Showing posts with label vetapalem. Show all posts
Showing posts with label vetapalem. Show all posts

Saturday, March 26, 2011

కథ: పదహారేళ్ల తర్వాత (రెండో భాగం)

"ఏం సారూ! మీరీడికొచ్చి శానా కాలమైనట్టుందే?" అడిగాడు రిక్షావాలా.
"అవును. పదహారేళ్లయింది. నా ఫ్రెండుని చూడటం కోసం వచ్చా ఇప్పుడు" చెప్పాడు.
"నాయినపల్లిలో ఎ స్నేయితుడు? నేనుండేది కూడా అక్కణ్ణే. అంతా నాకు తెల్సినోళ్లే. నా పేరు కోటయ్య" అన్నాడు రిక్షావాలా.
"అవునా కోటయ్యా! వాడి పేరు సుదర్శన్". 
టక్కున బ్రేక్ వేశాడు కోటయ్య. చైను కిర్రుమని చప్పుడు చేస్తుండగా ఆగింది రిక్షా. అది ఊహించని పద్మాకర్ కంట్రోల్ చేసుకోలేక కాస్త ముందుకు తూలాడు. చివరి నిమిషంలో చేత్తో రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు. లేదంటే పడిపోయేవాడే.
"ఏంటి కోటయ్యా! ఎందుకు సడన్‌గా రిక్షా ఆపావ్?" కాస్త అసహనంగా అడిగాడు పద్మాకర్.
"శమించండి బాబూ. మీరు సుదర్శన్ బాబనేసరికి ఏదో అయినట్టయ్యింది బాబూ. అయితే ఆఖరి చూపుకు వొత్తున్నారన్న మాట!" అన్నాడు కోటయ్య.
'ఆఖరి చూపుకు..' అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు పద్మాకర్.
"ఏంటి కోటయ్యా నువ్వంటున్నది? ఆఖరి చూపేమిటి?" అడిగాడు.
కోటయ్య కాస్త ఆశ్చర్యంగా చూశాడు పద్మాకర్ వైపు. రిక్షా ఇంకా ఆగే ఉంది రోడ్డుకి ఓ పక్కగా.
"ఏంటి బాబుగోరూ మీరొత్తుంది సుదర్శన్‌బాబు అంతిక్రియలకే కదా!" అన్నాడు. 
షాక్ కొట్టినట్లు కాసేపు కోటయ్య వంక చూసి "నువ్వు చెబుతోంది లీడర్ సుదర్శన్ గురించి కాదనుకుంటా, వేరే అతను అయివుంటాడు" అన్నాడు పద్మాకర్ తనని తాను సంభాళించుకుంటూ.
"నాకు తెల్సిన సుదర్శన్‌బాబు వొక్కరేనయ్యా. ఆ మాటకొత్తే నాయినపల్లిలోనే కాదు, యేటపాలెం మొత్తమ్మీద సుదర్శన్‌బాబంటే అందరికీ తెల్సింది ఆ బాబొక్కడే" గట్టిగా చెప్పాడు కోటయ్య.
తన మిత్రుడికేమీ కాదని ఎక్కడనో మిణుకు మిణుకుమంటున్న ఆశ, ధైర్యం చల్లారిపోయాయి పద్మాకర్‌లో. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. గొంతు పూడుకుపోయింది. 
కళ్లు తడవుతున్నాయి.
"ఎలా.. ఎలా జరిగింది? ఇంత హఠాత్తుగా ఎలా పోయాడు? వారం రోజులు కాలేదే నేను వాడితో మాట్లాడి" అన్నాడు బలహీనమైన గొంతుతో. 
తిరిగి రిక్షా తొక్కుతూ చెప్పడం మొదలుపెట్టాడు కోటయ్య.
"నాల్రోజుల కింద నెక్లెసు నూక్కెళ్లాడనిజెప్పి ఓ కుర్రాణ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మేశారు బాబూ. కానీ ఆ నెక్లెసు ఆ కుర్రాడు పనిచేసే ఆసామి ఇంట్లోనే దొరికింది. ఆ ఆసామి పెళ్లాం ఏదో పేరంటామికెళ్తా ఆ నెక్లెస్‌ని యాడో పెట్టి మర్సిపోయింది. ఆ కుర్రాణ్ని దొంగన్నారు. పోలీసులు ఆడొళ్లు ఊనంసేసి పారేశారు.
ఎస్సయ్యి బూటుకాలితో కొట్టిన దెబ్బకి ఆడి కాలొకటి ఇరిగిపోయింది. ఈ సంగతి బయట చెబ్తే పేణాలు తీత్తామని బెదరగొట్టి ఆడ్ని వొదిలేశారు. కానీ అట్లాంటి సంగతులు దాగుతయ్యా? సుదర్శన్‌బాబుకి తెల్సిపోయింది. కొంతమంది కుర్రోళ్లని ఎంటేసుకొని పోలీసోళ్ల మీద ఉద్దెమం లేవదీశాడు.
కొత్త కాల్వ బ్రిడ్జికాడ నాలుగ్గంటల్సేపు రాస్తారోకో సేసారు. అప్పుడు సూడాలి బాబూ.. అటు ఒంగోల్నించి వొత్తున్న బళ్లు, ఇటు సీరాల్నించి ఎళ్తున్న బళ్లు ఎంత దూరం ఆగిపోయినాయో! యేటపాలెం సెరిత్రలోనే అట్టాంటి ఉద్దెమం నేను సూళ్లేదు బాబూ. అప్పుడు సీరాల్నించి సీఐ వొచ్చి బెదిరిచ్చాడు. ఎవురూ లెక్కసెయ్యలా. ఆ తర్వాత డీఎస్పీ బాబే వొచ్చాడు. గదిమాడు. అరెస్టు జేత్తానని బెదిరిచ్చాడు. సుదర్శన్‌బాబోళ్లు అదర్లా, బెదర్లా. "సేతనైతే సేస్కోండి" అన్నాడు.
రోసమొచ్చి డీఎస్పీ అరెస్టు చెయ్యబోయాడు. ఉన్నపళాన జనం తిరగబడ్డారు. ఆళ్లలో నేనూ ఉన్నందుకు చాలా గర్వమనిపిత్తుంది బాబూ ఇయాల. జనాన్ని చూసి డీఎస్పీ పళ్లు పటపటమంటా కొరికి పోలీసుల్తోటి 'శార్జ'నో ఏందో అన్నాడు బాబూ. ముందు ఆయనే లాఠీ తీసుకుని కుర్రాళ్ల మీద పడ్డాడు. ఆయన్ని చూసి అక్కడున్న పోలీసులంతా లాఠీల్తోటి ఇరగతన్నారు బాబూ జనాన్ని.
సుదర్శన్‌బాబు ఇది సూళ్లేక డీఎస్పీకి అడ్డం పడ్డాడు. అంతలోకే ఆయన తలమీన లాఠీ దెబ్బ పడిందయ్యా. ఆ డీఎస్పీనే కొట్టాడో, ఇంకెవరు కొట్టారో అట్టానే కుప్పకూలిపోయాడు. దాంతోటి జనం ఇంకా రెచ్చిపొయ్యారు.
ఎవుర్ని ఎవురు కొడ్తన్నారో తెలీలా. ఎవురు ఎవుర్ని తొక్కేత్తన్నారో తెలీలా. గొడవ సల్లార్నాక జూత్తే ఏముందయ్యా.. నెత్తుటి మడుగులో ఉన్నాడు సుదర్శన్‌బాబు.
ఆస్పెత్రికి తీస్కపోదామంటే ట్రాఫిక్‌జామయ్యే. రెండు గంటలు పైనే పట్టింది ఆస్పెత్రికి ఎళ్ళేతలికి. అప్పటికే ఆ బాబు కోమాలోకి ఎల్లిపోయాడు. కొనూపిర్తో వున్నాడు.
రెండ్రోజులు సావుతో యుద్ధం జేశాడు. మా కోసం సేసిన యుద్ధాలు ఇంక సాలనుకున్నాడో ఏందో నిన్ననే ఊపిరి వొదిలేశాడు బాబూ".
కోటయ్య గొంతు పూడుకుపోయింది బాధతో. అప్పటికే పద్మాకర్ గుండె బరువెక్కింది. పదహారేళ్లుగా దూరమైపోయి, తిరిగి కలవాలని ఎంతో ఆశతో వస్తుంటే.. సెలవంటూ వెళ్లిపోయావా నేస్తం? ఈ మిత్రుడి మొహం చూడకూడదనుకున్నావా? టపటపమంటూ రెండు నీటి చుక్కలు కళ్లనుండి జారి తొడల మీద పడ్డాయి.
కోటయ్యే మాట్లాడాడు మళ్లీ. "నిన్న సాయంకాలమే పోట్టుమాట్టం సేసి శవాన్ని ఇంటికి పంపిచ్చారు. సుదర్శన్‌బాబు పోయాడని తెలియంగాల్నే ఆస్పెత్రికాడికి వొచ్చారు సూడయ్యా.. ఎంత జనమని! నేం కూడా ఎల్లాలే. పోలీసు నాయాళ్లు కూడా శానా మందున్నారు. ఏదైనా గొడవ జరుగుద్దేమోనని ముందుగాల్నే వంద మందికి తక్కువ కాకుండా ఆళ్లని పెట్టారు. కానీ జనం గొడవ సెయ్యలా! ఎందుకనంటే అప్పటికే ఆ డీఎస్పీని ఆఫీసర్లు సస్పెండు సేసేశారు".
రిక్షా ఆగింది. పద్మాకర్ దిగాడు. వీధి పొడుగూతా జనమే.
"జరగండి.. జరగండి" అని కాస్త గట్టిగా అరుస్తూ ముందుకు పోతున్నాడు కోటయ్య. వెనకే పద్మాకర్.
కాళ్లు వొణుకుతున్నాయి. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగింది. ఎదురుగా నేలమీద పాడె, దాని మీద శవం. పద్మాకర్‌కి మొదటగా కనిపించింది తాడుతో బొటనవేళ్లు కలిపి కట్టిన రెండు పాదాలు. బాధ పొగిలి పొగిలి వచ్చింది గుండెల్లోంచి. దగ్గరగా వెళ్లాడు. 
"అమ్మా. బాబు సావాసగాడంట. కలకత్తా నుంచి వొచ్చాడంట" చెప్పాడు కోటయ్య.
సుదర్శన్ భార్య తలెత్తి పద్మాకర్ వైపు చూసి చీరకొంగుని నోట్లో కుక్కుకుంది దుఃఖాన్ని అదిమి పెట్టడానికి. 
"అంకుల్! మీరొస్తున్నారని వారం రోజుల కింద నాన్న ఎంత సంబరంగా చెప్పాడో. పదహారేళ్ల తర్వాత ఫ్రెండుని కలవబోతున్నానని ఎంత ఆనందపడ్డాడో. ఇప్పుడిట్టా కలుసుకున్నారు.." అని వెక్కివెక్కి ఏడ్చింది సుదర్శన్ పదకొండేళ్ల కూతురు. ఆ అమ్మాయి తలని గుండెలకి అదుముకుని సుదర్శన్ మొహం వంక చూశాడు పద్మాకర్. అదే స్ఫురద్రూపం. ఏమాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు కళ్లు మూసుకుని ఉన్నాయి. ముక్కు రంధ్రాల్లో దూది పెట్టి ఉంది.
సుదర్శన్ చెంపని తడిమాడు పద్మాకర్. దుఃఖాన్ని అదిమిపెట్టడం కష్టమైంది.
"ఏరా! ఇలా చూసేందుకా నేను వచ్చింది?" అంతకుమించి గొంతులోంచి మాటలు రాలేదు. కళ్లలోంచి నీళ్లు రాలుతున్నాయి.
తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు.
సరిగ్గా అప్పుడే అతడి సెల్‌ఫోన్ రింగయ్యింది. కళ్లు తుడుచుకుని చూశాడు. 
ఏదో తెలీని నెంబరు. కాల్ రిసీవ్ చేసుకున్నాడు. 
"హలో సార్. నేను లక్ష్మణ్‌ని. ఇందాక ట్రైన్‌లో కలిసి జర్నీ చేశాం కదా. సార్ మీ ఫ్రెండుని కలిశారా? ఈ పాటికి కలిసే ఉంటారనిపించి ఆగలేక ఫోన్ చేశా సార్".
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఫోన్‌లో పద్మాకర్ ఏడుపు గట్టిగా వినిపించింది లక్ష్మణ్‌కి.
(అయిపోయింది)

Saturday, March 12, 2011

కథ: పదహారేళ్ల తర్వాత...

కృష్ణా ఎక్స్‌ప్రెస్ వేగంగా పరుగెత్తుతోంది. పద్మాకర్‌ని ఆనందం, ఉద్వేగం కలగలసిన భావం ఊపేస్తోంది. అది మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎదుటివాళ్లకి.
"ఏం సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు?" ఎదురుగా విండో పక్కన కూర్చున్న లక్ష్మణ్ అడిగాడు. అతనో ఇంజినీరింగ్ స్టూడెంట్. అప్పటికే ఇద్దరికీ పరిచయమయ్యింది.
"ఇంకో అరగంటలో వేటపాలెం వచ్చేస్తుంది. పదహారేళ్ల తర్వాత నా స్నేహితుణ్ణి కలవబోతున్నా!" పద్మాకర్ గొంతులో ఉద్వేగం దాగలేదు.
"పదహారేళ్ల తర్వాత మీ ఫ్రెండుని కలవబోతున్నారా! అబ్బా.. చాలా థ్రిల్లింగ్‌గా ఉండి ఉంటుంది మీకు. అవునా?" అడిగాడు లక్ష్మణ్.
"మామూలు థ్రిల్లింగ్ కాదు. వాడు నా ప్రాణమిత్రుడు. కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. మా క్లోజ్‌నెస్ చూసి మిగతా స్టూడెంట్స్, లెక్చరర్స్ తెగ ఆశ్చర్యపోయేవాళ్లు. మమ్మల్ని విడదీయాలని చూసిన వాళ్లు సక్సెస్ కాలేకపోయారు."
"మరి ఎలా విడిపోయారు?"
"బీఎస్సీ ఫైనలియర్‌లో ఉండగానే మా నాన్నకు ప్రమోషన్ మీద కలకత్తాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఆయన అప్పుడు స్టేట్ బ్యాంకు మేనేజర్. ఎగ్జాంస్ అయ్యేలోగా నాలుగు నెలలు సుదర్శన్ వాళ్లింట్లోనే ఉన్నా. ఆ తర్వాత కలకత్తాకు వెళ్లిపోయా. మళ్లీ ఇప్పుడే రావడం."
"అప్పణ్ణుంచీ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ లేదా?"
రైలు వేగం తగ్గింది.
"నేను కలకత్తాకి వెళ్లిన కొత్తలో రెండు మూడు ఉత్తరాలు రాసుకున్నాం. ఆ తర్వాత నేను ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయా. చదువులో పడి నేను వాడికి ఉత్తరాలు రాయడం నిర్లక్ష్యం చేశా. అట్లా మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నెల రోజుల క్రితమే వాడితో మళ్లీ మాట్లాడా ఫోనులో. అప్పట్నించీ వాడెలాగ ఉన్నాడో చూడాలనే ఆరాటం. అందుకే ఈ ప్రయాణం."
రైలు బాపట్ల స్టేషనులో ఆగింది. దిగేవాళ్లు దిగుతుంటే, ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు.
"గుగ్గిళ్లోయ్.. గుగ్గిళ్లూ" అంటూ తిరుగుతున్న ఓ కుర్రాడిని పిలిచాడు పద్మాకర్. ఐదేసి రూపాయలకు రెండు పొట్లాలు తీసుకుని ఒకటి లక్ష్మణ్‌కిచ్చాడు. అతను మొహమాటపడుతూ తీసుకున్నాడు.
"గుగ్గిళ్లంటే సుదర్శన్‌కీ, నాకూ చాలా ఇష్టం. కాలేజీ దగ్గరకి ఓ ముసలామెతో పాటు ఇద్దరు ముగ్గురు గుగ్గిళ్లు తెచ్చేవాళ్లు. మేం మాత్రం రోజూ ఆ ముసలామె దగ్గరే కొనేవాళ్లం. ఒకసారి ఆమె ఆ గుగ్గిళ్లు అమ్ముతూనే గుండెపోటు వచ్చి చనిపోయింది" జ్ఞాపకం చేసుకున్నాడు పద్మాకర్.
"అసలు అన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఎలా దొరికాడు" అడిగాడు లక్ష్మణ్.
"ఫోన్ చేసింది నేను కాదు, వాడే. ఢిల్లీలో ఆ ఊరతను ఒకాయన పరిచయమయ్యాడు. అప్పుడు సుదర్శన్ గురించి అతనికేమన్నా తెలుసేమో అడిగాను. అతనేమన్నాడో తెలుసా? 'సుదర్శన్‌గారి గురించి తెలీకపోతే ఆ ఊరతను కానట్టే' అని. అయితే వాడి ఫోన్ నెంబర్ తెలీదనీ, వాడి పేరు, ఊరి పేరు రాస్తే చాలు లెటర్ వాడికి చేరుతుందనీ చెప్పాడు. అతను చెప్పినట్లే లెటర్ రాశా. అందులో నా ఫోన్ నెంబరు ఇచ్చా. నాలుగు రోజుల తర్వాత వాడు ఫోన్ చేశాడు" ఉత్సాహంగా చెప్పాడు పద్మాకర్.
రైలు కదిలింది.
"మీ ఫ్రెండ్ అక్కడ అంత ఫేమస్ ఫిగరా?" లక్ష్మణ్ గొంతుకలో కుతూహలం.
"అవును. ఆ ఊళ్లోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ల వాళ్లకీ వాడు తెలుసంట! ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరికంటే ఎక్కువసార్లు అరెస్ట్ అయ్యిందీ, జైలుకి వెళ్లిందీ వాడేనంట!" అని పద్మాకర్ చెప్పగానే గుగ్గిళ్లు తింటున్న వాడల్లా నోరెళ్లబెట్టాడు లక్ష్మణ్.
"జైలుకి వెళ్తుంటాడా? అంటే.." అని ఆగిపోయాడు.
"నీ ఉద్దేశం అతడు నేరాలు చేస్తూ జైలుకి వెళ్తుంటాడా? అని కదూ!.. కాదు. మామూలుగానైతే జైలుకి వెళ్లేది నేరాలు చేసేవాళ్లే. కానీ నా ఫ్రెండు అలాంటివాడు కాదు. అన్నిసార్లూ ఇతరుల కోసమే, వారి కోసం చేసిన పోరాటాల వల్లే జైలుకి వెళ్లాడు. పేదవాళ్లకి అన్యాయం జరిగితే కాళ్లూ చేతులూ ముడుచుకుని, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం వాడికి చేతకాదు. అందుకే అన్నిసార్లు జైలుకెళ్లాడు. ఇంకెన్నిసార్లు వెళతాడో! ఢిల్లీలో ఈ సంగతి చెప్పిన ఆ వ్యక్తి తనూ ఆ ఊరివాడైనందుకు గర్విస్తున్నానని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వపడ్డాను, సుదర్శన్‌కి నేను మిత్రుడనైనందుకు. అలాంటి గొప్ప లీడర్ని వెంటనే చూడాలని మనసు కొట్టుకుపోయింది. అందుకే ఈ ప్రయాణం" చెబుతుంటే పద్మాకర్ గొంతు ఉద్వేగంతో పూడుకుపోయింది. వొళ్లు వణికింది. విండోలొంచి బయటకు చూశాడు. రైలుకట్ట పొడవూతా వరిచేలు పచ్చగా. అప్పుడే కోతలు మొదలు పెడుతున్నట్లుంది. గోచీలు బిగించి ఆడవాళ్లు కొడవళ్లతో పైరు కోస్తుంటే, మగాళ్లు వాటిని కుప్పలు పెడుతున్నారు.
అంతట్లోనే నూలు డయ్యింగులు ప్రత్యక్షమయ్యాయి. బొంగుల మీద ఎండకు ఆరబెట్టిన రంగురంగుల నూలు. ఈపూరుపాలెం స్టేషను దాటింది రైలు. అక్కడ ప్యాసింజర్లు మాత్రమే ఆగుతాయి. రైలు వేగం తగ్గుతోంది. చీరాల స్టేషన్ దగ్గరవుతోంది.
"ఇంకో పది నిమిషాల్లో వేటపాలెం వచ్చేస్తుంది" అన్నాడు లక్ష్మణ్ విండోలోంచి బయటకి చూస్తూ.
పద్మాకర్ తలూపాడు.
"మీరు చెబుతుంటే మీ ఫ్రెండుని చూడాలని నాకూ ఆరాటంగా ఉందండీ. ఆయన గురించీ, ఆయన పనుల గురించీ ఇంకా తెల్సుకోవాలన్న కోరిక కలుగుతోంది. అలాంటివాళ్లే నాకు స్ఫూర్తి. నేను మా కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ని. కానీ నేను తప్పకుండా గూడూరుకి వెళ్లాలి. అమ్మకి ఆరోగ్యం బాలేదు" అన్నాడు లక్ష్మణ్ కాస్త విచారంగా.
"ఏంటి ప్రాబ్లెం అమ్మకి?" అడిగాడు పద్మాకర్.
చీరాల్లో ఆగింది రైలు.
"రెండ్రోజుల క్రితం ఇల్లు కడుగుతూ జారి గడప మీద పడిపోయిందంట! మడమ దగ్గర ఫ్రాక్చరంట! అసలే అమ్మకు సుగర్" చెప్పాడు అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ లక్ష్మణ్.
"అరే.. అవునా! అమ్మ ఆరోగ్యం ముఖ్యం. నిన్ను చూశాక అమ్మకు కాస్త ధైర్యం రావచ్చు. ఇష్టమైన వాళ్లు దగ్గరుంటే మనిషిలో హుషారు వస్తుంది" చెప్పాడు పద్మాకర్. రైలు కదిలింది. పద్మాకర్ లేచి సీటుకింద పెట్టిన ఎయిర్‌బ్యాగ్‌ను లాగి సీటు మీద పెట్టాడు. తనలో కలుగుతున్న ఉద్వేగానికి ఆశ్చర్యపడ్డాడు. తనకి ఊహ తెలిశాక ఇటువంటి ఉద్వేగాన్ని ఎన్నడూ ఎరుగడు. ఎంబీఏలో టాపర్‌గా నిలిచినప్పుడు గానీ, ప్రతిష్ఠాత్మక ఢిల్లీ బిజినెస్ స్కూల్లో ఉద్యోగం వచ్చినప్పుడు గానీ ఇంతటి ఉద్వేగం కలగలేదు.
అంతలోనే రైలు స్పీడు తగ్గింది. వేటపాలెం స్టేషన్ వచ్చేస్తోంది. కిర్రుమని చప్పుడు చేస్తూ ఆగింది రైలు.
పద్మాకర్ దిగుతుంటే "మీ ఫ్రెండుని అడిగినట్లు చెప్పండి సార్. బై.." చెప్పాడు లక్ష్మణ్.
నవ్వి "బై" అంటూ రైల్లోంచి ఫ్లాట్‌ఫాం మీదకి అడుగుపెట్టాడు. స్టేషన్ కాస్త మారింది. ఇదివరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవు. అవతలివైపు ఫ్లాట్‌ఫాంకి షెల్టర్లు లేవు. ఇప్పుడు వచ్చాయి. స్టేషన్ బయటకొచ్చాడు. అక్కడ పెద్ద మార్పు కనిపించలేదు. మూడు నాలుగు రిక్షాలు, రెండు ఆటోలు ఉన్నాయి.
"సార్! ఆటో కావాలా? ఎక్కడికి?" అంటూ వచ్చాడు ఒక ఆటోవాలా.
త్వరగా సుదర్శన్‌ని చూడాలని ఉన్నా, రిక్షాలో వెళ్లాలని అనుకున్నాడు పద్మాకర్. రిక్షాలో అయితే ఊరు చూస్తూ వెళ్లొచ్చు.
అతణ్ణి పంపించేసి ఒక రిక్షా ఎక్కి "నాయనపల్లికి పోనీయ్" అని కూర్చున్నాడు.
రిక్షా పోతుంటే అటూ ఇటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జింఖానా క్లబ్, పోలీస్ స్టేషన్, గరల్స్ హైస్కూలు దాటింది రిక్షా.
"అరే ఇక్కడ సరస్వతీ పిక్చర్ ప్యాలెస్ ఉండాలే. విజయదుర్గా థియేటర్ అని మార్చారన్న మాట!" అన్నాడు రూపురేఖలు మారిపోయిన సినిమా హాలును చూస్తూ.
(మిగతా వచ్చే వారం)