Showing posts with label suresh. Show all posts
Showing posts with label suresh. Show all posts

Wednesday, April 9, 2014

Movie Review: Saradala Samsaram (1997)

ఇదెక్కడి సరదా? ఇదెక్కడి సంసారం?

దర్శకత్వం: సాయిప్రకాశ్
నిర్మాత: ఉషశ్రీ మారెడ్డి
తారాగణం: సురేశ్, రుచిత, నరసింహరాజు, గోకిన రామారావు, ప్రసాద్‌బాబు, సుబ్బరాయశర్మ

మంచి పనులు చేయడానికి గూండాగిరీ, రౌడీయిజం చేయడంలో తప్పులేదనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రేక్షకులపై బలవంతాన రుద్దే ప్రయత్నం చేసింది 'సరదాల సంసారం' చిత్రం. 'అమ్మ' చిత్రాల సెంటిమెంటుని వదిలించుకుని 'సంసారం' గొడవలో పడ్డ దర్శకుడు సాయిప్రకాశ్ అసహజమైన కథాంశాన్ని తీసుకుని పొరపాటు చేశాడని అనిపిస్తుంది.
మిత్ర చతుష్టయం అనే సూర్య (సురేశ్) అండ్ కో గూండాయిజం చేసి డబ్బు సంపాదించడమే 'సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్' కింద పెట్టుకున్నారు. వాళ్లకో ఆఫీస్ సైతం ఉంది. ఒకానొకరోజు ఓ రోమియో బారినపడ్డ జయ (రుచిత) తారసపడ్తుంది సూర్యకి. రోమియో ఫోన్లమీద ఫోన్లు చేస్తూ జయని చికాకు పెడ్తుంటాడు. సూర్య ఆ రోమియోకి తన మిత్ర బృందంతో తన్నుల సన్మానం చేశాక సూర్య ప్రేమని అంగీకరించి తన లాయర్ అన్నయ్య (నరసింహరాజు) ఇష్టానికి వ్యతిరేకంగా అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది జయ. సూర్య తమ్ముడు చంద్రం (కొత్త నటుడు) ఎం.ఎ. ఫస్ట్ క్లాస్‌లో పాసవుతాడు. డబ్బు సంపాదించడానికి తన అన్న అనుసరించే మార్గాన్ని చంద్రం అసహ్యించుకుంటూ ఉంటాడు. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలని భావిస్తాడు. ఆ క్రమంలో సూర్య రికమెండ్ చేసిన ఉద్యోగాన్ని కూడా తిరస్కరిస్తాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్లినా 'నో వేకన్సీ' బోర్డు దర్శనమిస్తుంటుంది. లేదంటే లంచం ఇవ్వమనైనా అడుగుతుంటారు. ఆఖరికి విసిగిపోయిన చంద్రం వదిన జయ ఇచ్చిన నగలతో ఉద్యోగం సంపాదించాలని వాటిని తనకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపిన బ్రోకర్ (సుబ్బరాయశర్మ) చేతిలో పెడతాడు. అయినా ఆ ఉద్యోగం అతడికి రాదు. బ్రోకర్ చేతిలో తను మోసపోయానని అర్థమైన చంద్రం కుమిలిపోయి అన్నా వదినలకి తన ముఖం చూపలేక ఫ్యానుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తమ్ముడి చావు, జయ మాటలతో పరివర్తన చెందిన సూర్య మారిపోతాడు. మెకానిక్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆఖరుకి కంపెనీ ఎండీ మృదుల అతణ్ణి పార్టనర్‌గా కూడా చేర్చుకుంటుంది. జయ మరదల్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారని తెలియడంతో సూర్య ఆ రౌడీల్ని చితకతన్ని వేశ్యాగృహంలో ఉన్న జయ మరదల్ని రక్షించి ఆ వేశ్యాగృహంలోనే తన మిత్రబృందంలోని రాజుతో ఆమె పెళ్లి చేస్తాడు. గతంలో సూర్య చేతిలో దెబ్బలు తిన్నవాళ్లంతా అతడి అంతు చూడాలని ఓ 'ఇంటర్నేషనల్' గూండా (ప్రసాద్‌బాబు)కి డబ్బు చెల్లిస్తారు. అయితే అతణ్ణి కూడా మిత్ర చతుష్టయం చిత్తుగా చావగొడ్తుంది. మరోపక్క జయ మృదులతో తన భర్త సరస సల్లాపాలు సాగిస్తున్నాడనే భ్రమలోపడి విషం తాగుతుంది. ఆఖరికి ఎట్లాగో బతికి సూర్యని అతడి పూర్వపు మార్గాన్నే అంటే గూండాగిరినే కొనసాగించమనడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలచింది సుస్పష్టమే. గూండాల్లోనూ మంచి గూండాలుంటారనీ, రౌడీయిజం తప్పుకాదనీ ఆయన చెప్పదలచుకున్నాడు. ఈ నేపథ్యంలో కథంతా అసహజంగా తయారయింది. మనకి ఎక్కడా కనిపించని కొత్త తరహా గూండా సూర్య పాత్రలో మనకి దర్శనమిస్తాడు. అతడికి మనుషుల్ని చావగోట్టడమే కాకుండా తెగ జోకులు వేయడం, సరసం చేయడం కూడా బాగా తెలుసు. భార్యని ప్రేమగా "బుజ్జిముండా ఇంతందంగా ఎందుకు పుట్టావే" అంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్నంతసేపూ ఆమెని క్షణం వదలడు. ఆమెని సుఖపెట్టడం కోసం తాపత్రయపడిపోతుంటాడు. గూండాకి ఉండని అసహజమైన ప్రత్యేకతలెన్నో కలిగి ఉన్న సూర్య పాత్రని సురేశ్ తనదైన శైలిలో బాగా పోషించాడు. శృంగారం, హాస్యం మేళవించిన సన్నివేశాల్లో బాగా రాణించాడు. రుచిత ఓ వైపు గ్లామర్‌ని కురిపించి, మరోవైపు నటననీ ప్రదర్శించింది. శృంగారం వొలికించడానికి కూడా ఆమె పాత్ర పనికొచ్చింది. సూర్య తమ్ముడు చంద్రంగా నటించిన కొత్త నటుడు మంచి నటననే చూపించాడు. మిగతా నటులంతా సోసోగానే అనిపించారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. దుగ్గిరాల సంగీతం ఫర్వాలేదు. సంభాషణల విషయంలో రచయిత దురికి మోహనరావు శృంగార సన్నివేశాల్లో అత్యుత్సాహం ప్రదర్శించాడని చెప్పాలి. కామెడీ సంభాషణల్లో కొన్ని బిట్లు ఆకట్టుకున్నాయి. నిర్మాత ఉషశ్రీ మారెడ్డి పాటలకి సాహిత్యాన్ని కూడా అందించారు. అయితే కథలో పట్టు లేకపోవడం, కథనంలో లోపాలు, పేరున్న నటులు లేకపోవడం మైనస్ పాయింట్లు. గూండాగిరీని అంగీకరించడం చిత్రం మొత్తం మీద పెద్ద తప్పు. సమాజంపై ప్రభావం చూపే వాటిలో సినిమా మాధ్యమం ఒకటి. ఈ విషయాన్ని సినిమా వాళ్లు విస్మరిస్తూ ఉండటం మన అనుభవంలోనిదే. 'ప్రేక్షకులు చూస్తున్నారు (ఆదరిస్తున్నారు) కాబట్టే మేం తీస్తున్నాం' టైపు చిత్రంగా 'సరదాల సంసారం'ని పేర్కొనవచ్చు. అయితే ఈ చిత్రానికి ఆదరణ ఉంటుందా అంటే ఉండదనేదే జవాబు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 1 ఆగస్ట్ 1997

Monday, June 6, 2011

వ్యక్తిత్వం: డి. రామానాయుడు

అవిశ్రాంత సినీ శ్రామికుడు
నిజం. ఆయన అవిశ్రాంత సినీ శ్రామికుడు. డెబ్భై ఐదేళ్ల నవ యవ్వనుడు. చిత్ర నిర్మాతగా ఎన్నడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొంది, నలభై ఎనిమిదేళ్లుగా సినిమాలు నిర్మిస్తూ, నేటి తెలుగు చిత్రసీమ మూలస్తంభాల్లో ఒకరుగా పేరుపొందిన మూవీ మొఘల్. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నలభై ఏడేళ్ల క్రితం ఆయన నెలకొల్పిన సురేశ్ మూవీస్ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల్లో నేటికీ అగ్రగామిగా వెలుగొందుతుండటం అసాధారణం.
ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి మద్రాసు వెళ్లి 'అనురాగం' చిత్రాన్ని భాగస్వామితో కలిసి నిర్మించడం ద్వారా 1963లో చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన ఆ మరుసటి ఏడాదే సోలోగా ఎన్టీఆర్‌తో 'రాముడు భీముడు' నిర్మించి, సంచలన నిర్మాతగా మారిన సంగతి ఓ చరిత్ర. ఆరేళ్ల తర్వాత కష్టాల కడలి ఈదుతూ ఇక సినిమాలకు 'రాం రాం' చెప్పక తప్పదనుకునే పరిస్థితిని ఎదుర్కొని, అక్కినేని-వాణిశ్రీ జంటగా నిర్మించిన 'ప్రేమనగర్'తో పడిలేచిన కెరటమైన ఆయన, ఇక వెనుతిరిగిందే లేదు. శ్రీకృష్ణ తులాభారం, చక్రవాకం, సోగ్గాడు, సెక్రటరీ, సావాసగాళ్లు, మండే గుండెలు, దేవత, ముందడుగు, ప్రతిధ్వని, అహ నా పెళ్లంట, ఇంద్రుడు చంద్రుడు, బొబ్బిలి రాజా, కలిసుందాం రా, మల్లీశ్వరి వంటి ఎన్నో సినిమాలు ఆయన నిర్మాణ దక్షతకు నిదర్శనాలు.
పెద్ద కుమారుడు సురేశ్‌ని తన వారసుడిగా నిర్మాతని చేసిన ఆయన చిన్న కుమారుడు వెంకటేశ్‌ని 'కలియుగ పాండవులు'తో హీరోని చేశారు. ఇవాళ ఆ ఇద్దరూ తమ తమ రంగాల్లో అగ్ర స్థాయిని ఆస్వాదిస్తుండటం తెలిసిందే.
ఓ నిర్మాతగా ఎంతోమంది తారల్నీ, సాంకేతిక నిపుణుల్నీ పరిచయం చేసిన ఆయన తన సేవల్ని నిర్మాణ రంగం బయట కూడా విస్తరింపజేశారు. సినిమా షూటింగుల కోసం రామానాయుడు స్టూడియోస్‌ని నెలకొల్పిన ఆయన అందులో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల్నీ ఏర్పాటు చేశారు. ఇక డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోనూ ఆయన అగ్రగామిగా వెలుగొందుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌నీ సినీ హబ్ చేయాలనే సంకల్పంలో భాగంగా పాతికెకరాల సువిశాల స్థలంలో సముద్రానికి అతి దగ్గరగా ఆయన నెలకొల్పిన రామానాయుడు స్టూడియోస్ ఇప్పుడు ఎంతోమంది నిర్మాతల్ని ఆకర్షిస్తోంది. నటుడిగానూ ఆయన కొన్ని సినిమాల్లో కనిపించారు. ఇటీవలి కాలంలోనే 'హోప్' అనే సినిమాలో ప్రధాన భూమిక ధరించి, ఉత్తమ నటనని ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసల్పి సైతం అందుకున్న ప్రజ్ఞాశాలి రామానాయుడు. ప్రస్తుతం రాజకీయ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఉన్న కొద్ది సంవత్సరాల్లో ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన సేవాతత్పురుడు. బాపట్ల పార్లమెంటు సభ్యునిగా పదవిలో ఉన్న కాలంలో ఆయన చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలు నిరుపమానం. ఇందుకోసం ఆయన ఎంపీ నిధుల్నే కాక సొంత డబ్బునీ ఖర్చు చేసి తన సేవా నిరతిని చాటుకున్నారు.
అటువంటి ఆ నిరంతర సినీ పథికుడు ప్రస్తుతం మరో సినీ నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ హీరోలుగా వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్నీ చురుగ్గా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆద్యంతం వినోదభరితంగా తయారవుతున్న ఈ సినిమాతో నిర్మాతగా మరో విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్న రామానాయుడు సోమవారం తన 76వ పుట్టిన రోజును బ్యాంకాక్‌లో అదే సినిమా సెట్స్‌పై జరుపుకోబోతున్నారు. 
(నేడు డాక్టర్ రామానాయుడు పుట్టిన రోజు)