Showing posts with label krish. Show all posts
Showing posts with label krish. Show all posts

Friday, December 16, 2011

'కృష్ణం వందే జగద్గురుం' ప్రారంభం

రానా హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో డిసెంబర్ 14న జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. 
క్రిష్ మాట్లాడుతూ "ఈ కథకు సంబంధించిన పాయింట్ స్ఫురించగానే రానాకు ఫోన్ చేసి చెప్పాను. మా ఇద్దరి గమనం, గతిని మార్చే సినిమా ఇది. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. బీటెక్ బాబుగా రానా నటించనున్నారు. అతని ఆరున్నర అడుగుల కటౌట్‌ను పూర్తిగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాను. సాయిమాధవ్ డైలాగులు బావుంటాయి. మంచి టీమ్‌తో ముందుకు వెళ్తున్నాం. హీరోయిన్‌ను రెండు మూడు రోజుల్లో ఎంపిక చేస్తాం. వెంటనే షెడ్యూల్ మొదలవుతుంది. యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. కృష్ణుడిని మించిన మాస్ పాత్ర నాకు కనిపించలేదు. ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది'' అని అన్నారు. 
రానా మాట్లాడుతూ "ఇది నేను చేస్తున్న ఆరో చిత్రం. గతంలో దర్శకులు సృష్టించిన పాత్రల్లోకి నేవెళ్ళి చేశాను. ఈ సినిమాలో నాకోసం రూపొందించిన పాత్రలో నటించబోతున్నాను. హీరో జర్నీకి సంబంధించిన చిత్రమిది. వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళంలో 'వడక్కు చెన్నై'లో నటిస్తున్నాను'' అని అన్నారు. 
కథను నమ్మి సినిమా తీసే దర్శకుడు క్రిష్ అని పోసాని కితాబిచ్చారు. మంచి పాత్రలో నటిస్తున్నట్టు ఎల్బీశ్రీరామ్ అన్నారు. కథ మెప్పిస్తుందని వెంకటేష్ చక్రవర్తి చెప్పారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తానని సాయిమాధవ్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "మంచి కథ. రానా పాత్ర మెప్పిస్తుంది. లొకేషన్‌లు, స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, పోసాని, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, నాగినీడు, రవి ప్రకాష్, జె.వి.ఆర్., హేమ, శ్రీనిజ తదితరులు ఇతర పాత్రధారులు. కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: క్రిష్, స్క్రిప్ట్ కన్సల్టంట్: వెంకటేష్ చక్రవర్తి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: శ్రావణ్.కె, కెమెరా: జ్ఞాన శేఖర్.వి.ఎస్., సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి.

Thursday, August 18, 2011

న్యూస్: క్రిష్ తర్వాతి సినిమా ఎలా ఉంటుంది?

మిగతా దర్శకులంతా సేఫ్ జోన్‌లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి తాపత్రపడుతుంటే అతను మాత్రం తనకు నచ్చిన మార్గంలో జీవిత వాస్తవికతని ప్రతిబింబించే సినిమాలు తీస్తూ ముందుకు నడుస్తున్నాడు. కేవలం మూడే మూడు సినిమాలతో టాలీవుడ్‌లోనే కాక, మొత్తం భారతీయ చిత్రసీమలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అతను జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమితో 'గమ్యం', 'వేదం' సినిమాలతో చూపించిన అతను 'వేదం' తమిళ రీమేక్ 'వానం'తో తమిళ ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూస్తున్న తమిళ ప్రేక్షకులు థియేటర్లలో లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోయారంటే అతని దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవాల్సిందే. ఈ సినిమాలో అతను హీరోలనీ చూపలేదు, విలన్లనీ చూపలేదు. తప్పుడు మార్గంలో పోయే మనిషి కొన్ని సంఘటనలతో ఎలా మంచివాడిగా మారతాడో ఎంతో కన్విన్సింగ్‌గా అందులో చూపించాడు క్రిష్. ఈ సినిమాని హిందీలో తీసి, మరింతమందికి చేరువయ్యే అవకాశమున్నా అలా వచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఈ సినిమా తమిళ హక్కులు కొన్న హీరో శింబు హిందీ సినిమానీ డైరెక్ట్ చేయాల్సిందిగా అతన్ని కోరుతున్నాడు.
తెలుగుకంటే తమిళ ప్రేక్షకుల్నే ఎక్కువగా 'వేదం' ఆకట్టుంది. ఆ ఇద్దరి మధ్య పోలికల్ని తెలియజేస్తూ "ఓ సీన్‌లో ముసలాయన సొమ్ముని దొంగిలించిన అల్లు అర్జున్ తిరిగి దాన్ని అతనికి తిరిగివేస్తాడు. ఆ సీను చూసి తెలుగువాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సీనుని తమిళంలో శింబు చేశాడు. ఆ సీను చూసి తమిళులు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. మనవాళ్లకీ, తమిళులకీ సినిమాని అర్థం చేసుకోవడంలో ఉన్న తేడా అది" అని చెప్పాడు క్రిష్.
ఇప్పటిదాకా తన సినిమాల కోసం గ్రామాల్లో, మురికివాడల్లో ఎక్కువగా తిరిగిన క్రిష్ ఈసారి పట్టణ, పోష్ లొకేషన్లలో సినిమా తీయాలనుకుంటున్నాడు. "నా తర్వాతి సినిమాలో భారీ ఫైట్లు, సెట్లు ఉంటాయి" అని అతను తెలిపాడు. ఓ వైపు సామాజిక వాస్తవికతని చూపిస్తూ, మరోవైపు మానవ భావోద్వేగాల్ని గొప్పగా సెల్యులాయిడ్ మీద మలచగలిగే నేర్పు ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పుడు తన తర్వాతి స్క్రిప్టు మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమా కూడా అతణ్ణి కచ్చితంగా వార్తల్లో నిలుపుతుందన్నది నిఖార్సయిన నిజం.

Friday, August 5, 2011

న్యూస్: మంచి సినిమాలకే నందులు!

గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Monday, July 25, 2011

న్యూస్: మనోజ్ కెరీర్‌కి ప్రేక్షకులు ఊ కొడతారా?

ఇప్పటివరకు హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించిన మంచు మనోజ్ కెరీర్‌లో ఎన్ని హిట్లున్నాయి? సరిగ్గా చెప్పాలంటే ఒక్కటే. అది 'బిందాస్'. 2010 మొదట్లో వీరు పోట్ల తొలిసారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజానికి మరింత హిట్టవ్వాల్సింది కానీ నాలుగు వారాల తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద అప్పటికే మంచి వసూళ్లను అది రాబట్టింది. క్రిష్ డైరెక్షన్‌లో నటించిన 'వేదం' అందరి ప్రశంసలూ పొందింది కానీ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అందులో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ నటనని విమర్శకులు మెచ్చారు. మొదట్లోనే డైలాగ్ డిక్షన్‌లో స్పష్టత సాధించిన మనోజ్ హావభావాల్లోనూ పరిణతి కనపర్చాడు. హీరోగా తొలి సినిమా 'దొంగ దొంగది'లోనే తన నటనతో అతను ఆకట్టుకున్నాడు. మరైతే అతనికి ఎందుకు హిట్లు దక్కడం లేదు? ఎంచుకుంటున్న సబ్జెక్టులే అందుకు కారణం. ఆఖరుకి కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప సీనియర్ డైరెక్టర్ కూడా పాత చింతకాయ సబ్జెక్టుతోటే 'ఝుమ్మంది నాదం' తీయడంతో పాటలు తప్ప మరేమీ ఆకట్టుకోక ఆ సినిమా ఫ్లాపయ్యింది. ఈ నేపథ్యంలో మనోజ్ రెండు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', రెండు 'మిస్టర్ నోకియా'. మొదటి సినిమాని శేఖర్ రాజా అనే కొత్త దర్శకుడు తీస్తుంటే, రెండే సినిమాని 'అసాధ్యుడు' (కల్యాణ్‌రాం హీరో), 'జంక్షన్' (పరుచూరి రవిబాబు హీరో) వంటి సూపర్ డిజాస్టర్లను రూపొందించిన అనిల్‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్‌కృష్ణ ఈ సినిమాకి తన పేరుని 'అని' అంటూ మార్చుకున్నాడు. ఫెయిల్యూర్లు వచ్చిన వాళ్లెందుకు పేరు మార్చుకుంటారో తెలిసిందే కదా. ఈ సినిమాలతో అయినా కమర్షియల్ హీరోగా మనోజ్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకో గలుగుతాడా?

Sunday, October 10, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)

గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.  (ఇంకావుంది)

Wednesday, September 22, 2010

రివ్యూ: క్రిష్ తొలి సినిమా 'గమ్యం'


సజావుగా సాగిన 'గమ్యం'

సినిమా కళ పట్ల అభిమానం, అభిరుచి వున్న దర్శకుల వల్ల తెలుగులో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తూ వున్నాయి. ఇటీవలి కాలంలో కొత్తగా ఆలోచిస్తూ సినీ రంగంలోకి అడుగుపెడుతున్న దర్శకులు ఎక్కువవుతున్నారు. వారిలో రాధాకృష్ణ జాగర్లమూడి కూడా చేరతాడని చెప్పాలనిపిస్తుంది 'గమ్యం' చూశాక. ఫార్ములా చట్రంలో కాకుండా తాననుకున్న పాయింట్‌ని కొత్తగా చెప్పాలనే తాపత్రయం రాధాకృష్ణలో కనిపిస్తుంది. నటీనటుల ఎంపికలో కూడా అతను ఈ ధోరణిని కనపర్చాడు. శర్వానంద్ ప్రధాన హీరో అయితే, నరేష్ సైడ్ హీరో. కమలినీ ముఖర్జీ హీరోయిన్. నిజంగా ఆసక్తి కరమైన కాంబినేషన్. శుక్రవారం (ఫిబ్రవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకీ, సిద్ధార్థుడి (బుద్ధుడి) కథకీ ఒక పోలిక వుంది. అదేమంటే...
కథ:
చెప్పుకోవడానికి ఇందులో కథంటూ పెద్దగా ఏమీ లేదు. తనని వదలి వెళ్లిన కథానాయిక కోసం కథానాయకుడు జరిపే అన్వేషణ ఈ సినిమా. ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో అతను పొందిన అనుభవాల మాలిక ఈ సినిమా. అభిరామ్ (శర్వానంద్) పదివేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన సంపన్న యువకుడు. ఒకసారి అతడికి జానకి (కమలిని) అనే అందమైన మెడికో తారస పడుతుంది. ఆమెని వారం రోజుల్లో ప్రేమలో పడేస్తానని తన మిత్రుడితో పందెం కడతాడు అభి. ఆమెకు 'ఐ లవ్ యు' చెబుతాడు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. ఆమెతో పరిచయం పెంచుకుని తన బర్త్‌డే పార్టీకి పిలుస్తాడు. అభి తనకోసం ఎందుకు తిరుగుతున్నాడనే నిజం అక్కడ జానకికి తెలుస్తుంది. అభిని ఏవగించుకుంటుంది. పందెం కట్టింది నిజమే గానీ, ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నానంటాడు అభి. అక్కణ్ణించి కారులో వస్తున్న ఇద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. కారు కంట్రోల్ తప్పి ఒక స్త్రీని ఢీకొంటుంది. కళ్లువిప్పితే ఆసుపత్రిలో వుంటాడు అభి. జానకి అతణ్ణి వదిలి వెళ్లిపోతుంది. తనకోసం వెతకొద్దని ఉత్తరం రాస్తుంది. కానీ అభికిప్పుడు జానకి నిజంగా కావాలి. ఆమె కోసం బయలుదేరతాడు. మధ్యలో ఒక మోటారు వాహనాల దొంగ గాలి శీను (నరేష్) తారసపడతాడు. అభి వద్ద కనిపించిన ఖరీదైన మోటార్ బైకుని దొంగిలించాలని శీను కూడా అతనితో ప్రయాణిస్తాడు. అక్కణ్ణించి ఆ ఇద్దరూ ఎన్నో అనుభవాలు పొందుతారు. ఆ అనుభవాలేమిటి? ఆ ఇద్దరూ తమ తమ గమ్యాల్ని చేరుకున్నారా? జానకి ఏమయ్యింది? అనేది మిగతా సినిమా.
కథనం:
అంతఃపురం వీడి బయటి లోకంలోకి అడుగుపెట్టిన సిద్ధార్థుడు అక్కడి భయంకరమైన స్థితుల్ని చూసి బిత్తరపోతాడు. చావు బతుకుల గురించి ప్రత్యక్షంగా చూసి చలించిపోతాడు. నిజమైన జీవితమంటే ఏమిటో తెలుసుకుంటాడు. జన్మకి అర్ధాన్ని అన్వేషించే క్రమంలో సన్యాసి అవుతాడు. జ్ఞానోదయంతో బుద్ధుడిగా మారతాడు. బుద్ధుడిగా మారకముందు ప్రపంచంలో గౌతముడికి ఎదురైన అనుభవాల ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని 'గమ్యం' కథని మలిచాడు దర్శకుడు రాధాకృష్ణ. కాకపోతే కథానాయకుడి అన్వేషణ తన నాయక కోసం. ప్రేమ కోసం. అయినప్పటికీ ఆ అన్వేషణలో కథానాయకుడు లోకం తీరు ఎలా వుందో తెలుసుకుంటాడు. జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. మనిషికీ, మనిషితనానికీ అర్ధం తెలుసుకుంటాడు. ప్రేమంటే ఏమిటో, ప్రేమించడమంటే ఏమిటో తెలుసుకుంటాడు. తన చేతుల మీదుగా ఒక జననం, ఒక మరణం చూస్తాడు. కథానాయకుడు అభిరామ్ పొందే ఈ అనుభవాల కోసం దర్శకుడు కల్పించిన సన్నివేశాలు ప్రశంసనీయంగా వున్నాయి. మొదట్లో రిలేషన్‌షిప్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అనుకున్న అభిరామ్ చివరకు వచ్చేసరికి అనుబంధాల్లోని ఆత్మీయతని ఆస్వాదిస్తాడు. అలా ఆ పాత్ర మారే క్రమాన్ని చూపించడంలో దర్శకుడు ఎంతో మెచ్యూరిటీని కనపర్చాడు. ఆ పాత్రలో ఆ పరిణామానికి కారణమైన గాలి శీను పాత్రనీ చక్కగా తీర్చిదిద్దాడు. అభిరామ్, శీను మధ్య స్నేహానుబంధం పెనవేసుకునే తీరు ఆకట్టుకుంటుంది. కలిసి ప్రయాణించే క్రమంలో ఆ ఇద్దరి స్వభావాల్లోనూ మార్పు వస్తుంది. అందుకే ఒకచోట విజయచందర్ చేత "జంతువులు మారవు. మారని వాడు మనిషి కాడు" అనిపిస్తాడు దర్శకుడు. గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు ఎలా జరుగుతాయో చూపించిన అతను అక్కడ రికార్డింగ్ డాన్సర్‌కి కూడా మనసు, ఆత్మగౌరవం వుంటాయనే సన్నివేశాన్ని కల్పించిన తీరు ప్రశంసనీయం. అలాగే నక్సలైట్లు అడవుల్లోంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజోపయోగ పనులు చేయాలని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిరామ్ అన్వేషణకి కారణమైన జానకి పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించిన దర్శకుడు ఆమె పాత్రని ఇంకా విపులంగా చిత్రించివుంటే సినిమాకి మరింత ఆకర్షణ చేకూరేది. పాటల చిత్రీకరణ విషయంలోనూ రాధాకృష్ణ జాగ్రత్త వహించాడు. కథ నడకకి అవి అడ్డుపడకుండా చూసుకున్నాడు. రవీంద్రభారతిలో కమలిని బృందం చేత చేయించిన నృత్యం యువతని సైతం ఆకట్టుకుంటుంది. నరేష్ పాత్రలో వినోదాన్ని చొప్పించిన దర్శకుడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలను సందర్భోచితంగా వాడుకున్నాడు. కథనం విషయంలో ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని రూపొందించింది కొత్త దర్శకుడంటే నమ్మడం కష్టం.
నటీనటుల అభినయం:
'వెన్నెల', 'అమ్మ చెప్పింది' సినిమాల్లో ప్రతిభావంతంగా నటించిన శర్వానంద్ 'గమ్యం'లో అభిరామ్‌గా పరిణతి చెందిన అభినయాన్ని ప్రదర్శించాడు. కథ ప్రకారం పాత్ర ఎలా పరిణతి చెందుతూ వస్తుందో దానికి తగ్గట్లు అతను హావభావాలు ప్రదర్శించాడు. వాచకంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే హీరోగా రానున్న రోజుల్లో రాణించగలుగుతాడు. ఏమైనా ఈ సినిమాతో హీరోగా అతనికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. గాలి శీనుగా సైడ్ హీరో పాత్రని చేయడానికి నరేష్ అంగీకరించి, మంచిపనే చేశాడు. ఆ పాత్ర స్వభావానికి నరేష్ అతికినట్లు సరిపోయాడు. ఈమధ్య చేసిన సినిమాలతో నిరాశపరచిన అతను ఇందులో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. మొదట్లో అల్లరి చిల్లరగా కనిపించి కాలక్షేపాన్ని అందించిన అతను చివర్లో కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాడు. కమలిని నటనా సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జానకి పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చింది. సినిమాలో ప్రధానమైనవి ఈ మూడు పాత్రలే. మిగతావి ఇలా వచ్చి అలా పోతాయి. ఆ పాత్రల్లో ఆయా నటులు.. అభిషేక్ (శర్వానంద్ మిత్రుడు), బ్రహ్మానందం, ఎమ్మెస్, ఎల్బీ శ్రీరామ్, విజయచందర్, హేమ వగైరా.. రాణించారు.
టెక్నీషియన్ల పనితనం:
కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ తన పనిని శ్రద్ధగా చేస్తే, సంభాషణల్ని నాగరాజు గంధం సందర్భోచితంగా ప్రయోగించాడు. కథనానికి ఆయన మాటలు బాగా వుపకరించాయి. ప్రధానంగా నరేష్ నోట పలికే మాటలు ప్రేక్షకులకి రిలీఫ్‌నిస్తాయి. జీవితం గురించి చెప్పే సందర్భాల్లోనూ ఆయన కలం చురుగ్గా పనిచేసింది. ఇ.ఎస్. మూర్తి, అనిల్ కలిసి కూర్చిన సంగీతం ఓకే. నేపథ్య సంగీతం యాప్ట్‌గా వుంది. ఈ సినిమాకి ప్రధాన బలాల్లో ఒకటి సినిమాటోగ్రఫీ. యువకుడైన దర్శకుడి మనసుని గ్రహించినట్లు సీనియర్ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు కెమెరా సన్నివేశాల్లోని మూడ్‌ని బాగా క్యాప్చర్ చేసింది. సన్నివేశాలకు తగ్గట్లు నేపథ్యాన్ని సృష్టించడం అంత తేలికైన పనికాదు. కళా దర్శకుడు రాజీవ్ నాయర్ ఆ పనిని మెరుగ్గా చేసుకుపోయాడు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా వుంది.
బలాలు, లోపాలు:
అభిరామ్, గాలి శీను పాత్రలు, ఆ పాత్రల్లో శర్వానంద్, నరేష్ అభినయం, కథనం, సంభాషణలు, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం బలాలు. కమలిని పాత్ర నిడివి తక్కువ కావడం, ప్రథమార్ధంలో ఆకర్షణీయమైన సన్నివేశాలు తక్కువ కావడం, క్లైమాక్స్ ముందరి లీడ్ సన్నివేశాలు.. లోపాలు. ఓవరాల్‌గా చూస్తే కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది.

Friday, July 9, 2010

'Vedam' as 'Vaanam' in Tamil

తెలుగులో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వేదం' సినిమా తమిళంలో 'వానమ్' పేరుతో రూపొందనున్నది. ఈ సినిమాని ఢైరెక్ట్ చేయడానికి ఎట్టకేలకు ఒరిజినల్ మూవీ డైరెక్టర్ క్రిష్ అంగీకరించాడు. తెలుగులో చేసిన పాత్రల్నే అనుష్క, మనోజ్ చేస్తుండగా, అల్లు అర్జున్ చేసిన పాత్రని 'వానమ్'లో శింబు చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నాడు. గురువారం (జూలై 8) జరిగిన ఫోటో షూట్ శింబుకి థ్రిల్ కలిగించింది. శనివారం ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నది.

Tuesday, July 6, 2010

Manoj and Anushka in Tamil 'Vedam'




క్రిష్ దర్శకత్వంలో రూపొంది ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వేదం' సినిమా తమిళంలో రీమేక్ కాబోతోంది. ఈ సినిమా తమిళ రీమేక్ హక్కుల్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ పొందిన సంగతి తెలిసిందే. తెలుగులో రాక్‌స్టార్ వివేక్ చక్రవర్తిగా నటించిన మంచు మనోజ్ తమిళంలోనూ అదే పాత్రను చేయబోతున్నాడు. ఇక అల్లు అర్జున చేసిన కేబుల్ రాజు పాత్రని శింబు చేయబోతున్నాడు. తెలుగులో చేసిన వాళ్లలో మనోజ్ కాకుండా అమలాపురం సరోజగా సెక్స్ వర్కర్ రోల్ చేసిన అనుష్క కూడా తమిళంలో చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సిందిగా క్రిష్‌ని అడుగుతున్నారు. మనోజ్, అనుష్కలతో పాటు శింబు కూడా క్రిష్‌పై వత్తిడి తీసుకు వస్తున్నారు. ఈ విషయంపై నేను క్రిష్‌ని అడిగితే తానింకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పాడు. 'వేదం' హిందీ వెర్షన్‌కి డైరెక్షన్ చేయమని కూడా తనని అడుగుతున్నారనీ, అయితే తాను ఎవరికీ ఇంకా మాట ఇవ్వలేదనీ క్రిష్ తెలిపాడు. ప్రస్తుతం తాను కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నానన్నాడు.

Saturday, June 19, 2010

Ninna 'Gamyam'.. Nedu 'Vedam'

మూసలోపడి కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఎవరో ఒక దర్శకుడు రేపటి మీద ఆశని రేకెత్తిస్తూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల, సాయికిరణ్ అడివి, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) వంటి దర్శకులు సృజనాత్మకపరంగా తెలుగు సినిమాని ఓ మెట్టుపైకి తీసుకెడతారనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 'మినిమం గ్యారంటీ' ఉచ్చులో పడకుండా మన సినిమాల్లో చెప్పని కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 'గమ్యం' సినిమా వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జీవితంలోని వెలుగునీడల్ని, జీవిత సారాంశాన్ని ఇంత అందంగా తియ్యగల దర్శకులు తెలుగులో ఉన్నారా! అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం. ఆవారాగా, ఆకతాయిగా తిరిగే గాలి శీను తనకు ఎదురైన అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా ఆఖరుకి త్యాగమూర్తిగా మిగిలాడో చూసి, కళ్లతో పాటు గుండెనీ తడిచేసుకున్నాం. గాలి శీను కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యమవకుండానే ఇప్పుడు మరో కేబుల్ రాజు ఆ స్థానంలో వచ్చి నిల్చున్నాడు. 'వేదం'లో కేబుల్ రాజుని చూస్తే 'గమ్యం'లోని గాలి శీను జ్ఞాపకమొస్తాడు. ఆకతాయితనంలో గాలి శీనుని మించినవాడు కేబుల్ రాజు. డబ్బుకోసం ఎదుటివాళ్లని బోల్తాకొట్టించడంలో మొనగాడు. డబ్బున్న అమ్మాయి ప్రేమని పొంది, రంగుల కలల్లో విహరిస్తున్నవాడు. ఒకప్పుడు అందరూ ఈసడించుకున్నవాళ్లే, చీదరించుకున్నవాళ్లే చివరాఖరుకి అతడు చేసిన త్యాగానికి
కదిలిపోయి జేజేలు పలికారు. జీవన వాస్తవం అంటే అదే. 'గమ్యం'తో ఎంతగా ఆశ్చర్యపరిచాడో, 'వేదం'తో అంతగానూ అబ్బురపరిచాడు క్రిష్‌లోని డైరెక్టర్. 'గమ్యం'కి మూలం 'మోటార్ సైకిల్ డైరీస్' అన్నారు. 'వేదం'కి ప్రేరణ ఆరేళ్ల క్రితం ఆస్కార్ అవార్డులు పొందిన 'క్రాష్' అంటున్నారు. కావచ్చు. కాకపోవచ్చు. ఒకవేళ అది నిజమేననుకున్నా, ఎంతమంది దర్శకులు ఎన్ని సినిమాల్ని కాపీ కొట్టలేదు. కానీ తెలుగుతనానికి దగ్గరగా, అందంగా, ఆర్ద్రంగా వాటిని మలిచిందెంతమంది? ఆ కళేదో, ఆ విద్యేదో క్రిష్ నేర్చాడనుకోవాలి. తన సినిమాలు హాలీవుడ్ నుంచో, మరో వుడ్ నుంచో వండినవి కాదని అంటాడు క్రిష్. కావాలంటే తన కథల, తన పాత్రల మూలాలు నిజ జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉన్నాయంటాడు. 'వేదం'లో తను సృజించిన ఐదు ప్రధాన పాత్రలే కాక, మిగతా చిన్న చిన్న పాత్రలు కూడా మన కళ్లముందు కనిపించేవేనంటాడు.
'వేదం'అఓ ఐదు ప్రధాన పాత్రలూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవే కాదు, వాటి కథలూ భిన్నమైనవే. సంపన్న కుటుంబానికి చెందిన వివేక్ చక్రవర్తి (మంచు మనోజ్) అనే రాక్‌స్టార్, మధ్య తరగతికి చెందిన ముస్లిం యువకుడు రహీముద్దీన్ ఖురేషి (మనోజ్ బాజ్‌పేయి), దిగువ తరగతికి చెందిన కేబుల్ రాజు (అల్లు అర్జున్), పూట గడవడమే కష్టమైన చేనేత కార్మికుడు రాములు (నాగయ్య), సమాజమంతా ఈసడించుకునే, రాత్రి జీవితం మాత్రమే ఉండే వేశ్య అమలాపురం సరోజ (అనుష్క).. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వెత.
తల్లి సైనికుడిగా చూడాలనుకుంటే రాక్‌స్టార్ కావాలనుకున్న వివేక్ చక్రవర్తిలోని స్వార్థం అతణ్ణి ఏ పరిస్థితుల్లో నిలిపిందో, ఆ పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్న అతను చివరికి అమ్మ గర్వపడే స్థాయికి ఎలా చేరుకున్నాడో చూసి సంతృప్తిపడతాం. దైనందిన జీవితంలో కేబుల్ రాజు వంటి వ్యక్తులు తగలని వాళ్లం ఉండం. కానీ అలాంటివాళ్లు మనకి ఏ సినిమాలోనూ కనిపించలేదు. అందుకే రెబల్‌గా, చిలిపిగా, ఆకతాయిగా కనిపించే పక్కా మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుని మొదట కోపగించుకుంటాం. తర్వాత అతణ్ణి భుజాలమీద పెట్టుకుంటాం. "రాములు కథ అనుకున్నప్పుడు ఒక వృత్తి పనివాణ్ణిగా చూపించాలనుకున్నా. ఇటీవలి కాలంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. కథకి రెలటివిటీగా ఉంటుందని రాములుని చేనేత కార్మికుడిగా చూపించా" అని చెప్పాడు క్రిష్. తనకు హైదరాబాద్‌లో ఎదుగుదల ఉండదనీ, అందుకని దుబాయ్ వెళ్లి సంపాదించి, మెరుగైన జీవనం గడపాలనుకునే రాహీముద్దీన్ ఖురేషి లాంటి మధ్యతరగతి జీవులు ఎక్కడ వెతికినా కనిపిస్తారు. అమలాపురం సరోజ పాత్ర సృష్టి వెనుక బాలగంగాధర్ తిలక్ 'ఊరి చివరి ఇల్లు'లోని పాత్ర ప్రేరణ ఉందంటాడు క్రిష్. ఒక వేశ్య అయినా పిల్లవాడికి పాలిచ్చే సరోజని చూసినప్పుడు ఎవరూ ఆమెలో శృంగారాన్ని చూడకపోవడం అతని దర్శకత్వ చాతుర్యానికి నిదర్శనం. ఈ పాత్రల్ని తెరమీద ధరించిన వాళ్లంతా వాటికి న్యాయం చేకూర్చడం వల్ల ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ నటనతో ఆ పాత్రలకి వన్నెతెచ్చారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ హావభావాలు ఒక పట్టాన మరచిపోలేం. అలాగే పటేల్ దగ్గరున్న మనవణ్ణి విడిపించుకుని, అతడి చేయి పట్టుకుని నడిపించుకువెళ్లే రాములులోని రేపటి మీద ఆశ మనల్ని కదిలిస్తుంది. క్రిష్ మనసులోని దృశ్యాలకి జ్ఞానశేఖర్ కెమెరా ఇచ్చిన తెరరూపం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. అతడికిది తొలి సినిమా అంటే నమ్మడం కష్టం. పాటల్లో కంటే కీరవాణి కీబోర్డు నేపథ్య సంగీతానికి బాగా ఉపకరించింది. ఆయా సన్నివేశాల్లోని మూడ్ ఎలివేట్ అయ్యింది ఆయన సంగీతం వల్లే. ఎడిటింగ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐదు కథల్ని బిగి సడలకుండా, బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా కూర్చడం కత్తిమీద సాము. ఆ పనిని శ్రావణ్ నైపుణ్యంగా చేసుకుపొయ్యాడు. మూస సినిమాల్నే ఇష్టపడే వాళ్ల సంగతేమో కానీ కమర్షియాలిటీని మిస్ కాకుండానే కొత్తదనం కురిసే సినిమాల్ని చూడాలనుకున్న వాళ్లకి 'వేదం' తొలకరి జల్లులాంటిదే.