Showing posts with label gadde sindhura. Show all posts
Showing posts with label gadde sindhura. Show all posts

Saturday, July 9, 2011

న్యూస్: సిందూర సంగతి అంతే!

2005లో మిస్ ఇండియా వరల్డ్‌గా ఎంపికై అందాల ప్రపంచంలో తెలుగువాళ్లకి పేరు తెచ్చిన విజయవాడ అమ్మాయి గద్దె సిందూర సినీ రంగంలో రాణించలేక పోతోంది. నాలుగేళ్ళ క్రితం 'హే బేబీ'తో బాలీవుడ్‌లో కాలుమోపిన ఆమెకి మళ్లీ ఇంతవరకు మరో హిందీ సినిమా చాన్స్ దక్కలేదు. ఇక తెలుగుకు వస్తే 2008లో రసూల్ ఎల్లోర్ డైరెక్షన్‌లో 'సంగమం'తో పరిచయమై, ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో 'అమరావతి' సినిమా చేసింది. ఈ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో పెద్ద హీరోల దృష్టి ఆమె మీద ప్రసరించలేదు. అందుకే ఆమెకి అవకాశాలు అడుగంటాయి. నరేశ్ నారదాసి అనే అంతగా పేరులేని ఓ దర్శకుడితో ఆమె చేసిన 'కిల్లర్' సినిమా రెండేళ్ల క్రితమే మొదలైనా ఇప్పటికి విడుదలకి రెడీ అయ్యింది. సినిమా చాన్సులు లేనందువల్లే 2010 డిసెంబరులో తన బాయ్‌ఫ్రెండ్ జోనాథన్ వార్డ్‌ని న్యూజిలాండులో పెళ్లాడింది సిందూర. అయితే పెళ్లైనంత మాత్రాన నటనకి దూరం కావాలని ఆమె నిర్ణయం తీసుకోలేదు. 'కిల్లర్' అనూహ్యంగా హిట్టయితే ఆమెకి ఒకట్రెండు అవకాశాలు రావచ్చు. ఒక నరమాంస భక్షకుడు సమాజంలో ఉంటే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే భిన్నమైన కథాంశంతో నగేశ్ ఈ సినిమాని రూపొందించాడు. ఆ నరమాంస భక్షకుని పాత్రని షఫీ చేశాడు. ఇందులో సిందూర ఏ పాత్ర చేసిందీ, ఆమె ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశముందా.. అనేవి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాలి.