Showing posts with label aswani dutt. Show all posts
Showing posts with label aswani dutt. Show all posts

Thursday, December 15, 2011

గుణశేఖర్‌కి 'నిప్పు' పరీక్ష!

లాఠీ, సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు... ఈ సినిమాలకీ, గుణశేఖర్‌కీ సంబంధం ఉంది. అది - ఆ సినిమాలకు దర్శకుడు ఆయనే. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే 2003లో వచ్చిన 'ఒక్కడు' తర్వాత ఆయనకు మరో హిట్ లేదని అర్థమైపోతుంది. 
'ఒక్కడు'తో మహేశ్ ఇమేజ్‌ని ఎంతో పెంచిన గుణశేఖర్ అదే హీరోతో 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు తీసి అటు మహేశ్‌ని దెబ్బకొట్టడమే కాకుండా తానూ దెబ్బతిన్నాడు. 'అర్జున్' స్వయంగా మహేశ్ వాళ్ల బేనర్ నిర్మించినదే. దాని కోసం మధుర మీనాక్షి దేవాలయం సెట్‌ని భారీ ఖర్చుతో నిర్మించారు. ఫలితంగా 'అర్జున్' కాస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలింది. ఇక అశ్వనీదత్ నిర్మించిన 'సైనికుడు' డిజాస్టరైంది. దీని కోసం కూడా ఓ సునామీ సెట్‌ని భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించాడు గుణశేఖర్. వీటి తర్వాత పెళ్లి ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నానంటూ అల్లు అర్జున్ హీరోగా అతను రూపొందించిన 'వరుడు' సినిమా సైతం ఘోరంగా ఫెయిలైంది. దీనికి సైతం బిగ్ బడ్జెట్ అయింది. 
ఇలా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదుచేసిన గుణశేఖర్ ఇప్పుడు రవితేజ హీరోగా 'నిప్పు' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దీన్ని బొమ్మరిల్లు బేనర్‌పై వైవీఎస్ చౌదరి నిర్మిస్తుండటం విశేషం. తన మునుపటి సినిమాలకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న గుణశేఖర్ 'నిప్పు'ను మాత్రం యమ స్పీడుగా తీసేస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కూడా బాగా తక్కువని తెలుస్తోంది. అంటే అతడు మారాడని అనుకోవాలి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చౌదరి ప్రకటించాడు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాతో గుణశేఖర్ మునుపటి ఫాంని అందుకుంటాడా? క్రియేటర్‌గా ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టిన అతడి క్రియేటివిటీకి ఇది అగ్ని పరీక్ష. ఇందులో అతను పాసవుతాడా, ఫెయిలవుతాడా అన్నది ఇప్పుడు తేలాలి

Tuesday, September 13, 2011

న్యూస్: '1947 ఎ లవ్‌స్టోరీ'ని తెలుగులో ఊహించగలమా?

డబ్బింగ్ సినిమాలు డబ్బు దోచుకు పోతున్నాయనీ, స్ట్రెయిట్ సినిమాలకి థియేటర్లు దొరకడం లేదనీ గగ్గోలు పెడుతున్న వాళ్లంతా ఇవాళ తమిళం నుంచి దిగుమతి అవుతున్న సినిమాల్ని చూసి తెలివి తెచ్చుకోవాలి. నాలుగు రోజులు ఆలస్యంగానైనా '1947 ఎ లవ్‌స్టోరీ' అనే ఓ మంచి, అందమైన సినిమాని చూసే అవకాశం కలిగింది. మన డైరెక్టర్లు ఎప్పటికి ఇలాంటి సినిమా తీయగలుగుతారు? 'శివపుత్రుడు' వచ్చినా తమిళంలోనే రావాలి. 'జెంటిల్‌మన్', 'భారతీయుడు' వచ్చినా తమిళంలోనే రావాలి. ఇప్పుడు '1947 ఎ లవ్‌స్టోరీ' కూడా అదే భాషలో వచ్చింది. తమిళ దర్శకుల సృజనాత్మక శక్తికి ఈ సినిమా మరో మంచి ఉదాహరణ. 1947 స్వాతంత్ర్యం వచ్చే సందర్భంలో అప్పటి మద్రాసు నేపథ్యాన్ని ఎంత చక్కగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ చూపించాడు! చాకలి కుర్రాడు మల్లి (ఆర్య), బ్రిటీష్ గవర్నర్ కూతురు ఎమీ (ఎమీ జాక్సన్) మధ్య చిగురించిన అనురాగాన్ని ఎంత చక్కదనంగా చిత్రించాడు! అదీ సినిమానంతా ఎమీ పాత్ర దృష్టి నుంచి చూపించడం ఎంత బాగుంది! మల్లి, ఎమీ పాత్రలతో మనం కూడా ట్రావెల్ అయ్యామంటే వాటితో మనం ఎంతగా సహానుభూతి చెందిదే సాధ్యపడుతుంది! ఆ పాత్రల్ని ఆర్య, ఎమీ జాక్సన్ పోషించిన తీరు కూడా దానికి దోహదం చేసింది. సినిమాలో కనిపించే ప్రతి వస్తువుకీ, ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉండటం ఈ సినిమాలో కనిపించిన మరో విశేషం. విజయ్ దర్శకత్వ ప్రతిభ వికసించింది ఈ విషయంలోనే. అందుకే 80 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా రెండో వారానికి 120 ప్రింట్లకు చేరుకుంటోంది. బ్రిటీష్ నేపథ్యంతో మనవాళ్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో వెంకటేశ్ హీరోగా వచ్చిన 'సుభాష్ చంద్రబోస్' మంచి ఉదాహరణ. కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకుడు కూడా అంత ఘోరంగా ఆ సినిమాని అలా మలవడం ఆశ్చర్యమనిపిస్తుంది. అందుకే ఆ సినిమాకి ప్రింట్ ఖర్చులు కూడా రాలేదని దాని నిర్మాత సి. అశ్వనీదత్ వాపోయాడు. '1947 ఎ లవ్‌స్టోరీ' వంటి సినిమాలు చూసైనా మన దర్శకులు కథల విషయంలో, సన్నివేశాల సృష్టి విషయంలో సృజనాత్మకంగా ఆలోచిస్తే డబ్బింగ్ సినిమాల తాకిడి ఎక్కువవుతున్నదని బాధ పడాల్సిన అవసరం రాదు.

Wednesday, September 7, 2011

న్యూస్: మెహర్ రమేశ్ భలే మాయగాడు!

మాయగాడంటే మెహర్ రమేశే అంటున్నారు ఫిలింనగర్ జనాలు. అతను తీసిన మూడు తెలుగు సినిమాల్లో ఏ ఒక్కటీ హిట్ కాకపోయినా పెద్ద హీరోలతో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అతను రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించిన సంగతి తెలిసిందే. 'పవర్' టైటిల్‌తో రూపొందే ఈ సినిమాకు మళ్ల విజయప్రసాద్ నిర్మాత.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'కంత్రి'తో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేశ్‌కి ఆ సినిమా ఆడకపోయినా ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'బిల్లా'ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులోనే అనుకున్నట్లు ఆడలేదు. అయినా ఏకంగా 40 కోట్ల రూపాయల మెగా బడ్జెట్‌తో సి. అశ్వనీదత్ నిర్మించిన 'శక్తి' సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు. అది ఎన్టీఆర్‌తో రెండో సినిమా. బాక్సాఫీసు వద్ద 'శక్తి' ఎంత ఘోరంగా ఫ్లాపయ్యిందీ తెలిసిందే. ఆ సినిమాని కొన్న బయ్యర్లంతా మట్టికొట్టుకు పోయారు.
మరో డైరెక్టర్‌కైతే అంతటితో కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యేదే. లేదంటే చిన్నా చితకా హీరోల సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే. కానీ మెహర్ రమేశ్ అలాంటి వాడు కాడయ్యే. మాటల్తో ఎలాంటివాళ్లనైనా చిత్తుచేసే కోడి రామకృష్ణ తరహాకి చెందినవాడయ్యే. అందుకే రవితేజతో 'పవర్' సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అతనెంతగా మళ్ల విజయప్రసాద్‌ని నమ్మించాడో ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది."ఈ సినిమాకి వక్కంతం వంశీ అద్భుతమైన కథను అందించారు. రవితేజ పవర్, ఎనర్జీతో పాటు, మెహర్‌ రమేష్ టేకింగ్ స్టయిల్ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. బడ్జెట్ లిమిట్ లేకుండా చాలా లావిష్‌గా, స్టయిలిష్‌గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ 'ఇడియట్-2' తరువాత 2012 మార్చిలో ప్రారంభిస్తాం" అన్నారు విజయప్రసాద్. మెహర్ రమేశ్ మాయ చూసి ఫిలింనగర్ వాసులంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

Friday, August 19, 2011

న్యూస్: 2012లో హీరోగా పరిచయం కానున్న వరుణ్‌తేజ్

రాంచరణ్, జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిన 'ఆరెంజ్' సినిమా షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు అంజనా ప్రొడక్షన్స్ అధినేత నాగబాబు. డిజాస్టర్ కావడంతో ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లయ్యింది. ఈ సినిమా అనుభవం తర్వాత అతని అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కల్యాణ్ అతనికి సపోర్ట్‌గా నిలిచారు. తనకైనా, కల్యాణ్‌కైనా ఇప్పుడు చిరంజీవే తండ్రిలాంటివాడని తండ్రిని కోల్పోయిన ఆయన భావిస్తున్నారు.
త్వరలో నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరమీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "2012లో వాడు హీరోగా పరిచయమయ్యే సినిమా మొదలవుతుంది. ఈలోగా హీరోకి అవసరమైన అన్ని అంశాల్లోనూ వాడు తర్ఫీదు అవుతున్నాడు. అశ్వనీదత్ వాణ్ణి హీరోగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్‌లో నటిస్తాడు" అని ఆయన చెప్పారు. వరుణ్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ "వాడికి మేం ప్లాట్‌ఫాం మాత్రం అమరుస్తాం. వాడు సక్సెస్ అయ్యేదీ, లేనిదీ వాడి ప్రతిభా పాటవాల మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ల కుటుంబం నుంచి వస్తున్నందువల్ల వాడి మీద ఆ వత్తిడి సహజంగానే ఉంటుంది. దాన్ని వాడు అధిగమించ గలగాలి" అని నిర్మొహమాటంగా ఆయన చెప్పారు.