Showing posts with label robo. Show all posts
Showing posts with label robo. Show all posts

Saturday, October 1, 2011

న్యూస్: ఆల్‌టైం రికార్డ్ దిశగా 'దూకుడు'

టాలీవుడ్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్ దిశగా మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' దూసుకుపోతోంది. తొలివారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 50.07 కోట్ల గ్రాస్, రూ. 35.01 కోట్ల షేర్ సాధించి దక్షిణ భారత రికార్డుని సాధించింది. ఈ విషయంలో రజినీకాంత్ 'రోబో'ని సైతం అది అధిగమించడం విశేషం. తొలివారం కలెక్షన్ల విషయంలో 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రని 'దూకుడు' తిరగరాసిందని ఆ చిత్ర నిర్మాతలు రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. విడుదలైన ప్రతి ఏరియాలోనూ 'దూకుడు' సినిమా ఆల్‌టైం రికార్డ్ సృష్టించిందని వారు చెప్పారు. నైజాం ఏరియాలో తొలివారం 'దూకుడు' 12.51 కోట్ల గ్రాస్, 8.52 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితుల్ని నివ్వెరపోయేట్లు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఇలాంటి ఫీట్ సాధించడం అద్భుతమనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాలో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించడం అపూర్వం. అందుకే అక్కడి లాస్ ఏంజిల్స్ టైమ్స్, వెరైటీ లాంటి ప్రఖ్యాత పత్రికలు సైతం 'దూకుడు' విజయంపై ప్రత్యేక కథనాలు రాశాయి. మునుముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు చిన్న చిన్న హిట్లతోనే సరిపెట్టుకుంటూ వచ్చిన టాలీవుడ్‌కి ఇదే తొలి అతి పెద్ద విజయం కావడం గమనార్హం.

Saturday, November 13, 2010

సినిమా: 'బృందావనం' హిట్టేనా?

ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన 'బృందావనం' హిట్టేనా? హిట్టయ్యిందని అందరూ అనుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిశీలనగాచూస్తే రెండోదే నిజమనిపిస్తోంది. విడుదలైనప్పుడు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. 'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలు ఫ్లాప్ కావడంతో 'రోబో' ప్రభంజనాన్ని 'బృందావనం' అడ్డుకుంటుందని విశ్లేషకులు భావించారు. చిత్రంగా ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడంలో 'బృందావనం' విఫలమైంది. దాంతో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టిపెట్టి ఊకదంపుడు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఏ చానల్ చూసినా ఈ సినిమా గురించిన ప్రకటనలూ, ప్రచారమే. ఈ యేడాది 'టాప్ 3' సినిమాల్లో 'బృందావనం' ఉంటుందని తానన్న మాటల్ని నిజం చేయాలనే తాపత్రయమే ఆయనలో కనిపిస్తూ వచ్చింది.
నిన్నటికి నిన్న ఈ సినిమా ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో "ఈ సినిమా ఈ యేడాది టాప్ 3లో నిలిచింది' అని చెప్పడం దీన్నే సూచిస్తోంది. అలాగే నైజాంలో టాప్ 5గా నిలిచిందని కూడా ఆయనన్నారు. పైరసీ లేకుండా ఉన్నట్లయితే టాప్ 1గా నిలిచేదని ఆయన ఆక్రోశించారు.
కానీ అదే పైరసీని తట్టుకొని 'రోబో' సూపర్ కలెక్షన్లని సాధించిన సంగతిని ఆయన కావాలనే విస్మరించారు. ఏదేమైనా నైజాం, వైజాగ్ మినహాయించి మిగతా ఏరియాలకి ఈ సినిమాని కొన్న బయ్యర్లు అంత హ్యాపీగా లేరని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల సంగతలా వుంచి నష్టాలు రాకుంటే అంతే చాలని వాళ్లు కోరుకుంటున్నారు.

Friday, October 8, 2010

సినిమా: రజనీ - ద గ్లోబల్ స్టార్!

నిన్నటిదాకా దక్షిణాది సూపర్ స్టారుగా వెలుగొందిన రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇది ఆషామాషీగా చెబుతున్న సంగతి కాదు. సంచలనాల 'రోబో' సాక్షిగా వెల్లడైన నిఖార్సయిన నిజం. ఇది ఒక భారతీయ నటుడు - అదీ ఒక దక్షిణ భారత దేశానికి చెందిన ఓ ప్రాంతీయ నటుడు - సాధించిన అపూర్వ, అపురూప విజయం. తమిళ చిత్ర రంగానికి చెందిన ఓ నటుడి సినిమాకి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏమిటి! ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడంటే మూడు రోజుల్లో 95 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం ఏమిటి!! ఇది అద్భుతం కాక మరేమిటి!!!                        
బాక్సాఫీసు రికార్డులు పాదాక్రాంతం
భారతీయ సినిమాకి సంబంధించి 'రోబో' ఎన్నో సరికొత్త రికార్డుల్ని లిఖిస్తోంది. భవిష్యత్తులో మరెన్నింటినో లిఖించబోతోంది. ఇప్పటిదాకా దేశంలో అత్యంత వ్యయభరిత చిత్రం 'రోబో'నే. మునుపటి రికార్డు 120 కోట్ల రూపాయల వ్యయమైన హృతిక్ రోషన్ సినిమా 'కైట్స్' పేరుతో ఉంది. అలాగే మూడు భారతీయ భాషల్లో (తమిళ, తెలుగు, హిందీ) ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రింట్లతో విడుదలైన సినిమా కూడా 'రోబో'నే. అక్టోబర్ 1న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా ఇటీవలే సల్మాన్ ఖాన్ సినిమా 'దబాంగ్' నెలకొల్పిన తొలి మూడు రోజుల వసూళ్ల రికార్డుని ఏకంగా రెట్టింపు వసూళ్లతో బద్దలు కొట్టడం గొప్ప విశేషం. విడుదలైన తొలి మూడు రోజుల్లో 'దబాంగ్' 49 కోట్ల రూపాయల్ని ఆర్జించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆ రికార్డుని భారీ వ్యత్యాసంతో బద్దలు కొట్టాడు 'రోబో.
బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పిన లెక్కల ప్రకారం 'రోబో' సాధించిన మూడు రోజుల వసూళ్లు 95 కోట్ల రూపాయలు. ఆయన అంచనా ప్రకారం ఆ సినిమా రానున్న రోజుల్లో మరో 125 కోట్ల రూపాయల్ని ఆర్జించనున్నది. అయితే మనదేశంలో కచ్చితమైన బాక్సాఫీసు ఫలితాలు బహిర్గతం కావడం కష్టం. ఒక విశ్లేషణకీ, మరో విశ్లేషణకీ వ్యత్యాసాలు సాధారణం. ఉదాహరణకి స్వతంత్ర పారిశ్రామిక వెబ్ సైట్ అయిన బాక్సాఫీస్ ఇండియా డాట్ కామ్ అంచనాల ప్రకారం తొలి వారాంతంలో 'రోబో' వసూలు చేసిన మొత్తం 57 కోట్ల రూపాయలే. అయినప్పటికీ ఇది కూడా కొత్త రికార్డే కావడం గమనార్హం. మనదేశం బయట అమెరికా, మలేషియా, జపాన్ లలో వీర విహారం చేస్తున్న ఈ సినిమా కొత్తగా స్వీడన్ లోనూ బ్రహ్మాండంగా ఆడుతుండటం రజనీ సినిమాల మార్కెట్ విస్తృతికి ఒక చక్కని నిదర్శనం. రజనీ చేసిన ఈ మ్యాజిక్ తో దక్షిణాది నటులే కాదు, దేశంలో తామే అగ్రగణ్యులమని విర్రవీగే బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం ముక్కు మీద వేలేసుకుని విస్తుపోతున్నారు. వృద్ధాప్యమనదగ్గ అరవై ఏళ్ల వయసులో అందం చందం కూడా లేని నటుడికి ఇదెలా సాధ్యమని వాళ్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఒక నటుడికీ, దేవుడికీ ఉన్న వ్యత్యాసాన్ని సైతం చెరిపేసిన రజనీని చూసి దిగ్భాంతి చెందుతున్నారు. అదీ రజనీ మాయ! తమిళనాడులో నిన్నటిదాకా బాక్సాఫీసు కొలబద్ద రజనీయే నటించిన 'శివాజి'. ఇప్పుడు తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకుంటూ 'రోబో'గా సరికొత్త 'బెంచ్ మార్క్'ని నెలకొల్పబోతున్నాడు.
సరే - తమిళనాడులో ఆయనే నెంబర్ వన్ హీరో. మరి తెలుగు సంగతేమిటి? కనీ వినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన తెలుగు 'రోబో'కి ఈ కలెక్షన్ల తుఫానేమిటి! తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని రీతిలో ఒక డబ్బింగ్ సినిమా హైదరాబాదులో 72 స్క్రీన్లలో విడుదలవడం, అన్ని థియేటర్లూ మూడు రోజుల పాటు ఫుల్స్ కావడం మామూలు విశేషం కాదు. దానికి ముందు పవన్ కల్యాణ్ 'పులి' కానీ', దాని తర్వాత 'మహేశ్ ఖలేజా' కానీ అన్నేసి థియేటర్లలో విడుదల కాకపోవడం, రెండూ చాప చుట్టేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు చెప్పండి. తెలుగులో సూపర్ స్టార్ ఎవరు? ఏదేమైనా రజనీకాంత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దర్శకుడిగా తననెందుకు అగ్రశ్రేణిలో పరిగణిస్తారో 'రోబో'తో మరోసారి నిరూపించుకున్నాడు శంకర్. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో 'రోబో'తో అతను తెలియజేశాడు. ఇప్పుడు 'రోబో'ని ఎందుకు వదులుకున్నానా అని షారుఖ్ ఖాన్ బాధపడుతూ ఉంటాడు. శంకర్ ని తక్కువగా అంచనా వేసినందుకు తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు.

Monday, September 20, 2010

సినిమా: మహేశ్ వర్సెస్ ఎన్టీఆర్



తెలుగులో ఇద్దరు టాప్ హీరోలు దసరాకి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆ ఇద్దరు - మహేశ్, జూనియర్ ఎన్టీఆర్. మహేశ్ హీరోగా నటించిన 'మహేశ్ ఖలేజా' సినిమా అక్టోబర్ 7న రిలీజ్ అవుతుందని నిన్న (సెప్టెంబర్ 19) ఆ సినిమా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కల్యాణ్ అధికారికంగా ప్రకటిస్తే, ఎన్టీఆర్ సినిమా 'బృందావనం' అక్టోబర్ 8న రిలీజవుతుందని ఆ సినిమా నిర్మాత రాజు ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. నిజానికి ఇంతకుమునుపు 'ఖలేజా' సెప్టెంబర్ 30న, 'బృందావనం' అక్టోబర్ 1న విడుదలవుతాయని వాళ్లు ప్రకటించారు.
కానీ రజనీకాంత్ 'రోబో' సినిమా విడుదల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1కి మారడంతో దానికి అనుగుణంగా ఈ సినిమాలని కూడా ఓ వారం వెనక్కి జరిపారు. అయితే ఈ డేట్లు ఫైనల్ అవుతాయా, మళ్లీ పోస్ట్ పోన్ అవుతాయా అనే సంగతి చెప్పలేం. అయితే దసరాకి మాత్రం మహేశ్, ఎన్టీఆర్ 'నువ్వా నేనా' అనక తప్పేట్లు లేదు. వాళ్లిద్దరూ ఇలా ఢీకొనడం ఇదే ప్రథమం. అక్టోబర్ 17 విజయదశమి. 10 నుంచే దసరా సెలవులు మొదలు. వాటిని క్యాష్ చేసుకోవాలంటే 7 లేదా 8 తేదీల్లో సినిమాని విడుదల చేయాలి. అందుకే 'ఖలేజా', 'బృందావనం' సినిమాల్ని ఆ తేదీల్లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
ఇలా ఒక వారం తేడాతో మూడు మెగా మూవీలు వస్తుండటంతో థియేటర్లకు కొరత తప్పడం లేదు. ఇప్పటికీ 'రోబో' నైజాం బిజినెస్ సంగతి తేలకపోవడం వల్ల ఆ సినిమాని ఈ ప్రాంతంలో ఎన్ని థియేటర్లలో విడుదల చేసేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు 'ఖలేజా'ని అల్లు అరవింద్, 'బృందావనం'ని దిల్ రాజు విడుదల చేస్తున్నందువల్ల ప్రధాన థియేటర్లన్నీ ఈ రెండు సినిమాలకే బుక్ అయ్యాయి. అయినప్పటికీ ఒకే టైంలో ఈ మూడింటినీ విడుదల చేస్తున్నందువల్ల మరీ ఎక్కువ ప్రింట్లతో విడుదల సాధ్యం కాదు. ఈ సంగతిని నిర్మాత రాజు ఒప్పుకున్నారు కూడా. 'వంద థియేటర్లలో వేయాల్సింది తొంభై థియేటర్లలో వేస్తాం' అని ఆయన చెప్పారు.
ఏదేమైనా 'ఖలేజా', 'బృందావనం' సినిమాలపై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ల్యాబ్ రిపోర్టులు కూడా ఈ రెండింటికీ పాజిటివ్ గానే ఉండటం వల్ల రిజల్ట్ ఏమవుతుందనే కుతూహలం అందరిలో పెరుగుతోంది. ఇద్దరిలో గెలుపెవరిది? ఒకరు ఓడి, ఒకరు గెలుస్తారా? ఇద్దరూ గెలుస్తారా? లేక ఇద్దరూ చేతులెత్తేస్తారా? దీనిపై ఇద్దరు హీరోల అభిమానులు ఇప్పటికే పందేలు కడుతున్నారు. ఈ పందెంలో గెలుపు పుంజు ఎవరో?