తొలి సినిమా 'ఆర్య'తో ప్రతిభావంతుడైన దర్శకుడిగా అందరిచేతా ప్రశంసలు పొందిన గణిత అధ్యాపకుడు సుకుమార్ ఆ తర్వాత ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ మూటగట్టుకున్నాడు. రాంతో అతను రూపొందించిన 'జగడం' సరిగా ఆడకపోవడం అటుంచి, అలాంటి సబ్జెక్టుని ఎంచుకున్నందుకూ, ఆ సబ్జెక్టుని రాం వంటి చాక్లెట్ బాయ్‌తో తీసినందుకూ విమర్శలపాలయ్యాడు. అతని మూడో సినిమా అల్లు అర్జున్‌తో తీసిన 'ఆర్య-2'ని కూడా కొంతమంది నిరసించినప్పటికె, ఎంతో స్టైలిష్‌గా ఆ సినిమాని అతను రూపొందించిన తీరు చాలామందిని మెప్పించింది. ప్రత్యేక తెలంగాణ అంశం కారణంగా నైజాం ఏరియాలో కొద్ది రోజులు మాత్రమే ఆడేందుకు నోచుకోవడం వల్ల ఆశించిన రీతిలో ఇక్కడ వసూళ్లు అందలేదు. మిగతా ప్రాంతాల్లో ఆ సినిమాకి మంచి వసూళ్లే దక్కాయి.
ఇప్పుడిక సుకుమార్ తన నాలుగో సినిమా తీసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇంకా పేరుపెట్టని ఆ సినిమాలో నగచైతన్య, తమన్నా జంటగా నటిస్తున్నారు. చిత్రసీమలో సమకాలీన ధోరణికి భిన్నంగా కొత్త పోకడలతో సినిమాలు రూపొందిస్తున్న సుకుమార్ ఈసారి ఓ ప్రేమ కథని తెరకెక్కిస్తున్నాడు. కాలేజీ నేపథ్యంలో నడిచే కథతో తయారవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా ప్రారంభం రోజున తన మాటలతో వివాదాస్పదుడయ్యాడు సుకుమార్. 'ఆర్య' తప్ప మిగతా రెండు సినిమాలు సరిగా ఎందుకు ఆడలేకపోయాయన్న ఓ చానల్ రిపోర్టర్ ప్రశ్నకు సహణం సంయమనం కోల్పోయిన సుకుమార్ "ఆ సినిమాలని చూసే స్థాయికి ఆడియెన్స్ ఎదగలేదు" అని పరుష సమాధానమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఆ సంగతలా ఉంచితే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే అరవింద్ నిర్మాతగా కాక, సమర్పకునిగా వ్యవహరిస్తుంటే, నిర్మాతగా 'బన్ని' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన వాసు పరిచయమవుతున్నాడు. ప్రేమ, వినోదం ప్రధానాంశాలుగా ఉండే ఈ చిత్రానికి తనదైన మార్కు ట్రీట్‌మెంట్‌ని జోడించి ఈ సినిమా తీస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాతో లెక్క సరిచేసి, అతను తన విమర్శకులకి సమాధానం చెబుతాడేమో చూడాలి.
No comments:
Post a Comment