Showing posts with label sridhar. Show all posts
Showing posts with label sridhar. Show all posts

Saturday, November 24, 2012

ఆడది గడప దాటితే (1980) - సమీక్ష


మన సమాజంలో పురుషునికి లేకుండా స్త్రీకి మాత్రమే కొన్ని కట్టుబాట్లు నిర్దేశించారు. గడప దాటిన స్త్రీకి అగచాట్లు, నగుబాట్లు తప్పవని చెప్పే కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. గడప దాటిన స్త్రీని సమాజం ఎంతగా హింసిస్తుందో చలం సైతం తన రచనల్లో ఎంతో సహజంగా చిత్రించాడు. ఫలానా అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందని హేళన చేయడం తేలికే. కానీ అలా వెళ్లిందంటే దాని వెనక ఎంతటి బలీయమైన కారణం ఉండి ఉంటుందని ఆలోచించేవాళ్లు బహు అరుదు. ఇదే పాయింటుతో దర్శకుడు బి.ఎస్. నారాయణ రూపొందించిన సినిమా 'ఆడది గడప దాటితే'.
కోటీశ్వరుడు రఘునందనరావు ఏకైక కుమార్తె కరుణ. రాహుల్ అనే యువకుడు, కరుణ గాఢంగా ప్రేమించుకుంటారు. కరుణ వెనకున్న ఆస్తిని చూసే ఆమెని రాహుల్ ప్రేమిస్తున్నాడనేది రఘునందనరావు నమ్మకం. రాహుల్‌ను ఇంటికి పిలిపించి అవమానిస్తాడు. అయినా కరుణ, రాహుల్ జంకరు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం తేదీ నిర్ణయించుకుంటారు. ఇంట్లోంచి వచ్చేసిన కరుణకు చిల్లిగవ్వ ఆస్తి రాదని తెలిసిన రాహుల్ మాయమైపోతాడు. రోడ్డునపడిన కరుణను ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఆదుకుంటాడు. ఆమెని నమ్మించి గుళ్లో పెళ్లి చేసుకుంటాడు. కరుణకు నెలలు నిండిన సందర్భంలో కృష్ణకు అదివరకే పెళ్లయిందనే సంగతి తెలుస్తుంది. కరుణను ఆస్పత్రిలో చేర్పించి, ఆ ఊరినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడు కృష్ణ. మగబిడ్డను కన్న కరుణకు ఆర్టిస్ట్ మధుబాబు ఆశ్రయమిస్తాడు. తన చిత్రాలకు ఆమెను మోడల్‌గా తీసుకుంటాడు. ఆమెపై అతను ప్రేమ పెంచుకుంటున్న సమయంలోనే అతని స్నేహితుడు, కోటీశ్వరుడు ఆయిన ఆనంద్ రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నది పతాక సన్నివేశం.
కరుణగా కన్నడ మంజుల సమర్థవంతంగా నటించింది. రాహుల్‌గా నరసింహరాజు, మధుబాబుగా మురళీమోహన్, ఆనంద్‌గా శ్రీధర్ రాణించారు. జగ్గయ్య, శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్ ఇతర ప్రధాన పాత్రధారులు. యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాయగా, దాశరథి, సినారె, కోపల్లె పాటలు రాశారు. ఎం.బి. శ్రీనివాస్ కూర్చిన బాణీలు శ్రవణానందకరం. చక్కటి డ్రామాతో బి.ఎస్. నారాయణ ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారు. శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి. రామచంద్రరావు, ఎం.ఎం. రాజా, సి. సుబ్బారాయుడు ఈ సినిమా నిర్మించారు.

Thursday, August 18, 2011

న్యూస్: 'ఇట్స్ మై లవ్‌స్టోరీ'తో ఆశ నెరవేరుతుందా?

లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'స్నేహ గీతం'తో దర్శకుడిగా పరిచయమైన 'మధుర' శ్రీధర్‌రెడ్డి త్వరలో 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త తారలతో అతను రూపొందించిన 'స్నేహ గీతం' పబ్లిసిటీ ఇచ్చిన స్థాయిలో ఆడకపోయినా డైరెక్టర్‌గా శ్రీధర్‌రెడ్డి ఫర్వాలేదనిపించాడు. ఆ సినిమా తర్వాత పెద్ద హీరోలతో కాకపోయినా ఓ మాదిరి హీరోల నుంచైనా తనకి కాల్స్ వస్తాయని అతను ఊహించాడు. అలాగే నిర్మాతల నుంచి ఆఫర్లు వస్తాయనుకున్నాడు. అవేవీ జరగకపోవడంతో తిరిగి కొత్త తారలతోటే సినిమా తీయడానికి సిద్ధమైపోయాడు. నిర్మాతగా ఓ ఎన్నారైని దొరకబుచ్చుకున్నాడు. అలా 'ఇట్స్ మై లవ్‌స్టోరీ'ని తీశాడు. ఈ సినిమా ద్వారా అరవింద్‌కృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. అతను ఈ సినిమాకి ముందు డి. రామానాయుడు నిర్మించిన ఫ్లాప్ ఫిల్మ్ 'ఆలస్యం అమృతం'లో నటించాడు (హీరోగా కాదు). ఇక హీరోయిన్ నిఖితకు ఇదే తొలి చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' సెప్టెంబరులో రిలీజ్ కానున్నది. చాలా కాలం తర్వాత వెటరన్ యాక్టర్లు జయసుధ, శరత్‌బాబు కలిసి ఇందులో నటించారు. ఇందులో జయసుధ హీరో తల్లిగా, శరత్‌బాబు హీరోయిన్ తండ్రిగా నటించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ గేం డిజైనర్ (అరవింద్‌కృష్ణ)కీ, వైజాగ్‌కి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ (నిఖిత)కీ మధ్య చిగురించే ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందీ, చివరికి ఎలా సుఖాంతమయ్యిందీ అన్నది ఈ సినిమా కథ. ఈ లవ్‌స్టోరీతో డైరెక్టర్‌గా తనకి మరింత పేరు వస్తుందనీ, తద్వారా క్రేజీ ఆఫర్లు రావడం ఖాయమనీ శ్రీధర్‌రెడ్డి ఆశిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

Saturday, October 30, 2010

ఆనాటి సంగతి: 'పెళ్లి కానుక' రజతోత్సవం

అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి, కృష్ణకుమారి, జగ్గయ్య కాంబినేషనులో వచ్చిన 'పెళ్లి కానుక' (1960) చిత్రం విజయవాడ అలంకార్ థియేటర్లో 25 వారాలు (175 రోజులు) ఆడింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజతోత్సవం మద్రాసులోని న్యూవుడ్ లాండ్స్ హోటల్లో 1960 నవంబర్ 6న జరిగింది. ఆరోజు కుంభవృష్టిగా వాన పడుతున్నా లెక్కచెయ్యక ఆహ్వానితులంతా వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సినిమాలోని ప్రధాన నాయిక బి. సరోజాదేవి రాలేదు. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్లలో అక్కినేని, బిఎన్ రెడ్డి, డి. మధుసూదనరావు, గుమ్మడి, జగ్గయ్య, సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు జానకి, రేలంగి, గిరిజ, మాలతి, పి. సుశీల, జిక్కి, ఎస్. జానకి, దేవిక, చక్రపాణి, తాపీ చాణక్య, తాతినేని ప్రకాశరావు, బిఎ సుబ్బారావు, ఎవి సుబ్బారావు, ఎ.ఎం. రాజా, పేకేటి శివరామ్, శ్రీధర్ (డైరెక్టర్), బి. నాగిరెడ్డి, చిత్తూరు నాగయ్య, జెమిని గణేశన్, వీనస్ ఫిలిమ్స్ కృష్ణమూర్తి, నవయుగ ఫిలిమ్స్ శ్రీనివాసరావు, అలంకార్ థియేటర్ ఎస్. విష్ణురావు తదితరులు ఉన్నారు.                              

Saturday, August 21, 2010

Movies: Why partiality on Telangana films?


నేటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని తెలంగాణా నేపథ్య చిత్రాల్ని కొన్ని ప్రాంతాలవారే ఆదరించడం, కొన్ని ప్రాంతాలవారు నిరాకరించడం సబబేనా? 'కొమరం భీమ్', 'వీర తెలంగాణా' సినిమాల గురించే నేను ప్రస్తావిస్తున్నది. అమాయక గిరిజనులపై నిజాం పాలకుల, ఆనాటి పోలీసుల దుర్మార్గాల్ని ఎదిరించి, గోండుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలొడ్డి పోరాడిన గోండు వీరుని కథతో 'కొమరం భీమ్' వస్తే, 1945-50 మధ్యకాలంలో నిజాం పాలకుల దౌర్జన్యాల్ని నిరసిస్తూ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మహోదృతంగా జరిగింది. ప్రపంచంలోనే ఇలాంటి పోరాటం ఎక్కడా జరగలేదని ప్రపంచ మేధావులే కొనియాడిన ఆ పోరాటంపై ఆర్. నారాయణమూర్తి 'వీర తెలంగాణా' తీశారు. ఈ రెండు సినిమాలకూ, ప్రత్యేక తెలంగాణతో కానీ, నేటి రాజకీయాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆ సినిమాలవేపు మన కోస్తాంధ్ర, రాయలసీమ సోదరులు కన్నెత్తి చూడలేదు. అవి బాగాలేక కాదు. తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చాయనే భావనతో. 'కొమరం భీమ్' సినిమా కేవలం తెలంగాణ ఏరియాలోనే విడుదలైతే, 'వీర తెలంగాణా'ను తెలంగాణతో పాటు కొన్ని కోస్తా, సీడెడ్ ఏరియాల్లో రిలీజ్ చేశారు. కానీ జనం అసలు రాకపోవడంతో ఆ ప్రింట్లను కూడా తెలంగాణ ప్రాంతాల్లోనే నారాయణమూర్తి రిలీజ్ చేయాల్సి వచ్చింది.
'కొమరం భీమ్'ని 20 ఏళ్ల క్రితమే డైరెక్టర్ అల్లాణి శ్రీధర్ రూపొందించారు. 1990 సంవత్సరపు నంది అవార్డుల్లో ఆ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డుల్ని సాధించింది. విమర్శకుల ప్రశంసలూ దానికి దక్కాయి. 20 ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదలకు నోచుకున్న ఆ సినిమా తెలంగాణలో 50 రోజులు పూర్తి చేసుకుంది. కానీ ఆంధ్రా, రాయలసీమల్లో మాత్రం దాన్ని పట్టించుకున్నవాళ్లే లేరు. హాలీవుడ్, బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న, తమిళం నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాల్ని కూడా ఆదరిస్తున్న మన సినిమా ప్రియులు మన తెలుగు సినిమాల విషయంలో ఇలా పక్షపాతం చూపించడం కరెక్టేనా?

Wednesday, June 30, 2010

'Komaram Bheem' is coming to cinema halls

ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనుల హక్కుల కోసం చావుకు తెగించి పోరాడిన గోండు యోధుడు కొమరం భీం కథ ఎంతో ఉత్తేజభరితం, మరెంతో ఉద్వేగభరితం. ఆయన కథతో సుమారు 20 యేళ్ల క్రితం రూపొందిన 'కొమరం భీం' సినిమా ఇన్నాళ్లకి జూలై 2న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నవలా రచయితా అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న అల్లాణి శ్రీధర్‌కి డైరెక్టర్‌గా ఇదే తొలి సినిమా. 'మాభూమి' చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు పొందిన సినీ నవలా రచయిత ఎస్.ఎం. ప్రాణ్‌రావు ఈ చిత్రానికి రచన చేసి, సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఆయనా, శ్రీధర్ కలిసి ఆదిలాబాద్ అడవుల్లో మూడు నెలలు గోండులతో కలిసి గడిపి వారి ఆచారాలు, సంప్రదాయాలు, శుభ, అశుభ కార్యక్రమాలను అధ్యయనం చేశారు. "కొమరం భీం భార్య ఎక్కడ ఉన్నారో కనుగొని, ఆమెని కలిశాం. అప్పుడామె దయనీయ స్థితిలో ఉన్నారు. భీం గురించి ఆమె చాలా విషయాలు చెప్పారు" అని తెలిపారు ప్రాణ్‌రావు. కొమరం భీం పాత్రని రంగస్థల నటుడు, రచయిత అయిన భూపాల్‌రెడ్డి పోషించారు. "కొమరం భీం ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఆ పాత్ర పోషణ చేశారు భూపాల్" అని ప్రాణ్‌రావు, శ్రీధర్ ఇద్దరూ ప్రశంసించారు.
విశేషమేమంటే ఈ చిత్రంలోని పాటల్ని భూపల్ స్వయంగా రాశారు. అంతకంటే విశేషం, ఆ పాటలకి అవార్డు చిత్రాల దర్శకుడు గౌతం ఘోష్ సంగీతం సమకూర్చడం. అప్పట్లోనే నంది అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డులు లభించాయి. అయితే "దర్శకుడిగా నంది అవార్డును తీసుకున్నా నాకు తృప్తిలేదు. నాకు కావలసింది నంది కాదు, ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకుడి చేతిలోని టిక్కెట్టు. ఈ సినిమా ఇన్నాళ్లకి విడుదలవబోతోందంటే ఎంతో భావోద్వేగంగా ఉంది" అని సహజంగీనే స్పందించారు శ్రీధర్.
ఈ సినిమా షూటింగ్ అంతా ఆదిలాబాద్ అడవుల్లో జరిగింది. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ ఈ సినిమా కోసం పనిచేశారు. "ఈ సినిమా రూపకల్పన విషయంలో ఆదిలాబాద్ గిరిజనుల సహకారం మరవలేనిది. ఇది తెలంగాణ కథ. ఇందులోనివి తెలంగాణ మాటలు, పాటలు. అడవిలోనే మొత్తం షూటింగ్. నాతో సహా అందరూ నేలమీదే పడుకుని, నదిలో స్నానం చేసేవాళ్లు షూటింగ్ జరుగుతున్నంత కాలం" అని అప్పటి రోజుల్ని భూపాల్ జ్ఞప్తి చేసుకున్నారు. ఆదివాసి చిత్ర (ఐటిడిఎ, ఉట్నూరు), ఫిల్మీడియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భీం భార్యగా మౌనిక నటించగా, శ్రీధర్ మిత్రుడు కె. భవానీశంకర్ సినిమాటోగ్రఫీని అందించారు. గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ఎఫ్.డి.సి., కొమరం భీం ఫౌండేషన్ ద్వారా జూన్ తొలి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్‌సింగ్ లాగా, జనం హృదయాల్లో నిలిచిన పోరాట యోధుడు 'కొమరం భీం' జీవితాన్ని తెరమీద చూసే అవకాశం ఇన్నాళ్లకైనా కలుగుతుండటం హర్షణీయం.