Monday, September 19, 2011
బిగ్ స్టోరీ: నేను రావణబ్రహ్మను!
రావణబ్రహ్మ... రామాయణ కథకి ప్రతినాయకుడు. మాహాసాధ్వి సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడి కదనరంగంలో అశువులు బాసిన మహా శివభక్తుడు. లంకాధీశుడు. భారతీయ తెరపైనే అద్భుతమనదగ్గ రీతిలో, తమదైన ప్రత్యేక శైలితో అభినయించి ఆ పాత్రకి అమరత్వాన్ని ప్రసాదించిన నటులు ఇద్దరు. ఒకరు ఎన్టీ రామారావు, మరొకరు ఎస్వీ రంగారావు. ఇప్పుడు ఆ పాత్రని పోషించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నటుడు మోహన్‌బాబు. ఆయనని రావణావతారంలో చూపించేందుకు సిద్ధమవుతున్న దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఆ సినిమా షూటింగ్ మొదలయ్యేది 2012 ప్రథమార్థంలో.మోహన్‌బాబు 'రావణ' సినిమా చేస్తానన్న ప్రకటనతో తెలుగులో భక్తిరస, పౌరాణిక చిత్రాల మీద ధ్యాసమళ్లినట్లే కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ సినిమాల కంటే ఇలాంటి భక్తి, పౌరాణిక చిత్రాలకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. కారణం ఆ కాలపు వాతావరణాన్ని సృష్టించడానికి భారీ సెట్లు నిర్మించాల్సి రావడం, కాస్ట్యూమ్స్, అలంకరణ సామగ్రి తయారుచేయించడం. అయితే ఆయా పాత్రల్ని పోషించాలన్న సంకల్పమే తెలుగులో ఆ తరహా చిత్రాల నిర్మాణానికి దారితోస్తోంది. అటువంటి సినిమాలతో, అటువంటి 'లార్జర్ దేన్ లైఫ్' కేరక్టర్లతో చరిత్రలో నిలిచిపోవచ్చనే కోరిక కూడా ఇందుకు కారణమే. రావణబ్రహ్మ అనగానే మనకి 'భూకైలాస్' (1958), 'సీతారామ కల్యాణం' (1961) చిత్రాల్లోని ఎన్టీ రామారావు, 'ఇంద్రజిత్' (1961), 'సంపూర్ణ రామాయణం' (1972) చిత్రాల్లోని ఎస్వీ రంగారావు జ్ఞాపకమొస్తారు. ఆ పాత్రల్ని మరికొంతమంది పోషించినా ఆ ఇద్దరే ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆ పాత్రలో ఆమోఘంగా రాణించారు.
సాంఘిక పాత్రలకీ, పౌరాణిక పాత్రలకీ స్పష్టమైన తేడా ఒకటుంది. సోషల్ కేరక్టర్లో వేసే కుప్పిగంతులు పౌరాణిక పాత్రలకి చెల్లుబాటు కావు. పౌరాణిక పాత్ర పోషణలో నటుడికి ప్రధానంగా కావలసినవి ఆంగిక, వాచికాభినయాలు. ఈ రెండింటిలోనూ ఆరితేరినవాళ్లు కాబట్టే ఎస్వీఆర్, ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. చిత్రమేమంటే రావణ పాత్రని ఏ మాత్రమూ పోలికలేని విధంగా ఆ ఇద్దరూ వేర్వేరు తరహాల్లో పోషించడం. సామర్ల వెంకట రంగారావు పోషించిన రావణాసురుడు మనకి పరమ క్రూరునిగా, కిరాతకునిగా, స్త్రీలోలునిగా కనిపిస్తే, నందమూరి తారకరామారావు అభినయించిన రావణుడు కథానాయకుడి తరహాలో కనిపించాడు. 'ఇంద్రజిత్' (దీనికి 'సతీ సులోచన' అనే పేరు కూడా ఉంది) చిత్రంలో క్రూరత్వానికి తోడు పుత్ర వాత్సల్యం కలిగిన రావణునిగానూ ఎస్వీఆర్ దర్శనమిచ్చారు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన హావభావాలూ, కదలికలూ చూసి ఆ పాత్ర పోషణని అలా చెయ్యడం మరొకరికి సాధ్యం కాదన్నారు. చేసిన ప్రతి పాత్రకూ ప్రశంసలందుకోవడం మాటలు కాదు. అయినా పాత్ర పాత్రకీ ఆయన అడుగు ముందుకేయడానికి కారణం, కళారాధకునిగా ఆయనలో ఉన్న అసంతృప్తే. 'మీ ఉత్తమ పాత్ర ఏది?' అనే ప్రశ్నకు 'ఇంకా నేను ఉత్తమ పాత్ర చెయ్యలేదు' అనే సమాధానమే చివరిదాకా ఆయన నోటినుంచి వచ్చింది. ఎంత అద్భుతంగా నటించిన పాత్రయినా ఆయనకు మాత్రం అద్భుతంగా కనిపించలేదు. అన్నిటికన్నా ఆత్మవిమర్శకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే రంగారావు తాను ధరించబోయే పాత్ర మనస్తత్వాన్నీ, ప్రవర్తననీ, అనుభవాల్నీ బాగా అవగాహన చేసుకుని, ఆ పాత్రని ఎలా పోషించాలో నిర్ణయించుకునేవారు. అందుకే రావణ పాత్రలోని రౌద్ర, బీభత్స, కరుణ రసాల్ని అద్భుతంగా పోషించగలిగారు. 'రంగారావుతో సమంగా నటించే నటులుండవచ్చు. కానీ అంతకన్నా బాగా నటించగలవారు మాత్రం లేరు' అనే ప్రశంసలు పొందారు.
ఓ పాత్ర చేయడానికి ఆయన చూపించే అంకితభావం కూడా ఆశ్చర్యపరుస్తుంది. బాపు రూపొందించిన 'సంపూర్ణ రామాయణం'లో రావణ పాత్ర చేసే సమయంలో ఆయన దురలవాట్లకు దూరంగా ఉన్నారు. అద్భుతమైన నటనతో చిత్రానికి వన్నె తెచ్చారు. అప్పట్లో రూ. 17.5 లక్షల వ్యయంతో రూపొందించిన ఆ సినిమా నిర్మాతలకు సిరులు కురిపించిందంటే బాపు, రమణల కాంబినేషన్‌తో పాటు రావణ పాత్రని ఎస్వీఆర్ పోషించిన తీరు కూడా ప్రధాన కారణమని విమర్శకులు ముక్తకంఠంతో పలికారు.
తెలుగులో శ్రీరాముడి పాత్ర పోషణకంటే ముందుగానే పురాణ వాఙ్మయంలో అతి భయంకరమైన ప్రతినాయకుడిగా పేరుపొందిన రావణుడ్ని నాయక స్థాయికి చేర్చింది నిస్సందేహంగా ఎన్టీ రామారావే. 'భూకైలాస్'లో ప్రత్యక్షమైన అందమైన రావణాసురుడికి ప్రేక్షక జనం విజయాన్ని చేకూర్చిపెట్టారు. స్రీలోలుడిగా కాక వేద వేదాంగాలు ఔపోసన పట్టిన విద్యాధికుడిగా ఈ చిత్రంలో కనిపించి సమాజానికి ఎదురీదారు ఎన్టీఆర్.
"కథానాయకుడి వేషాలే వేయడం చాలామందికి గొప్ప. కాని ప్రతినాయకుడి పాత్రలను కూడా మంచివాటిగా మలిచి జనాదరణ పొందింది ఒక్క ఎన్టీఆరే'' అన్న అక్కినేని నాగేశ్వరరావు మాటలు పూర్తిగా నిజం. భారతదేశ చలనచిత్ర రంగం మొత్తాన్ని జల్లెడపట్టి వెతికినా నాయకుడై ఉండి రావణ, దుర్యోధన వంటి ప్రతి నాయక పాత్రలు ధరించి అందరి మెప్పూ పొందిన ఏకైక నటుడు రామారావు. ఎస్వీ రంగారావు ఉండగానే ఆ పాత్రల్ని మెప్పించడం అసామాన్యం.
'సీతారామ కల్యాణం' పూర్తిగా ఎన్టీఆర్ అభిరుచి మేరకు తీసిన చిత్రం. ఆయనలోని భావ విప్లవానికీ, నూతన ప్రయోగానికీ అందులోని రావణ పాత్ర ప్రతీక. కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరిలోని భావ విప్లవ ప్రభావం, రావణుడు దుష్టుడు కాడనీ, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్నవాడనీ చెప్పిన ద్రావిడోద్యమ ప్రభావం ఆ పాత్రమీద కనిపిస్తుంది. ఈ చిత్రంలో 'కానరార కైలాస నివాస' అని ప్రారంభమయ్యే సుదీర్ఘ శివస్తుతిలో ఎన్టీఆర్ అభినయ విన్యాసాన్ని చూసి తీరాల్సిందే. సీతారాముల కల్యాణాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ చిత్రంలో అపూర్వమనదగ్గ రీతిలో దశముఖ ప్రదర్శన చేశారు. భక్తి ఆధారంగా మౌఢ్యం పరిఢవిల్లుతుందని సోదాహరణంగా చూపించారు. ఈ రెండు సినిమాల్లోనే కాక 'శ్రీకృష్ణ సత్య' (1971), 'శ్రీరామ పట్టాభిషేకం' (1978) చిత్రాల్లోనూ రావణ పాత్రలో కనిపించారు ఎన్టీఆర్.
ఆ మహానటులతో పాటు రావణ పాత్రని తీగెల వేంకటేశ్వర్లు (సీతా కల్యాణము - 1934), మునిపల్లె సుబ్బయ్య (సతీ సులోచన - 1936), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (మైరావణ - 1939), ఎం.వి. సుబ్బయ్యనాయుడు (భూకైలాస్ - 1940), రాజనాల (మైరావణ - 1964), కైకాల సత్యనారాయణ (సీతా కల్యాణం - 1976), నాగబాబు (శ్రీరామదాసు - 2006)లో పోషించారు. అందరూ బాలలతో గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం' (1997)లో ఆ పాత్రని స్వాతి అనే అమ్మాయి పోషించడం విశేషం.
అయితే ఇవాళ రావణ పాత్ర చేయడానికి మోహన్‌బాబుని పురికొల్పింది నిస్సందేహంగా ఎన్టీఆర్, ఎస్వీఆర్ అనే చెప్పవచ్చు. అందుకే "రావణుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా, రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నా. వారి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నా స్టైల్‌లో ఆ పాత్ర రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తా'' అని చెప్పారు మోహన్‌బాబు. ఆయన సంకల్పం సఫలీకృతం కావాలని ఆశిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment