అవిశ్రాంత సినీ శ్రామికుడు
నిజం. ఆయన అవిశ్రాంత సినీ శ్రామికుడు. డెబ్భై ఐదేళ్ల నవ యవ్వనుడు. చిత్ర నిర్మాతగా ఎన్నడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొంది, నలభై ఎనిమిదేళ్లుగా సినిమాలు నిర్మిస్తూ, నేటి తెలుగు చిత్రసీమ మూలస్తంభాల్లో ఒకరుగా పేరుపొందిన మూవీ మొఘల్. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నలభై ఏడేళ్ల క్రితం ఆయన నెలకొల్పిన సురేశ్ మూవీస్ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల్లో నేటికీ అగ్రగామిగా వెలుగొందుతుండటం అసాధారణం.ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి మద్రాసు వెళ్లి 'అనురాగం' చిత్రాన్ని భాగస్వామితో కలిసి నిర్మించడం ద్వారా 1963లో చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన ఆ మరుసటి ఏడాదే సోలోగా ఎన్టీఆర్‌తో 'రాముడు భీముడు' నిర్మించి, సంచలన నిర్మాతగా మారిన సంగతి ఓ చరిత్ర. ఆరేళ్ల తర్వాత కష్టాల కడలి ఈదుతూ ఇక సినిమాలకు 'రాం రాం' చెప్పక తప్పదనుకునే పరిస్థితిని ఎదుర్కొని, అక్కినేని-వాణిశ్రీ జంటగా నిర్మించిన 'ప్రేమనగర్'తో పడిలేచిన కెరటమైన ఆయన, ఇక వెనుతిరిగిందే లేదు. శ్రీకృష్ణ తులాభారం, చక్రవాకం, సోగ్గాడు, సెక్రటరీ, సావాసగాళ్లు, మండే గుండెలు, దేవత, ముందడుగు, ప్రతిధ్వని, అహ నా పెళ్లంట, ఇంద్రుడు చంద్రుడు, బొబ్బిలి రాజా, కలిసుందాం రా, మల్లీశ్వరి వంటి ఎన్నో సినిమాలు ఆయన నిర్మాణ దక్షతకు నిదర్శనాలు.
పెద్ద కుమారుడు సురేశ్‌ని తన వారసుడిగా నిర్మాతని చేసిన ఆయన చిన్న కుమారుడు వెంకటేశ్‌ని 'కలియుగ పాండవులు'తో హీరోని చేశారు. ఇవాళ ఆ ఇద్దరూ తమ తమ రంగాల్లో అగ్ర స్థాయిని ఆస్వాదిస్తుండటం తెలిసిందే.
ఓ నిర్మాతగా ఎంతోమంది తారల్నీ, సాంకేతిక నిపుణుల్నీ పరిచయం చేసిన ఆయన తన సేవల్ని నిర్మాణ రంగం బయట కూడా విస్తరింపజేశారు. సినిమా షూటింగుల కోసం రామానాయుడు స్టూడియోస్‌ని నెలకొల్పిన ఆయన అందులో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల్నీ ఏర్పాటు చేశారు. ఇక డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోనూ ఆయన అగ్రగామిగా వెలుగొందుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌నీ సినీ హబ్ చేయాలనే సంకల్పంలో భాగంగా పాతికెకరాల సువిశాల స్థలంలో సముద్రానికి అతి దగ్గరగా ఆయన నెలకొల్పిన రామానాయుడు స్టూడియోస్ ఇప్పుడు ఎంతోమంది నిర్మాతల్ని ఆకర్షిస్తోంది. నటుడిగానూ ఆయన కొన్ని సినిమాల్లో కనిపించారు. ఇటీవలి కాలంలోనే 'హోప్' అనే సినిమాలో ప్రధాన భూమిక ధరించి, ఉత్తమ నటనని ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసల్పి సైతం అందుకున్న ప్రజ్ఞాశాలి రామానాయుడు. ప్రస్తుతం రాజకీయ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఉన్న కొద్ది సంవత్సరాల్లో ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన సేవాతత్పురుడు. బాపట్ల పార్లమెంటు సభ్యునిగా పదవిలో ఉన్న కాలంలో ఆయన చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలు నిరుపమానం. ఇందుకోసం ఆయన ఎంపీ నిధుల్నే కాక సొంత డబ్బునీ ఖర్చు చేసి తన సేవా నిరతిని చాటుకున్నారు.
అటువంటి ఆ నిరంతర సినీ పథికుడు ప్రస్తుతం మరో సినీ నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ హీరోలుగా వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్నీ చురుగ్గా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆద్యంతం వినోదభరితంగా తయారవుతున్న ఈ సినిమాతో నిర్మాతగా మరో విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్న రామానాయుడు సోమవారం తన 76వ పుట్టిన రోజును బ్యాంకాక్‌లో అదే సినిమా సెట్స్‌పై జరుపుకోబోతున్నారు.
(నేడు డాక్టర్ రామానాయుడు పుట్టిన రోజు)
No comments:
Post a Comment