నిన్నటిదాకా దక్షిణాది సూపర్ స్టారుగా వెలుగొందిన రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇది ఆషామాషీగా చెబుతున్న సంగతి కాదు. సంచలనాల 'రోబో' సాక్షిగా వెల్లడైన నిఖార్సయిన నిజం. ఇది ఒక భారతీయ నటుడు - అదీ ఒక దక్షిణ భారత దేశానికి చెందిన ఓ ప్రాంతీయ నటుడు - సాధించిన అపూర్వ, అపురూప విజయం. తమిళ చిత్ర రంగానికి చెందిన ఓ నటుడి సినిమాకి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏమిటి! ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడంటే మూడు రోజుల్లో 95 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం ఏమిటి!! ఇది అద్భుతం కాక మరేమిటి!!!
బాక్సాఫీసు రికార్డులు పాదాక్రాంతం
భారతీయ సినిమాకి సంబంధించి 'రోబో' ఎన్నో సరికొత్త రికార్డుల్ని లిఖిస్తోంది. భవిష్యత్తులో మరెన్నింటినో లిఖించబోతోంది. ఇప్పటిదాకా దేశంలో అత్యంత వ్యయభరిత చిత్రం 'రోబో'నే. మునుపటి రికార్డు 120 కోట్ల రూపాయల వ్యయమైన హృతిక్ రోషన్ సినిమా 'కైట్స్' పేరుతో ఉంది. అలాగే మూడు భారతీయ భాషల్లో (తమిళ, తెలుగు, హిందీ) ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రింట్లతో విడుదలైన సినిమా కూడా 'రోబో'నే. అక్టోబర్ 1న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా ఇటీవలే సల్మాన్ ఖాన్ సినిమా 'దబాంగ్' నెలకొల్పిన తొలి మూడు రోజుల వసూళ్ల రికార్డుని ఏకంగా రెట్టింపు వసూళ్లతో బద్దలు కొట్టడం గొప్ప విశేషం. విడుదలైన తొలి మూడు రోజుల్లో 'దబాంగ్' 49 కోట్ల రూపాయల్ని ఆర్జించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆ రికార్డుని భారీ వ్యత్యాసంతో బద్దలు కొట్టాడు 'రోబో.
బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పిన లెక్కల ప్రకారం 'రోబో' సాధించిన మూడు రోజుల వసూళ్లు 95 కోట్ల రూపాయలు. ఆయన అంచనా ప్రకారం ఆ సినిమా రానున్న రోజుల్లో మరో 125 కోట్ల రూపాయల్ని ఆర్జించనున్నది. అయితే మనదేశంలో కచ్చితమైన బాక్సాఫీసు ఫలితాలు బహిర్గతం కావడం కష్టం. ఒక విశ్లేషణకీ, మరో విశ్లేషణకీ వ్యత్యాసాలు సాధారణం. ఉదాహరణకి స్వతంత్ర పారిశ్రామిక వెబ్ సైట్ అయిన బాక్సాఫీస్ ఇండియా డాట్ కామ్ అంచనాల ప్రకారం తొలి వారాంతంలో 'రోబో' వసూలు చేసిన మొత్తం 57 కోట్ల రూపాయలే. అయినప్పటికీ ఇది కూడా కొత్త రికార్డే కావడం గమనార్హం. మనదేశం బయట అమెరికా, మలేషియా, జపాన్ లలో వీర విహారం చేస్తున్న ఈ సినిమా కొత్తగా స్వీడన్ లోనూ బ్రహ్మాండంగా ఆడుతుండటం రజనీ సినిమాల మార్కెట్ విస్తృతికి ఒక చక్కని నిదర్శనం. రజనీ చేసిన ఈ మ్యాజిక్ తో దక్షిణాది నటులే కాదు, దేశంలో తామే అగ్రగణ్యులమని విర్రవీగే బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం ముక్కు మీద వేలేసుకుని విస్తుపోతున్నారు. వృద్ధాప్యమనదగ్గ అరవై ఏళ్ల వయసులో అందం చందం కూడా లేని నటుడికి ఇదెలా సాధ్యమని వాళ్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఒక నటుడికీ, దేవుడికీ ఉన్న వ్యత్యాసాన్ని సైతం చెరిపేసిన రజనీని చూసి దిగ్భాంతి చెందుతున్నారు. అదీ రజనీ మాయ! తమిళనాడులో నిన్నటిదాకా బాక్సాఫీసు కొలబద్ద రజనీయే నటించిన 'శివాజి'. ఇప్పుడు తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకుంటూ 'రోబో'గా సరికొత్త 'బెంచ్ మార్క్'ని నెలకొల్పబోతున్నాడు.
సరే - తమిళనాడులో ఆయనే నెంబర్ వన్ హీరో. మరి తెలుగు సంగతేమిటి? కనీ వినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన తెలుగు 'రోబో'కి ఈ కలెక్షన్ల తుఫానేమిటి! తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని రీతిలో ఒక డబ్బింగ్ సినిమా హైదరాబాదులో 72 స్క్రీన్లలో విడుదలవడం, అన్ని థియేటర్లూ మూడు రోజుల పాటు ఫుల్స్ కావడం మామూలు విశేషం కాదు. దానికి ముందు పవన్ కల్యాణ్ 'పులి' కానీ', దాని తర్వాత 'మహేశ్ ఖలేజా' కానీ అన్నేసి థియేటర్లలో విడుదల కాకపోవడం, రెండూ చాప చుట్టేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు చెప్పండి. తెలుగులో సూపర్ స్టార్ ఎవరు? ఏదేమైనా రజనీకాంత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దర్శకుడిగా తననెందుకు అగ్రశ్రేణిలో పరిగణిస్తారో 'రోబో'తో మరోసారి నిరూపించుకున్నాడు శంకర్. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో 'రోబో'తో అతను తెలియజేశాడు. ఇప్పుడు 'రోబో'ని ఎందుకు వదులుకున్నానా అని షారుఖ్ ఖాన్ బాధపడుతూ ఉంటాడు. శంకర్ ని తక్కువగా అంచనా వేసినందుకు తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు.
No comments:
Post a Comment