Thursday, September 29, 2011

కళాఖండం: మాభూమి (1980)

ఒక అపురూపమైన చిత్రం 1980లో వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాట ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమా 'మాభూమి'. ఆ సినిమా విడుదలకు ముందు బిజినెస్ కాలేదు. విడుదలైన మొదటివారంలో థియేటర్లలో జనాలే లేరు. రోజులు గడిచిన కొద్దీ పుంజుకుని జనంతో కిటకిటలాడింది. ఇది అయాచితంగా వచ్చిన విజయం కాదు. ఈ సినిమాలోని గూడ అంజయ్య, సుద్దాల హనుమంతు, దేవీప్రియ పాటలు జనం గుండెల్లో మారుమోగాయి. సంధ్యతో కలిసి ప్రజా గాయకుడు గద్దర్ పాడిన ఆ పాటలు దడదడలాడించాయి. ఆ సినిమాకి సంగీతాన్ని అందించింది సీత.
ఈ సినిమాలో ముఖ్య పాత్రల్ని పోషించింది పెద్ద పేర్లున్న వారు కాదు. ఈ సినిమా నిర్మాత బి. నరసింగరావు స్వతహాగా చిత్రకారుడు. గేయకర్త. విమర్శకుడు, జర్నలిస్టు. చిత్ర నిర్మాణం మీద క్రేజ్ ఉన్న ఉత్తమ అభిరుచులు కలిగిన కళాభినివేశి. "తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తదనంతర జీవితాన్ని తెరకెక్కించాలనేది నా చిరకాల వాంఛ. అందుకే ఎన్ని శ్రమదమాదులకోర్చయినా ఈ సినిమా తీయగలిగాను" అని చెప్పారు నరసింగరావు. సినిమాటోగ్రాఫర్‌గా అప్పటికే పేరుపొందిన గౌతం ఘోష్ దర్శకత్వంలో అద్భుతంగా రూపొందింది 'మాభూమి'. తన భార్యతో కలిసి తెలంగాణా జన జీవితంలోని లోతుల్ని తరిచి తరిచి చూసేందుకు నెలల తరబడి ఆ ప్రాంతాల్లో తిరిగాడు గౌతం. సెట్స్ మీదకు వెళ్లేముందు నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, గౌతం అహోరాత్రాలు స్క్రిప్టుమీద పనిచేశారు. అందుకే అది లోబడ్జెట్ డాక్యుమెంటరీలాగా కాకుండా అందమైన కళాఖండంగా తయారైంది. వర్గభేదం, వయోబేధం, లింగభేదం, ప్రాంతభేదం లేకుండా అన్ని తరగతులవారు అమితంగా ఆ చిత్రాన్ని ఆదరించారని చెప్పారు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయిచంద్.
ఓ విభిన్న అంశాన్ని సృజిస్తూ వచ్చిన ఈ సినిమా సినీ పండితుల అంచనాల్ని తలకిందులు చేస్తూ పండిత పామరుల్ని కూడా ఒకే రీతిగా అలరించడానికి వెనుకనున్న రహస్యమేమిటి? మూస సినిమాలతో విసిగివున్న ప్రేక్షక హృదయాలు మంచి చిత్రం కోసం తపించే తరుణంలో రావడమేనా? అయితే ఇప్పుడూ అదే పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. మరో 'మాభూమి' కోసం ప్రేక్ష హృదయాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

No comments: