రానున్న రోజుల్లో బాలీవుడ్‌లో రాబోతున్న కొన్ని రీమేక్స్, సీక్వెల్స్ సినీ ప్రేమికుల్లో అమితాసక్తి రేకెత్తిస్తునాయి. వాటిపై ఓ లుక్కేస్తే...
జంజీర్: 1974లో విడుదలైన 'జంజీర్' సినిమాలో ఇన్‌స్పెక్టర్ విజయ్‌గా యాంగ్రీ యంగ్‌మేన్ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ పాత్రను కొత్తగా రూపొందించిన అపూర్వ లఖియా 'జంజీర్' 2013 సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిల్ హై కి మాన్తా నహీ: హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'ఇట్ హ్యాపెండ్ వన్ నైట్' ఆధారంగా రూపొందిన 'దిల్ హై కీ మాన్తా నహీ' సినిమాలో అమీర్‌ఖాన్, పూజాభట్ జంటగా అలరించారు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌కి పూజాభట్ డైరెక్టర్ కావడం విశేషం. ఆమె చెల్లెలు అలియాభట్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించబోతున్నారు.
మాసూం: ఎరిక్ సీగల్ పుస్తకం 'మేన్, వుమన్ అండ్ చైల్డ్' ఆధారంగా నసీరుద్దీన్‌షాతో శేఖర్ కపూర్ రూపొందించిన 'మాసూం' క్లాసిక్ ఫిలింగా పేరుపొందింది. గత ఏడాది 'చిట్టగాంగ్' సినిమాతో జాతీయ అవార్డు పొందిన వేదవ్రత పైన్ ఈ సినిమాకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్టున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్ర చేయనున్నాడు.
సాజన్: మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ నటించిన సూపర్‌హిట్ ముక్కోణ ప్రేమకథ చిత్రం 'సాజన్'ను నేటి తరం తారలతో సీక్వెల్ చేయనున్నట్లు ఆ సినిమా దర్శకుడు లారెన్స్ డి'సౌజా తెలిపాడు.
బోర్డర్: 1997లో వచ్చిన జె.పి. దత్తా సినిమా 'బోర్డర్' ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణ పొందింది. ఇప్పుడు వివిధ యుద్ధ వీరుల జీవితాలతో 'బోర్డర్'కు మూడు సీక్వెల్స్ తీస్తానని ఆయన ప్రకటించారు.
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్: రాహుల్ బోస్, మల్లికా షెరావత్ వంటి ఆసక్తికర జంటతో రూపొందిన 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్'లో విద్యా బాలన్, ఫరాన్ అఖ్తర్ జంటగా నటిస్తున్నారు.
ఇష్కియా: కొత్త దర్శకుడు అభిషేక్ చౌబీ రూపొందించిన 'ఇష్కియా' అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'దేద్ ఇష్కియా'లో మాధురీ దీక్షిత్, హుమా ఖురేషి, అర్షద్ వార్సి, నసీరుద్దీన్‌షా నటిస్తున్నారు.
ధూం: యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా ఒకదాన్ని మించి ఒకటి సూపర్‌హిట్టయిన్ 'ధూల్' సీరిస్‌లో మూడోదైన 'ధూల్ 3' కోసం ఈ యేడాది ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అమీర్‌ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్‌చోప్రా నటిస్తున్నారు.
విశ్వరూప్: కమల్‌హాసన్ రూపొందించగా 2012లో విడుదలైన 'విశ్వరూప్' ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దేశాంతర ఉగ్రవాదంపై కమల్ రూపొందిస్తున్న 'విశ్వరూప్ 2' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
క్రిష్: హృతిక్ రోషన్‌ను సూపర్ హీరోగా చూపిస్తూ రాకేశ్ రోషన్ రూపొందిస్తున్న సినిమా 'క్రిష్ 3'. నవంబర్‌లో రానున్న ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.
Showing posts with label vidya balan. Show all posts
Showing posts with label vidya balan. Show all posts
Wednesday, July 10, 2013
Wednesday, June 13, 2012
రవితేజ కోసమే పుట్టిన 'దరువు'
"ఇది రవితేజ కోసమే పుట్టిన కథ. ఇందులో తను చేసిన సీన్లు ఇప్పటివరకు చేయలేదని రవి అన్నారు'' అని చెప్పారు శివ. రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన 'దరువు'కు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి శివ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
'దరువు' పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్. యువతతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి చేస్తే మంచే జరుగుతుందనే సందేశం వాళ్లని ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలవగానే బాగుందన్నారు. ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి.
ఇదే తొలి చిత్రం
తెలుగులో ఇంతవరకు సోషియో పాంటసీ, సామాజిక అంశాల మేళవింపుతో సినిమా రాలేదు. ఆ తరహాలో ఇదే తొలి చిత్రం. చిరంజీవిగారి 'యముడికి మొగుడు'కీ, 'దరువు'కీ ఇదే తేడా. ఇది అవినీతిపై పోరాడే హీరో కథ. అవినీతిపై పోరాటం అంటేనే మనకు శంకర్ గుర్తుకొస్తారు. అందువల్ల ఈ సినిమాకీ, ఆయన సినిమాలకీ పోలిక రావడం సహజం. కానీ సన్నివేశాల్ని నా శైలిలో చిత్రీకరించా. ఇందులోని 3డి గ్రాఫిక్స్‌ని ప్రైమ్ ఫోకస్ వాళ్లు చాలా బాగా చేశారు.
అలసట ఎరుగని హీరో
ఆయన వద్దకు బౌండ్ స్క్రిప్టుతో వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆయన ఎనర్జీ మనకి కూడా వస్తుంది. ఆయనకు అలసట అనేది ఉండదు. ఈ సినిమా అవగానే వెంటనే మరో సినిమా కలిసి చేద్దామన్నారు రవి. రానున్న రోజుల్లో తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తా.
యాక్టింగ్ కష్టం
నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని ఇందులో చిన్న యముడి కేరక్టర్‌ని నన్నే వెయ్యమన్నారు రవితేజ. కానీ నా వరకు డైరెక్షన్ చేయడమే బెటర్. యాక్టింగ్ చాలా కష్టం. ఆ పాత్రను ప్రభు చాలా బాగా చేశారు. సీనియర్ యుమునిగా నటించిన కైకాల సత్యనారాయణగారు కూడా ప్రభు ఛాయిస్‌ను మెచ్చుకున్నారు. ఆడతనం ఉన్న పాత్ర చెయ్యడం బ్రహ్మానందంకు ఇదే తొలిసారి. అందుకే ఆయన పాత్రకు విద్యాబాలన్ పేరు పెట్టాం. ఆయన తెరమీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ పాత్రకు మంచి డాన్సర్ కావాలి. తాప్సీకి భరతనాట్యం వచ్చు. అందుకే ఆమెని తీసుకున్నాం. ఇప్పటివరకు ఆమె కామెడీ చేయలేదు. ఈ సినిమాలో ఆమె బాగా చేసింది.
మాట నిలబెట్టుకున్నా
తొమ్మిదేళ్ల గ్యాప్‌తో బూరుగుపల్లి శివరామకృష్ణగారు నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాని నేననుకున్న విధంగా తీయడానికి ఆయనిచ్చిన సహకారం మరచిపోలేనిది. సినిమా మొదలుపెట్టేప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేవిధంగా సినిమా ఉండాలనీ, వల్గారిటీ ఉండకూడదనీ చెప్పారు నిర్మాత శివరామకృష్ణగారు. ఆయనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నా. ఆయన బేనర్‌లో గతంలో 'ప్రేమంటే ఇదేరా'కి అసిస్టెంట్ కెమెరామన్‌గా, 'శ్రీరామ్'కు సినిమాటోగ్రాఫర్‌గా, ఇప్పుడు 'దరువు'కు డైరెక్టర్‌గా పనిచేశా. నన్నో కుటుంబ సభ్యునిలా ఆయన చూసుకుంటారు.
అజిత్‌తో సినిమా
తమిళంలో అజిత్ హీరోగా సెప్టెంబర్ నుంచి ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా. ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మించబోతోంది. తర్వాత తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తా.
Friday, June 8, 2012
కామెడీ చేస్తున్న విద్య
'ద డర్టీ పిక్చర్', 'కహాని' సినిమాల్లో బలమైన పాత్రలు పోషించి, ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఇప్పుడు ఓ కామెడీ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరు 'ఘన్‌చక్కర్'. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. "ఇది నా తొలి కామెడీ సినిమా కావడంతో కాస్త నెర్వస్‌గా ఉంది. ఇప్పుడే నా కేరక్టర్ గురించి చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇందులో నేను ఇమ్రాన్ హష్మి పంజాబీ భార్యగా కనిపిస్తాను'' అని తెలిపింది విద్య. 'ద డర్టీ పిక్చర్' తర్వాత ఇమ్రాన్, విద్య మరోసారి ఇందులో కలిసి నటించనుండటం గమనార్హం. 'ఆమిర్', 'నో ఒన్ కిల్డ్ జెస్సికా' ఫేమ్ రాజ్‌కుమార్ గుప్తా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యుటీవీ నిర్మిస్తోంది. 'ద డర్టీ పిక్చర్', 'కహాని' సినిమాలతో సూపర్ హీరోయిన్ ఇమేజ్ పొంది, హీరోయిన్లు సైతం బాక్సాఫీసును కొల్లగొట్టగలరనే సంగతిని నిరూపించిన విద్య నేడు హీరోయిన్లకి స్ఫూర్తిగా నిలిచిందన్నది కాదనలేని సత్యం.
Saturday, May 26, 2012
తెలుగు, తమిళ భాషల్లో 'కహాని'
విద్యాబాలన్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా 'కహాని' తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కాబోతోంది. టెలివిజన్ నిర్మాణ సంస్థ అయిన ఎండిమోల్ ఇండియా వీటి రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలతోటే ఆ సంస్థ సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టబోతుండటం గమనార్హం. సూపర్ హిట్ టీవీ రియాలిటీ షోలు 'బిగ్ బాస్', 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోం కే ఖిలాడి' ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలుగు, తమిళ వెర్షన్ల షూటింగ్ ప్రారంభించి, 2013 జనవరిలో విడుదల చేయాలని సంకల్పించినట్లు ఎండిమోల్ ఇండియా సీఈఓ దీపక్‌ధర్ తెలిపారు. ఒరిజినల్‌లో విద్యాబాలన్ చేసిన ప్రధాన పాత్ర కోసం తెలుగు, తమిళ భాషల్లో పేరుపొందిన తారల్ని సంప్రదిస్తున్నారు. పెన్ ఇండియా ప్రై. లిమిటెడ్‌తో కలిసి 'కహాని' చిత్రాన్ని నిర్మించడమే కాక, దర్శకత్వం వహించిన సుజయ్ ఘోష్ ఈ రీమేక్ సినిమాలకి సైతం సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ రీమేక్స్‌కి ఓ పేరుపొందిన తెలుగు లేదా తమిళ దర్శకుడు పనిచేయనున్నాడు.
Monday, September 26, 2011
బిగ్ స్టోరీ: 'నాయిక' రంగుల జీవితం!
చిత్రసీమ అంటే రంగుల ప్రపంచమని అందరికీ తెలుసు. ఇక్కడి తారల జీవితాలు ఎలా ఉంటున్నాయో, తరచూ చూస్తూనే ఉన్నాం. వెండితెరపై సూపర్‌స్టార్లుగా వెలిగిన తారామణుల్లో కొంతమంది జీవితాలు అర్ధంతరంగా ఆగిపోతే, ఎంతోమంది జీవితాలు దయనీయంగా ముగిసిపోయాయి. అలాంటి తారల నిజ జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమైతే... వాటికంటే రసభరిత చిత్రాలూ, హృదయాల్ని ద్రవింపజేసే కథలూ మరేముంటాయి! అయితే అలాంటి వాస్తవిక గాథా చిత్రాలు తెలుగులో రావడం అరుదు. ఇతర భాషల్లోనే అలాంటి చిత్రాలు రూపొందుతుండటమనేది వాస్తవిక దృశ్యం. ఇవాళ అలాంటి రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలకూ, విమర్శలకూ తావిస్తున్న హిందీ చిత్రం 'ద డర్టీ పిక్చర్' కాగా, మరొకటి మలయాళంలో రూపొందుతున్న 'నాయిక'
శృంగార తారగా ఓ తరాన్ని తన ఒంపుసొంపులు, వొంటి విరుపులతో ఊపేసిన మత్తుకళ్ల సుందరి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ద డర్టీ పిక్చర్'. ఇందులో స్మిత పాత్రని విద్యాబాలన్ పోషిస్తుండటం ఓవైపు ఆసక్తినీ, మరోవైపు వివాదాన్నీ రేపుతోంది. ఐటం సాంగ్స్‌లో నర్తించడం ద్వారానే కాక, వ్యాంప్ పాత్రలతోనూ స్మిత ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ శృంగార కెరటం కేవలం 36 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని, అర్ధంతరంగా తనువు చాలించడం అందర్నీ కలచివేసింది. అలాంటి ఆమె జీవితాన్ని డైరెక్టర్ మిలన్ లూథ్రియా తెరకెక్కిస్తుండగా, తల్లీకూతుళ్లు శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2 స్మిత జయంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్మిత జీవితంలోని ముగ్గురు పురుషుల పాత్రల్ని వాళ్లు చేస్తున్నారు. స్మిత రూపానికీ, విద్యా బాలన్ ఆకారానికీ అసలు పోలికే లేదనీ, స్మితకి ప్రధానాకర్షణ అయిన మత్తు కళ్లు కానీ, వంపుసొంపుల విన్యాసాలు కానీ విద్యాబాలన్‌లో లేవనీ, అలాంటప్పుడు ఆమె ఎలా ఆ పాత్రకి న్యాయం చేస్తుందనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వస్తున్నాయి. అయితే వీటినేమీ పట్టించుకోకుండా ఏక్తా కపూర్, మిలన్ లూథ్రియా తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్ని ప్రశ్నలకీ తమ సినిమానే సమాధానం చెబుతుందనేది వారి అభిప్రాయం. ఈ సినిమా స్క్రిప్టుని రజత్ అరోరా సమకూర్చాడు.
ఇక దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న మరో చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ సినిమాని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ సినిమాల ద్వారానే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఇది శారద జీవితంపై తీస్తున్నట్లుగానే వార్తలు చలామణీ అవుతున్నాయి. ఈ వర్తల్ని శారద స్వయంగా ఖండించారు. అయితే ఈ చిత్రంలో ఆమె స్వయంగా తన నిజ జీవిత పాత్రను చేస్తుండటం విశేషం. ప్రధాన కథలో ఆమె పాత్ర కూడా వస్తుంది. మరైతే ప్రధాన కథ ఎవరిది? ఒకప్పుడు మలయాళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపి, అర్ధంతరంగా సినిమాల నుంచి మాయమైన ఓ తార జీవితం ఈ చిత్రం. ఆ తార ఎవరంటే... షీలా! తెలుగులోనూ ఆమె నటించింది. అదీ అల్లాటప్పా హీరోలతో కాదు. 'నేనే మొనగాణ్ణి'లో ఎన్టీఆర్‌తో, 'విచిత్ర కుటుంబం'లో శోభన్‌బాబుతో నటించింది షీలానే. అందాలరాశి అయిన ఆమె అకస్మాత్తుగా సినిమాల నుంచి విరమించుకుంది. అలాంటి ఆమె పాత్రని తెరమీద ఆవిష్కరిస్తున్న తార పద్మప్రియ. ఆమె కూడా తెలుగులో ఆర్పా పట్నాయక్ సోదరిగా 'శీను వాసంతి లక్ష్మి'లో, చంద్రసిద్ధార్థ్ రూపొందించిన 'అందరి బంధువయ'లో శర్వానంద్ జోడీగానూ నటించింది. 'నాయిక'లో జయరాం హీరోగా నటిస్తుంటే, మమతా మోహన్‌దాస్ ఓ కీలక పాత్రను చేస్తోంది. అర్ధంతరంగా మాయమైన 'నాయిక'ను అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతోంది.
తెలుగులో ఇదివరకు తారల జీవితాలు ఎలా ఉంటాయో దాసరి నారాయణరావు రూపొందించిన 'శివరంజని', వంశీ డైరెక్ట్ చేసిన 'సితార' సినిమాలు చూపించాయి. అయితే ఇవి నిజ జీవిత కథలు కావు. 'శివరంజని'లో టైటిల్ పాత్ర చేసిన జయసుధ జీవితంలోని కొన్ని ఘట్టాలున్నాయని అంటారు కానీ ఆ సినిమా పూర్తిగా ఆమె కథైతే కాదు. ఇక 'సితార' చిత్రానికి ఆధారం వంశీ స్వయంగా రాసిన 'మహల్లో కోయిల' నవల. ఆ మధ్య వర్థమాన తార ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆమె పేరుమీద సత్యారెడ్డి ఓ సినిమా తీశారు కానీ అది ఆమె జీవిత కథ కాదు. ఓ సంఘటనని ఆధారం చేసుకుని రూపొందించిన సినిమానే.
ఏదేమైనా పైకి కనిపించినట్లు సినీ తారల జీవితాలు రంగుల మయం కాదనీ, కలల వెన్నంటే కష్టాలూ, కన్నీళ్లూ, వ్యధలూ ఉంటాయనీ 'ద డర్టీ పిక్చర్', 'నాయిక' చిత్రాలు మనకి చూపించబోతున్నాయి. కాకపోతే వాటిలో హిందీ సినిమా ఎక్కువ కమర్షియల్ కోణంలో తయారవుతుంటే, మలయాళ చిత్రం వాస్తవికతే ప్రధానంగా తయారవుతోంది. ప్రేక్షకులు వాటికి ఎలా స్పందిస్తారో చూడాలి.
Subscribe to:
Posts (Atom)




