చిన్ననాటి స్నేహితులు పెద్దవాళ్లయ్యాక ప్రేమికులు కావడం చాలా సినిమాల్లో చూశాం. చిన్నతనంలో స్నేహితులుగా విడిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి పెద్దయ్యాక ఒకర్నొకరు చూసుకోకపోయినా ఒకరిపట్ల మరొకరు విపరీతమైన ఆరాధనా భావాన్ని పెంచుకోవడం, తమ ఉనికి తెలీకుండా తమ పట్ల ఎదుటివాళ్లకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకోవడం వైవిధ్యమైన పాయింట్. 'మనసంతా నువ్వే' ఘన విజయానికి దోహదం చేసిన ప్రధానాంశం ఇదే. నిర్మాత ఎమ్మెస్ రాజు ఇచ్చిన లైన్‌ని దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, స్క్రిప్టు సహాయకుడు వీరు పోట్ల కలిసి డెవలప్ చేసి, కల్పించిన సన్నివేశాలూ, ఆ సన్నివేశాలకి పరుచూరి సోదరులు కూర్చిన సంభాషణలూ ఓ సున్నితమైన, భావోద్వేగపూరితమైన ప్రేమకథని సృజించాయి.
ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో బలవంతపు ప్రేమలే ఎక్కువ. హీరోనో, హీరోయినో 'నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపేస్తా', 'నన్ను కాకుండా ఇంకొకర్ని చూశావా?' అనే బెదిరింపులే కనిపిస్తాయి. ఆ బెదిరింపులతోటే ప్రేమలు పుట్టినట్లు ఆ సినిమాల్లో చూపిస్తారు. అట్లా ప్రేమ స్థాయిని దిగజార్చిన సినిమాలు వస్తున్న కాలంలో ఒకరిపట్ల మరొకరు గుండె నిండా ప్రేమ నింపుకొని, వేరే ఇంకే ఆకర్షణకీ లొంగని ప్రేమికుల కథ వస్తే, గుండెల మీద పన్నీటి జల్లు కురిసినట్లే కదా!
మ్యూజికల్ వాచ్‌తో మ్యాజిక్
చిన్నతనంలో అనుకి జ్వరం తగిలినప్పుడు చంటి గుళ్లోని ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి అను వద్ద పెడతాడు. "నువ్వు గుడికి రాలేవు కదా. అందుకని దేవుణ్ణే నీ దగ్గరకు తీసుకొచ్చా" అన్న చంటి మాటల్లోని అమాయకత్వం, నిజాయితీకి ముచ్చటపడని వాళ్లెవరు? ఆ పిల్లల స్నేహం మనసుకి హత్తుకుంటే, ఆ ఇద్దరూ విడిపోయే సన్నివేశం బాధ కలిగిస్తుంది. ఆ సన్నివేశాన్ని కల్పించిన కథకుడూ, వాటిని కదిలించేలా చిత్రీకరించిన దర్శకుడూ.. ఇద్దరూ అభినందనీయులే. విడిపోయిన ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక తిరిగి కలవాలంటే ఏదో ఒక 'సంధాన కర్త' ఉండాలి. అది ఓ జ్ఞాపకం కావచ్చు, ఓ వస్తువు కావచ్చు, ఓ వ్యక్తి కావచ్చు. ఈ సినిమాలో అలాంటి 'సంధానకర్త'గా కనిపించేది ఓ మ్యూజికల్ వాచ్. ఎమ్మార్వోగా పనిచేసే తన తండ్రికి బదిలీ కావడంతో చంటి నుంచి విడిపోక తప్పని స్థితిలో అను అతనికి ఆ మ్యూజికల్ వాచ్ ఇచ్చి, తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దానితో ఆడుకొమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఆ గడియారం కథలో ఓ మలుపుకి కారణమవుతుంది. ఆ గడియారాన్ని శ్రుతి (తనూరాయ్) వద్ద చూసి, ఆమె చెప్పిన మాటలు విని, చంటి అలియాస్ వేణు (ఉదయ్ కిరణ్)ని అపార్థం చేసుకుంటుంది అను. అలాగే ప్రీ క్లైమాక్స్‌లోనూ ఆ గడియారం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎంపీ కొడుకుతో అను పెళ్లి జరిగితేనే నీ చెల్లెలి పెళ్లి అనుకున్న ప్రకారం జరుగుతుందని అను తండ్రి వేణుని హెచ్చరిస్తే, చెల్లెలి కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటాడు వేణు. అందుకే 'మనసంతా నువ్వే' సీరియల్ రచయిత్రి రేణు, తను ప్రేమించిన అను.. ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ సంగతి ఆమెకి చెప్పకుండా "ఇప్పుడు నాకు ఆ అమ్మాయే (అను) గుర్తురావడం లేదు. అసలు ఉందో, లేదో తెలీని అమ్మాయి మీద ప్రేమేంటండీ రేణు గారూ. నా మనసంతా మీరే ఉన్నారండీ..." అంటాడు వేణు.
"అనూయే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది?" అనడుగుతుంది అను. నిజమే కదా అంటూ ఆ గడియారాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు వేణు. అప్పుడు అతడి చెంప చెళ్లుమనిపించి, "యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు" అంటా వెళ్లిపోతుంది అను. వేణు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వాన కూడా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన సునీల్ ఒడ్డున నీళ్లలో కనిపిస్తున్న గడియారాన్ని తీసుకుని వేణు వద్దకొస్తాడు. అతణ్ణి చూసి లేని నవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ ఇప్పటిదాకా అను, తను కలిసి మాట్లాడుకున్నామనీ, తను చాలా హ్యాపీగా ఫీలయ్యిందనీ అంటాడు వేణు.
గడియారాన్ని వేణు చేతిలో పెట్టిన సునీల్ "రేయ్. అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లని ఎదుటివాళ్లకి కనిపించకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావో భగవంతుడు నీకు ఆ కన్నీళ్లే మిగిల్చాడురా. ఏడవరా. వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడువ్" అంటాడు ఉద్వేగంగా. దాంతో సునీల్‌ని గట్టిగా వాటేసుకుని ఏడ్చేస్తాడు వేణు.
ఇట్లా ఆ మ్యూజికల్ వాచ్‌ని ఈ ప్రేమకథలోని మలుపులకు ఉపయోగించుకున్నారు. గమనించాల్సిన అంశమేమంటే ఓసారి అపార్థానికి కారణమైన ఆ గడియారం ఇంకోసారి ప్రేమికులిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఈ రెండో సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా కదిలిస్తుంది. ముఖ్యంగా సునీల్ డైలాగులతో వేణు పాత్ర పట్ల సానుభూతి పెల్లుబుకుతుంది. చెల్లెలి కోసం ప్రేయసికి తనంతట తానుగా దూరమయ్యే అతని పరిస్థితి ఎవర్ని మాత్రం కదిలించదు! ఆ సన్నివేశంలో వానపడటం, ఆ వానలో సునీల్ వద్ద కన్నీళ్లని దాచుకోవాలని వేణు ప్రయత్నించడం, దాన్ని గమనించిన సునీల్ మన కన్నీళ్లని ఎదుటివాళ్లకు కనిపించకుండా వర్షం దాచేస్తుందని అనడం.. రచయిత సన్నివేశ కల్పనా చాతుర్యానికి ఓ చక్కని ఉదాహరణ.
కీలకం చర్చావేదిక సన్నివేశం
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ రోజుల్లో టెలివిజన్లో పాపులర్ అయిన 'ప్రజావేదిక' కార్యక్రమం తరహాలో ఈ సినిమాలో 'స్నేహం-ప్రేమ' అనే అంశంపై పెట్టిన చర్చావేదిక సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. సినిమా మొత్తానికీ కీలకమైంది ఈ ఎపిసోడే. కథ ప్రధానమైన మలుపు తిరిగేది ఆ ఎపిసోడ్‌లోనే. సాధారణంగా సినిమాలో చర్చావేదిక అంటే సగటు ప్రేక్షకుడి దృష్టిలో విసుగు పుట్టించే వ్యవహారం. కానీ దాన్ని జనరంజకం ఎలా చేయొచ్చో ఈ సినిమా చూపించింది. ఆ చర్చావేదికలో పాల్గొన్న అను ఒక్కసారి ఆడది మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురుచూస్తుందంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. వేణు, శ్రుతి ప్రేమించుకుంటున్నారనే అపోహే ఆమె ఆవేశానికి మూలం. ఆ తర్వాత తన చిన్ననాటి నేస్తం గురించీ, ఆమె మీద ప్రేమ గురించీ ఆ కార్యక్రమంలో చెప్పిన వేణు.. ఆ స్నేహితురాలు కలిస్తే తనెవరో చెప్పకుండా ఆమె మనసులో ఏముందో తెలుసుకుంటాననీ చెబుతాడు. 'తూనీగా తూనీగా' పాట పాడతాడు. దాంతో అనుకి అతడి పట్ల ఉన్న అపోహ పటాపంచలవుతుంది. తన పట్ల అతడికి ఉన్న ప్రేమ సంగతి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తను ఎదురైతే అతను ఏం చేయదలచుకున్నాడో అదే ప్రయోగాన్ని అతడి మీద తనే చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పట్నించీ తనెవరో చెప్పకుండా వేణుకి ఆమె దగ్గరయ్యే విధానం, అతడితో ఆమె ఆడే దాగుడుమూతలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తన చిన్ననాటి నేస్తాన్ని తెలుసుకోవడం కోసం రేణు పేరుతో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ని అను రాయడం మరో ఆసక్తికర అంశం. ఇది రంగనాయకమ్మ 'రచయిత్రి' నవలని గుర్తు చేస్తుంది. ఆ నవలలో అనూరాధ అనే కలం పేరుతో రచనలు చేస్తుంది కథానాయిక విజయ. తన భార్యే అనూరాధ అనే సంగతి ఆమె భర్తకి తర్వాత తెలుస్తుంది. చిత్రమేమంటే 'రచయిత్రి' నవలా నాయిక కలం పేరు 'మనసంతా నువ్వే'లో నాయిక అసలు పేరు కావడం. కాకపోతే అ కథ వేరు, ఈ కథ వేరు.
సమష్టి కృషి ఫలితం
కథాకథనాలు రెండూ చక్కగా అమరడమే ఈ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణం. ఆ క్రెడిట్ కథా రచయిత ఎమ్మెస్ రాజు, సంభాషణల రచయితలు పరుచూరి సోదరులు, దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు దక్కుతుంది. తొలి సినిమా కావడం వల్లనేమో ఆదిత్యలోని 'ఫైర్' ప్రతి సన్నివేశ చిత్రణలోనూ కనిపిస్తుంది. ప్రధాన పాత్రలతో పాటు సపోర్టింగ్ కేరెక్టర్లనీ దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. హీరో స్నేహితుడిగా చేసిన సునీల్ పాత్ర, వీక్లీ ఎడిటర్ కూతురు శ్రుతి పాత్ర, అను తండ్రి గంగాధరం పాత్ర కథకి మంచి 'సపోర్ట్'నిచ్చాయి. ఆ పాత్రల్లో సునీల్, తనూరాయ్, తనికెళ్ల భరణి సరిగ్గా ఇమిడిపోయారు. ఇక హీరో వేణు పాత్రకి అతికినట్లు సరిపోయాడు ఉదయ్ కిరణ్. పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది. అప్పటికే అతడికొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ దీనికి మరింత వన్నె అద్దింది. నిజానికి అనూరాధ పాత్రకి రీమాసేన్ ఛాయిస్ కాదు. హీరో పాత్రలో ఉన్న భావోద్వేగాలన్నీ ఆ పాత్రలోనూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోకి తన ఐడెంటిటీ తెలీకుండా నటించే సన్నివేశాల్లో 'అండర్‌ప్లే' అవసరం. ఆ విషయంలో రీమాసేన్ ఓ మోస్తరుగానే నటించింది. అయినా ఆమెని ఆ పాత్రలో ప్రేక్షకులు ఆమోదించడానికి కారణం, ఆ పాత్రలోని బలమే. ఇక ప్రత్యేక పాత్రలో సీతారామశాస్త్రి కనిపించేది స్వల్ప సమయమే అయినా తమవైన డైలాగులతో, 'వాయిస్'తో బలమైన ముద్ర వేశారు. చంద్రమోహన్, సిజ్జు వంటివాళ్లు పాత్రల పరిధుల మేరకు రాణించారు.
సినిమాకి సగం బలం సంగీతమే అనేది నానుడి. ఈ సినిమాకి సంబంధించి అది అక్షరాలా నిజం. అప్పుడే ఎగిసిన సంగీత కెరటం ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా పాటలకి వినసొంపైన, ఆహ్లాదకరమైన బాణీలనిస్తే, పదాలతో ఆడుకునే సీతారామశాస్త్రి చక్కని సాహిత్యాన్నందించారు. 'తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే రావే నా వంకా', 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' (టైటిల్ సాంగ్) పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే వుంటే, 'కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం', 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా', 'ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా' పాటలు మంచి హిట్టయ్యాయి. ఆర్పీ కూర్చిన నేపథ్య సంగీతమూ ప్రభావవంతమైందే. మిగతా సాంకేతిక నిపుణులూ తమ వంతు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఎస్. గోపార్‌రెడ్డి కెమెరా అత్యుత్తమ స్థాయి పనితనాన్ని ప్రదర్శించింది. ఆరంభ సన్నివేశాల్లో, సముద్రం ఒడ్డున సన్నివేశాల్లో, పాటల్లో అది ఎలా హొయలు పోయిందో చూసి తీరాల్సిందే. అరకు అందాల్ని లాఘవంగా ఒడిసిపట్టింది ఆ కెమెరా. దర్శకుడు ఆదిత్య చెప్పినట్లు కె.వి. కృష్ణారెడ్డి ఎడిటింగ్ ప్రతిభ ఈ సినిమా కథనానికి బిగువుని చేకూర్చిపెట్టింది. 'మనసంతా నువ్వే' అందరి మనసుల్నీ దోచుకుని, పెట్టుబడికి ఐదు రెట్ల ఆదాయాన్ని అందించిందంటే అది సమష్టి పనితనం వల్లే.
(వచ్చే వారం ఎన్‌టీఆర్ 'ఆది' చిత్ర విశేషాలు)
No comments:
Post a Comment