Showing posts with label siddharth. Show all posts
Showing posts with label siddharth. Show all posts

Saturday, November 19, 2011

ఇంటర్‌వ్యూ: సిద్ధార్థ్

కుర్రాళ్లు కాలేజీ ఎగ్గొట్టి 'ఓ మై ఫ్రెండ్' చూస్తున్నారు




"యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు'' అని చెప్పారు సిద్ధార్థ్. ఆయన హీరోగా వేణుశ్రీరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
'బొమ్మరిల్లు'లాంటి సినిమా తర్వాత దిల్‌రాజు బేనర్‌లో నేను చేసిన సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలుంటాయి. డైరెక్టర్ వేణు నా కోసం రెండేళ్లు ఎదురుచూశాడు. అంతకాలం ఎదురు చూడాలంటే గట్స్ ఉంటాలి. ప్రధాన పాత్రకు నేనే కావాలని నా మీద నమ్మకం పెట్టాడు. రాజు కూడా నాతోనే దీన్ని తీయాలనుకున్నాడు. ఇది ఒక హీరో సినిమా కాదు. నాలుగు కేరక్టర్ల సినిమా. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ గురించి దీనిలో చెప్పాం. దాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఫ్యామిలీల్లోకి వెళ్లాలి
యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదు థియేటర్లకు వెళ్లి చూశాం. ఎక్కువగా కనిపించింది కాలేజీ కుర్రాళ్లే. ఇక ఈ సినిమా వెళ్లాల్సింది ఫ్యామిలీల్లోకి. అది కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్లు కూడా థియేటర్లలో కనిపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ రెవెన్యూపరంగా సంతోషంగా ఉన్నారు.
20 నిమిషాలే బలం
కొత్తగా ఈ సినిమాలో ఏముంది అనేవాళ్లకి నా సమాధానం ఒక్కటే. ప్రపంచంలో ఏడు కథలే ఉన్నాయంటారు. ఎవరు చెప్పినా వాటిలోంచి తిప్పితిప్పి చెప్పాల్సిందే. ఈ సినిమాకి సంబంధించి చివరి 20 నిమిషాలే బలం. అలాంటి క్లైమాక్స్‌ని ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తియ్యలేదు. వేణు ఓ సున్నితమైన పాయింట్ బాగా డీల్ చేయగలిగాడు. స్నేహితులుగా ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి చివరివరకు తమ అనుబంధాన్ని అలాగే కొనసాగించలేరా... అనే పాయింట్‌ని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకు తెరమీద ప్రకాశ్‌రాజ్, నేను తండ్రీకొడుకులుగా బాగా సరిపోయాం. ఈ సినిమాలో నా తండ్రిగా తనికెళ్ల భరణి బ్రహ్మండంగా చేశారు. క్లైమాక్స్‌లో ఆయన సంభాషణలు చెప్పిన విధంగానీ, ఆయన హావభావాలు కానీ అత్యుత్తమం.
లక్కీ గర్ల్ హన్సిక
నేను, నవదీప్, శ్రుతిహాసన్ మొదటే ఫైనలైజ్ అయినా హన్సిక ఆ పాత్రకి చివరగా ఎంపికైంది. ఆమెకి ఈ ఏడాది తెలుగులో 'కందిరీగ', తమిళంలో 'వేలాయుధం' వంటి హిట్స్ వచ్చాయి. ఆమె ఈ సినిమాకి లక్కీ అవుతుందనుకున్నా. అలాగే అయ్యింది. శ్రుతి, నవదీప్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
నాలుగు భాషా చిత్రాలు
2012 నాకు మరపురాని సంవత్సరం కాబోతోంది. నాలుగు భాషలు - తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌లో నా సినిమాలు రాబోతున్నాయి. హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో చేస్తున్న 'చష్మే బద్దూర్', ఇంగ్లీష్‌లో దీపా మెహతా డైరెక్షన్‌లో చేస్తున్న 'విండ్స్ ఆఫ్ చేంజ్' వచ్చే ఏడాది రాబోతున్నాయి. దీపాతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆమె పర్‌ఫెక్షనిస్ట్. బుకర్ ఆఫ్ బుకర్స్‌గా ప్రశంసలు పొందిన సల్మాన్ రష్డీ నవల 'మిడ్‌నైట్ చ్రిల్డన్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నిడివి పరంగా పెద్దది కాకపోయినా కథకి కీలకమైన పాత్ర చేస్తున్నా.

Wednesday, November 9, 2011

'ఓ మై ఫ్రెండ్' మరో 'వసంతం'?

సిద్ధార్థ్, శ్రుతిహాసన్ సినిమా 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వేణు శ్రీరాంను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ఇదివరకు చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇద్దరు మిత్రులు', వెంకటేశ్ హీరోగా వచ్చిన 'వసంతం' సినిమాల తరహాలో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 'ఇద్దరు మిత్రులు'లో చిరంజీవి, సాక్షి శివానంద్ మిత్రులుగా నటిస్తే, చిరంజీవి సరసన నాయికగా రమ్యకృష్ణ నటించింది. సాక్షికి జోడీగా సురేశ్ కనిపించాడు. అలాగే 'వసంతం' చిత్రంలో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటిస్తే, వెంకటేశ్ సరసన ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. కల్యాణికి జోడీగా ఆకాశ్ కనిపించాడు. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో సిద్ధార్థ్, శ్రుతి జంటగా గాక, స్నేహితులుగా నటించారని గట్టిగా వినిపిస్తోంది. అంటే సిద్ధార్థ్‌కి జోడీగా హన్సిక, శ్రుతికి జోడీగా నవదీప్ కనిపించనున్నారనేది ప్రచార సారాంశం. ఇదే నిజమైతే ఇప్పటికే 'ఇద్దరు మిత్రులు', 'వసంతం' సినిమాల్ని చూసిన జనం 'ఓ మై ఫ్రెండ్'ని బాగా రిసీవ్ చేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా 'ఇద్దరు మిత్రులు' సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు కూడా. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి జరుగుతున్న ప్రచారం నిజమో, కాదో తేలిపోనున్నది.

Tuesday, November 8, 2011

తొమ్మిదేళ్లు... తొమ్మిది మంది కొత్త దర్శకులు!

కొత్త దర్శకులంటే సిద్ధార్థ్‌కి మోజెక్కువ. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో సరిగ్గా తొమ్మిది మంది కొత్త దర్శకులతో పనిచేశాడు. ఈ వరుసలో వస్తున్న అతడి తదుపరి సినిమా 'ఓ మై ఫ్రెండ్'తో కరీంనగర్‌కి చెందిన వేణుశ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇదే సినిమాతో కేరళకు చెందిన రాహుల్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అవడంతో ఈ సినిమా విజయంపై సిద్ధుతో పాటు నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తమ బేనర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయనీ, కానీ 'ఓ మై ఫ్రెండ్' గ్రేట్ ఫిల్మ్ అవుతుందనీ గొప్పగా చెప్పాడు. సిద్ధు విషయానికొస్తే అతడి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా అవతారమెత్తి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత కాలంలో సిద్ధు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' ద్వారా మణిరత్నం శిష్యుడు శివకుమార్, 'బొమ్మరిల్లు' ద్వారా భాస్కర్, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ద్వారా డాలీ, 'ఓయ్!'తో ఆనంద్ రంగా, 'బావ'తో రాంబాబు, 'అనగనగా ఓ ధీరుడు'తో సూర్యప్రకాశ్, '180'తో జయేంద్ర డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. వీరిలో ప్రభుదేవా, భాస్కర్ మాత్రమే సక్సెసయ్యారు. '180' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని సిద్ధు గట్టిగా నమ్మాడు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్'తోనైనా అతడికో హిట్టు వస్తుందేమో చూడాలి.

Thursday, October 27, 2011

న్యూస్: 'ఓ మై ఫ్రెండ్' మీదే సిద్ధు ఆశలు!

2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత సిద్ధార్థ్‌కి చెప్పుకోదగ్గ సినిమా ఏది? ఏదీ లేదు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు - 'ఆట' (యావరేజ్), 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (యావరేజ్), 'ఓయ్' (డిజాస్టర్), 'బావ' (డిజాస్టర్), 'అనగనగా ఓ ధీరుడు' (ఫ్లాప్), '180' (యావరేజ్). ఇదీ అతడి ప్రస్థానం. తెలుగు హీరో అనిపించుకోడానికి ఏడేళ్లు పట్టిందని ఈమధ్య ఇంటర్వ్యూల్లో అతడు చెప్పాడు కానీ మన వాళ్లెవరూ అలా ఫీలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి తెప్పించుకోడానికి అతను కష్టపడుతున్నాడు. దిల్ రాజు రూపంలో అతగాడికి ఓ మంచి ఫ్రెండ్ దొరకడం అతడు చేసుకున్న భాగ్యం. అందుకే 'ఓ మై ఫ్రెండ్' సినిమాని సిద్ధార్థ్‌తో తీస్తున్నాడు రాజు. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ 'క్లోజ్ ఫ్రెండ్' శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. నవదీప్ మరో కీలక పాత్ర చేశాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో అక్టోబర్ 15న రిలీజైంది. పాటలు బాగానే ఉన్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. ఈ సినిమాతో మరోసారి 'బొమ్మరిల్లు' మేజిక్‌ని రిపీట్ చేస్తానని నమ్ముతున్నాడు సిద్ధు. నిజానికి అది అతడికి చాలా అవసరం కూడా. ఎందుకంటే 'ఓ మై ఫ్రెండ్' కూడా ఆడకపోతే తెలుగులో అతడి కెరీర్ నిజంగా కష్టాల్లో చిక్కుకున్నట్లే. నవంబర్లోనే ఈ సినిమా రిలీజవుతున్నందున అతడి భవిష్యత్ ఏమిటో అప్పుడు తేలనున్నది.

Saturday, October 22, 2011

న్యూస్: జోరంతా సమంతదే!

టాలీవుడ్‌లో ఇప్పుడు సమంత జోరు నడుస్తోంది. 'ఏమాయ చేసావె', 'బృందావనం', 'దూకుడు' సినిమాలతో ఆమె టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న 'ఈగ'లో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె రెండోసారి నాగచైతన్య సరసన 'ఆటోనగర్ సూర్య'లో నటిస్తోంది. తాజాగా మరో మూడు సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మహేశ్‌తో రెండోసారి చేయబోతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థ్ సరసన ఓ సినిమాలోనూ, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలోనూ చేయబోతోంది. 'ఆటోనగర్ సూర్య'ని దేవా కట్టా డైరెక్ట్ చేస్తుండగా, మాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ను 'కొత్త బంగారులోకం' ఫేం శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనుండగా, దిల్ రాజు నిర్మించబోతున్నారు. వెంకటేశ్, త్రిష మరో జోడీగా నటించే ఈ సినిమా 2012 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్నది. సిద్ధార్థ్ సరసన నటించే సినిమాని నందినీరెడ్డి డైరెక్ట్ చేయనుండగా, బెల్లంకొండ సురేశ్ నిర్మించనున్నారు. ఈ సినిమా నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నది. ఇక అల్లు అర్జున్ సరసన ఆమె నటించే సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించనున్నాడు. అలాగే తన మెంటర్ గౌతం మీనన్ తెలుగు, తమిళ, మలయాళ్ భాషలు మూడింటిన్లోనూ తీసే మరో సినిమానీ సమంతా చేయనున్నది. ప్రస్తుతం ఆమె చేస్తున్న, చేయబోతున్న సినిమాలు చూస్తే మిగతా హీరోయిన్లకి కన్నుకుట్టక మానదు.

Tuesday, October 18, 2011

న్యూస్: సిద్ధార్థ్, సమంత జోడీ



సిద్ధార్థ్, సమంత జంటగా ఓ చిత్రం రూపొందబోతోంది. 'అలా మొదలైంది' ఫేమ్ నందినీరెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేశ్ తెలియజేస్తూ "నందినీరెడ్డి అద్భుతమైన కథ చెప్పారు. సిద్ధార్థ్, సమంత కూడా కథ వినగానే ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇటీవల 'కాంచన', 'కందిరీగ' వంటి చిత్రాలు మా బేనర్‌కి ఎంతో పేరు తెచ్చాయి. ఈ సినిమా ఆ కోవలోనే పెద్ద హిట్టవుతుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. మహేంద్రబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి. నందినీరెడ్డి. 

Saturday, September 24, 2011

టర్నింగ్ పాయింట్: జెనీలియా

సినిమాలకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. సినిమాల్లోకి అనుకోకుండానే వచ్చా. నేనో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ యాడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి నన్ను చూశాడు. ఆ తర్వాత ఓ యాడ్‌లో చేయడానికి పిలుపు వచ్చింది. అదీ అమితాబ్ బచ్చన్ వంటి మహా నటుడితో. ఎవరైనా వదులుకుంటారా అలాంటి ఆఫర్‌ని! నేనూ అంతే. అది చేసిన మూడు నెల్లకే తొలి సినిమా ఆఫర్ వచ్చింది. తెలుగులో సూపర్‌హిట్టయిన 'నువ్వే కావాలి'ని హిందీలో 'తుఝే మేరీ కసం' పేరుతో తీయడానికి రామోజీరావు గారు ప్లాన్ చేశారు. మా అమ్మతో పాటు వెళ్లి రామోజీరావు గారినీ, దర్శకుడు విజయభాస్కర్ గారినీ కలిశా. ఆ మీటింగ్ మొత్తం మీద నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి అవకాశాలు ఒకే ఒక్కసారి వస్తాయనీ, వాటిని ఉపయోగించుకోవాలనీ అమ్మ నన్ను కన్విన్స్ చేసింది. నేనప్పుడే హైస్కూల్ పూరిచేశా. నేను ఆల్‌రౌండర్ని. సవాళ్లంటే ఇష్టం. సినిమాలు నాకు తాజా సవాళ్లని విసిరాయి.
కెమెరా ముందు తొలిసారి నిల్చున్నప్పుడు నేను భయపడలేదు. ఒకసారి కెమెరా ఆన్ అవగానే అంతకుముందున్న నెర్వస్‌నెస్ మాయమైపోయింది. మధ్యలో 'బాయ్స్' (తమిళ్) కోసం డైరెక్టర్ శంకర్ నుంచి కాల్ వచ్చింది. అయితే ప్రాంతీయ భాషలో నటించాలా, వద్దా అనేది నిర్ణయించుకోలేదు. ఏదైతేనేం, హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో తొలి యేడాది క్లిష్టంగా గడిచింది. నాకు భాష సమస్యగా మారింది. తెలుగు, తమిళంలో మాట్లాడటం కష్టమైపోయింది. అయినా పట్టుదలతో డైలాగులు నేర్చుకుని ప్రాంప్టింగ్ అవసరం లేకుండానే చెప్పగలిగా. 'బాయ్స్' సెట్స్ మీద నేను ఇబ్బంది పడుతుంటే డైలాగుల విషయంలో సిద్ధార్థ్ బాగా సాయపడ్డాడు.

Sunday, August 7, 2011

న్యూస్: తండ్రి తమిళంలో.. తనయ తెలుగులో!

కమల్‌హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో కళ్లు చెదిరే రూప లావణ్యాలతో కనిపించిన ఆమెని చూసి ప్రేక్షకుల కంటే ఎక్కువగా ఫ్లాటైపోయారు మన హీరోలు. అందుకే ఆమెని తమ సరసన బుక్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే శ్రుతి మాత్రం అంత ఆరాటం చూపడం లేదు. పాత్రలు, సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలు చేస్తోంది. వాటిలో ఒకటి తన ప్రియుడు సిద్ధార్థ్ సరసన చేస్తున్న 'ఓ మై ఫ్రెండ్' కాగా, మరొకటి ఎన్టీఆర్ సరసన చేస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమా. వీటిలో మొదటి సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, వేణు శ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో మరో బ్యూటీ హన్సికతో కలిసి స్క్రీన్ పంచుకుంటోంది శ్రుతి. నిజానికి ఈ పాత్ర మొదట వచ్చింది తనకేననీ, అయితే సిద్ధార్థ్ రికమెండ్ చేసి మరీ శ్రుతిని రప్పించుకున్నాడనీ నిత్యమీనన్ బాంబు పేల్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాని డైరెక్ట్ చేస్తోంది ఓటమి ఎరుగని బోయపాటి శ్రీను. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ సినిమా 'గబ్బర్‌సింగ్'లోనూ ఆమె నటించనున్నదని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఏదేమైనా తండ్రి తమిళనాట టాప్ యాక్టర్ కాగా, తనయ అక్కడ కంటే తెలుగులోనే క్రేజ్ తెచ్చుకోవడం చిత్రమే!

Wednesday, June 29, 2011

హాట్ న్యూస్: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం

సినీ మాక్స్‌లో మంగళవారం జరిగిన '180' సక్సెస్‌మీట్‌లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథుల నుంచి హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ట్విట్టర్‌లో "టీవీలో ఓ గంట కార్యక్రమం కోసం థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ తమ కుటుంబాల్ని కూడా అమ్ముకుంటాయి'' (థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ విల్ సెల్ దెయిర్ ఫ్యామిలీస్ టు మేక్ అప్ యాన్ అవర్ ఆఫ్ టీవీ) అంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై తెలుగు న్యూస్ చానల్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జరిగిన '180' సక్సెస్ మీట్‌లో యథాలాపంగా పాల్గొన్న సిద్ధార్థ్‌ని చానల్స్ అన్నీ మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేయడం ద్వారా తమ నిరసన తెలిపాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్ మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు మైకుల ముందుకు సిద్ధార్థ్ రావడంతోటే తమ కెమెరాలన్నింటినీ చానల్స్ తీసేశాయి. దీంతో పత్రికల వారివైపు తిరిగి రెండు ముక్కలు మాట్లాడిన సిద్ధార్థ్, పత్రికా ఫొటోగ్రాఫర్లు గ్రూప్ ఫొటో కోసం రావడంతో అక్కడ నిలవకుండా ఆవేశంతో విసవిసా నడచుకుంటూ అక్కణ్ణించి వెళ్లిపోయారు.

దీంతో ఆ సినిమా యూనిట్ సభ్యులంతా అతడి ప్రవర్తన పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, మీడియాకి క్షమాపణలు చెప్పేంతవరకు సిద్ధార్థ్ విషయంలో తమ నిరసనని ఇలాగే కొనసాగిస్తామని ఫిల్మ్ న్యూస్‌కేస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు తెలిపారు. సిద్ధార్థ్ ప్రవర్తన పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేస్తున్నట్లు వారు చెప్పారు.

Tuesday, September 21, 2010

సినిమా: సిద్ధార్థ్ పని బాగుంది!


తెలుగు హీరోగానే తనని పరిగణించాలని కోరుకుంటున్న తమిళుడు సిద్ధార్థ్ ఆ లక్ష్యంలో భాగంగా తెలుగు ప్రేక్షకుల్లో తన ఇమేజిని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. 2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ లేని అతను త్వరలో 'బావ'గా ఆకట్టుకోడానికి వస్తున్నాడు. బాలీవుడ్ లో 'రంగ్ దే బసంతి' (2006) తర్వాత చేసిన 'స్ట్రైకర్' సినిమా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ లోనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత అతను చేసిన మూడు సినిమాలు - 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (కెఐకెకె), 'ఓయ్'లలో - 'కెఐకెకె' ఓ మోస్తరుగా ఆడితే మిగిలిన రెండూ ఫ్లాపయ్యాయి. 'బావ'లో సిద్ధార్థ్ సరసన 'ఏం పిల్లో ఏం పిల్లడో' ఫేమ్ ప్రణీత నాయిక. కొత్త దర్శకుడు రాంబాబు డైరెక్టరుగా పరిచయమవుతున్న ఈ సినిమా దీపావళికి రానున్నది. ఈ సినిమా కాకుండా రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. వాటిలో ఒకటి కోవెలమూడి సూర్యప్రకాశ్ డైరెక్ట్ చేస్తున్న 'అనగనగా ఒక ధీరుడు' (ఇంకా నిర్ధారించలేదు), రెండోది జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న '180'. లేటెస్టుగా సిద్ధార్థ్ తో మరో సినిమా చేయబోతున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమ్వనున్నాడు. ఇలా చేతిలో నిండుగా సినిమాలతో తెలుగులో సిద్ధు పని బాగానే ఉంది.

Saturday, August 7, 2010

Movies: Actors And Their Internet Relationships


ఒకరితో ఒకరు అనుసంధానమవడానికీ, అనుబంధాలు నెరపడానికీ అంతర్జాలం (ఇంటర్నెట్)లో వచ్చిన విప్లవాత్మక ధోరణి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినిమా తారల దాకా ఈ వెబ్ సైట్స్ ని ఆశ్రయిస్తుండటంతో వాటి విలువ అతి స్వల్పకాలంలో అనూహ్యంగా పెరిగిపొతూ వస్తోంది. తమ మనసులోని భావాల్ని ప్రతిసారీ మీడియా ముందు వ్యక్తం చేయాలంటే ఆయా సెలబ్రిటీలకు చాలా కష్టం. కానీ తమ భావాలు జనం దృష్టికి చేరటమెలా? వాళ్లకి అలా అందివచ్చినవే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్.
ప్రపంచవ్యాప్తంగా వున్న తమ అభిమానులకు తమ మనసులోని మాటలు చెప్పడానికీ, వాళ్లతో అనుసంధానమవడానికీ ఈ సైట్స్ కి మించిన మీడియం సెలబ్రిటీలకు మరొకటి లేదు. లక్షల సంఖ్యనుంచి కోట్ల సంఖ్యలో వీక్షకులు ఈ సైట్లని ఆశ్రయిస్తున్నారు. ఆర్కుట్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సైట్లు శరవేగంగా పాపులారిటీ సాధిస్తూ, ఆయా వ్యక్తుల ఇమేజిని మరింత ఇనుమడింప జేస్తున్నాయి. ఈ సైట్లలో సినిమా హీరోల పేరుతో ఎన్నో బ్లాగులు, కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఆదరణ పొందుతున్నాయి. 'ఫేస్ బుక్'ని హీరోల కంటే టెక్నీషియన్లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కృష్ణవంశీ, గుణశేఖర్, పూరి జగన్నాథ్, ఏవీఎస్, ఆర్పీ పట్నాయక్, రఘు కుంచే వంటి డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఈ వెబ్ సైట్స్ ని ఆశ్రయిస్తూ, అభిమానులతో అనుసంధానమవుతున్నారు. 'కమ్యూనిటీ'లను ఏర్పాటుచేసే సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఆర్కుట్'లో మన హీరోల పేరిట ఒకటికి మించి ఎక్కువగా కమ్యూనిటీలు ఏర్పాటవుతున్నాయి. అంటే ఆయా హీరో పేరిట ఎవరైనా ఒక కమ్యూనిటీని ప్రారంభించవచ్చు. అందులో ఎవరైనా చేరవచ్చు, తమ భావాల్ని వ్యక్తం చేయవచ్చు. ఇలాంటి కమ్యూనిటీల్లో తెలుగు సినిమాకి సంబంధించి, దివంగత ఎన్టీఆర్ పేరిట ఏర్పాటైన 'ఎన్టీఆర్ - లెజెండ్ ఆఫ్ లెజెండ్స్' అనే కమ్యూనిటీ నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. ఒకే కమ్యూనిటీ (సింగిల్ కమ్యూనిటీ)లో ఎక్కువమంది సభ్యులున్న హీరోల జాబితాలో మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్ వరుస స్థానాల్లో నిలుస్తున్నారు.
ట్విట్టరే ముద్దు
ఇక లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిందన్నట్లు 'ట్విట్టర్' అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ వ్యక్తులకు అత్యంత ప్రియమైన వెబ్ సైటుగా మారింది. వీళ్లని అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య వేల నుంచి లక్షలకి పెరుగుతుండటంతో 'ట్విట్టర్' వీక్షకుల సంఖ్య అనూహ్య స్థాయిలో పెరిగిపోతోంది. బాలీవుడ్డులోనే కాదు.. దేశం మొత్తంమీద అత్యధిక 'ఫాలోయర్స్' (అనుసరిస్తున్నవారు) ఉన్న నటునిగా 'కింగ్ ఖాన్' షారుక్ ఖాన్ నిలిచారు. ఇది రాసే సమయానికి ట్విట్టర్లో ఆయన బ్లాగుని అనుసరిస్తున్న వాళ్ల సంఖ్య 5,58,700. ఆయన తర్వాత స్థానంలో 3,38,000 ఫాలోయర్లతో హృతిక్ రోషన్ నిలిచాడు. ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ కి 3,05,500 మంది, అమీర్ ఖాన్ కి 1,92,500 మంధి ఫాలోయర్లు ఉన్నారు. అమితాబ్ ని అనుసరిస్తున్నవాళ్లు 3,11,000 మంది అయితే, ఆయన కుమారుడు అభిషేక్ తండ్రిని మించాడు. అతని ఫాలోయర్ల సంఖ్య 3,14,500. దేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫాలోయర్స్ 52,000 మంది మాత్రమే. దక్షిణాదిన హీరోయినుగా మంచి పాపులారిటీ సంపాదించుకుని, ఇటీవల బాలీవుడ్డులోనూ తన ముద్రవేసిన జెనీలియాకి ట్విట్టర్లో మంచి ఆదరణే ఉంది. ఆమెకి 2,17,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
మహేశ్ వర్సెస్ సిద్ధార్థ్
టాలీవుడ్ విషయానికొస్తే ట్విట్టర్లో నెంబర్ వన్ స్థానం మహేశ్ దే. అతని ఫాలోయర్స్ 1,01,000 మంది. అలా తెలుగులో తొలిసారి లక్ష ఫాలోయర్స్ దాటిన హీరోగా మహేశ్ నిలిచాడు. అతని సమీపంలో ఉన్న హీరో సిద్ధార్థ్. అతన్ని అనుసరిస్తున్న వాళ్లు 98,000 మంది. అంటే ఈ ఇద్దరూ ట్విట్టర్లో ఢీ అంటే ఢీ అంటున్నారన్న మాట. ఫాలోయర్లలో యాభై వేలు దాటిన వాళ్లు హీరోలు అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, హీరోయిన్ త్రిష. నాగార్జునకి 60,500 మంది, రానాకి 53,500 మంది, త్రిషకు 57,600 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ కూడా ట్విట్టర్లో ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఆయనను 47,600 మంది అనుసరిస్తున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు అడపాడడపా మాత్రమే తమ భావాల్ని వ్యక్తం చేస్తుండటంతో వాళ్ల ఫాలోయర్స్ సంఖ్య ఇంకా వేగాన్ని అందుకోలేదు. వాళ్లని అనుసరిస్తున్నవాళ్లు పది వేల లోపే ఉన్నారు. రామ్, సుమంత్ వంటి హీరోలకు ఫాలోయర్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 'మర్యాద రామన్న' విడుదలకు ఒక రోజు ముందే ట్విట్టర్లో అడుగుపెట్టిన సునీల్ కి అప్పుడే 10,400 మంది ఫాలోయర్స్ తయారయ్యారు. హీరోలే కాక డైరెక్టర్లు కూడా ట్విట్టర్ని బాగానే ఆశ్రయిస్తున్నారు. తెలుగు దర్శకుల్లో అందరికంటే ఎక్కువగా ఎస్.ఎస్. రాజమౌళిని 34,700 మంది అనుసరిస్తున్నారు. తమ అభిమానులకే తప్ప తమ మధ్య ఎలాంటి అరమరికలూ, వైరమూ ఉండదని వాళ్లు తెలియజెప్పారు. రామ్, సుమంత్, నితిన్ వంటి వాళ్లు కూడా ఇతర హీరోల సినిమాలు బాగా ఆడాలనే ఆకాంక్షని తమ బ్లాగుల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. హీరోలందరూ ఏ రోజు ఎక్కడ షూటింగులో ఉన్నారో, ఆ షూటింగులో జరిగిన ఆసక్తికరమైన అంశాలేమిటో తమ 'ట్వీట్స్' ద్వారా తమ అభిమానులకి వివరిస్తున్నారు. ఇటీవల మనాలిలో 'బృందావనం'షూటింగులో పాల్గొన్న ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేదనే పుకార్లు వచ్చాయి. వాటిని ట్విట్టర్లో ఖండించిన ఎన్టీఆర్ తను భేషుగ్గా ఉన్నాననీ, మనాలిలో షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాననీ, ఆగస్టు 5న హైదరాబాదుకి వస్తున్నాననీ, తన ఫాలోయర్లకి తెలిపాడు. ఇలా తమ మీద అనవసరంగా పుట్టే పుకార్లకి వెంటనే వివరణ లేదా జవాబు చెప్పే అవకాశం వాళ్లకి ఈ బ్లాగుల ద్వారా కలుగుతోంది. అలాగే అభిమానులు లేదా ఫాలోయర్స్ వ్యక్తిగతంగా అడిగే ప్రశ్నలకు కూడా - అందరికీ కాకపోయినా కొంతమందికైనా - జవాబిస్తున్నారు ఈ హీరోలు.
రెండో ముఖమూ ఉంది
ఈ సైట్లకు ఇది మొదటి ముఖం. ఇక రెండో ముఖమేమిటి? కత్తికి రెండు వేపులా పదునున్నట్లు, నాణేనికి రెండు ముఖాలున్నట్లు ఈ వెబ్ సైట్ల వల్ల ఎంత ప్రయోజనం వుందో, అంత నష్టమూ ఉన్నదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్విట్టర్ కారణంగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తమ పదవుల్ని కోల్పోవాల్సి వచ్చింది. వారిలో ఒకరు నిన్నటిదాకా ఐపీఎల్ కు ఛైర్మనుగా వ్యవహరించిన లలిత్ మోడీ అయితే, మరొకరు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని త్యజించాల్సి వచ్చిన శశిథరూర్. ఇక అనేక సందర్భాల్లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, రాంగోపాల్ వర్మ లాంటి సినీ దిగ్గజాలు తమ బ్లాగుల్లో రాసిన వ్యాఖ్యలు వివాదాలు సృష్టించిన సంగతి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే 'రావణ్' సినిమాని మణిరత్నం రూపొందించిన తీరు, ఆ సినిమా ఎడిటింగ్ ఎమాత్రం బాగాలేవని తన బ్లాగులో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై 'విలన్' విక్రమ్ నిరసన వ్యక్తం చేశాడు కూడా. మణిరత్నం అయితే తాను అమితాబ్ మెప్పు కోసం సినిమాలు తియ్యడం లేదని ఒకింత ఘాటుగానే స్పందించారు.
ఏదేమైనా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మన సెలబ్రిటీలకి బాగా ఉపయోగపడ్తున్నాయి. తమ పాపులారిటీని, ఇమేజినీ మరింత పెంచుకోవడానికి దోహదపడ్తున్నాయి.

Tuesday, July 20, 2010

ANR once again facing camera!


మళ్లీ మొహానికి రంగేసుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఫ్రెండ్లీ మూవీస్ అధినేత అడ్డాల చంటి నిర్మిస్తున్న తాజా చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అడ్డాల చంటి ఇదివరకు ఆరో ప్రాణం, పవిత్ర ప్రేమ, తిరుమల తిరుపతి వెంకటేశ, అల్లరి రాముడు, అడవి రాముడు, ఒక ఊరిలో.. వంటి చిత్రాల్ని నిర్మించారు. ప్రస్తుత చిత్రంలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తుండగా, ఒక ప్రధాన పాత్రని శ్రీహరి చేస్తున్నారు. కథకి కీలకమైన ఒక పాత్రను అక్కినేని చేస్తేనే బాగుంటుందని డైరెక్టర్ అశోక్‌కుమార్ లాలం, నిర్మాత చంటి అభిప్రాయపడ్డారు. దాంతో ఆయన్ని సంప్రదించారు. మొదట చేయడానికి సందేహించిన అక్కినేని, చివరకు కథ, ఆ కథలో తన పాత్ర బాగా నచ్చి.. చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆయన చివరిసారి మొహానికి రంగేసుకుని నాలుగేళ్లయింది. 2006లో ఆయన 'చుక్కల్లో చంద్రుడు', 'శ్రీరామదాసు' చిత్రాల్లో నటించారు. 'చుక్కల్లో చంద్రుడు'లో హీరో సిద్ధార్థ్ తాతగా నటించిన ఆయన 'శ్రీరామదాసు'లో కబీర్‌దాసు పాత్ర చేశారు. తన వయసుకు తగ్గ మంచి పాత్రలు రావడం కష్టమైనందునే తాను సినిమాలు చేయడం లేదని ఆమధ్య ఒక కార్యక్రమంలో చెప్పారు అక్కినేని. ఇప్పుడాయన వయసు 85 సంవత్సరాలు. తాను కళాకారుణ్ణనీ, చనిపోయేంత వరకు నటిస్తాననీ ఒకప్పుడు చెప్పిన అక్కినేని ఎట్టకేలకు నచ్చిన పాత్ర లభించడంతో మళ్లీ హుషారుగా నటించేందుకు సిద్ధమైపోయారు. 'నిన్నే పెళ్లాడుతా', 'స్టూడెంట్ నెం.1' వంటి సూపర్‌హిట్ సినిమాలకు కథల్ని అందించిన పృథ్వీరాజ్ ఈ చిత్రానికి కథని సమకూరిస్తే, సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్నారు. పరిచయం అవసరంలేని సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇక దర్శకుడు అశోక్‌కుమార్‌కి ఇదే తొలి సినిమా. అతను పూరి జగన్నాథ్ శిష్యుడు. హైదరాబాద్‌లోనే కాక కన్యాకుమారి, చిదంబరం, కంచి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్రతో అక్కినేని మరోసారి తన అభిమానుల్ని అలరిస్తారని ఆశించవచ్చు.