మళ్లీ మొహానికి రంగేసుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఫ్రెండ్లీ మూవీస్ అధినేత అడ్డాల చంటి నిర్మిస్తున్న తాజా చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అడ్డాల చంటి ఇదివరకు ఆరో ప్రాణం, పవిత్ర ప్రేమ, తిరుమల తిరుపతి వెంకటేశ, అల్లరి రాముడు, అడవి రాముడు, ఒక ఊరిలో.. వంటి చిత్రాల్ని నిర్మించారు. ప్రస్తుత చిత్రంలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తుండగా, ఒక ప్రధాన పాత్రని శ్రీహరి చేస్తున్నారు. కథకి కీలకమైన ఒక పాత్రను అక్కినేని చేస్తేనే బాగుంటుందని డైరెక్టర్ అశోక్‌కుమార్ లాలం, నిర్మాత చంటి అభిప్రాయపడ్డారు. దాంతో ఆయన్ని సంప్రదించారు. మొదట చేయడానికి సందేహించిన అక్కినేని, చివరకు కథ, ఆ కథలో తన పాత్ర బాగా నచ్చి.. చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆయన చివరిసారి మొహానికి రంగేసుకుని నాలుగేళ్లయింది. 2006లో ఆయన 'చుక్కల్లో చంద్రుడు', 'శ్రీరామదాసు' చిత్రాల్లో నటించారు. 'చుక్కల్లో చంద్రుడు'లో హీరో సిద్ధార్థ్ తాతగా నటించిన ఆయన 'శ్రీరామదాసు'లో కబీర్‌దాసు పాత్ర చేశారు. తన వయసుకు తగ్గ మంచి పాత్రలు రావడం కష్టమైనందునే తాను సినిమాలు చేయడం లేదని ఆమధ్య ఒక కార్యక్రమంలో చెప్పారు అక్కినేని. ఇప్పుడాయన వయసు 85 సంవత్సరాలు. తాను కళాకారుణ్ణనీ, చనిపోయేంత వరకు నటిస్తాననీ ఒకప్పుడు చెప్పిన అక్కినేని ఎట్టకేలకు నచ్చిన పాత్ర లభించడంతో మళ్లీ హుషారుగా నటించేందుకు సిద్ధమైపోయారు. 'నిన్నే పెళ్లాడుతా', 'స్టూడెంట్ నెం.1' వంటి సూపర్‌హిట్ సినిమాలకు కథల్ని అందించిన పృథ్వీరాజ్ ఈ చిత్రానికి కథని సమకూరిస్తే, సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్నారు. పరిచయం అవసరంలేని సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇక దర్శకుడు అశోక్‌కుమార్‌కి ఇదే తొలి సినిమా. అతను పూరి జగన్నాథ్ శిష్యుడు. హైదరాబాద్‌లోనే కాక కన్యాకుమారి, చిదంబరం, కంచి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్రతో అక్కినేని మరోసారి తన అభిమానుల్ని అలరిస్తారని ఆశించవచ్చు.
No comments:
Post a Comment