Friday, July 23, 2010

Women: Life is merely living in health


ఇది స్పీడు యుగం. ఈ యుగంలో మనిషి జీవితంలో అడుగడుగునా ఆటంకాలే. విపరీతమైన పోటీ వాతావరణం, ఆర్థికపరమైన, కుటుంబపరమైన ఒత్తిడులు, ఇతర సమస్యలు ఎన్నో.
ఈ రోజున జీవితమంటే దీర్ఘ నొప్పులు, బాధలు, నిద్రలేమి, దీర్ఘాయాసం, మానసిక అశాంతి, బాధ్యతల బరువు అనే అభిప్రాయాన్ని స్త్రీలలో కలిగిస్తున్నది. గతంలో కంటే ఈ రకపు సమస్యలు స్త్రీలను ఇప్పుఢు మరింత బాధిస్తున్నాయి. అయితే ఈ పరిణామం ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. అదే 'సెల్ఫ్ మెడికేషన్'!
ఆయాసానికి, నీరసానికి, తలనొప్పికి బాధానివారణ మందులు, ట్రాంక్విలైజర్లు అతి తేలిగ్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. దీన్నిబట్టి ఓ విషయం స్పష్టమవుతున్నది. టాబ్లెట్ల వల్లనో, క్యాప్సూల్స్ వల్లనో ఆరోగ్యం లభిస్తుందని! తలనొప్పి, కడుపునొప్పి, నీరసానికి ఏ మందులు వాడాలో ఇప్పుడు చాలామంది గృహిణులకు తెలుసు. అయితే మందులపై ఇట్లా ఆధారపడితే పర్యవసానం ఎట్లా వుంటుందో కూడా యోచించాల్సిన అవసరం వచ్చింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మెడికల్ షాపులో మందులు తెచ్చేసుకుని వాడటం మంచి పద్ధతి కాదని గ్రహించాల్సిన అవసరం కూడా వుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు చాలా మెడిసిన్లు తేలికగా లభ్యమవుతుంటే, కమర్షియల్ ప్రకటనల వెల్లువ జనాన్ని ముంచెత్తుతున్నది. ఆయా మందుల కంపెనీలు తమ ఉత్పత్తుల 'సద్గుణాల'ను గొప్పగా పాడుతుండటంతో మెదళ్లలో వాటి పేర్లు నాటుకుపోతున్నాయి.
ఆధునిక జీవనం మనలో కలిగిస్తున్న ప్రభావాన్ని ఉపేక్షిస్తూ అసహజంగా బతకడానికి అలవాటుపడిపోతున్నాం. నిజంగా మనది అసహజమైన జీవితమే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన పోషకాహారాన్ని తిన్నంత మాత్రాన సరిపోదు. భోజన విషయంలో సమయపాలన, సరైన సమయానికి నిద్రపోవడం వంటివి కూడా ముఖ్యమైనవనే విషయానికి ప్రాధాన్యతను ఇవ్వలేకపోతున్నాం. మనమెలా జీవించాలని ఆశిస్తున్నామో అందుకు అనుగుణంగా మన శరీరం, మనసు సిద్ధం కావడం లేదు. దాంతో అకస్మాత్తుగా 'మాత్రలు' మన నోట్లోకి వెళ్లిపోవడం సాధారణమై పోయింది.
శరీరారోగ్య రక్షణ విషయంలో మన దేహంలోని 'ఇమ్యూన్ సిస్టమ్' అద్భుత పాత్ర వహిస్తుందని ఎంతమంది గృహిణులకు తెలుసు? ఈ ఇమ్యూన్ సిస్టమ్ కూడా శరీరారోగ్య సమతూకం మీదే ఆధారపడి పనిచేస్తుంది. మనలో మనమాట - మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సింది ఎవరు? మనమా, డాక్టరా?
ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు - దేహంలోని మెటాబాలిక్ ఫంక్షన్ని అవసరమైనప్పుడు తగ్గించడం లేదా పెంచడం, ప్రేరేపించడం లేదా ఆటంకపరచే విషయాల్లో మందులు చురుకైన పాత్ర వహిస్తాయి. శరీర ధర్మ సంబంధమైన పనుల్లో చొరబడ్డం ద్వారా మందులు పనిచేస్తాయి. అయితే ఓ మామూలు నొప్పి నివారిణి బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది తప్ప ఆ నొప్పికి కారణమేమిటో - ఆ మూలాన్ని తొలగించలేదు. సాధారణంగా పెయిన్ కిల్లర్స్ నొప్పి రాకుండా ఆపలేవు కానీ, ఎక్కువైన నొప్పినుంచి రిలీఫ్ పొందాక అప్పుడు అవి మన దేహంలో ప్రభావం చూపించాయని మనం భావిస్తాం. నొప్పిని ఓర్చుకోవడంలో అవి ఇచ్చే తోడ్పాటుని మనం నిజం చేస్తాం. ఒకే రకమైన మందుల్ని గనక మనం పదేపదే వాడుతుంటే వాటి ప్రభావం దేహంలో తగ్గుతుంది. అందుకని భవిష్యత్తులో వాటి మోతాదు పెంచడం కానీ, లేదా మరింత బాగా పనిచేసే మరో మందును కానీ వినియోగిస్తాం. ఏ మందయినా వైద్యపరమైన చికిత్సకు సంబంధించి ప్రయోజనాన్ని కలిగివుంటుందనేది అందరూ అంగీకరించే సత్యమే. అట్లా అని దాన్ని విచక్షణా రహితంగా ఉపయోగిస్తే ప్రమాదమే.
ఈ రోజుల్లో ఆయా మందులకు సంబంధించి కొత్త కొత్త రేపర్లతో, ప్యాకేజీలతో కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిపై రేడియో, టీవీలలో కమర్షియల్ ప్రాపగాండా కూడా ఎంతో జరుగుతున్నది. అయితే ఈ మందుల వాడకం వల్ల తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్టుల గురించి మాత్రం అవి తెల్పవు. అందువల్ల వీటిని ఉపేక్షిస్తే తర్వాత అవి మనల్ని కబళించవచ్చు కూడా. ఈ సైడ్ ఎఫెక్టులు ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మెడిసిన్స్ అదేపనిగా మహిళలు వాడటం వల్ల మున్ముందు వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్టులకు గురికావడం జరుగుతుందని వైద్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి కఠినమైన పరీక్షల అనంతరమే, ప్రస్తుత మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి టెక్నాలజీ కూడా నేడు గొప్పగా వృద్ధి చెందింది. దీర్ఘకాలిక ఉపయోగం తర్వాతే మందుల మూలంగా సైడ్ ఎఫెక్టులు వస్తాయని ఈ టెక్నాలజీ రుజువు చేస్తున్నది.
ఇక శరీరారోగ్యానికి అవసరమైన విటమిన్ల విషయం తీసుకోండి. మన శరీరాలకు ప్రాణాధారం ఏమిటో, అవసరాలేమిటో మనకి తెలియనిది కాదు. విటమిన్లు లోపిస్తే సంభవించే వ్యాధులు కూడా మనకు తెలుసు. అయితే అవి కూడా అధిక మోతాదులో తీసుకుంటే నష్టమే జరుగుతుంది. సరైన ఆహార నియమాన్ని పాటించే స్త్రీలు తమకి సహజంగా అవసరమైన విటమిన్లను పొందుతారు. కాబట్టి సహజ పద్ధతిలో అవసరమైన పోషక విలువల్ని శరీరం పొందుతుంటే మీ డాక్టర్ మాత్రమే మీకు విటమిన్లు ఇంకా అవసరమో, కాదో చెప్పగలుగుతారు.
ఆధునిక కాలంలో వచ్చే వ్యాధులకీ మన జీవన విధానం, అలవాట్లకీ మధ్య సంబంధం తప్పకుండా వుండి తీరుతుంది. ఎప్పుడూ పనీపాటా లేకుండా వూరకే కూర్చుని జీవనం సాగించేద్దామనుకునే వారూ, ఆహార నియమాల్ని పాటించడంలో శ్రద్ధ చూపించనివారూ ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. టీ, కాఫీ వంటివి సేవించడం, అదే మగవాళ్లయితే సిగరెట్లు తాగడం సాధారణమైపోయింది. జీవితంలో ఇవి అప్పటికి ఉత్తేజాన్నిచ్చినా దీర్ఘకాలంలో వాటి ప్రభావం చెడు ఫలితాలనే ఇస్తుంది. వీటి వాడకం ఎక్కువైనప్పుడు వాటితో పాటే ఉపశమన మందుల, ట్రాంక్విలైజర్ల వాడకం కూడా పెరుగుతుంటుంది. ఇది అసహజమైన జీవన పద్ధతిని సూచిస్తుంది. ఆరోగ్యాన్ని కోల్పోయాక, ప్రమాదకరమైన వ్యాధులు చుట్టుముట్టాక అప్పుడు పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సి రావడం సహజమైన విషయంగా మారుతుంది.
తాత్కాలిక ఉపశమన మార్గాల కోసం కాక అసలు బాధకు కల కారణంపై, దాన్ని అరికట్టడానికి తెసుకోవాల్సిన జాగ్రత్తలపై స్త్రీలు దృష్టి సారించాలి. రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కాఫీ, టీలను తగ్గించడం వంటివి చేస్తూ జీవన పద్ధతిని మార్పు చేసుకుంటే మహిళలకు నిజమైన నివారణోపాయం అదేనని అర్థమవుతుంది.

No comments: