మూసలోపడి కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఎవరో ఒక దర్శకుడు రేపటి మీద ఆశని రేకెత్తిస్తూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల, సాయికిరణ్ అడివి, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) వంటి దర్శకులు సృజనాత్మకపరంగా తెలుగు సినిమాని ఓ మెట్టుపైకి తీసుకెడతారనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 'మినిమం గ్యారంటీ' ఉచ్చులో పడకుండా మన సినిమాల్లో చెప్పని కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 'గమ్యం' సినిమా వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జీవితంలోని వెలుగునీడల్ని, జీవిత సారాంశాన్ని ఇంత అందంగా తియ్యగల దర్శకులు తెలుగులో ఉన్నారా! అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం. ఆవారాగా, ఆకతాయిగా తిరిగే గాలి శీను తనకు ఎదురైన అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా ఆఖరుకి త్యాగమూర్తిగా మిగిలాడో చూసి, కళ్లతో పాటు గుండెనీ తడిచేసుకున్నాం. గాలి శీను కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యమవకుండానే ఇప్పుడు మరో కేబుల్ రాజు ఆ స్థానంలో వచ్చి నిల్చున్నాడు. 'వేదం'లో కేబుల్ రాజుని చూస్తే 'గమ్యం'లోని గాలి శీను జ్ఞాపకమొస్తాడు. ఆకతాయితనంలో గాలి శీనుని మించినవాడు కేబుల్ రాజు. డబ్బుకోసం ఎదుటివాళ్లని బోల్తాకొట్టించడంలో మొనగాడు. డబ్బున్న అమ్మాయి ప్రేమని పొంది, రంగుల కలల్లో విహరిస్తున్నవాడు. ఒకప్పుడు అందరూ ఈసడించుకున్నవాళ్లే, చీదరించుకున్నవాళ్లే చివరాఖరుకి అతడు చేసిన త్యాగానికి
కదిలిపోయి జేజేలు పలికారు. జీవన వాస్తవం అంటే అదే. 'గమ్యం'తో ఎంతగా ఆశ్చర్యపరిచాడో, 'వేదం'తో అంతగానూ అబ్బురపరిచాడు క్రిష్‌లోని డైరెక్టర్. 'గమ్యం'కి మూలం 'మోటార్ సైకిల్ డైరీస్' అన్నారు. 'వేదం'కి ప్రేరణ ఆరేళ్ల క్రితం ఆస్కార్ అవార్డులు పొందిన 'క్రాష్' అంటున్నారు. కావచ్చు. కాకపోవచ్చు. ఒకవేళ అది నిజమేననుకున్నా, ఎంతమంది దర్శకులు ఎన్ని సినిమాల్ని కాపీ కొట్టలేదు. కానీ తెలుగుతనానికి దగ్గరగా, అందంగా, ఆర్ద్రంగా వాటిని మలిచిందెంతమంది? ఆ కళేదో, ఆ విద్యేదో క్రిష్ నేర్చాడనుకోవాలి. తన సినిమాలు హాలీవుడ్ నుంచో, మరో వుడ్ నుంచో వండినవి కాదని అంటాడు క్రిష్. కావాలంటే తన కథల, తన పాత్రల మూలాలు నిజ జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉన్నాయంటాడు. 'వేదం'లో తను సృజించిన ఐదు ప్రధాన పాత్రలే కాక, మిగతా చిన్న చిన్న పాత్రలు కూడా మన కళ్లముందు కనిపించేవేనంటాడు.
'వేదం'అఓ ఐదు ప్రధాన పాత్రలూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవే కాదు, వాటి కథలూ భిన్నమైనవే. సంపన్న కుటుంబానికి చెందిన వివేక్ చక్రవర్తి (మంచు మనోజ్) అనే రాక్‌స్టార్, మధ్య తరగతికి చెందిన ముస్లిం యువకుడు రహీముద్దీన్ ఖురేషి (మనోజ్ బాజ్‌పేయి), దిగువ తరగతికి చెందిన కేబుల్ రాజు (అల్లు అర్జున్), పూట గడవడమే కష్టమైన చేనేత కార్మికుడు రాములు (నాగయ్య), సమాజమంతా ఈసడించుకునే, రాత్రి జీవితం మాత్రమే ఉండే వేశ్య అమలాపురం సరోజ (అనుష్క).. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వెత.
తల్లి సైనికుడిగా చూడాలనుకుంటే రాక్‌స్టార్ కావాలనుకున్న వివేక్ చక్రవర్తిలోని స్వార్థం అతణ్ణి ఏ పరిస్థితుల్లో నిలిపిందో, ఆ పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్న అతను చివరికి అమ్మ గర్వపడే స్థాయికి ఎలా చేరుకున్నాడో చూసి సంతృప్తిపడతాం. దైనందిన జీవితంలో కేబుల్ రాజు వంటి వ్యక్తులు తగలని వాళ్లం ఉండం. కానీ అలాంటివాళ్లు మనకి ఏ సినిమాలోనూ కనిపించలేదు. అందుకే రెబల్‌గా, చిలిపిగా, ఆకతాయిగా కనిపించే పక్కా మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుని మొదట కోపగించుకుంటాం. తర్వాత అతణ్ణి భుజాలమీద పెట్టుకుంటాం. "రాములు కథ అనుకున్నప్పుడు ఒక వృత్తి పనివాణ్ణిగా చూపించాలనుకున్నా. ఇటీవలి కాలంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. కథకి రెలటివిటీగా ఉంటుందని రాములుని చేనేత కార్మికుడిగా చూపించా" అని చెప్పాడు క్రిష్. తనకు హైదరాబాద్‌లో ఎదుగుదల ఉండదనీ, అందుకని దుబాయ్ వెళ్లి సంపాదించి, మెరుగైన జీవనం గడపాలనుకునే రాహీముద్దీన్ ఖురేషి లాంటి మధ్యతరగతి జీవులు ఎక్కడ వెతికినా కనిపిస్తారు. అమలాపురం సరోజ పాత్ర సృష్టి వెనుక బాలగంగాధర్ తిలక్ 'ఊరి చివరి ఇల్లు'లోని పాత్ర ప్రేరణ ఉందంటాడు క్రిష్. ఒక వేశ్య అయినా పిల్లవాడికి పాలిచ్చే సరోజని చూసినప్పుడు ఎవరూ ఆమెలో శృంగారాన్ని చూడకపోవడం అతని దర్శకత్వ చాతుర్యానికి నిదర్శనం. ఈ పాత్రల్ని తెరమీద ధరించిన వాళ్లంతా వాటికి న్యాయం చేకూర్చడం వల్ల ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ నటనతో ఆ పాత్రలకి వన్నెతెచ్చారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ హావభావాలు ఒక పట్టాన మరచిపోలేం. అలాగే పటేల్ దగ్గరున్న మనవణ్ణి విడిపించుకుని, అతడి చేయి పట్టుకుని నడిపించుకువెళ్లే రాములులోని రేపటి మీద ఆశ మనల్ని కదిలిస్తుంది. క్రిష్ మనసులోని దృశ్యాలకి జ్ఞానశేఖర్ కెమెరా ఇచ్చిన తెరరూపం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. అతడికిది తొలి సినిమా అంటే నమ్మడం కష్టం. పాటల్లో కంటే కీరవాణి కీబోర్డు నేపథ్య సంగీతానికి బాగా ఉపకరించింది. ఆయా సన్నివేశాల్లోని మూడ్ ఎలివేట్ అయ్యింది ఆయన సంగీతం వల్లే. ఎడిటింగ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐదు కథల్ని బిగి సడలకుండా, బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా కూర్చడం కత్తిమీద సాము. ఆ పనిని శ్రావణ్ నైపుణ్యంగా చేసుకుపొయ్యాడు. మూస సినిమాల్నే ఇష్టపడే వాళ్ల సంగతేమో కానీ కమర్షియాలిటీని మిస్ కాకుండానే కొత్తదనం కురిసే సినిమాల్ని చూడాలనుకున్న వాళ్లకి 'వేదం' తొలకరి జల్లులాంటిదే.
No comments:
Post a Comment