శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'తో కథానాయకుడిగా పరిచయమైన రానా (రామానాయుడు) చిత్రమైన సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆయన పొడవాటి రూపమే ఆ సమస్య. దీనివల్ల ఆయనకి తగ్గ కథానాయకిని అన్వేషించడం కష్టమైపోతోంది. ఈ సంగతిని ఆయనే చెప్పాడు. వంద రోజులు నడిచిన తొలి సినిమా 'లీడర్'లో ఆయన సరసన రిచా గంగోపాధ్యాయ్ ప్రదాన నాయకిగా పర్వాలేదనిపించింది. రెండో నాయిక ప్రియా ఆనంద్ అయితే మరీ పొట్టిగా కనిపించింది. అందువల్లే ఇప్పుడు తెలుగులో రెండో సినిమాకి నాయిక ఎంపిక కోసం కషపడుతున్నారు. ఈ రెండో సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు. రానా బాబాయ్ వెంకటేశ్ కథానాయకుడిగా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాన్ని రూపొందించిన శ్రీరాఘవ. "ఇది తెలుగు, తమిళ భాషల్లో ఉంటుంది. ఐదు వేల సంవత్సరాల క్రితం నేపథ్యంలో జరిగే కాల్పనిక కథ అది. తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇది కొత్త తరహాలో ఉంటుందని చెప్పగలను. తెలుగు సంభాషణలు కూడా రెగ్యులర్ సినిమాల్లో మాదిరిగా ఉండవు. అడవిలో ఎక్కువ షూటింగ్ ఉంటుంది" అని చెప్పాడు రానా. హీరోయిన్ ఎంపిక జరిగితే ఈ నెలలోనే షూటింగ్ మొదలవుతుంది.
ప్రస్తుతం రానా హిందీలో 'దం మారో దం' చేస్తున్నాడు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, ప్రతీక్ బబ్బర్ (రాజ్ బబ్బర్ కొడుకు)తో కలిసి నటిస్తున్నాడు. విశేషమేమంటే ఈ చిత్రంలో అతనికి జోడీగా బిపాషా బసు నటిస్తోంది. తెలుగులో గతంలో మహేశ్ సరసన 'టక్కరి దొంగ'లో కనిపించిన బిపాషా బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ కిందే లెక్క. అలాంటిది అక్కడ తొలి సినిమాలోనే బిపాషాతో జతకట్టే అవకాశం దక్కింది రానాకి. ఈ సినిమాకి రోహన్ సిప్పీ దర్శకుడు. గోవా నేపథ్యంలో డ్రగ్ మాఫియా చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా తయారవుతోంది.
తెలుగులో 'లీడర్' తర్వాత వెంటనే సినిమా ప్రారంభించకుండా ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు? "నా తొలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఒక ప్రయోగంగా చేసిన ఆ సినిమాని ప్రేక్షకులు మెచ్చడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ప్రత్యామ్నాయ సినిమాలు చేయొచ్చా, లేదా అని తెలుసుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నా. ఒక ప్రధాన స్రవంతి కథకు ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ ఇచ్చి చేసిన సినిమా 'లీడర్'. రోజువారీ అందరూ ఎదుర్కొనే సమస్యల్ని చూపించిన సినిమా. దాని ఫలితంతో పూర్తి స్థాయిలో నేను సంతృప్తి చెందా. ఈ తరహా సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని అది కలిగించింది" అని వివరించాడు రానా. ఆయనలో కేవలం నటుడే కాదు రచయిత కూడా ఉన్నాడు. స్వయంగా కొన్ని కథలు రాసుకున్నాడు కూడా. ఒక కథ తాలూకు పూర్తి స్క్రిప్టు ఆయా వద్ద సిద్ధంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఆ కథతో సినిమా చేసే అవకాశముందని ఆయన చెప్పాడు.
No comments:
Post a Comment