Wednesday, September 21, 2011

ఇంటర్వ్యూ: తెలంగాణా శకుంతల

తెలంగాణా శకుంతల అనే పేరు ఎలా వచ్చింది?
- నేను శకుంతల అనే పేరుతోనే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశించాను. నేను నటిగా బిజీగా మారాక అదే పేరుతో మరొకరు వచ్చారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటం నిర్మాతలకు కన్ఫ్యూజన్ కలిగించింది. తెలంగాణా మాండలికంతో నేను నటించిన సినిమాలు విజయవంతం కావడంతో నిర్మాతలు నా పేరును తెలంగాణా శకుంతలగా మార్చారు.
రంగస్థలం నుంచి ఇక్కడకు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
- ఎలాంటి కళాకారులకైనా స్టేజి అనేది ఓ పెద్దబాలశిక్షలాంటిది. బాల్యంలో బాలశిక్షలో నేర్చుకున్న విషయాలు జీవితమంతా గుర్తున్నట్లు స్టేజి మీద మేము పొందిన శిక్షణ విభిన్న పాత్రల పోషణలో మాకు ఉపయోగపడుతుంటుంది. స్టేజి మీద నటించేప్పుడు కదలికల విషయంలో ఓ రకమైన స్వేచ్ఛ ఉంటుంది. అదే సినిమా అంటే కెమెరా పరిధిలోనే నటించాలి. నాటకంలో జనం మన కళ్లముందే కనపడుతుంటారు. అదే సినిమా అయితే జనం ఎదురుగా ఉన్నారనుకుని కెమెరాని దృష్టిలో పెట్టుకుని నటించాలి. స్టేజి మీద విజృంభించిన నటీనటులకు కెమెరా పరిధిలో ఉండాలంటే ఏనుగును తెచ్చి సీసాలో బంధించినట్లే అనిపిస్తుంది మొదట్లో. తర్వాత్తర్వాత అలవాటైపోతుంది.
ఈ మధ్య ఏ సినిమాలో చూసినా మీరు అరుస్తున్నారెందుకు?
- పాత్ర మేనరిజంలో వైవిధ్యం చూపించాలని స్టేజి మీద స్వేచ్ఛ తీసుకుంటాం. అదే సినిమాలో అయితే దర్శకుని అభిరుచి, సూచనల మేరకు నటించాలి. ఓ కేరక్టర్ హిట్టయితే అలాంటి పాత్రల్నే దర్శకులు రూపకల్పన చేస్తుంటారు. అన్ని సినిమాల్లో అదే కొనసాగితే మీరన్నట్లు ఒకే మూసలో వచ్చిన పాత్రల్లా కనిపిస్తాయి. సీమ కథలతో వచ్చిన సినిమాల్లో అలా అరుపులతో నటించి, అవి హిట్టయ్యేసరికి దర్శకులు అలాంటి పాత్రల్నే ఇస్తున్నారు.
దర్శకత్వ ఆలోచనేమైనా ఉందా?
- ఆ కోరికైతే ఉంది. అయితే సినిమాలకు కాదు. ముందుగా ఓ మంచి నాటకానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. స్టేజి నుంచి సినిమాలకి వచ్చినవాళ్లు స్టేజికి దూరమవుతున్నారనే అపవాదు నాపై రాకుండా ఓ మంచి నాటకాన్ని నా దర్శకత్వంలో ప్రదర్శించాలనుకుంటున్నా. ఇక సినిమా అంటారా. ఇప్పుడే కాదు. మరికొంత కాలం పోనివ్వండి.
కెరీర్ మొత్తంలో మీకు సంతృప్తినిచ్చిన పాత్రలు?
- నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను నటించిన పాత్రల్లో నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన పాత్ర లభించలేదనే చెప్పాలి. ఓ పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించినట్లే ఏదైనా ఓ మంచి పాత్రలో అలా విజృంభించి విశ్వరూపం ప్రదర్శించాలని ఉంది. ఇప్పటివరకూ నటించిన సినిమాల విషయానికొస్తే 'ఒసేయ్ రాములమ్మా', 'నువ్వు నేను', 'ఒక్కడు', 'వీడే' సినిమాల్లో నా పాత్రలు కొంతవరకు సంతృప్తినిచ్చాయి.
మీ కలేమిటి?
- కామెడీ, విలన్, గయ్యాళి పాత్రల్లో నటించా. 'బంగారు తల్లి' సినిమాలో జమున, 'రంగుల రాట్నం'లో అంజలీదేవి వంటి నటీమణులు చేసిన మాతృమూర్తి పాత్రల్లో నటించాలని ఉంది. అలాగే పూర్తిగా కరుణరసం గల శబరి పాత్రలోనైనా నటించాలని ఉంది.

No comments: