ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?
- 'సలామత్' షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. క్లైమాక్స్, పాటలు మిగిలున్నాయి. 'మేం వయసుకు వచ్చాం' రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి జరగబోతోంది. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాతో త్రినాథ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు.
'మేం వయసుకు వచ్చాం'లో మీ కేరక్టర్ ఎలా ఉంటుంది?
- ఇందులో నేను చేసే పాత్రలో రెండు ఛాయలున్నాయి. ఇంటర్మీడియేట్ పూర్తయి ఇంజనీరింగ్‌లో చేరే పదహారేళ్ల కుర్రాడిగానూ, ఆ తర్వాత పరిణతి చెందిన యువకుడిగానూ కనిపిస్తా. ఇది సిటీ నేపథ్యంలో నడిచే కథ. నేటి విద్యార్థుల ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉన్నాయనే దాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఎక్కువ సన్నివేశాలు నాటకీయంగా కాక సహజంగా ఉంటాయి. 'నచ్చావులే' తర్వాత నేను చేస్తున్న మంచి ప్రేమకథ. డైరెక్టర్ త్రినాథ్ చెప్పిన కథలోని పాయింట్, స్క్రీన్‌ప్లే విపరీతంగా నచ్చేశాయి. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. నా కెరీర్‌లోని మంచి సినిమాల్లో కచ్చితంగా నిలబడే సినిమా 'మేం వయసుకు వచ్చాం'.
మీ దృష్టిలో ప్రస్తుతం మీ కెరీర్ ఎలా నడుస్తోంది?
- కెరీర్‌లో ఎవరికైనా ఎత్తు పల్లాలు ఉంటాయి. ప్రతి సినిమాకీ బాగా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. ప్రస్తుతం నా కెరీర్ గొప్పగా లేదు, అలాగని అసంతృప్తికరంగానూ లేదు. స్మూత్‌గానే నడుస్తోంది.
ఎలాంటి పాత్రల్ని చేయడానికి ఇష్టపడతారు?
- ఏదో ఒక తరహా సినిమాలకి పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. నటుడన్నాక అన్ని రకాల పాత్రలూ చెయ్యాలి. ఇప్పుడు నేను చేస్తున్నవి జనం టిక్కెట్ పెట్టి చూడదగ్గ సినిమాలు. 'సలామత్' ఇంటెన్స్ లవ్‌స్టోరీ అయితే, 'మేం వయసుకు వచ్చాం' క్యూట్ లవ్‌స్టోరీ.
తెలుగులో హీరోలు చాలామంది ఉన్నారు కదా. ఆ పోటీని ఎలా ఎదుర్కోబోతున్నారు?
- మిగతా హీరోలతో నాకు పోటీ ఉన్నట్లు అనుకోను. నేను నా కెరీర్ గురించే ఆలోచిస్తా. ఇంతమంది హీరోలు తెలుగులో ఉండటం గొప్ప విషయం. మా అమ్మానాన్నల తర్వాత నేను భయపడేది నాని (హీరో) అన్నయ్యకే. 'రైడ్' చేసినప్పట్నించీ మా మధ్య మంచి అనుబంధం ఉంది. అతని సలహాలు తీసుకుంటూ ఉంటా.
మీమీద ఏ హీరో ప్రభావం ఉంది?
- ప్రత్యేకంగా ఏ ఒక్కరో అని కాకుండా చాలామంది హీరోల ప్రభావం నాపై ఉంది. చిరంజీవి గారి డాన్సులంటే చిన్నప్పట్నించీ ఇష్టం. అలాగే నాగార్జున, మహేశ్, శ్రీకాంత్, బన్నీ వంటి వాళ్ల ప్రభావం నా మీద ఉంది.
ఈ యేడాది మీకు ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
- 'కోడి పుంజు' ఏ సెంటర్లలో ఆడకపోయినా బీ, సీ సెంటర్లలో బాగా పేరు తెచ్చుకుంది. నేను యాక్షన్ చేయగలనన్న నమ్మకాన్నిచ్చింది. ఈ ఏడాది నేను నటించిన మరో సినిమా 'మంచివాడు' మంచి సినిమా అవుతుందని గట్టిగా నమ్మాం. అయితే అది సరైన సమయంలో పడలేదు.
చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోగా ఎదిగారు కదా. ఈ రెండు దశల్లో ఏది బాగుంది?
- బాల నటునిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే అప్పుడు నామీద ఎలాంటి బాధ్యతా ఉండేది కాదు. ఇప్పుడు హీరోని కాబట్టి అన్నీ శ్రద్ధగా చూసుకోవాల్సి వస్తుంది. లేదంటే 'వీడు ఇలాంటి సినిమా చేశాడేంట్రా' అంటారు. ఈ బాధ్యతని నిర్వహించడం కొంచెం కష్టమే కానీ ఇష్టమైంది.
మీరు చేసిన వాటిలో మీ ఫేవరేట్ సినిమాలు?
- బాలనటునిగా 'దేవుళ్లు', హీరోగా 'నచ్చావులే' నా ఫేవరేట్ సినిమాలు.
No comments:
Post a Comment