Showing posts with label magadheera. Show all posts
Showing posts with label magadheera. Show all posts

Tuesday, October 13, 2015

Rajamouli's Answers With BAAHUBALI

సీక్వెల్ పనిలో.. 



పోటీ తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, సినిమా జూదంగా మారిపోయిన సంధి కాలంలో డైరెక్ట్‌ చేసిన పది సినిమాల్లో తొమ్మిది సినిమాలు నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాయంటే, వాటిలో రెండు ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయంటే ఆ దర్శకుణ్ణి ఏమని పిలవాలి? దర్శకుల్లోనే ‘బాహుబలి’ అని. ఆ ‘బాహుబలి’ యస్‌.యస్‌. రాజమౌళి కాకపోతే ఇంకెవరవుతారు! ఇవాళ ‘బాహుబలి’ ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌. రాజమౌళి ఓ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలతో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలిపిన ఆయన ‘బాహుబలి: ద బిగినింగ్‌’తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒక్క ‘సై’ మినహా ఆయన రూపొందించిన మిగతా సినిమాలన్నీ హిట్టే. ‘సై’ కూడా కాస్ట్‌ ఫెయిల్యూర్‌ మాత్రమే. ‘బాహుబలి’ సినిమా తెలుగులోనే కాకుండా దక్షిణ భారతావనిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రకెక్కి, ప్రపంచవ్యాప్త వసూళ్లలో టాప్‌ 3 ఇండియన్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇక దేశీయ వసూళ్లలో నెంబర్‌వన్‌ ప్లేస్‌ ‘బాహుబలి’దే. ఇంతటి చరిత్రకు కారకుడైన రాజమౌళి ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ అయిన ‘బాహుబలి: ద కంక్లూజన్‌’ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు. విమర్శకుల ప్రకారం మొదటి సినిమాను ‘ఇంటర్వెల్‌’లో ఆపేసిన ఆయన, పోస్ట్‌ ఇంటర్వెల్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ భాగాల్ని తీస్తున్నాడన్న మాట. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య పరిచయం ఎలా జరిగింది? ఆ పరిచయం ప్రణయంగా ఎలా మారింది? అది పెళ్లిగా ఎలా రూపాంతరం చెందింది? దేవసేనపై మోజుపడ్డ భల్లాలదేవ దీన్నంతా చూస్తూ ఊరుకున్నాడా? బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? అమరేంద్ర బాహుబలి కొడుకు, పసికందు మహేంద్ర బాహుబలిని రాజమాత శివగామి ఎలాంటి పరిస్థితుల్లో కాపాడింది? భర్త హత్యకు కొడుకు మహేంద్ర/శివుడు సాయంతో దేవసేన ఎలా ప్రతీకారం తీర్చుకుంది?... ఇవన్నీ ‘బాహుబలి’ చూశాక మన మనసుల్లో తలెత్తిన ప్రశ్నలు. వాటన్నింటికీ సీక్వెల్‌లో సమాధానాలివ్వబోతున్నాడు రాజమౌళి. దీని కథేమిటో ముందే మనకు తెలిసినా, ఎలా తీసుంటాడనే కుతూహలం అందరిలోనూ ఉంది. సన్నివేశాల కల్పన, భావోద్వేగాల చిత్రణ విషయంలో సామాన్య ప్రేక్షకులఊహల్ని ఎప్పుడూ సంతృప్తిపరుస్తూనే ఉన్నాడు రాజమౌళి. ‘బాహుబలి: ద కంక్లూజన్‌’తోనూ ఆయన ఆ మ్యాజిక్‌ను మరోసారి చూపిస్తాడనేది ఖాయం. చూడాల్సింది.. అది ‘బాహుబలి’ని మించుతుందా, లేదా?.. అని మాత్రమే.

- ఆంధ్రజ్యోతి డైలీ, 10 అక్టోబర్ 2015

Wednesday, November 2, 2011

'బద్రినాథ్' బాధ నుంచి తేరుకున్న దర్శకుడు

అల్లు అర్జున్ కెరీర్‌లోనే నెంబర్‌వన్ సినిమా అవుతుందని ఎంతగానో ఆశించిన 'బద్రినాథ్' బాక్సాఫీస్ వద్ద ఫెయిలవడంతో మానసికంగా కలతచెందిన ఏస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఇప్పుడు ఆ బాధనుంచి కోలుకుని తదుపరి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా బాక్సాఫీసులు బద్దలుకొట్టే సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను చెప్పిన కథకి ఇప్పటికే రాంచరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. 'మగధీర'లో ప్రేమికులుగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న రాంచరణ్, కాజల్ అగర్వాల్ మరోసారి ఈ సినిమాలో జంటగా నటించనున్నారనే వార్తలు రావడంతో అందరి దృష్టీ ఈ ప్రాజెక్టు పైకి మళ్లింది. కొంత కాలంగా వినాయక్ వద్దే పనిచేస్తున్న ఆకుల శివ ఈ సినిమాకి కథని అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నాడు. 'బద్రినాథ్' చేదు అనుభవాన్ని ఈ సినిమాతో చెరిపివేయాలనే పట్టుదలతో ఉన్న వినాయక్ దీని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. 'మగధీర'లో ఎమోషనల్, లవ్ సీన్లలో రాంచరణ్ కనపర్చిన ప్రతిభావంతమైన అభినయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టులో ఇటు లవ్‌నీ, అటు ఎమోషన్స్‌నీ సమపాళ్లలో మేళవిస్తున్నట్లు సమాచారం. 

Wednesday, October 19, 2011

వేలానికి 'దూకుడు' దుస్తులు

శ్రీను వైట్ల రూపొందించిన 'దూకుడు' చిత్రంలోని క్లైమాక్స్ సాంగ్‌లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన ప్రత్యేక దుస్తుల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') వేలానికి పెట్టింది. ఈ నెల 25లోగా ఎవరైతే ఎక్కువ ధరకి వేలం పాడతారో వారికి మహేశ్ చేతుల మీదుగా వాటిని అందజేస్తామని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. మంగళవారం నిర్మాతల మండలి హాలులో జరిగిన సమావేశంలో ఈ సంగతిని ఆయన ప్రకటించారు. "ఈమధ్య కాలంలో అనేక ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మహేశ్, శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' ఓ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఊపిరిపోసింది. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలోనూ గత రికార్డుల్ని బద్దలు కొడుతోంది. కలెక్షన్ల విషయంలో 'మగధీర'ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. రూ. 80 కోట్ల వసూళ్ల అంచనాల్ని దాటి రూ. వంద కోట్ల అంచనాలకి చేరుకోవడం సామాన్య విషయం కాదు. ఈ సినిమాతో మహేశ్ ఇమేజ్ ఎంతగా పెరిగిందంటే ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా 50 మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేశ్ వచ్చాడు. అదీ అతని ఘనత. శ్రీను వైట్ల హీరోలతో కామెడీ చేయిస్తే తిరుగుండదని 'దూకుడు' మరోసారి చెప్పింది. కేవలం కమెడియన్లతోటే కాకుండా హీరోలతోనూ కామెడీ చేయించి మెప్పిస్తుంటాడు. త్వరలో హిందీలోనూ 'దూకుడు'ను డైరెక్ట్ చేయబోతున్నాడు. అతను అక్కడా విజయఢంకా మోగించాలి. గతంలో కొన్ని సినిమాల వస్తువుల్ని వేలం వేసి పేద కళాకారుల కోసం వినియోగించాం. ఇప్పుడు 'దూకుడు'లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన కాస్ట్యూమ్స్‌ని వేలం వేస్తున్నాం'' అని చెప్పారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ "దూకుడు సినిమా ఎంతగా రికార్డు కలెక్షన్లని సాధిస్తున్నదో అందుకు తగ్గట్లుగా ఈ కాస్ట్యూమ్స్‌ని మహేశ్ అభిమానులు అధిక ధరకు సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నా. తద్వారా వారు ఓ మంచి పనికి ఉపయోగపడతారు. మేం కూడా ఊహించని స్థాయిలో 'దూకుడు' హిట్టయింది'' అని తెలిపారు.
శ్రీను వైట్ల తన సినిమాల్లో తెలుగు నటులకి అవకాశమివ్వాలని 'మా' సంయుక్త కార్యదర్శి మహర్షి సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టార్స్ డాట్ కామ్ శేఖర్, 'మా' సభ్యులు జయలక్ష్మి, మాణిక్ పాల్గొన్నారు.

Thursday, September 29, 2011

న్యూస్: 'దూకుడు'కు అమెరికన్ డైలీ ప్రశంసలు

ఓ భారతీయ చిత్రాన్ని అమెరికన్ పత్రికలు ప్రశంసించాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఓ తెలుగు సినిమాని అక్కడి పత్రికలు మెచ్చుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిందే. ఇప్పుడు మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' అమెరికాలో సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం చూసి అమెరికన్ పత్రికలు సైతం విస్తుపోతున్నాయి. అక్కడి పేరుపొందిన పత్రికల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ - 'దూకుడు', ద బిగ్గెస్ట్ హిట్ యు హావ్ నెవర్ హార్డ్ ఆఫ్ - అంటూ ఓ వ్యాసాన్నే ప్రచురించడం అమెరికాలో తెలుగు సినిమాకి దక్కిన గుర్తింపు, గౌరవంగా భావించవచ్చు. ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'మనీబాల్', 'అబ్డక్షన్స్', 'డాల్ఫిన్స్ టేల్స్'కు దీటుగా టాలీవుడ్‌కి చెందిన 'దూకుడు' సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఆ పత్రిక పేర్కొంది. ఇదివరకు అమెరికాలో ఓ తెలుగు సినిమా ('మగధీర') మూడు నెలల్లో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు కాగా, ఇప్పుడు 'దూకుడు' చిత్రం కేవలం తొలి మూడు రోజుల్లోనే 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అనూహ్యమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

Saturday, September 24, 2011

న్యూస్: దున్నేస్తున్న 'దూకుడు'

విడుదలకు ముందే అనేక రికార్డుల్ని సొంతం చేసుకున్న మహేశ్ 'దూకుడు' టైటిల్‌కి పూర్తి న్యాయం చేకూరుస్తూ తొలిరోజు కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుని సృష్టించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ థియేటర్లలో విడుదలైన రికార్డుని సొంతం చేసుకున్న 'దూకుడుకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకుల స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. తొలిరోజు 'మగధీర' రికార్డుల్ని 'దూకుడు' అధిగమించిందనేది ట్రేడ్ రిపోర్ట్. మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' రికార్డుల్ని ఈ సినిమా మూడు నుంచి నాలుగు వారాల్లో అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జి. అజయ్‌కుమార్ ఐపియస్ పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉండటంతో కనీసం 15 నుంచి 20 నిమిషాల నిడివి తగ్గించాలని విమర్శకులు సూచిస్తున్నా ట్రెండ్ చూస్తుంటే లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా కనిపించడంలేదు. 'పోకిరి' తర్వాత మహేశ్ సినిమాలు 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' ఆడకపోవడానికి ప్రధాన కారణం వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడమేనని భావించిన శ్రీను వైట్ల, అతని రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ 'దూకుడు'ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలచడంలో విజయం సాధించారు. స్వతహాగా రచయిత కూడా అయిన శ్రీను వైట్ల ఇందులో అనేక పంచ్ డైలాగుల్ని స్వయంగా రాశాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పాత్రలతో పాటు మహేశ్ సైతం కామెడీని పంచడంతో వినోదానికి కొదవ లేకుండా పోయింది. సినిమా ట్యాగ్‌లైన్ 'డేరింగ్ అండ్ డేషింగ్'కు తగ్గట్లు మహేశ్ కేరక్టర్ రూపొందింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ మాస్ ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది. ఆ పాత్రలో చెలరేగిన మహేశ్ సినిమానంతా తన భుజాల మీద మోశాడు. అతని డైలాగ్ డిక్షన్, మధ్య మధ్యలో హైదరాబాద్ హిందీలో, తెలంగాణ యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాశ్‌రాజ్, మహేశ్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా 2011లో తొలి సూపర్ డూపర్ హిట్‌కు మార్గం సుగమమైంది. 'దూకుడు' ఏ స్థాయి రికార్డుల్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి.

Monday, September 5, 2011

ఇంటర్వ్యూ: గోపీమోహన్

'దూకుడు' సబ్జెక్ట్ ఎలా పుట్టింది?
'దూకుడు' సబ్జెక్టుకి పెద్ద కథే ఉంది. మహేశ్‌తో సినిమా చెయ్యాలనేది శ్రీను వైట్ల గారికి ఎప్పట్నించో ఉన్న కోరిక. 'ఖలేజా' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్ గారు పిలిచి "మీరు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టండి. నా తర్వాతి సినిమా మీతోనే" అన్నారు. అప్పటిదాకా ఆయన తర్వాతి సినిమా ఏదో క్లారిటీ లేదు. రెండు మూడు పేర్లు వినపడుతూ ఉన్నాయి. మహేశ్ ఎప్పుడైతే తర్వాతి సినిమా మీదే అన్నారో శ్రీను ఆ బాధ్యతని ఎలా ఫీలయ్యారంటే ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యకూడదు. కథ పరంగా, అన్ని విషయాల పరంగా జాగ్రత్తగా ఉండాలి - అనే ఆలోచనతో స్పాన్ ఉన్న హీరో కాబట్టి 'మగధీర'లాగా గ్రాండియర్‌గా వెళ్దామా అనుకున్నారు. తర్వాత అది ఈయన శైలికి దూరంగా ఉండే సినిమా, అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కి అంటే కామెడీకి పెద్దగా స్కోప్ కనిపించడం లేదు, హెవీ బ్యాక్‌గ్రౌండ్స్ అసలు సూటవుతాయా అనుకుంటూ దాన్నుంచి డ్రాప్ అయ్యాం. తర్వాత ఓ లవ్‌స్టోరీ అనుకున్నాం. దాని మీద చాలా కాలం కూర్చున్నాం. మహేశ్‌కి లైన్ చెబితే ఆయనకి నచ్చింది. తాను కూడా పూర్తి స్థాయి లవ్‌స్టోరీని అంతదాకా చెయ్యలేదనీ, చెయ్యమనీ చెప్పారు. మా ఉద్దేశంలో 'ఆనందం' తర్వాత శ్రీను గారు మళ్లీ ఆ తరహా సినిమా చెయ్యలేదు అనేది మా ఫీలింగ్. మహేశ్‌కి అలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీని ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ పెట్టుకుని చేస్తే బాగుంటుందనుకుని మేం ప్లాన్ చేశాం. కానీ మహేశ్ అంటే యాక్షన్ కూడా కోరుకుంటున్నారు జనం. మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం పంచ్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల డిస్కషన్ల తర్వాత ఆ లవ్‌స్టోరీని పక్కనపెట్టి ఎంతో తర్జనభర్జన తర్వాత ఓ అద్భుతమైన లైన్‌ని సెట్ చేశాం. 'ఇది తప్పు చెయ్యదు. జనాలకి ఇది బాగా నచ్చే అవకాశం 100% ఉంది. దీంట్లో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి' అనుకుని దీన్ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసం ఈ ఆర్నెల్లూ శ్రమించాం.
మహేశ్‌కి ఎన్ని వెర్షన్స్ వినిపించారు?
నిజానికి మహేశ్ ఒక మనిషిని నమ్మిన తర్వాత - అది శ్రీను వైట్ల కానివ్వండి, గుణశేఖర్ కానివ్వండి, త్రివిక్రం కానివ్వండి - లైన్ ఓకే చెప్పాక ఆయన ఇంక జోక్యం చేసుకోరు. ప్రతి విషయాన్నీ అదెలా వచ్చిందీ, ఇదెలా వచ్చిందీ అని అడగరు. ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తారు. "నా కెరీర్లో 'ఒక్కడు', 'పోకిరి' సినిమాల రేంజిలో నిలబడే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చేసిన సినిమాలకు ఇలా చెప్పలేదు. మీరెంత చేసుకుంటే అంత ఈ సినిమా పొటెన్షియాలిటీ ఉంటుంది. మీ మార్క్ మిస్ కాకుండా చెయ్యండి" అన్నారు. దాంతో దాన్ని మేమే ఓ ఛాలెంజిగా తీసుకుని ఫస్టాఫ్ ఆరేడు వెర్షన్లు చేశాం. మహేశ్‌కి ఫైనల్ వెర్షన్ వినిపించాం. షూటింగుకి వెళ్తున్న దశలో ఆయనకి మొత్తం కథ చెప్పాం. ఆయన 'గో ఎ హెడ్' అన్నారు. అప్పట్నించి ఇప్పటివరకు ఆయన నుంచి పూర్తి సహకారం. ఆయనకి యాక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. వాటి మీద ఆయన చిన్న చిన్నవే అయినా మంచి డౌట్స్ అడిగారు. ఆ మార్పులు కూడా బాగా జరిగాయి. అలాగే స్క్రీన్‌ప్లేలో రెండు మూడు చిన్న సూచనలు చేశారు. కన్ఫ్యూజన్‌కి తావులేకుండా అవి బాగా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ తర్వాత చూసుకున్నాక వాటికి చాలా సంతోషపడ్డాం.
మహేశ్ కోసం ప్రత్యేకించి ఈ సబ్జెక్టులో ఏవైనా విశేషాల్ని ప్రవేశపెట్టారా?
మహేశ్‌బాబు అనగనే ప్రేక్షకులు క్లాస్, యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటి ఆయన్ని కొంత మోతాదు తగ్గించి లోకల్‌గా చూపించారు 'పోకిరి'లో పూరి జగన్నాథ్ గారు. ఆ తర్వాత మేము బాగా లోకల్ టోన్ ఉన్న డైరెక్టర్ అండ్ రైటర్. మా స్క్రిప్ట్స్ అన్నిట్నీ మీరు గమనిస్తే మన ఇంటీరియర్ పీపుల్ హావభావాలకి దగ్గరగానే అవుతా ఉంటాం. ఈ సినిమాలోనూ అలాగే ఓపెన్ అయ్యి చూపిద్దాం అని ఫిక్సయి చేశాం.
మహేశ్ కేరక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది?
మహేశ్ క్యారెక్టరైజేషన్ మంచి యాటిట్యూడ్‌తో ఉంటుంది. ఆ యాటిట్యూడ్ సినిమాలో చాలా హైలైట్‌గా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన నిల్చునే స్టైల్ గానీ, ఆయన మాట్లాడే విధానం గానీ, ఆయన ఇగో ఫీలయ్యే విధానం గానీ, లేకపోతే ఆయన డైలాగ్ చెప్పే టోన్ గానీ ఇవన్నీ బయటివాళ్లు అనుకరించే స్థాయిలోనే ఉంటాయి.
'కింగ్‌'కి ఆర్నెల్లే టైం ఉండటం వల్ల కొన్ని తప్పులు సరిచేయలేకపోయామన్నారు. ఇప్పుడు 'దూకుడు'ని కూడా ఆర్నెల్లలోనే తీశారు...
కాదండీ. ఈ సినిమా వర్క్ మొదలై దాదాపు రెండేళ్లయ్యిందండీ. 'నమో వెంకటేశ' 2010 జనవరిలో రిలీజయ్యింది. అప్పట్నించీ మేం ఈ ప్రాజెక్టు మీదే స్ట్రగులవుతూ ఉన్నాం. సెకండాఫ్ మీదైతే ఏడెనిమిది నెలలు కూర్చున్నాం. షూటింగుకి వెళ్లేటప్పటికి ఫస్టాఫ్ పక్కాగా రెడీ అయ్యింది. సెకండాఫ్ మేమో వెర్షన్ అనుకుని చెప్పాం. కానీ మధ్యలో ఇండస్ట్రీ స్ట్రైక్ రావడం, అప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కంటిన్యూగా సిట్టింగ్స్ వేస్తూ వచ్చాం.
సంభాషణల రచయితగా కోన వెంకట్ పాత్రేమిటి?
ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్ కాబట్టి ముందే ట్రీట్‌మెంట్ అనుకునేటప్పటికే 70% దాకా సంభాషణలు ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. డైలాగులు ఎలా ఉండాలో డైరెక్టర్ గారే చెబుతారు. 'వెంకీ' నుంచి మా అన్ని సినిమాలకి కోన గారే మాటల రచయిత. మాటల విషయంలో ఆయనకీ, మాకూ బ్రహ్మాండంగా సింకవుతుంది. ఈ సినిమాలో అద్భుతమైన మాటలు రాశారు. ఈ మాటల్లో శ్రీను వైట్ల గారి భాగస్వామ్యం కూడా ఉంది.
పంచ్ డైలాగుల గురించి చెప్పండి..
ఫ్రాంకుగా చెప్పాలంటే కొన్ని డైలాగులు నాకు శ్రీను గారు చెప్పేటప్పుడు "ఈ డైలాగుల్లో ఇంత పంచ్ ఉందా?" అనిపించింది. ఉదాహరణకి "మైండులో ఫిక్సయితే బ్లైండుగా వెళ్లిపోతాను' అనేది. ఆయన 'ఇది చూడండి. భలే ఉంటుంది' అనేవారు. డబ్బింగ్ అయిపోయి ట్రైలర్ వదిలినప్పుడు దానికొచ్చిన రియాక్షన్ చూసి నేనే షాకయ్యా 'ఇంత రియాక్షన్ ఉంటుందా' అని. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. ఆయన పర్టిక్యులర్‌గా ఫిక్సయి రాశారు. శ్రీను గారు చెబుతూ వచ్చారు - "ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్‌ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్‌గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్‌ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్‌కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు.
మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెబుతారా?
బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు.
'నమో వెంకటేశ' దాకా మీ సినిమాలన్నీ ఓకే పేటర్న్‌లో ఉన్నాయనే పేరొచ్చింది. 'దూకుడు' ఎలా ఉండబోతోంది?
ఆ పేటర్న్ లేకపోతే జనాలు చూడరేమో అనే ఫీలింగ్ ఉంటుండేది. కానీ అదే చేసుకుంటూ పోతే మొనాటనీ ఫీలయ్యే అవకాశం ఉంది. మీరు గమనిస్తే మేం ఎక్కువగా ఇళ్లల్లోనే సినిమా చేసుకుంటూ వస్తున్నాం. దాని వల్ల ఓ గ్రూప్ మధ్య కథ సెటిలవుతుంది. మంచి కమెడీకి ఆస్కారం కలుగుతుంది. బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ పేటర్న్‌ని మరికొంత మంది కూడా ఫాలో అయ్యారు. ఇలా బోల్డన్ని సినిమాలు రావడంతో మేం కూడా రిపిటిషన్ చేసినట్లయ్యింది. అందుకే 'దూకుడు'కి పెద్ద స్పాన్ పెట్టుకున్నాం. టర్కీ లొకేషన్లకి వెళ్లాం. ఎమోషన్స్‌కి కూడా రకరకాలుగా డీల్ చేశాం. ఇదివరకు డీల్ చెయ్యని ఎమోషన్స్‌ని డీల్ చేశాం. ఇదివరకు ఏ సినిమాలో చెయ్యని రీతిలో ఇందులో శ్రీను హ్యూమన్ ఎమోషన్స్‌ని బాగా డీల్ చేశారు. ఓ పర్పస్ కోసం సినిమా జరుగుతుంటుంది. ఇదివరకు ఎందులోనూ లేని విధంగా ఇందులో ఆ పర్పస్‌ని చాలా స్ట్రాంగ్‌గా పెట్టాం. 'ఢీ', 'రెడీ'లో లవర్ కోసం చేసేదుంటుంది. ఇందులో లవర్ కోసమని కాకుండా స్ట్రాంగ్ హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. దసరా పండక్కి అందరూ ఎంజాయ్ చేసే రీతిలో 'దూకుడు' ఉంటుంది. 'రెడీ' తర్వాత అంత హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్. మొదట్నుంచీ చివరి దాకా మహేశ్ కేరక్టర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా సినిమా అంటే ఎక్స్‌పెక్ట్ చేసే బ్రహ్మానందం గారికి 'ఢీ', 'రెడీ', 'కింగ్' కంటే మంచి కేరక్టర్ కుదిరింది. డెఫినెట్‌గా అది కొత్తగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇందులోని పాత్ర పేరుతో పిలుస్తారు. బ్రహ్మానందం గారి లానే హాట్ ఫేవరేట్ ఎమ్మెస్ నారాయణ. మా ప్రతి సినిమాలో ఆయన ఓ సీను చేసినా అది పేలుతుంటుంది. ఇందులో ఆయన కేరక్టర్‌ని ఫుల్ ఫోకస్డ్‌గా రాశాం. ఆయన పాత్రకి థియేటర్లో వచ్చే రెస్పాన్స్ ఏమిటో మీరో చెప్పాలి. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. 
తమన్ చాయిస్ ఎవరిది?
శ్రీను గారిదే. తమన్ నిజానికి ఫ్రెండ్. నల్లమలుపు బుజ్జి దగ్గర నేను 'లక్ష్యం' చేస్తున్నప్పుడు తమన్ ఓ ఆల్బం తీసుకువచ్చి పరిచయమయ్యాడు. అప్పుడతను మణిశర్మ వద్ద కీబోర్డు ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. 'రెడీ' అప్పుడు నా ద్వారా శ్రీనుకి ఓ ఆల్బం వినిపించాడు. అతని రిదం తీరు, ఇన్‌స్ట్రుమెంటైజేషన్ చూసి శ్రీను చిన్న షాక్‌కు గురయ్యారు. డిఫినెట్‌గా ఎంకరేజ్ చేస్తాననీ, ట్యూన్స్ మంచిగా పట్టుకోమనీ చెప్పారు. ప్రస్తుతం తను దేవిశ్రీ ప్రసాద్‌తో చేస్తున్నాను కాబట్టి వీలు చేసుకుని అవకాశమిస్తానన్నారు. ఈలోగా తమన్ 'కిక్', 'బృందావనం' వంటి హిట్లతో లైంలైట్‌లోకి వచ్చాడు. 'నమో వెంకటేశ' పాటలు క్లిక్ కాకపోవడంతో దేవికి తను సరిగా చెప్పలేకపోతున్నానా లేక దేవి నాకు చెప్పలేకపోతున్నాడా అని ఫీలయ్యారు శ్రీను. దాంతో ఈసారి మారుద్దాం అనుకుని తమన్‌తో చేయించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
గుహన్ పనితనం గురించి చెప్పండి.
ఈ సినిమాకి గుహన్ చాలా ప్లస్సవుతారు. అది కచ్చితంగా చెప్పగలను. ఇదివరకు మా సినిమాల్లో ఎన్నడూ లేనిరీతిలో సినిమాటోగ్రఫీ ఇందులో గొప్పగా ఉండబోతోంది. లొకేషన్లు ఎక్కువ ఉండటం, సెట్లు వైబ్రంట్‌గా ఉండటం వల్ల సినిమాటోగ్రఫీకి పాత్ర ఎక్కువ. విజువల్స్ అదరగొట్టారు. 'ఇటు రాయే ఇటు రాయే' పాటలో మహేశ్ స్టెప్స్ విరగదేశాడు. అలాగే 'చుల్‌బులీ', టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటాయి.
ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అనుకున్నారు?
బడ్జెట్ మాకు సంబంధం లేని మేటర్. మహేశ్ సినిమాల్లో కాస్ట్లీ సినిమా. సాంగ్స్, ఫైట్లకి ఎక్కువ టైం తీసుకున్నాం. ఒక్కో సాంగ్ 8 నుంచి 10 రోజుల పాటు చేశాం. శ్రీను వైట్ల సినిమాల్లో ఫైట్స్ అంటే మాగ్జిమం నాలుగు రోజులు ఉంటుంది. పాట అంటే మూడు లేదా నాలుగు రోజులు. ఈ సినిమాలో అలా లెక్కలేమీ వేసుకోలేదు. బాగా రావాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ షాట్స్ చేశాం. 
అసెస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేశారు కదా. డైరెక్షన్ చేయబోతున్నారా?
ఇప్పుడు చాలామంది రైటర్లు డైరెక్టర్‌లుగా రాణిస్తారు. త్రివిక్రం, హరీశ్ శంకర్, వీరు పోట్ల సక్సెస్ అయ్యారు. రైటర్స్ డైరెక్టర్లు కావడానికి మంచి వాతావరణమే ఉంది. నేను కూడా వచ్చే యేడాది డైరెక్టర్ కాబోతున్నా. మళ్ల విజయప్రసాద్ గారికి సినిమా చేయబోతున్నా. 2012 మేలో అది మొదలు కావచ్చు. పెద్ద హీరోతోటే ఉంటుంది. ఆయన డేట్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోపల ఎన్టీఆర్, శ్రీను వైట్ల సినిమాకి పనిచేస్తా. 

Saturday, July 23, 2011

న్యూస్: 'ది బిజినెస్ మ్యాన్'కి రంగం సిద్ధం

రెండో బాలీవుడ్ సినిమా 'బుడ్డా.. హో గయా తేరా బాప్' (తొలి సినిమా 'బద్రి'కి రీమేక్ అయిన 'షర్త్') తర్వాత మహేశ్‌తో రెండో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్‌లో తొలిగా వచ్చిన 'పోకిరి' బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు సినిమా 40 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ మూవీ 'మగధీర' ఏకంగా దానికి రెట్టింపు వసూళ్లను సాధించి యావద్భారతీయ చిత్రసీమనే అబ్బురపరిచిన సంగతి మనకు తెలుసు. ప్రస్తుతానికి వస్తే మహేశ్‌తో జగన్ తీయబోతున్న 'ది బిజినెస్‌మ్యాన్' బిజినెస్ వర్గాల్లో హాట్ ప్రాజెక్ట్‌గా మారింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ద గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్' అనే ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తున్నారు. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా మహేశ్‌తో జతకట్టబోతోంది. నిజానికి మొదట ఆ పాత్రకి ఇలియానా, శ్రుతిహాసన్ పేర్లు వినిపించినా, చివరకి కాజల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. తమన్ మ్యూజిక్ అందించే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలు కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దీనితో పాటు రవితేజతో 'ఇడియట్ 2'ని కూడా తీయబోతున్నాడు జగన్.

Wednesday, July 20, 2011

విశ్లేషణ: మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సూపర్‌హిట్టే!

ఏ కథకైనా నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) ముఖ్యం. మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సినిమా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా హైలైట్ చేస్తూ తెలుగులో తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సందర్భాలు అనేకం. గతంలో కాశ్మీర్, అమెరికా, సింగపూర్ తదితర ప్రాంతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోవాలంటే చిన్న సినిమా అయినా గోదావరి నేపథ్యంలో వంశీ రూపొందించిన 'గోపి గోపిక గోదావరి' పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. గోపిక అనే లేడీ డాక్టర్ పేదలకు సేవ చేసే ఉద్దేశంతో గోదావరి గ్రామాల్లో పనిచేసే ఓ బోటు హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైన గోపి అనే ఆర్కెస్ట్రా సింగర్‌ని ప్రేమిస్తుంది. అయితే ఓ యాక్సిడెంట్లో గోపి చనిపోయాడని విని హతాశురాలవుతుంది. చిత్రమేమంటే తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయిన గోపి ఆమె వల్లే కోలుకుని ప్రభుగా చలామణి అవుతాడు. చివరకు ఆ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారన్నది కథ. చక్రి సంగీతం సమకూర్చగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే' పాట ఏ నోట విన్నా వినిపించింది. చక్రి సంగీత మాయాజాలంతో పాటు గోదావరి తీరంలో వంశీ తీసిన సన్నివేశాలన్నీ జనాన్ని ఆకట్టుకోవడంతో 'గో గో గో' చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది.
దాని తర్వాత వచ్చిన పెద్ద సినిమా 'మగధీర' ఏ స్థాయి విజయాన్ని పొందిందో మనకు తెలుసు. అంతకు ముందు బాక్సాఫీస్ పరంగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్న 'పోకిరి'ని వెనక్కినెట్టి ఏకంగా దానికి దాదాపు రెట్టింపు వసూళ్లతో అదరగొట్టింది. అలాంటి 'మగధీర'లోనూ ఓ ప్రాంతపు నేపథ్యం ఉంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఉదయగఢ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజం నేపథ్యంలో వచ్చే అన్ని సన్నివేశాలూ (ముఖ్యంగా రాంచరణ్-కాజల్, రాంచరణ్-దేవ్‌గిల్, రాంచరణ్-శ్రీహరి సన్నివేశాలు) ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉదయఘడ్‌ని రక్షించే కాలభైరవ పాత్రలో రాంచరణ్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. ఉదయఘడ్‌ని కళా దర్శకుడు ఆనంద్‌సాయి తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. రానున్న అరిష్టాన్ని పోగొట్టడానికి రాజకుమారి చేసే కాలభైరవ పూజా సన్నివేశాల చిత్రీకరణ, అక్కడ విలన్లతో హీరో కాలభైరవ పోరాడే తీరు అద్భుతమనిపించాయి.
అంతకుముందు గంగోత్రి, హరిద్వార్ నేపథ్యంలో వచ్చిన అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి', చార్మినార్ నేపథ్యంలో వచ్చిన మహేశ్ 'ఒక్కడు', వరంగల్ నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ 'వర్షం', కలకత్తా నేపథ్యంలో వచ్చిన చిరంజీవి 'చూడాలని ఉంది', రాయలసీమ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వీటిలాగే ఘన విజయం పొందిన మరో సినిమా 'సింహాద్రి'. జూనియర్ ఎన్‌టీఆర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు రాయలసీమతో పాటు కేరళను నేపథ్యంగా ఎంచుకున్నారు. 'ఇంద్ర'లో కాశీ, 'సింహాద్రి'లో కేరళ నేపథ్యాలు వాటి భారీ విజయాల్లో తమవైన పాత్ర పోషించాయి. 'వర్షం' సినిమా ప్రభాస్‌కు స్టార్‌డంను తీసుకొచ్చిందనేది వాస్తవం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథకు నేపథ్యం వరంగల్. హీరో హీరోయిన్ల రొమాన్స్‌కు సాక్షీభూతంగా వరంగల్ నిలుస్తుంది. అంతదాకా వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణాన్ని ఎవరూ చూపించని రీతిలో ఈ సినిమాలో అందంగా చూపించారు.
అయితే కేవలం ఓ ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ సినిమా తీసేస్తే కచ్చితంగా హిట్టు దక్కుతుందా? అనే ప్రశ్నకు 'కాదు' అనే జవాబే వస్తుంది. కథకు అనుగుణమైన నేపథ్యం, వాస్తవికంగా ఉండే చిత్రీకరణ మాత్రమే సినిమాను అందంగా తీర్చిదిద్దగలుగుతాయి. లేదంటే కోరి అపజయం తెచ్చుకున్నట్టే. ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'బద్రినాథ్'ను తీసుకోండి. ఈ సినిమా కథకు నేపథ్యంగా హిమాలయాల్లోని తక్షశిలనీ, అక్కడి బద్రీనాథ్ దేవాలయాన్నీ ఎంచుకున్నారు. అయితే కథలో లోపాలు, గురు (ప్రకాష్‌రాజ్), శిష్య (అల్లు అర్జున్) అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి సినిమాలకి అత్యవసరమైన ఎమోషన్‌ని క్యారీ చేయకపోవడం, దర్శకత్వ లోపాలు ఈ సినిమాకి ఆశించిన రీతిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే బద్రీనాథ్ దేవాలయం సెట్లో తీసిన సన్నివేశాలు బాగుండటం గమనార్హం.
అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన 'తీన్‌మార్' సినిమా కొంతవరకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ హీరో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా వచ్చినప్పటికీ తెలుగు నేటివిటీని మిస్సవడం, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్సులయ్యాయి. ఇక మహా శక్తిపీఠాల నేపథ్యంతో పాటు రాజస్థాన్, కాశ్మీర్ నేపథ్యంలో వచ్చిన ఎన్‌టీఆర్ సినిమా 'శక్తి' అసహజమైన సన్నివేశాల కారణంగా ఘోర పరాజయం పాలైంది. ఇష్టమొచ్చినట్లు భారీగా ఖర్చుపెట్టేసి, 'మగధీర'ని మించిన సినిమా తీయాలనుకునే యత్నంలో నేల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం మరోసారి స్పష్టం చేసింది. దీన్నిబట్టి మంచి కథకు మంచి నేపథ్యం అనేది మరింత శోభను చేకూర్చిపెడుతుందనే సంగతితో పాటు కథలో దమ్ము లేకపోతే మంచి నేపథ్యం కూడా వృథా అవుతుందనే విషయం అర్థమవుతుంది.
తాజాగా కొన్ని సినిమాలు అమెరికా, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశీ నేపథ్యాలతో తయారవుతున్నాయి. ఓవర్సీస్‌లోని తెలుగువాళ్లని కూడా మెప్పించే ఉద్దేశంతో ఇప్పుడు ఈ తరహా నేపథ్యాలు తెలుగు సినిమాల్లో ఎక్కువవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సత్తా వీటికి ఉంటుందా?

Thursday, June 16, 2011

ఇంటర్వ్యూ: అల్లు అర్జున్

బయటి నిర్మాతలకైతే 'బద్రినాథ్' చేసేవాణ్ణి కాదు

"ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేది బడ్జెట్‌లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే చేసేవాణ్ణి కాను'' అని చెప్పారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా దర్శకుడు వి.వి. వినాయక్ రూపొందించిన 'బద్రినాథ్' సినిమా ఇటీవల విడుదలై భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ సంభాషించారు అర్జున్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... 
ఇది పెద్ద మాస్ ఇమేజ్ వచ్చే కథ. అన్ని విషయాలూ ఉన్న కమర్షియల్ కథ. సినిమాకి మొదట డివైడ్ టాక్ ఉన్నా, కచ్చితంగా ఆడే అంశాలు ఉన్నాయి. అందుకే టాక్‌కి భిన్నంగా కలెక్షన్లు బలంగా ఉన్నాయి. సినిమాలో విషయం ఉంది కాబట్టే, తాము కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి కాబట్టే జనం బాగా చూస్తున్నారు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ వల్ల మొదట అలాంటి టాక్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల ధోరణి ఇలాగే కొనసాగితే చిత్రసీమలోని అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుంది. నా కెరీర్‌లో ఇవి హయ్యస్ట్ ఓపెనింగ్స్. నా మునుపటి టాప్ సినిమాల కలెక్షన్లని 'బద్రినాథ్' వారంలోనే దాటేస్తుంది.
32 గంటల సమయం 
కత్తి పట్టుకోవడం కొత్త పాయింట్ కాదు. పాతదే. కానీ అందులోనే కొత్తదనం చూపించాలి. హాంగ్‌కాంగ్, చైనీస్ సినిమాల్లో వాళ్లు కత్తి పట్టుకునే విధానం మనవాళ్లు పట్టుకునే దానికి భిన్నంగా, మరింత సాధికారికంగా ఉంటుంది. అందుకే వియత్నాం వెళ్లి రెండు నెలలు పాటు కత్తి తిప్పడంలో శిక్షణ పొందా. 'బద్రినాథ్'లో సమురాయ్ టైపు ఫైట్స్ చేయడానికి ఇదే కారణం. ఇక పొడవాటి జుట్టు విషయానికొస్తే ఆ కృత్రిమ జుట్టు పెట్టించుకోవడానికి 32 గంటల సమయం పట్టింది. అంతసేపూ ఓపిగ్గా కూర్చోవాల్సిందే. కానీ తీసేయడానికి అరగంట చాలు.
స్టంట్స్ కంటే డాన్సే కష్టం 
చిరంజీవి మావయ్య డాన్స్ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆయన్ని గుర్తుకు తేవాలని కావాలనే ఓ పాటలో కొన్ని బిట్స్ ఆయనలా చేశా. యాక్షన్ ఎపిసోడ్స్ చెయ్యడం కంటే డాన్సు చెయ్యడమే కష్టం. స్టంట్స్‌ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి బాగా తీయొచ్చు. అందుకే ఇవాళ 'యాక్షన్ ఎంత బాగా చేశాడు!' అనడం లేదు. 'ఎంత బాగా తీశాడు!' అంటున్నారు. డాన్సుకి అలా కుదరదు. ఫిజికల్‌గా చెయ్యాల్సిందే.
'మగధీర' లక్ష్యం కాదు 
'మగధీర' అందరికీ ఓ బెంచ్‌మార్క్ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది అలాంటి సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు. దెబ్బతింటున్నారు. కానీ భారీ స్థాయిలో సినిమా తియ్యడానికి అది ఓ ఉదాహరణగా మారింది. సృజనాత్మక స్వేచ్ఛనిచ్చింది. అయితే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మేం 'బద్రినాథ్' తియ్యలేదు. సృజనాత్మక విషయంలోనే దాన్నో ఆదర్శంగా తీసుకున్నాం. ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేవి బడ్జెట్‌లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే చేసేవాణ్ణి కాను. సినిమా బడ్జెట్ పెరగడానికి ఏ ఒక్కరో కారణం కాదు. అందరూ కారణమే.
బెస్ట్ మాస్ డైరెక్టర్ 
వినయ్ (వినాయక్)తో పనిచెయ్యడమంటే చాలా చాలా ఇష్టం. 'బన్ని' తర్వాత మేం కలిసి చేసిన సినిమా. అతని సినిమాలో ఎక్కడా వృథా అనేది కానీ, అనవసరమైనది కానీ ఉండదు. హి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ డైరెక్టర్స్. వినయ్‌తో సినిమా అంటేనే మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చేస్తుంది. కాంబినేషన్ వల్ల నష్టమేం లేదు. పైగా దానివల్ల సినిమాకి హైప్ వస్తుంది. స్టార్‌కేస్ట్ ఉంటే ఎవరిమైనా ఆసక్తి చూపిస్తాం కదా. క్రేజీ కాంబినేషన్ల వల్ల హిట్లు, ఫ్లాప్టు రెండూ ఉన్నాయి. అయితే కాంబినేషన్ ఒక్కటే సరిపోదు. మంచి కథ ఉండాలి.
మోస్ట్ సిన్సియర్ గర్ల్ 
'హ్యాపీడేస్' అప్పట్నించీ తమన్నాతో చెయ్యాలని ఉంది. అందుకే అడ్వాన్స్ ఇచ్చి మా సంస్థ తరపున ముందుగానే ఆమెని బుక్ చేశాం. మొదట '100% లవ్'కి తీసుకున్నాం. అది హిట్టవడంతో 'బద్రినాథ్'కి ఆమె ఓ ప్లస్ పాయింటయ్యింది. ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోయిన్లలో అంకితభావం ఉన్న 'ద మోస్ట్ సిన్సియర్ గర్ల్'.

Tuesday, October 26, 2010

ఫోకస్: 'నంది' లీలలు (చివరి భాగం)

'లీడర్'కి అన్యాయం?
'ఇంకోసారి' అనే సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో సాధారణ ప్రేక్షకులకే కాదు విమర్శకులకి కూడా జ్ఞాపకం లేదు. ఆ సినిమాలో నటించించిన వెన్నెల కిశోర్ ఉత్తమ హాస్యనటుడిగా, దాన్ని డైరెక్ట్ చేసిన సుమాన్ పాతూరి తొలి చిత్ర దర్శకుడిగా అవార్డులు పొందారు. హాస్యనటుడిగా అవార్డునివ్వాలంటే అతను ఆ పాత్ర ద్వారా జనాన్ని బాగా నవ్వించాలి కదా. కానీ ఆ సినిమాని చూసిన వాళ్లెంతమంది? సుమన్ పాతూరితో పోలిస్తే ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా ఎంపికకు అర్హత ఉన్నది ఉత్తమ సకుటుంబ కథా చలనచిత్రంగా అవార్డుకు ఎంపికైన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' దర్శకుడు కిశోర్ కే అనేదే అత్యధిక విమర్శకుల అభిప్రాయం. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణిని ఎంపిక చేశారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో ఆయన అగ్రగణ్యుడనేది నిర్వివాదం. కానీ ఆయన ఆ అవార్డుకు ఎంపికైన చిత్రం సందర్భవశాత్తూ 'మగధీర' కాదు, 'వెంగమాంబ'! జనానికి తెలిసింది 'మగధీర' సంగీతమా? 'వెంగమాంబ' సంగీతమా? ఇలాగే మరికొన్ని అవార్డుల విషయంలోనూ ఇదే అభిప్రాయం కలుగుతుంది.
ఈ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిన సినిమా ఏదంటే 'లీడర్' అనే చెప్పాలి. ఈ సినిమాకి కంటితుడుపుగా ఉత్తమ కథా రచయిత అవార్డునిచ్చారు. శేఖర్ కమ్ముల తయారుచేసిన కథ నచ్చిన జ్యూరీకి ఈ సినిమాలో మరే అంశమూ నచ్చకపోవడం వైచిత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రయి, వ్యవస్థలోని అవినీతిని అంతం చేయాలని తపించే యువకుడి కథతో రూపొందిన ఈ సినిమా జ్యూరీని ఇతర అంశాల్లో ఎందుకు మెప్పించలేక పోయింది? ఉత్తమ చిత్రం కేటగిరీలో ఎంపికైన మూడు చిత్రాల్లోని కథకంటే ఈ సినిమా కథ ఉత్తమమైందని జ్యూరీకి తోచినప్పుడు ఉత్తమ చిత్రాలుగా వాటిని ఏ ప్రాతిపదిక ఆధారంగా ఎంపిక చేసినట్లు? 'నంది అవార్డుల జ్యూరీ లీలలు ఇన్నిన్నికాదయా' అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం మరేముంటుంది?  (అయిపోయింది)

Saturday, October 23, 2010

ఫోకస్: 'నంది' లీలలు! (2వ భాగం)

నారా రోహిత్ కథానాయకుడిగా, చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమైన 'బాణం' సినిమా జనాదరణ పొందలేకపోయినా విమర్శకుల్ని మెప్పించింది. భ్రష్టుపట్టిపోయిన ఈ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలని భావించే ఒక యువకుని కథ ఈ సినిమా. ఆ క్రమంలో అతడు ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకుల్ని చట్టం పరిధిలో ఎలా పరిష్కరించాడనేది ప్రధానాంశం. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమా. 'కలవరమాయె మదిలో' ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఇటు జనాన్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయిన ఈ బోరింగ్ ఫిల్మ్ నంది జ్యూరీని ఆకట్టుకోవడం విశేషమే. ఎప్పటికైనా ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో పాటలు పాడే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ఆశించే ఓ ఔత్సాహిక గాయని కథ ఈ సినిమా.
విమర్శలెదుర్కొన్న 'ఉత్తమ నటుడు'
ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా 'మగధీర'ని మించిన సినిమా ఇంకేముంటుంది? దీన్ని తప్పుపట్టే వాళ్లయితే లేరు. ఇదే సినిమా మరో ఎనిమిది అవార్డుల్ని గెలుచుకుని సత్తా చాటింది. 'మగధీర' సరికొత్త బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించడానికి ప్రధాన కారణమైన ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడమూ సబబే. ఇదే సినిమాకి సమకూర్చిన నృత్యాలతో జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డుని గెలుచుకున్న శివశంకర్, జాతీయ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు పొందిన కమల్ కణ్ణన్ లకే ఆ అవార్డులనివ్వడం మినహా జ్యూరీకి చేసేదేముంటుంది? అలాగే ఉత్తమ ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వరరావు, కళా దర్శకుడిగా రవీందర్, శబ్దగ్రాహకుడిగా రాధాకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనరుగా రమా రాజమౌళికి అవార్డులు ప్రకటించారు. వీటికి అదనంగా కథానాయకుడు రాంచరణ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు(!)ని ప్రకటించారు. ఇలా రాంచరణ్ కి జ్యూరీ అవార్డు ప్రకటించి, దాసరి నారాయణరావుని ఉత్త నటుడిగా ఎంపికచేయడం విమర్శకి తావిచ్చింది. చిరంజీవి - రాంచరణ్ అభిమానులు సహజంగానే ఇందులో రాజకీయం ఉందని ఆరోపించారు. దాసరికి ఈ అవార్డుని ప్రకటిస్తారని విమర్శకులు సహా ఎవరూ ఊహించలేదు. 'మేస్త్రి'లో పాలకొల్లు అనే పాత్రలో జీవించినందుకు గాను ఆయనకు జ్యూరీ ఈ అవార్డుని అందించిందనుకోవాలి. గమనించదగ్గ సంగతేమంటే, ఈ సినిమాలో పాలకొల్లు ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడతాడు. సినిమా ప్రారంభంలో ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమనీ, ఎవర్నీ ఉద్దేశించినవి కాదనీ చెప్పినా, చిరంజీవిని లక్ష్యంగా చేసుకునే, ఆయన్ని విమర్శించడానికే ఈ సినిమా తీశారని అంతా భావించారు. అలాంటి సినిమాలో నటించిన ఆయనకు ఉత్తమ నటుడి అవార్డునివ్వడం చాలామందికి మింగుడుపడని సంగతి.  (ఇంకావుంది)