Saturday, July 31, 2010

Poetry: Bathukuporu

బతుకుపోరు

ముంచెత్తబోయే వరదని వంతెన మాటున
నొక్కిపట్టి
కొత్త కలలకు రెక్కలు మొలిపించుకుంటూ
ఆశగా
"నా రైతుని బతికించుకోవాలి" అంది
నేలతల్లి!
అక్కడ
ఎదుగుతున్న వరినారు బేలగా ఎండిపోయి
అప్పు కుప్పలుగా పేరుకుంది
కరువు కాలికింద
రైతు బతుకు చితికిపోయింది
కరువునిస్తా లేదంటే
వరదనిస్తా అనే ప్రకృతిని
నారు పోసినంత తేలిక్కాదు కదా
అదుపు చేయడం!
నిజం
రైతుకేం ఇవ్వాలో తెలీని
ప్రకృతిని
అంత సులువుకాదు వంచడం!
రైతుకు కచ్చితంగా తెలుసు
పంటా కావాలి
అందుకు తగ్గ ధరా కావాలి.. అని!
అప్పటికే ప్రతి రుతువూ మోసం చేసినా కూడా
శిలువ మోస్తున్న రైతుకు అనిపిస్తూనే వుంది
ఈ యేడు పంట ఎండినా
వచ్చే యేడు పండుద్దని
బతికే ధైర్యాన్నిస్తుందని
అతణ్ణి నిలువునా కోసినా
నేలతల్లినే కలవరిస్తుంటాడు!
ఎన్ని తరాలైనా ఎడతెగని
ఈ బతుకుపోరులో
చీడపురుగు పట్టిన వ్యవస్థ
ధైర్యాన్ని హరిస్తూనే వుంది
ఆత్మహత్యల్ని ఆపలేకపోతూనే వుంది
అవును.. అవునవును..
ఒకడుపోయి ఇంకొకడు వస్తాడు
అధికారానికి
ఫలితం మాత్రం ఒక్కటే
ఇది
రైతులు బతికే కాలం కాదు
రాబందుల కాలం
అందుకే రైతన్నాడు
"ఆగండి.. వంచన మాటలు చెప్పకండి
ముందు నన్ను పురుగులమందు
తాగనివ్వండి
చావు పొత్తిళ్లలో సేదతీరనివ్వండి"..!

-ప్రస్థానం, డిసెంబర్ 2009-జనవరి 2010

No comments: