Showing posts with label jalsa. Show all posts
Showing posts with label jalsa. Show all posts

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.

Wednesday, July 13, 2011

న్యూస్: 'పవర్' చూపిస్తాడా?

పవన్ కల్యాణ్ 'జల్సా' తర్వాత మళ్లీ అంత హిట్ ఎప్పుడిస్తాడు? ఆయన్ని అభిమానించేవాళ్లు ఎదురుచూస్తున్నది దీని కోసమే. 'పులి' సినిమా డిజాస్టర్ కావడమే కాక, దాని నిర్మాత శింగనమల రమేశ్‌ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ హిట్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా ఎంతో హైప్‌తో జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో వచ్చిన 'తీన్‌మార్' సినిమా ఆశించిన రీతిలో ఆడియన్సుని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందువల్ల ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల మీదే అందరి దృష్టి ఉంది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరిలో ఒకరైన పవన్ ఈ యేడాది చివరలో 'ద షాడో' (టైటిల్ మారవచ్చు)గా రాబోతున్నాడు. దీని డైరెక్టర్ విష్ణువర్ధన్. తెలుగువాడైనప్పటికీ తమిళంలోని హాట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రూపొందిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా హీరోయిన్లు. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో నడిచే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. 'లవ్ ఆజ్ కల్' తర్వాత మరో హిందీ హిట్ సినిమా 'దబాంగ్'కి రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు పవన్. 'గబ్బర్ సింగ్' పేరుతో రూపొందే ఈ సినిమాని నటుడు గణేశ్‌బాబు నిర్మించనుండగా, హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇవికాక యేసుక్రీస్తుపై సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న పేరుపెట్టని సినిమాలో పవన్ ఓ ప్రత్యేక పాత్రని చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలన్నిట్నీ బాల తారలు చేస్తున్నారు. ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమాని మినహాయిస్తే.. 'ద షాడో', 'గబ్బర్‌సింగ్' సినిమాలతో పవన్ కల్యాణ్ తన 'పవర్'ని చూపిస్తాడని ఆశించొచ్చు.

Friday, October 29, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (చివరి భాగం)

'ఖలేజా' కనిపిస్తున్నదెక్కడ?
మూడేళ్ల విరామంతో మహేశ్ సినిమా వస్తున్నదనేసరికి ఆయన అభిమానుల్లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి! బాక్సాఫీసు చరిత్రని 'మహేశ్ ఖలేజా' తిరగరాస్తుందనే చాలామంది ఆశించారు, నమ్మారు. తీరా థియేటర్లలో సినిమా విడుదలయ్యాక చూస్తే.. 'ఈ సినిమా కోసమా మహేశ్ మూడేళ్లు ఆగింది' అనే వ్యాఖ్యలే, విమర్శలే. కథని కాక, కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన సినిమా 'ఖలేజా'. ఈ సినిమా కంటే ముందు వేరే దర్శకులతో వేరే సినిమాలు చేస్తానని మహేశ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్లిపోయి, త్రివిక్రమ్ సినిమా ముందుకొచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో అదివరకు వచ్చిన 'అతడు' హిట్టవడం, అప్పుడే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' విజయం సాధించడం దీనికి కారణం. హీరోయిన్ విషయంలోనూ ఇదే స్థితి. మొదట ఎంపిక చేసిన పార్వతీ మెల్టన్ ని కాదని 'అరుంధతి' సూపర్ హిట్టవడంతో అనుష్కని హీరోయినుగా తీసుకున్నారు. సూపర్ హీరో, సూపర్ హీరోయిన్, సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'పులి' కథని కానీ, 'ఖలేజా' కథని కానీ ముందుగా ఆయన వినలేదు. కాంబినేషన్స్ ని కుదుర్చుకుని, పెట్టుబడి పెట్టారంతే. ఒకప్పటి నిర్మాతలకీ, ఈ కాంబినేషన్ నిర్మాతలకీ అదే తేడా.
'ఖలేజా'లో ప్రారంభం నుంచి చివరిదాకా రీజనింగ్ కి అందని సన్నివేశాలెన్నో. హీరో ఇంట్రడక్షన్ సీనులో ఎడారిలో మనుషుల్ని మహేశ్ కత్తులతో కుత్తుకలు కోస్తుంటే, వాళ్లు అతనికి ఏం అన్యాయం చేశారో, ఎంతటి దుర్మార్గాలు చేశారో.. అనుకుంటాం. కానీ వాళ్లని అతను చంపింది 'నీళ్ల' కోసం! ఆ ఓపెనింగ్ ఫైట్ తోటే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతినిపోయింది. విషపు నీటివల్ల ఐదొందల పైచిలుకు జనాభా ఉన్న ఓ ఊరు వల్లకాడవుతుంటే, వాళ్లని 'దేవుడు'గా మహేశ్ ఎలా కాపాడాడనేది ఈ సినిమా ప్రధానాంశం. 'స్టఫ్' అంటూ లేని ఈ కథలోని 95 శాతం సన్నివేశాల్లో అంతా తానై కనిపిస్తాడు మహేశ్. అంటే ప్రధాన పాత్ర మీదే ధ్యాసంతా పెట్టిన దర్శకుడు మిగతా పాత్రల పట్ల చిన్నచూపు చూశాడు. తనవరకు విభిన్నమైన డైలాగ్ డిక్షనుతో, నటనతో మహేశ్ ఎంతగా చెలరేగిపోయినా, బిగువైన కథనం లేకపోవడమే 'ఖలేజా'కి ప్రతికూలంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం బాక్సాఫీసు వద్ద భారీగా 21 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసిన ఈ సినిమా కలెక్షన్లు రెండో వారం బాగా నెమ్మదించాయి. దాదాపు 40 కోట్ల రూపాయల (అంచనా) వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావడం చాలా కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట.
'బృందావనం' అందరిదయ్యేనా?
'బృందావనం' బాగుంది.. ఎక్కడికెళ్లినా ఇదే మాట. ఎన్టీఆర్ కథానాయకుడిగా; కాజల్ అగర్వాల్, సమంతా నాయికలుగా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన తొలిరోజు నిర్మాత రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. 'బృందావనం' సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసు వద్ద రారాజుగా వెలిగిపోతున్న 'రోబో'ని నిలువరించడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే టాక్ కీ, కలెక్షన్లకీ కనిపిస్తున్న దూరం బయ్యర్లని ఆందోళన పరుస్తోంది. పైరసీ కారణంగానే ఈ సినిమాకి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనేది ఓ వాదన. అదే నిజమైతే 'రోబో' కలెక్షన్లు ఇంకా నిలకడగా ఎందుకున్నాయనేది ప్రశ్న. ఇంతవరకు చేయని కొత్త తరహా పాత్రలో ఎన్టీఆర్ నటన అందరి ప్రశంసలూ పొందుతున్నప్పటికీ స్త్రీల హక్కులు, సమానత్వం మీద ఎంతో చైతన్యం కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ 'ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు' పాయింట్ ఎలా మెప్పు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 కోట్ల రూపాయలకు మించి వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావాలంటే మరో రెండు వారాల పాటు కలెక్షన్లు బలంగా ఉండాలి. అయితే 'రోబో' స్థాయిలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనపర్చడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమాకి 'బృందావనం' వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వల్లే ఓపెనింగ్స్ లో ఉధృతి కనిపించ లేదనేది ట్రేడ్ విశ్లేషకుల భావన.
డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్లు కరువవుతున్నాయని ఇప్పటిదాకా చిన్న సినిమాల నిర్మాతలు ఆవేదన చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల వల్ల తమకూ ముప్పు ఏర్పడిందని పెద్ద సినిమాల నిర్మాతలు బాధపడే రోజులొచ్చాయి. కిం కర్తవ్యం? కాంబినేషన్ల మీదకంటే కథాకథనాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడమే.                          

Friday, July 11, 2008

Just title gets success?

ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి టైటిల్ బాగా దోహదం చేస్తుందని సినిమా రంగంలోని చాలామంది నమ్ముతారు. టైటిల్ అనేది సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది కానీ, విజయానికి మొత్తంగా అదే దోహదం చేయదనీ, సినిమా కథలో పస లేకపోతే టైటిల్ ఎంత బాగున్నా, వింతగా వున్నా ఆ సినిమా నడవదనీ విశ్లేషకులు అనే దాంట్లో తప్పు కొంచెం కూడా లేదు. అయినప్పటికీ మన దర్శకులు తమ సినిమా టైటిళ్లను విభిన్నంగా పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు.
ఎవరన్నా కాస్త డబ్బులు ఖర్చు పెడుతూ సరదా చేసుకునే వాణ్ణి చూసి మనం 'వాడికేంటిరా జల్సా పురుషుడు' అంటుంటాం. అందులోని 'జల్సా'ని టైటిల్‌గా పెట్టి సక్సెస్ సాధించారు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు. రెండక్షరాలతో చాలా సినిమాలే వచ్చాయి కానీ అన్నీ విజయం సాధించలేక పోయాయి. గత యేడాది నుంచి చూసుకుంటే యోగి, టాస్, ఆట, లక్ష్యం, మున్నా, మంత్ర, డాన్, కృష్ణ, వాన, గమ్యం, జల్సా, కంత్రి, రెడీ వచ్చాయి. లక్ష్యం, మంత్ర, కృష్ణ, గమ్యం, జల్సా విజయం సాధించగా; ఆట, డాన్ బాక్సాఫీసు వద్ద యావరేజ్ ముద్రను వేసుకున్నాయి. యోగి, టాస్, మున్నా, వాన, కంత్రి సినిమాలు విఫలమయ్యాయి. 'రెడీ' బాక్సాఫీసు ఫలితం తేలాల్సి వుంది. తేజ తొలి చిత్రం 'చిత్రం' హిట్టవడంతో రెండక్షరాల టైటిల్‌కి గిరాకీ ఏర్పడింది. 'ఖుషి', 'ఆది' చిత్రాలు ఆ బాటలో మంచి హిట్టవగా తేజ స్వయంగా రూపొందించిన మరో రెండక్షరాల సినిమా 'జయం', చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'ఇంద్ర' బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి.
టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్ టైటిల్‌ని విభిన్నంగా పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇట్లు.. శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి 9848022338 అంటూ అతడు వెరైటీగా పెట్టిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తిట్టుపదాలు ఇడియట్, పోకిరి, దేశముదురు టైటిళ్లతో బంపర్‌హిట్ సినిమాలు తీయడం అతడికే చెల్లింది. ఆ కోవలోనే ఎన్టీఆర్ హీరోగా పూరీ శిష్యుడు మెహర్ రమేష్ రూపొందించిన 'కంత్రి' బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ప్రభాస్ హీరోగా తను రూపొందించిన ఇటీవలి సినిమాకు 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' అనే వెరైటీ టైటిల్ పెట్టాడు పూరీ. కానీ అది వర్కవుట్ కాలేదు.
తెలుగు సినిమాలకీ, యముడికీ మంచి అవినాభావ సంబంధం వుంది. 'యమజాతకుడు' వంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే 'యమ' శబ్దంతో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా విజయం సాధించినవే. 'యమగోల', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'యమలీల' వంటివి అందుకు ఉదాహరణలు. నిరుడు వచ్చిన ఎన్టీఆర్ సినిమా 'యమదొంగ', శ్రీకాంత్, వేణుల సినిమా 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు రెండూ విజయాన్ని చవిచూశాయి. అంటే యముడు బాక్సాఫీసు మంత్రమన్నమాట.
ఆహ్లాదకరమైన పేర్లు పెడితే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పొలోమని వస్తారనేది చాలామంది భావన. కానీ ఆ తరహా టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్లో అత్యధికం ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విచారకరం. టైటిల్‌లో వున్న ఆహ్లాదం సినిమాలో లేకపోవడమే దానికి కారణం. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అందమైన మనసులో', పదిహేనేళ్ల తర్వాత గిరిబాబు రూపొందించిన 'నే సుఖమే నే కోరుతున్నా', అపురూప చిత్రాల దర్శకుడు బాపు గీచిన 'సుందరకాండ', తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 'నవ వసంతం' వంటివి తుస్సుమన్నాయి.
కొన్ని సినిమాలు టైటిళ్లకు విరుద్ధమైన ఫలితాల్ని పొంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనించదగ్గ అంశం. 'వాన' ఎమ్మెస్ రాజుకు బాక్సాఫీసు వానను కురిపించలేక పోయింది. రాజా నటించిన 'వేడుక' నిర్మాత పాలిట పీడకల అయ్యింది. శ్రీహరి 'శ్రీ మహాలక్ష్మి' సిరులు కురిపించలేక పోయింది. 'లక్షీపుత్రుడు', 'లక్ష్మీ కల్యాణం'లదీ అదే దారి. ఎస్వీ కృష్ణారెడ్డి 'బహుమతి' నిర్మాత జేబుల్ని ఖాళీ చేయించింది. నాగబాబు హీరోగా నటించిన 'ఆపద మొక్కులవాడు' నిర్మాతల్ని పుట్టిముంచాడు. 'హ్యాపీ డేస్' మాత్రం శేఖర్ కమ్ములకూ, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకూ నిజంగానే హ్యాపీ డేస్‌ను తెచ్చింది.
హిట్టయిన పాత సినిమాల టైటిల్స్‌తో వచ్చిన సినిమాలేవీ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. ఉదయ్‌కిరణ్, శ్రీహరిల 'వియ్యాలవారి కయ్యాలు', వేణుమాధవ్ నటించగా దాసరి కథను అందించిన 'ప్రేమాభిషేకం', తరుణ్, ఇలియానాల 'భలే దొంగలు', తరుణ్ మరో సినిమా 'నవ వసంతం', శ్రీకాంత్, ప్రభుదేవా, సునీల్ ప్రధాన పాత్రలు పోషించిన 'మైఖేల్ మదన కామరాజు' వంటివి అందుకు ఉదాహరణలు.
అంటే చిత్ర విజయానికి టైటిల్ అనేది ఒక ప్లస్ పాయింట్‌గా మాత్రమే వుంటుందనీ, కేవలం టైటిల్ వల్లే సినిమా హిట్టు కాదనీ స్పష్టమవుతుంది. మంచి కథతో సినిమాని రూపొందించి, దానికి జస్టిఫై అయ్యే టైటిల్‌ని పెడితే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతందనడంలో సందేహ లేదు. అందుచేత కథకులూ, దర్శకులూ టైటిల్ కంటే ముందు కథకీ, స్క్రీన్‌ప్లేకీ ప్రాధాన్యతనిచ్చి వాటిమీద శ్రద్ధ చూపి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించడం బెటరు.