Monday, September 26, 2011

బిగ్ స్టోరీ: 'నాయిక' రంగుల జీవితం!


చిత్రసీమ అంటే రంగుల ప్రపంచమని అందరికీ తెలుసు. ఇక్కడి తారల జీవితాలు ఎలా ఉంటున్నాయో, తరచూ చూస్తూనే ఉన్నాం. వెండితెరపై సూపర్‌స్టార్లుగా వెలిగిన తారామణుల్లో కొంతమంది జీవితాలు అర్ధంతరంగా ఆగిపోతే, ఎంతోమంది జీవితాలు దయనీయంగా ముగిసిపోయాయి. అలాంటి తారల నిజ జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమైతే... వాటికంటే రసభరిత చిత్రాలూ, హృదయాల్ని ద్రవింపజేసే కథలూ మరేముంటాయి! అయితే అలాంటి వాస్తవిక గాథా చిత్రాలు తెలుగులో రావడం అరుదు. ఇతర భాషల్లోనే అలాంటి చిత్రాలు రూపొందుతుండటమనేది వాస్తవిక దృశ్యం. ఇవాళ అలాంటి రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలకూ, విమర్శలకూ తావిస్తున్న హిందీ చిత్రం 'ద డర్టీ పిక్చర్' కాగా, మరొకటి మలయాళంలో రూపొందుతున్న 'నాయిక'
శృంగార తారగా ఓ తరాన్ని తన ఒంపుసొంపులు, వొంటి విరుపులతో ఊపేసిన మత్తుకళ్ల సుందరి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ద డర్టీ పిక్చర్'. ఇందులో స్మిత పాత్రని విద్యాబాలన్ పోషిస్తుండటం ఓవైపు ఆసక్తినీ, మరోవైపు వివాదాన్నీ రేపుతోంది. ఐటం సాంగ్స్‌లో నర్తించడం ద్వారానే కాక, వ్యాంప్ పాత్రలతోనూ స్మిత ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ శృంగార కెరటం కేవలం 36 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని, అర్ధంతరంగా తనువు చాలించడం అందర్నీ కలచివేసింది. అలాంటి ఆమె జీవితాన్ని డైరెక్టర్ మిలన్ లూథ్రియా తెరకెక్కిస్తుండగా, తల్లీకూతుళ్లు శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2 స్మిత జయంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్మిత జీవితంలోని ముగ్గురు పురుషుల పాత్రల్ని వాళ్లు చేస్తున్నారు. స్మిత రూపానికీ, విద్యా బాలన్ ఆకారానికీ అసలు పోలికే లేదనీ, స్మితకి ప్రధానాకర్షణ అయిన మత్తు కళ్లు కానీ, వంపుసొంపుల విన్యాసాలు కానీ విద్యాబాలన్‌లో లేవనీ, అలాంటప్పుడు ఆమె ఎలా ఆ పాత్రకి న్యాయం చేస్తుందనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వస్తున్నాయి. అయితే వీటినేమీ పట్టించుకోకుండా ఏక్తా కపూర్, మిలన్ లూథ్రియా తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్ని ప్రశ్నలకీ తమ సినిమానే సమాధానం చెబుతుందనేది వారి అభిప్రాయం. ఈ సినిమా స్క్రిప్టుని రజత్ అరోరా సమకూర్చాడు.
ఇక దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న మరో చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ సినిమాని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ సినిమాల ద్వారానే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఇది శారద జీవితంపై తీస్తున్నట్లుగానే వార్తలు చలామణీ అవుతున్నాయి. ఈ వర్తల్ని శారద స్వయంగా ఖండించారు. అయితే ఈ చిత్రంలో ఆమె స్వయంగా తన నిజ జీవిత పాత్రను చేస్తుండటం విశేషం. ప్రధాన కథలో ఆమె పాత్ర కూడా వస్తుంది. మరైతే ప్రధాన కథ ఎవరిది? ఒకప్పుడు మలయాళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపి, అర్ధంతరంగా సినిమాల నుంచి మాయమైన ఓ తార జీవితం ఈ చిత్రం. ఆ తార ఎవరంటే... షీలా! తెలుగులోనూ ఆమె నటించింది. అదీ అల్లాటప్పా హీరోలతో కాదు. 'నేనే మొనగాణ్ణి'లో ఎన్టీఆర్‌తో, 'విచిత్ర కుటుంబం'లో శోభన్‌బాబుతో నటించింది షీలానే. అందాలరాశి అయిన ఆమె అకస్మాత్తుగా సినిమాల నుంచి విరమించుకుంది. అలాంటి ఆమె పాత్రని తెరమీద ఆవిష్కరిస్తున్న తార పద్మప్రియ. ఆమె కూడా తెలుగులో ఆర్పా పట్నాయక్ సోదరిగా 'శీను వాసంతి లక్ష్మి'లో, చంద్రసిద్ధార్థ్ రూపొందించిన 'అందరి బంధువయ'లో శర్వానంద్ జోడీగానూ నటించింది. 'నాయిక'లో జయరాం హీరోగా నటిస్తుంటే, మమతా మోహన్‌దాస్ ఓ కీలక పాత్రను చేస్తోంది. అర్ధంతరంగా మాయమైన 'నాయిక'ను అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతోంది.
తెలుగులో ఇదివరకు తారల జీవితాలు ఎలా ఉంటాయో దాసరి నారాయణరావు రూపొందించిన 'శివరంజని', వంశీ డైరెక్ట్ చేసిన 'సితార' సినిమాలు చూపించాయి. అయితే ఇవి నిజ జీవిత కథలు కావు. 'శివరంజని'లో టైటిల్ పాత్ర చేసిన జయసుధ జీవితంలోని కొన్ని ఘట్టాలున్నాయని అంటారు కానీ ఆ సినిమా పూర్తిగా ఆమె కథైతే కాదు. ఇక 'సితార' చిత్రానికి ఆధారం వంశీ స్వయంగా రాసిన 'మహల్లో కోయిల' నవల. ఆ మధ్య వర్థమాన తార ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆమె పేరుమీద సత్యారెడ్డి ఓ సినిమా తీశారు కానీ అది ఆమె జీవిత కథ కాదు. ఓ సంఘటనని ఆధారం చేసుకుని రూపొందించిన సినిమానే.
ఏదేమైనా పైకి కనిపించినట్లు సినీ తారల జీవితాలు రంగుల మయం కాదనీ, కలల వెన్నంటే కష్టాలూ, కన్నీళ్లూ, వ్యధలూ ఉంటాయనీ 'ద డర్టీ పిక్చర్', 'నాయిక' చిత్రాలు మనకి చూపించబోతున్నాయి. కాకపోతే వాటిలో హిందీ సినిమా ఎక్కువ కమర్షియల్ కోణంలో తయారవుతుంటే, మలయాళ చిత్రం వాస్తవికతే ప్రధానంగా తయారవుతోంది. ప్రేక్షకులు వాటికి ఎలా స్పందిస్తారో చూడాలి.

No comments: