామ సింహాచలంనాయుడు (జయప్రకాశ్‌రెడ్డి) ఇంట్లో ఉండి చదువుకుంటూ నరసింహని ప్రేమిస్తుంది.
అంజలిని మేనల్లుడైన దివాకర్ (హేమంత్ రావణ్)కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కుప్పుస్వామి. కట్నంగా నరసింహనాయుడు తల కావాలన్న అక్క నాగమణి (తెలంగాణ శకుంతల)కి అలాగేనని వాగ్ధానం చేస్తాడు. అయితే నరసింహనాయుణ్ణి అంజలి ఇష్టపడ్తున్న సంగతి తెలిసి, ఊరువిడిచి వెళ్లమని నరసింహనాయుణ్ణి హెచ్చరించిన సింహాచలంనాయుడు తమ్ముళ్లు, పసివాడైన అతని కొడుకుని పైకి విసిరేస్తారు. దాంతో కొడుకుని రక్షించుకుని, వాళ్లందర్నీ చితగ్గొడతాడు నరసింహనాయుడు. అక్కణ్ణించి వెళ్లిపోవాలని ఆశ్రమం ఖాళీచేస్తాడు. బావతో పెళ్లి ఇష్టంలేని అంజలి కూడా నరసింహ వెళ్తున్న రైలుబండిలోనే ఎక్కుతుంది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారనుకున్న దివాకర్ బృందం రైలుని ఆపేస్తారు. రైలు దిగుతాడు నరసింహనాయుడు. అంతే! అతన్ని చూసీ చూడగానే దివాకర్ బృందం ఆయుధాలు పారేసి, భయంతో పరుగులు తీస్తారు.
అదిచూసి ఆశ్చర్యపోయిన అంజలికి తన గతం చెబుతాడు నరసింహనాయుడు. ఆ గతం.. తండ్రిమీద దౌర్జన్యం చేసిన అప్పల్నాయుణ్ణి హతమారుస్తాడు నరసింహ. అతని కొడుకుల్ని చావగొడతాడు. చేతులూ, కాళ్లూ విరిగిన వాళ్లు తండ్రి చితికి కొరివి పెట్టలేని స్థిలో వుంటే బావమరిది కుప్పుస్వామి వచ్చి కొరివి పెడతాడు. నరసింహ చితి మండేదాకా తాళి, బొట్టు తీయొద్దని అక్క నాగమణితో ఆవేశంతో చెబుతాడు. శ్రావణి (సిమ్రాన్)ని పెళ్లిచేసుకుంటాడు నరసింహ. విదేశాల్లో వున్న అన్నలు పెళ్లికి రాకపోవడంతో వాళ్ల ఫోటోని ఎదురుగా పెట్టుకుని మరీ చేసుకుంటాడు. గుడివద్ద నరసింహ, కుప్పుస్వామి ఒకరికొకరు తారసపడతారు. అంతుచూస్తానన్న కుప్పుస్వామితో "ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే/కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా" అంటాడు నరసింహ.
'నీ మొగుడు నా మొగుణ్ణి చంపాడు' అని నాగమణి చెప్పడంతో భర్త వాస్తవ జీవితం తెలుస్తుంది శ్రావణికి. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అన్నావదినల వల్ల ఎదురైన అవమానాలకు తట్టుకోలేక వారికి ఎదురుతిరిగి మాట్లాడుతుంది శ్రావణి. ఇంటికొచ్చిన నరసింహకి ఆమెమీద పితూరీలు చెబుతారు అన్నావదినలు. దాంతో మనస్తాపం చెందిన నరసింహ వాళ్లకే విలువనిచ్చి శ్రావణిని పుట్టింటికి పంపేస్తాడు. అప్పటికే నిండు చూలాలైన శ్రావణి పుట్టింట్లోనే కొడుకుని కంటుంది. నరసింహ మీద అలిగిన అన్నలు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. కుప్పుస్వామి వల్ల ప్రమాదం వుండటంతో పోలీసుల సాయంతో వెళ్తారు. మరోవైపు మనవణ్ణి చూడాలనుకున్న రఘుపతి తనకు రక్షణగా కొడుకుని రమ్మంటాడు. నరసింహ అన్నలమీద కుప్పుస్వామి మనుషులు దాడిచేస్తారు. విషయం తెలిసి నరసింహ అక్కడికి వచ్చి, తాను గొడ్డలి దెబ్బ తిని కూడా అన్నావదినల్ని కాపాడతాడు. ఈలోగా నరసింహ కొడుకుని చంపాలనుకుని శ్రావణి వద్దకు వెళ్లిన కుప్పుస్వామికి పసివాడు కనిపించడు. కొడుకుని దాచి, తాను కుప్పుస్వామి చేతిలో బలైపోతుంది శ్రావణి. ఆ తర్వాత నరసింహ చేతుల్లో తుదిశ్వాస విడుస్తూ కొడుకుని అతని చేతుల్లో పెట్టి కొట్లాటలకు దూరంగా వుండమని ఒట్టు వేయించుకుంటుంది. తండ్రి కూడా చెప్పడంతో భార్యకిచ్చిన మాటకోసం కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లిపోతాడు నరసింహ. ఇదీ గతం.
వర్తమానానికొస్తే విషయం తెలిసి నరసింహని చంపడానికి అతనింటికి వచ్చిన కుప్పుస్వామికి అంజలినిచ్చి పంపిస్తాడు నరసింహ. అంజలిని 'అమ్మా' అని పిలుస్తున్న అతని కొడుకుని చూసి, ఆ పసిబిడ్డకు అమ్మనివ్వమని నరసింహని వేడుకుంటాడు రఘుపతి. సరేనని కుప్పుస్వామి ఇంటికొచ్చి 'రేపు ఉదయం 10 గంటలకి నాకూ, అంజలికీ వివాహం' అని చెబుతాడు. మరుసటి రోజు చెప్పినట్లే అంజలిని తీసుకెళ్లడానికి వస్తాడు. నరసింహకీ, కుప్పుస్వామికీ ముఖాముఖి పోరు జరుగుతుంది. నరసింహ చేతిలో చావుదెబ్బలు తింటాడు కుప్పుస్వామి. అంజలి హాస్పిటల్లో ఉందని తెలిసి అందరూ అక్కడకు వెళతారు. నరసింహ కొడుకు కోసం తనకి పిల్లలు పుట్టకుండా అంజలి ఆపరేషన్ చేయించుకోవడం చూసి కుప్పుస్వామి పశ్చాత్తాపపడతాడు. అందరూ ఒక్కటవుతారు.
(వచ్చేవారం 'నరసింహనాయుడు' విజయానికి దోహదం చేసిన అంశాలు)
-నవ్య వీక్లి, జనవరి 12, 2011