నారా రోహిత్ కథానాయకుడిగా, చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమైన 'బాణం' సినిమా జనాదరణ పొందలేకపోయినా విమర్శకుల్ని మెప్పించింది. భ్రష్టుపట్టిపోయిన ఈ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలని భావించే ఒక యువకుని కథ ఈ సినిమా. ఆ క్రమంలో అతడు ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకుల్ని చట్టం పరిధిలో ఎలా పరిష్కరించాడనేది ప్రధానాంశం. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమా. 'కలవరమాయె మదిలో' ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఇటు జనాన్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయిన ఈ బోరింగ్ ఫిల్మ్ నంది జ్యూరీని ఆకట్టుకోవడం విశేషమే. ఎప్పటికైనా ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో పాటలు పాడే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ఆశించే ఓ ఔత్సాహిక గాయని కథ ఈ సినిమా.
విమర్శలెదుర్కొన్న 'ఉత్తమ నటుడు'
ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా 'మగధీర'ని మించిన సినిమా ఇంకేముంటుంది? దీన్ని తప్పుపట్టే వాళ్లయితే లేరు. ఇదే సినిమా మరో ఎనిమిది అవార్డుల్ని గెలుచుకుని సత్తా చాటింది. 'మగధీర' సరికొత్త బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించడానికి ప్రధాన కారణమైన ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడమూ సబబే. ఇదే సినిమాకి సమకూర్చిన నృత్యాలతో జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డుని గెలుచుకున్న శివశంకర్, జాతీయ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు పొందిన కమల్ కణ్ణన్ లకే ఆ అవార్డులనివ్వడం మినహా జ్యూరీకి చేసేదేముంటుంది? అలాగే ఉత్తమ ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వరరావు, కళా దర్శకుడిగా రవీందర్, శబ్దగ్రాహకుడిగా రాధాకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనరుగా రమా రాజమౌళికి అవార్డులు ప్రకటించారు. వీటికి అదనంగా కథానాయకుడు రాంచరణ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు(!)ని ప్రకటించారు. ఇలా రాంచరణ్ కి జ్యూరీ అవార్డు ప్రకటించి, దాసరి నారాయణరావుని ఉత్త నటుడిగా ఎంపికచేయడం విమర్శకి తావిచ్చింది. చిరంజీవి - రాంచరణ్ అభిమానులు సహజంగానే ఇందులో రాజకీయం ఉందని ఆరోపించారు. దాసరికి ఈ అవార్డుని ప్రకటిస్తారని విమర్శకులు సహా ఎవరూ ఊహించలేదు. 'మేస్త్రి'లో పాలకొల్లు అనే పాత్రలో జీవించినందుకు గాను ఆయనకు జ్యూరీ ఈ అవార్డుని అందించిందనుకోవాలి. గమనించదగ్గ సంగతేమంటే, ఈ సినిమాలో పాలకొల్లు ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడతాడు. సినిమా ప్రారంభంలో ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమనీ, ఎవర్నీ ఉద్దేశించినవి కాదనీ చెప్పినా, చిరంజీవిని లక్ష్యంగా చేసుకునే, ఆయన్ని విమర్శించడానికే ఈ సినిమా తీశారని అంతా భావించారు. అలాంటి సినిమాలో నటించిన ఆయనకు ఉత్తమ నటుడి అవార్డునివ్వడం చాలామందికి మింగుడుపడని సంగతి. (ఇంకావుంది)
No comments:
Post a Comment