Showing posts with label anand. Show all posts
Showing posts with label anand. Show all posts

Sunday, August 28, 2011

న్యూస్: కమలినికి కొత్త అవకాశాల్లేవ్!

బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ప్రాభవం టాలీవుడ్‌లో దాదాపు అంతరించినట్లే కనిపిస్తోంది. 'ఆనంద్', 'స్టైల్', 'గోదావరి', 'గమ్యం', 'గోపి గోపిక గోదావరి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సన్నిహితమైన ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. వాటిలో 'పోలీస్ పోలీస్', 'మా అన్నయ్య బంగారం', 'నాగవల్లి', లేటెస్టుగా 'విరోధి' వంటివున్నాయి. అందంకంటే అభినయాన్నే ఎక్కువ నమ్ముకున్న ఆమెకి టాప్ హీరోలతో చేసే అవకాశాలు రాలేదు. వెంకటేశ్ సినిమా 'నాగవల్లి' చేసినా అది ఆయన సరసన హీరోయిన్ పాత్ర కాదు. నీలకంఠ డైరెక్ట్ చేసిన 'విరోధి'లో ఆమెది పేరుకు హీరోయిన్ పాత్రయినప్పటికీ మరీ చిన్న పాత్ర కావడం, పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడం వల్ల ఆమెకి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం ఆమె నటించిన 'రామాచారి' సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒకే పాజిటివ్ అంశం 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణు, ఆమె కలిసి నటించడం. వాళ్ల కలయికలోని తొలి సినిమా హిట్టవడం వల్ల 'రామాచారి'కి అది ప్లస్ అవుతుందని నిర్మాత, దర్శకుడు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు దానికి బిజినెస్ జరగకపోవడం గమనార్హం. అందుకే ఆగస్టులోనే రిలీజ్ కావలసిన ఆ సినిమా సెప్టెంబరుకి వాయిదా పడింది. ఈ సినిమా ఆడితేనే కమలినికి టాలీవుడ్‌లో మరో అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

Wednesday, October 13, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (చివరి భాగం)

కథనమే కాదు కథా ముఖ్యమే
సరే, ఇక్కడ మనం ప్రస్తావిస్తున్న చిన్న చిత్రం అంటే చెత్త సినిమా కాదు, 'బి' గ్రేడ్ సినిమా అంతకంటే కాదు. చిన్న సినిమా పేరుతో వచ్చే 'బి' గ్రేడ్ సినిమాల వల్లే వాటికి చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇక్కడ చిన్న సినిమా అంటే 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'వినాయకుడు', 'గమ్యం' లాంటి నవ్య సినిమాలు. బడ్జెట్ పరంగానే అవి చిన్న సినిమాలు కానీ, భారీ బడ్జెట్ తో తీసిన ఎన్నో స్టార్ల సినిమాల కంటే అవి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు. మనం చెప్పుకుంటోంది అలాంటి చిన్న, మంచి సినిమాల గురించి. మల్టీప్లెక్స్ విప్లవం మొదలైన కాలంలో ఇక భవిష్యత్ అంతా స్వతంత్ర సినిమాదే అనే అభిప్రాయం కలిగిందనేది నిజం. అయితే అది అనుకున్నంత వేగంగా జరగడం లేదనేదీ వాస్తవం. కారణం కథలో కంటే కథనంలోనే ఎక్కువ కొత్తదనం కనిపిస్తుండటం. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లో వీడియోల్లోనూ, టీవీల్లోనూ సినిమాలు చూడటం మొదలుపెట్టిన వాళ్లు కూడా ఇప్పుడు కనీసం వారాంతాల్లోనైనా సినిమా హాళ్లకు రావాలనుకుంటున్నారు. ఈ తరహా ప్రేక్షకులకి కొత్త తరహా కథలు, కథనాలు కావాలి. స్వతంత్ర సినిమా దర్శకులకి కావలసింది ఇదే. 'తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి విడుదల చేస్తే చాలు - శాటిలైట్, వీడియో హక్కులతో పెట్టుబడి అంతా వచ్చేస్తుంది' అనే అభిప్రాయంతో కొంతమంది దర్శకులు కథ, కథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా సినిమాలు తీసి, చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఈ ధోరణిని మార్చుకుని హద్దుల్ని చెరిపేసే రీతిలో కష్టపడి పనిచేసి, కొత్తదనంతో సినిమాలు తీయకపోతే నవ్య సినిమాకి ఈరోజు ఉన్న మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నవాళ్లు అవుతారు.
ఇవాళ విలక్షణమైన కథ, కథనాలతో తీస్తున్న దర్శకులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమందే ఉండటం తెలుగు సినిమాకి సంబంధించి శుభపరిణామం. వాళ్లు తీసే నాణ్యమైన సినిమాల సంఖ్య ఏడాదికి పది మించగలిగితే స్టార్లు సైతం తమ అభిప్రాయాల్ని మార్చుకుని, ఆ దర్శకులతో పనిచేయాలని ఉవ్విళ్లూరుతారు. శేఖర్ కమ్ముల ఈమధ్య రూపొందించిన 'లీడర్' సినిమాని గానీ, కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి తీసిన 'బాణం'ని గానీ, దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం'ని గానీ స్టార్ వాల్యూ ఉన్న నటులు చేసినట్లయితే పెద్ద హిట్లయ్యేవి. అయితేనేం, వాటి ద్వారా ఆ దర్శకుల ప్రతిభ బయటపడింది. వాటి వల్ల ఇద్దరు ముగ్గురు ప్రతిభావంతులైన నటులు పరిచయమై, భవిష్యత్ మీద ఆశలు రేకెత్తించారు. ఇదే స్పిరిట్ తో స్వతంత్ర సినిమా దర్శకులు ముందుకు అడుగేయాలి. తెలుగులో మంచి సినిమాలకు కొదవలేదనే పేరు వచ్చే అవకాశం ఉంది వాళ్ల వల్లనే.  (అయిపోయింది)                         

Tuesday, October 12, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (2వ భాగం)

ఆక్సిజన్ ఇచ్చిన 'ఆనంద్'
నిజం చెప్పాలంటే 1989లో రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడు తీసిన 'శివ' సైతం స్వతంత్ర సినిమా అనే చెప్పాలి. అయితే అందులో హీరో నాగార్జున స్టార్ కావడం వల్లే ఆ సినిమా కోట్ల రూపాయల్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాదాపు అదే సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ రూపొందించిన 'అలజడి' చిత్రం సైతం స్వతంత్ర సినిమానే. స్టార్లు లేకపోవడం వల్లే ఆ సినిమా 'శివ' స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.  అయినప్పటికీ దానినీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రేక్షకులు చూశారు.
ఇటీవలి కాలానికొస్తే స్టార్లు లేకుండా 'మంచి కాఫీలాంటి సినిమా' అంటూ శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆనంద్' సినిమాకి పెట్టుబడి పెట్టేందుకు గానీ, దాన్ని విడుదల చేయడానికి గానీ ఎవరూ ముందుకు రాలేదు. అయినా కేవలం తన పనినీ, తన సినిమానీ నమ్ముకున్న శేఖర్ రాష్ట్రం మొత్తం మీద కేవలం మూడంటే మూడు ప్రింట్లతో 'ఆనంద్'ని విడుదల చేస్తే, ఆ తర్వాత అది ఎంత సంచలనాన్ని సృష్టించిందీ, స్వతంత్ర సినిమా దర్శకుడిగా శేఖర్ కి ఎంత మైలేజ్ ఇచ్చిందీ మనకు తెలియంది కాదు. 'ఆనంద్' సినిమా మంచి సినిమా దర్శకులకి అక్సిజన్ లాగా పనిచేసిందని చెప్పాలి.
మూస పంథాలో తీస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం అందరిలో ఉంది. ఆ అభిప్రాయం తప్పని అప్పట్లో 'శివ', ఇప్పట్లో 'ఆనంద్' నిరూపించాయి. అయినప్పటికీ 'కమర్షియల్ ఉచ్చు'లో ఉండేందుకే ఇష్టపడే నిర్మాతలు తాము మార్కెట్ ఉందనుకున్న ఒక స్టార్ హీరోని పెట్టి 20 కోట్ల రూపాయలయినా ఖర్చుచేసి సినిమా తీస్తున్నారు కానీ, దానివల్ల నష్టాలు వచ్చినా భరిస్తున్నారు కానీ ఒక చిన్న చిత్రం మీద ఒక కోటి రూపాయలు వెచ్చించేందుకు మాత్రం అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. వాళ్లకి మరోరకంగా సినిమా నిర్మించడం తెలియకపోవడమే దీనికి కారణమంటే కరెక్టుగా ఉంటుంది. సినిమా నిర్మాణంలో వారికి అర్థమయ్యే ఒకే ఒక అంశం టేబుల్ ప్రాఫిట్. అది రావాలంటే ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఉండాలి. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లకు కూడా వాళ్లదైన ఒక అజెండా ఉంటుంది. ఫలానా తరహా సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడతారని వాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ చిత్రమేమంటే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు నటించే సినిమాల్లో సక్సెస్ అయ్యేది 15 నుంచి 20 శాతమే. అంటే ప్రేక్షకుల ఆదరణ పొందాలనే లక్ష్యంతో తీసిన సినిమాల్లో అత్యధిక శాతం పరాజయం పాలవుతుంటాయి. వాటికి పెట్టిన డబ్బులు కూడా తిరిగిరావు. అయినా స్టార్ల దృక్పథంలో మార్పు రావడం లేదు.  (ఇంకావుంది)                      

Sunday, October 10, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)

గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.  (ఇంకావుంది)