కథనమే కాదు కథా ముఖ్యమే
సరే, ఇక్కడ మనం ప్రస్తావిస్తున్న చిన్న చిత్రం అంటే చెత్త సినిమా కాదు, 'బి' గ్రేడ్ సినిమా అంతకంటే కాదు. చిన్న సినిమా పేరుతో వచ్చే 'బి' గ్రేడ్ సినిమాల వల్లే వాటికి చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇక్కడ చిన్న సినిమా అంటే 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'వినాయకుడు', 'గమ్యం' లాంటి నవ్య సినిమాలు. బడ్జెట్ పరంగానే అవి చిన్న సినిమాలు కానీ, భారీ బడ్జెట్ తో తీసిన ఎన్నో స్టార్ల సినిమాల కంటే అవి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు. మనం చెప్పుకుంటోంది అలాంటి చిన్న, మంచి సినిమాల గురించి. మల్టీప్లెక్స్ విప్లవం మొదలైన కాలంలో ఇక భవిష్యత్ అంతా స్వతంత్ర సినిమాదే అనే అభిప్రాయం కలిగిందనేది నిజం. అయితే అది అనుకున్నంత వేగంగా జరగడం లేదనేదీ వాస్తవం. కారణం కథలో కంటే కథనంలోనే ఎక్కువ కొత్తదనం కనిపిస్తుండటం. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లో వీడియోల్లోనూ, టీవీల్లోనూ సినిమాలు చూడటం మొదలుపెట్టిన వాళ్లు కూడా ఇప్పుడు కనీసం వారాంతాల్లోనైనా సినిమా హాళ్లకు రావాలనుకుంటున్నారు. ఈ తరహా ప్రేక్షకులకి కొత్త తరహా కథలు, కథనాలు కావాలి. స్వతంత్ర సినిమా దర్శకులకి కావలసింది ఇదే. 'తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి విడుదల చేస్తే చాలు - శాటిలైట్, వీడియో హక్కులతో పెట్టుబడి అంతా వచ్చేస్తుంది' అనే అభిప్రాయంతో కొంతమంది దర్శకులు కథ, కథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా సినిమాలు తీసి, చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఈ ధోరణిని మార్చుకుని హద్దుల్ని చెరిపేసే రీతిలో కష్టపడి పనిచేసి, కొత్తదనంతో సినిమాలు తీయకపోతే నవ్య సినిమాకి ఈరోజు ఉన్న మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నవాళ్లు అవుతారు.
ఇవాళ విలక్షణమైన కథ, కథనాలతో తీస్తున్న దర్శకులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమందే ఉండటం తెలుగు సినిమాకి సంబంధించి శుభపరిణామం. వాళ్లు తీసే నాణ్యమైన సినిమాల సంఖ్య ఏడాదికి పది మించగలిగితే స్టార్లు సైతం తమ అభిప్రాయాల్ని మార్చుకుని, ఆ దర్శకులతో పనిచేయాలని ఉవ్విళ్లూరుతారు. శేఖర్ కమ్ముల ఈమధ్య రూపొందించిన 'లీడర్' సినిమాని గానీ, కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి తీసిన 'బాణం'ని గానీ, దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం'ని గానీ స్టార్ వాల్యూ ఉన్న నటులు చేసినట్లయితే పెద్ద హిట్లయ్యేవి. అయితేనేం, వాటి ద్వారా ఆ దర్శకుల ప్రతిభ బయటపడింది. వాటి వల్ల ఇద్దరు ముగ్గురు ప్రతిభావంతులైన నటులు పరిచయమై, భవిష్యత్ మీద ఆశలు రేకెత్తించారు. ఇదే స్పిరిట్ తో స్వతంత్ర సినిమా దర్శకులు ముందుకు అడుగేయాలి. తెలుగులో మంచి సినిమాలకు కొదవలేదనే పేరు వచ్చే అవకాశం ఉంది వాళ్ల వల్లనే. (అయిపోయింది)
No comments:
Post a Comment